హోమ్‌ లోన్‌పై నూరు శాతం పన్ను ప్రయోజనం.. | CREDAI urges government for change in definition of affordable housing input tax credit | Sakshi
Sakshi News home page

హోమ్‌ లోన్‌పై నూరు శాతం పన్ను ప్రయోజనం.. క్రెడాయ్‌ కీలక సూచనలు

Published Wed, Nov 27 2024 8:55 AM | Last Updated on Wed, Nov 27 2024 9:06 AM

CREDAI urges government for change in definition of affordable housing input tax credit

న్యూఢిల్లీ: గృహ రుణాలకు చెల్లించే వడ్డీ మొత్తంపైనా ఆదాయపన్ను ప్రయోజనం కల్పించాలని రియల్టర్ల మండలి ‘క్రెడాయ్‌’ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఇలా చేయడం వల్ల అందుబాటు ధరల ఇళ్లు, మధ్య శ్రేణి ఇళ్ల అమ్మకాలకు డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంది.

అలాగే, రూ.45 లక్షలుగా ఉన్న అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని రూ.75–80 లక్షలకు పెంచాలని కోరింది. క్రెడాయ్‌ 25వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ మీడియాతో మాట్లాడారు. నిర్మాణంలోని రూ.75–80 లక్షల ధరల్లోని ఇళ్ల ప్రాజెక్టులకు ఒక శాతం జీఎస్‌టీని అమలు చేయాలని, తద్వారా డిమాండ్‌కు ఊతం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రూ.45 లక్షల ధరల్లోపు నిర్మాణంలోని ఇళ్లకే ఒక శాతం జీఎస్‌టీ అమల్లో ఉంది. ఇంతకుమించిన ఇళ్లకు 5 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. పైగా డెవలపర్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందేందుకు వీల్లేదు.

‘‘ఎప్పుడో 2017లో రూ.45 లక్షల్లోపు ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా నిర్ణయించారు. నాటి నుంచి వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా, ఈ ధరల పరిమితి రూ.75–80లక్షలకు సవరించాల్సి ఉంది’’అని బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు. ధరల పరిమితిని పెంచడం వల్ల కొనుగోలు దారులు తక్కువ జీఎస్‌టీ నుంచి ప్రయోజనం పొందుతారని చెప్పారు.  

మరో కీలక సూచన.. 
ఇక అందుబాటు ధరల ఇళ్లకు ఎలాంటి ధరల పరిమితి విధించొద్దని క్రెడాయ్‌ మరో కీలక సూచన చేసింది. దీనికి బదులు మెట్రోల్లో 60 మీటర్ల కార్పెట్‌ ఏరియా, నాన్‌ మెట్రోల్లో 90 మీటర్ల కార్పెట్‌ ఏరియాను అందుబాటు ధరలకు పరిమితిగా కొనసాగించాలని కోరింది. పన్ను తగ్గించడం ద్వారా వినియోగదారుల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలని బొమన్‌ ఇరానీ ప్రభుత్వానికి సూచించారు.

ప్రస్తుతం గృహ రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై సెక్షన్‌ 24 కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉండగా, దీని స్థానంలో చెల్లించిన వడ్డీ మొత్తానికి (నూరు శాతం) పన్ను మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్‌ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శేఖర్‌ పటేల్‌ కోరారు. నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం డిమాండ్‌ను పెద్ద ఎత్తున పెంచుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల ఆమోదాల కోసం 12–18 నెలల సమయం పడుతోందని, ఈ విషయంలో వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా చర్యలు తీసుకోవాలని క్రెడాయ్‌ చైర్మన్‌ మనోజ్‌ గౌర్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement