input tax credit
-
29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం!
నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు పాల్పడిన వేలాది బోగస్ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 బోగస్ సంస్థలను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వానికి 4,646 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ.12,036 కోట్ల ఐటీసీ ఎగవేతలకు పాల్పడిన 4,153 బోగస్ సంస్థలను గుర్తించగా వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. 926 బోగస్ కంపెనీల గుర్తింపుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ (507), ఢిల్లీ (483), హర్యానా (424) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిసెంబరు త్రైమాసికంలో బోగస్ కంపెనీలను గుర్తించడం ద్వారా రూ. 1,317 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేయగా, వీరిలో 31 మందిని సెంట్రల్ జీఎస్టీ అధికారులు అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘2023 మే నెల మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి రూ. 44,015 కోట్ల అనుమానిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేతకు పాల్పడిన మొత్తం 29,273 బోగస్ సంస్థలను గుర్తించాం. దీని వల్ల రూ. 4,646 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి వరకు 121 మందిని అరెస్టు చేశాం’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
కార్పొరేట్ వైద్యం మరింత ‘ప్రియం’
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ వైద్యాన్ని మరింత ప్రియం చేసేలా జీఎస్టీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. వైద్యసేవలపై విధించే జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకునే వెసులుబాటుపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్పొరేట్ లేదా ఖరీదైన వైద్య సేవలు పొందే రోగుల నుంచి ఆసుపత్రులు ఆమేరకు పన్నును వసూలు చేయనున్నాయి. గతంలో ఐసీయూ, సీసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ చికిత్సలు కాకుండా రూ.5 వేల కన్నా ఎక్కువ రోజువారీ అద్దె చెల్లించి ఆసుపత్రిలో ఉండే రోగులకు వైద్యసేవలపై జీఎస్టీ విధించేవారు. ఈ జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద తిరిగి మళ్లీ ఆ జీఎస్టీని మొత్తాన్ని పొందేవి. తదనుగుణంగా రోగులకు ఇతర సేవల రూపంలో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించేవి. ఇప్పుడు తిరిగి ఐటీసీ పొందే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో జీఎస్టీకి అదనంగా ఇతర సేవలపై కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఫలితంగా రోగులపై పన్నుభారం పెరగనుంది. అయితే, ఈ నిబంధన మినహాయింపు రాష్ట్రస్థాయిలో జరిగేది కాదని, జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్‌ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట.. ఆ ఛార్జీలపై జీఎస్టీ ఉండదు
ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు నామమాత్రపు మొత్తాన్ని వసూలు చేసి క్యాంటీన్ సదుపాయాలను కల్పిస్తాయి. అయితే, యాజమాన్య సంస్థలు అందించే క్యాంటీన్ సదుపాయాలు ఉపయోగించే ఉద్యోగులు వారు చెల్లించే మొత్తంపై జీఎస్టీ వసూలు చేయవద్దు అని ఏఏఆర్ తీర్పు ఇచ్చింది. క్యాంటీన్ సదుపాయం వాడుకున్నందుకు ఉద్యోగుల నుంచి యాజమాన్యం వసూలు చేసే నామమాత్రపు మొత్తంపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వర్తిస్తుందా అనే దానిపై తీర్పు కోరుతూ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) గుజరాత్ బెంచ్ ను టాటా మోటార్స్ ఆశ్రయించింది. ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు అందించే క్యాంటీన్ సదుపాయంపై సర్వీస్ ప్రొవైడర్ వసూలు చేసిన జీఎస్టీపై ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) కోర్ అవకాశం ఉందా అని కంపెనీ కోర్టును కోరింది. టాటా మోటార్స్ తన ఉద్యోగుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, దీనిని తృతీయపక్ష క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ నడుపుతున్నట్లు కోర్టుకు తెలిపింది. క్యాంటీన్ ఛార్జీలలో ఎక్కువ మొత్తాన్ని టాటా మోటార్స్ భరిస్తుంది అని మిగిలిన భాగాన్ని ఉద్యోగులు భరిస్తున్నట్లు పేర్కొంది. క్యాంటీన్ ఛార్జీల్లో ఉద్యోగుల చెల్లించే మొత్తాన్ని కంపెనీ సేకరించి క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ కు చెల్లిస్తుంది. అలాగే, క్యాంటీన్ ఛార్జీల్లో ఉద్యోగుల భాగాన్ని సేకరించే ఈ కార్యకలాపాల్లో టాటా మోటార్స్ ఎలాంటి లాభం మార్జిన్ ను కలిగి లేదని పేర్కొంది.(చదవండి: టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ) జీఎస్టీ వర్తించదు ఈ క్యాంటీన్ సౌకర్యం కింద చెల్లించిన జీఎస్టీపై ఐటీసీ జీఎస్టీ చట్టం కింద క్రెడిట్ బ్లాక్ చేస్తున్నట్లు ఏఏఆర్ తన తీర్పులో తెలిపింది. "క్యాంటీన్ ఛార్జీల విషయంలో ఉద్యోగుల నుంచి సంస్థలు వసూలు చేస్తున్న మొత్తాన్ని సేకరించి క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉద్యోగులు చెల్లించే మొత్తంపై కాకుండా యాజమాన్యాలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది" అని ఏఏఆర్ తెలిపింది. ప్రస్తుతం సబ్సిడీ కింద ఆహార సదుపాయాలను కల్పిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల నుంచి వసూలు చేసిన క్యాంటీన్ ఛార్జీలపై 5 శాతం పన్ను వసూలు చేస్తున్నట్లు ఏఎంఆర్ జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ తెలిపారు. క్యాంటీన్ ఛార్జీల ఉద్యోగుల నుంచి వసూలు చేసే నామమాత్రపు మొత్తంపై ఎటువంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు అని అథారిటీ తీర్పు ఇచ్చినట్లు మోహన్ తెలిపారు. -
మీరేం పెద్దమనుషులయ్యా, 35వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు
న్యూఢిల్లీ: ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగం చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత మోసాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి 426 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 14 మంది సీఏలు, లాయర్లు, డైరెక్టర్ల వంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. 2020–21లో సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ).. నకిలీ ఐటీసీల విషయంలో 8,000 పైచిలుకు కేసులు నమోదు చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. సాధారణంగా జీఎస్టీ విధానంలో.. ఉత్పత్తిపై పన్ను చెల్లించేటప్పుడు సంస్థలు తాము ముడి వస్తువులపై (ఇన్పుట్) కట్టిన పన్ను తగ్గించుకుని, చెల్లించవచ్చు. అయితే, ఇన్పుట్ విషయంలో కొందరు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం ద్వారా ఐటీసీ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు సీబీఐసీ వివరించింది. దీనిపై దేశవ్యాప్తంగా 2020 నవంబర్ 9 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,200 సంస్థలకు సంబంధించి 500 కేసులు గుర్తించినట్లు, 24 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐసీ పేర్కొంది. చదవండి: మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు -
నకిలీ ఇన్వాయిస్లతో 19.1 కోట్లు విత్‌డ్రా
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్‌లో వెలుగుచూసిన నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణం మరువక ముందే అదే తరహాలో రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌లోనూ ఓ మోసం వెలుగు చూసింది. ముఖేశ్ కుమార్ గోయల్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్ అనే ముగ్గురు మనుగడలో లేని కంపెనీలను సృష్టించి, సరుకు రవాణా చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందారు. అంతేకాకుండా ప్రీతం ఫుట్‌వేర్, రాజేశ్ ఫుట్‌వేర్, యోగేశ్ ఫుట్‌వేర్ సంస్థలు జారీ చేసిన నకిలీ జీఎస్టీ ఈ–వే బిల్లుల సాయంతో దాదాపు రూ. 32.54 కోట్ల విలువైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళిక రచించారు. అందులో రూ. 19.1 కోట్లను రీఫండ్ రూపంలో పొందినట్లు జీఎస్టీ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కోర్టు వారికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. -
నకిలీ ఇన్వాయిస్లతో రూ.700 కోట్ల మోసం
పుణె: నకిలీ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ఇన్వాయిస్లతో భారీ మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ కేసుకు సంబంధించి పుణెలో ఇద్దరు అరెస్టయ్యారు. పుణె నగరానికి చెందిన రిలయబుల్ మల్టీట్రేడింగ్, హిమాలయా ట్రేడ్‌లింక్స్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునేందుకు రూ.700 కోట్ల విలువ చేసే నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు జారీ చేసినట్లు కేంద్రీయ వస్తు, సేవల పన్నుల (సీజీఎస్టీ) విభాగం గుర్తించింది. -
జీఎస్టీ వలలో పచ్చ ‘చేప’
సాక్షి, హైదరాబాద్: ఏమీ కొనలేదు... ఎక్కడా అమ్మలేదు... అసలు వ్యాపారమే జరగలేదు... కానీ కాగితాలపై మాత్రం కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగినట్లు సృష్టించారు. ప్రభుత్వం నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద వందల కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రాబట్టారు. దీన్ని ఆసరాగా చేసుకొని బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకున్నారు. ఆ షెల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయని రుణం ఎగ్గొట్టే ప్లాన్ చేశారు. కానీ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు జరిపిన వరుస తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా టీడీపీకి చెందిన వ్యాపార ప్రముఖుడైన రాజ్యసభ సభ్యుడు, ఓ కేంద్ర మాజీ మంత్రికి చెందిన కంపెనీ నిర్వాకమని తెలుస్తోంది. ఆ కంపెనీకి షెల్ కంపెనీలతో ఉన్న లింకులను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్లో ఇప్పటికే ఓ షెల్ కంపెనీకి చెం దిన మేనేజింగ్ డైరెక్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో డైరెక్టర్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చినా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఏం జరిగిందంటే...! వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో కొనుగోలు చేసిన సరుకులను మరో రాష్ట్రంలో అమ్మినప్పుడు ఆ సరుకులపై విధించే జీఎస్టీని ముందుగా సరుకు అమ్మిన రాష్ట్రానికి చెందిన వ్యాపారి చెల్లిస్తాడు. ఆ తర్వాత మరో రాష్ట్రంలో ఆ సరుకులను వినియోగదారుడికి అమ్మిన వ్యాపారి కూడా జీఎస్టీ చెల్లిస్తాడు. అయితే ముందుగానే పక్క రాష్ట్రంలో అమ్మిన వ్యాపారి పన్ను చెల్లించి ఈ రాష్ట్ర వ్యాపారికి విక్రయిస్తాడు కనుక ఈ రాష్ట్రంలో అమ్మిన వ్యాపారికి తాను చెల్లించిన పన్నును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పేరుతో ప్రభుత్వం మళ్లీ తిరిగి ఇచ్చేస్తుంది. అంటే ఒక వస్తువుపై ప్రభుత్వం ఒకసారి మాత్రమే పన్ను వసూలు చేస్తుంది. దీని ప్రకారం రెండోసారి పన్ను చెల్లించిన వ్యాపారి తిరిగి దాన్ని పొందుతాడు. దీన్ని ఆసరాగా చేసుకునే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ కంపెనీ గత 18 నెలలుగా పెద్ద ప్లాన్‌కు శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు వెల్లడించిన ప్రకారం... ఈ ప్లాన్ అమలులో భాగంగా ముందుగా 8 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల ద్వారా వ్యాపార లావాదేవీలు జరిగాయని, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయని ఇన్వాయిస్లు సృష్టించారు. కానీ అక్కడ నిజంగా వ్యాపారం జరగలేదు. కేవలం కాగితాలపైనే రూ. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరిగినట్లు చూపించారు. ఈ వ్యాపారంపై ఓ షెల్ కంపెనీ నుంచి అమ్మిన సరుకులకు జీఎస్టీ కట్టినట్లు, కొన్న కంపెనీ కూడా మళ్లీ జీఎస్టీ కట్టినట్లు కాగితాలపై చూపించారు. అప్పుడు కొన్న కంపెనీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తాము కట్టిన పన్నును పొందొచ్చు కనుక దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు తెలిపిన ప్రకారం ఇలా మొత్తం రూ. 1,284 కోట్ల వ్యాపార లావాదేవీలు చూపించి రూ. 225 కోట్ల మేర ఐటీసీ కింద ప్రభుత్వం నుంచి పొందారు. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఈ వ్యవహారంలో మొత్తం రూ. 2 వేల కోట్ల మేర కాగితపు లావాదేవీలు జరిగి ఉంటాయని, రూ. 500 కోట్ల వరకు ఐటీసీ కింద లబ్ధి పొంది ఉంటారని జీఎస్టీ కమిషరేట్ వర్గాలంటున్నాయి. లావాదేవీల ఆధారంగా రుణాలు... కాగితపు లావాదేవీలపై ప్రభుత్వం నుంచి పొందిన రూ. 225 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించిన పత్రాలను మరో మోసానికి ఉపయోగించుకున్నారు. ఈ లావాదేవీల సామర్థ్యాన్ని గ్యారంటీగా చూపించి రూ. 700 కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చూపించి వాటిని మూసివేసే ప్రయత్నమూ చేశారు. కానీ, జీఎస్టీ అధికారులు జరిపిన వరుస తనిఖీల్లో దొరికిపోయారు. ఇప్పుడు ఒక్కో షెల్ కంపెనీ డైరెక్టర్లను అరెస్టు చేసే పనిలో పడ్డారు జీఎస్టీ అధికారులు. ఒకరి అరెస్టు, మరొకరి అరెస్టుకు ఆదేశాలు... జీఎస్టీ చట్టం ప్రకారం రూ. 5 కోట్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని అరెస్టు చేసే అధికారం ఉండటంతో ఈ షెల్ కంపెనీల ఎండీలను అరెస్టు చేసే పనిలో జీఎస్టీ అధికారులున్నారు. అందులో భాగంగా భరణి కమాడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. బీఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్ ఎండీని కూడా అరెస్టు చేయాలనే ఆదేశాలున్నా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సదరు టీడీపీ ఎంపీ జీఎస్టీ అధికారుల దర్యాప్తును అడ్డుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ షెల్ కంపెనీల్లో ఓ కంపెనీ డైరెక్టర్‌ను తన ఇంట్లోనే పెట్టుకొని అరెస్టు కాకుండా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
రూ.3 వేల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన బడా వ్యాపారులు నల్లధనాన్ని ‘తెల్ల’గా మార్చుకోవడానికి, నగదు సమకూర్చుకోవడానికి భారీ ప«థక రచన చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు కొన్ని చిన్న వ్యాపారులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఏడాది కాలంగా బోగస్ ఇన్వాయిస్లతో దందా చేపట్టారు. వాస్తవంగా లేని సరుకుతో ‘వ్యాపారం’ చేసిన 18 కంపెనీలు రూ.3 వేల కోట్ల టర్నోవర్ సృష్టించాయి. ఈ మొత్తాన్ని దారి మళ్లిస్తూ జీఎస్టీని మాత్రం ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)లో లెక్కలు చూపిస్తూ ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం వాటిల్లేలా చేశాయి. గుట్టుగా సాగుతున్న ఈ దందాపై కన్నేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు 3 నెలలుగా వరుస దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా... శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఇల్లు, కార్యాలయాల్లో దాడులు చేశారు. అతడిని అరెస్టు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్వాయిస్లు రూపొందించి... సాధారణంగా సరుకు సరఫరా చేసే వ్యాపారులు/సంస్థలు దాంతో పాటే ఇన్వాయిస్ను రూపొందించి ఖరీదు చేసిన వారికి ఇస్తారు. దీని ఆధారంగానే ఆ సరుకు ఖరీదు చేసిన వ్యక్తి డబ్బు ఆన్లైన్లో, చెక్కులు, డ్రాఫుల ద్వారా సరఫరా చేసిన వారికి ఇస్తుంటాడు. దీనికి సంబంధించిన జీఎస్టీని సరఫరా చేసిన వ్యక్తి/సంస్థ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే వ్యాపారుల వెసులుబాటు కోసం ప్రభుత్వం జీఎస్టీ తక్షణం చెల్లించకుండా ఐటీసీలో చూపించే అవకాశం కల్పించింది. దీంట్లో లోపాలను అధ్యయనం చేసిన కొందరు బడా వ్యాపారులు దాదాపు ఏడాది క్రితం భారీ స్కామ్‌కు తెరలేపారు. కొందరు వ్యాపారుల వద్ద లేని సరుకును తమకు సరఫరా చేసినట్లు ఇన్వాయిస్లు సృష్టించారు. ఆ మేరకు డబ్బును వారి ఖాతాల్లోకి బదలాయించారు. ఆపై వారు ఈ మొత్తాన్ని డ్రా చేసి మళ్లీ బడా వ్యాపారులకే ఇస్తూ వచ్చారు. ఇలా చేసి నందుకు వారి నుంచి కొంత మొత్తం కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇలా అనేక కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ఏడాదిలో రూ.3 వేల కోట్ల వ్యాపారాన్ని సృష్టించాయి. చెల్లించాల్సిన జీఎస్టీని ఐటీసీలో చూపిస్తూ కాలం గడిపేస్తున్నారు. డీజీజీఐ దర్యాప్తు... వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హైద రాబాద్లోని డీజీజీఐ కార్యాలయం 2 నెలల క్రితం దర్యాప్తు చేపట్టింది. 45 రోజుల్లో తెలంగాణ, ఏపీ లో 10 మందిని అరెస్టు చేసింది. వీరిలో కొందరు ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి గూడ్స్ సరఫరా పేరుతో ఈ స్కామ్‌కు పాల్పడ్డాడు. ఇన్వాయిస్ల మీదే ఆధారపడి రూ.35 కోట్ల వ్యాపారం చేశాడు. దీనికి సంబంధించి రూ.6.31 కోట్ల పన్ను ఎగవేశాడు. ఇతడిని అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దందాతో బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. కంపెనీలు కొన్ని సందర్భాల్లో కొందరికి లంచాలు తదితరాలు ఇస్తున్నట్లు సమా చారం. దీనికి అవసరమైన నగదును కంపెనీ ఖాతాల నుంచి చెల్లించలేరు. దీంతో నగదు సమ కూర్చుకోవడానికి ఈ విధానం వినియోగిస్తున్నారని అనుమానిస్తున్నారు. కేసుల్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి డీజీజీఐలో ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. -
‘బై వన్, గెట్ వన్’ ఆఫర్లపై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఒకటి కొంటే ఒకటి ఉచితం.. ఒకటి కొంటే రెండు ఉచితం... మా దగ్గర వస్తువులు కొంటే 50 శాతం డిస్కౌంట్ ఇస్తాం... మా దగ్గర షాపింగ్ చేస్తే 80 శాతం రాయితీ ఇస్తాం... ఇవన్నీ మాల్స్, దుకాణదారుల ఆఫర్లు. ఎఫ్ఎంసీజీ నుంచి ఫార్మాస్యూటికల్, టెక్ట్స్‌టైల్, ఫుడ్, రిటైల్ చైన్ కంపెనీల వరకు అన్ని కంపెనీలు ఈ మార్కెటింగ్ టెక్నిక్‌నే ఎక్కువగా ఉపయోగించేవి. అయితే ఈ ఉచితాలన్నింటికీ గతేడాది అమల్లోకి వచ్చిన జీఎస్టీ మంగళం పాడేసింది. వాటిని కూడా పన్ను పరిధిలోకి తెచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఈ ఉచితాలను పక్కనపెట్టేశాయి. ప్రస్తుతం ఈ ఉచితాలపై గుడ్‌న్యూస్ చెప్పబోతుంది జీఎస్టీ కౌన్సిల్. బై-వన్-గెట్-వన్-ఫ్రీ వంటి కంపెనీల ఉచిత ఆఫర్లను పన్ను పరిధి నుంచి మినహాయించాలని చూస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ నేతృత్వంలోని ఓ ప్యానల్ అధికారులు.. ఉచితాలపై జీఎస్టీని తీసివేసే ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారని తెలిసింది. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ భేటీ కూడా జరుపబోతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అంతేకాక ఉచితంగా ఉత్పత్తిని అమ్ముతున్నట్టు కంపెనీలు వర్గీకరిస్తే ఇన్ని రోజులు వ్యాపారస్తులు ఇన్పుట్ క్రెడిట్‌ను కూడా కోల్పోయేవారు. అయితే ఇక నుంచి గిఫ్ట్‌లు, శాంపుల్స్‌పై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నిరాకరించకూడదని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రమోషనల్ స్కీమ్స్‌లో బై-వన్-గెట్-వన్-ఫ్రీ అనేది చాలా పాపులర్. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక, చాలా కంపెనీలు దీన్ని తీసేశాయి. కొంతమంది దీన్ని అవలంభించినా.. పన్ను డిపార్ట్మెంట్ నుంచి వారికి నోటీసులు వెళ్లాయి. వ్యాపారం కోసం ఉచిత ధరలకు ఏదైనా అందించినా.. లేదా శాంపుల్స్ సరఫరా చేసినా.. ఇన్పుట్ క్రెడిట్‌పై ఎలాంటి పరిమితులు విధించకూడదని పీడబ్ల్యూసీ పరోక్ష పన్ను అధికారి ప్రతీక్ జైన్ చెప్పారు. -
జీఎస్టీ అపరాధ రుసుము ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను క్లెయిమ్ చేసుకునేందుకు ట్రాన్–1, జీఎస్టీఆర్–3బీ రిటర్నులు దాఖలు చేయని జీఎస్టీ డీలర్లకు అపరాధ రుసుము లేకుండా మళ్లీ దాఖలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సాంకేతిక కారణాలతో ట్రాన్–1తో పాటు జీఎస్టీఆర్–3బీ దాఖలు చేయని డీలర్లకు మరో మంచి అవకాశం లభించినట్లయింది. ఐటీసీ క్లెయిమ్ చేసుకునేందుకు తమకు అవకాశం లేకుండా పోతోందని కొందరు డీలర్లు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్–2017 నుంచి ఏప్రిల్–2018 వరకు జీఎస్టీ ట్రాన్–1 డిక్లరేషన్ చేసి డిసెంబర్–2017 నాటికి కామన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయని వారికే ఇది వర్తించనుంది. ఈ ఏడాది మే 10 నాటికి ట్రాన్–1 డిక్లరేషన్, ప్రతి నెలా జీఎస్టీఆర్–3బీ రిటర్నులు.. మే 31 నాటికి దాఖలు చేసిన వారికీ ఈ మినహాయింపు వర్తించనుంది. -
జీఎస్టీతో లాభాలివీ..
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది పరోక్ష పన్ను విధానంలో వర్తించని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ).. జీఎస్టీలో వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక తయారీ సంస్థ ఒక వస్తువు తయారు చేయటానికి కావాల్సిన ముడి సరుకులను రూ.100 పెట్టి కొనుగోలు చేసిందనుకుందాం. దీనిపై 10 శాతం అంటే రూ.10 రాష్ట్రానికి ఇన్పుట్ ట్యాక్స్ కడుతుంది. ఆ ముడి సరుకులతో వస్తువును తయారు చేసి.. అదే రాష్ట్రంలో లాభం కలిపి రూ.200కు విక్రయించిందనుకుందాం. అప్పుడు అదే రాష్ట్రానికి ఈ సంస్థ అమ్మకం పన్ను (అవుట్‌పుట్ ట్యాక్స్) కూడా చెల్లిస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఒక ఉత్పత్తి తయారీ, విక్రయం రెండూ ఒకే రాష్ట్ర పరిధిలో జరిగినప్పుడు ఇన్పుట్, ఔట్పుట్ ట్యాక్స్ రెండూ కట్టాల్సి వస్తోంది. అయితే జీఎస్టీలో మాత్రం ఏ రాష్ట్రంలో తయారు చేసి.. ఏ రాష్ట్రంలో అమ్మినా సరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అంటే ముడి పదార్థాల కొనుగోలు సమయంలోనే ఇన్పుట్ ట్యాక్స్ కట్టేసింది కనక... అమ్మకం సమయంలో ఆమేరకు పన్ను మొత్తాన్ని మినహాయిస్తారన్న మాట. పన్నులపై పన్నులుండవు జీఎస్టీ వచ్చాక పన్ను మీద పన్ను భారం ఉండదు. ఉదాహరణకు ఉత్పత్తిదారుడు ఒక వస్తువు తయారీ కోసం ముడిసరుకును రూ.100 పెట్టి కొనుగోలు చేశాడు. వస్తువు తయారీకి మరో రూ.100 ఖర్చయింది అనుకుందాం. అంటే ఆ ఉత్పత్తి వ్యయం రూ.200. దీని మీద ఎక్సైజ్ డ్యూటీ (12 శాతం) రూ.24. అంటే మొత్తం రూ.224 అయింది. ఇప్పుడా వస్తువును ఒక రాష్ట్రంలో విక్రయించాలంటే సేల్స్‌ట్యాక్స్ (10 శాతం) కట్టాలి. అంటే రూ.224 మీద 10 శాతం కట్టాలి. ఇక్కడ గమనించాల్సిందేంటంటే... వాస్తవంగా ఉత్పత్తికి అయిన ఖర్చు రూ.200 మాత్రమే. ఎక్సైజు పన్ను కలిపాక రూ.224 అవుతోంది. అంటే అమ్మకం సమయంలో సేల్స్ట్యాక్స్ను ఉత్పత్తి వ్యయం మీద (అంటే రూ.200 మీద) కాకుండా ఎక్సైజ్ సుంకంతో కలిపిన మొత్తంపై (అంటే రూ.224పై) చెల్లించాల్సి వస్తుంది. ఇది తయారీదారులకు రెండు రకాల పన్ను భారంగా మారుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ పన్నుల మీద పన్నుల భారం ఉండదు. ఒకే రిటర్న్ సరిపోతుంది ప్రస్తుతం మన దేశంలో ఒక్కో పన్ను చెల్లించటానికి ఒక్కో తరహా రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీ ఇలా ఒక్కో దానికి ఒక్కో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్‌ను ప్రిపేర్ చేయాలి కూడా. కానీ జీఎస్టీతో ఇవేవీ అవసరం ఉండదు. దేశమంతా ఒకే పన్ను విధానం లాగా.. ఒకే ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేస్తే సరిపోతుంది. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా పేపర్ వర్క్ తప్పుతుంది. జీఎస్టీ అమలు ద్వారా పన్నులు వసూలు చేయటంలో సమర్థత పెరుగుతుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇబ్బందులు.. నష్టాలు దేశంలో జీఎస్టీని ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వేగంగా నిర్ణయాలు కూడా ప్రకటిస్తోంది. కానీ ప్రస్తుతం మనం 2017–18 ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉన్నాం. అప్పటివరకు పాత పన్ను విధానాన్ని పాటిస్తూ... రాత్రికి రాత్రే జీఎస్టీలోకి మారడం కంపెనీలకు, వర్తకులకు కొంత గందరగోళాన్ని కలిగిస్తోంది. ప్రస్తుత విధానంలో రూ.1.50 కోట్ల టర్నోవర్పైన ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే అన్ని కంపెనీలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టర్నోవర్ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించారు. ఇది చిన్న, మధ్యతరహా (ఎస్ఎంఈ) కంపెనీలకు ఇబ్బందికరం, నష్టం కూడా. జీఎస్టీతో నిర్వహణ వ్యయం పెరుగుతుంది. దీన్ని పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి ఉండడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కంపెనీలు ఐటీ నిపుణులను నియమించుకుని జీఎస్టీని నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతమున్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేదా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)లను మార్చి వాటి స్థానంలో కొత్తగా జీఎస్టీ టెక్నాలజీ ఉండే అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తయారీ రంగాలకు చెందిన పలు సంస్థలు పన్ను రాయితీలున్న, పన్నులపరంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాయి. ఈ–కామర్స్ సంస్థలైతే ప న్నుల్లో వెసులుబాటు కోసం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గిడ్డంగుల్ని ఏర్పాటు చేస్తున్నాయి. జీఎస్టీతో దేశమంతటా ఒకే రకమైన పన్ను విధానం ఉన్నప్పుడు ఇవి అన్ని రాష్ట్రాల్లో గిడ్డంగులను నిర్వహిం చాల్సిన అవసరం ఉండదు. డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరుగుతుంది. సరుకుల రవాణా సమయం కూడా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఔట్ ఆఫ్ స్టాక్ పరిస్థితి ఏర్పడొచ్చు కూడా. గిడ్డంగులపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు దూరమై భూములు ధరలూ పడిపోయే ప్రమాదమూ ఉంది. తాజాగా శ్లాబులు ప్రకటించటంతో ఏ వస్తువు పై జీఎస్టీ ఎంత అనేది స్పష్టమైపోయింది. కాకపోతే ఏ వస్తువు విషయంలోనైనా ప్రస్తుత వ్యాట్ రేటు క న్నా జీఎస్టీ రేటు అధికంగా ఉంటే వ్యాపారులకు ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటికే రిటైలర్ స్టోర్లలో బోలెడంత స్టాక్ ఉంది. ఆయా ఉత్పత్తులపై ఎంఆర్ పీ ధర ముద్రించి ఉంటుంది కూడా. జీఎస్టీ రేటు పెరగడంతో కంపెనీలకు లాభాలు తగ్గిపోతాయి. ఉత్పాదక రంగంపై మూలధన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం స్టాక్ బదిలీపై ఎలాంటి పన్నులూ లేవు. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక సరఫరా జీఎస్టీ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది గనక.. కంపెనీలు సరఫరా చైన్ నిర్వహణ వ్యూహాలపై పునరాలోచనలో పడతాయి. ఇది కంపెనీల నగదు ప్రవాహంపై ప్రభావాన్ని చూపిస్తుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపై నియంత్రణ కోల్పోతాయి. ఎలాగంటే దేశంలో నిర్వహించే ప్రతీ వ్యాపారం మీద కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాల రూపంలో ద్వంద్వ నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర పరిధిలో పన్ను రేట్లను మార్చుకునే లేదా తగ్గించుకునే అవకాశం, అధికారం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవు. అది పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ పరిధిలో ఉంటుంది. -
సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఓకే
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లులకు చేసిన 5 సవరణలతోపాటుగా చట్టంలోని మిగిలిన 4 నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 13వ సమావేశంలో.. జీఎస్టీ బిల్లులకు సంబంధించి లోక్‌సభ చేసిన సవరణలను ఆమోదించారు. జీఎస్టీకి సంబంధించిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్, వస్తువులు–సేవల సప్లై వాల్యుయేషన్, లెవీ విధింపుపై నిర్ణయం, మధ్యంతర నిబంధనలకు మండలి మౌలికంగా ఆమోదించారు. సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్లు సంబంధింత అధికారి డిజిటల్ సంతకంతోనే జరగాలని, ఏకీకృత గుర్తింపు నెంబరును ఇవ్వటం, రద్దు చేయటానికి సంబంధించిన విధివిధానాల సవరణకూ ఓకే చెప్పింది. కొన్ని కేటగిరీల్లోని వ్యక్తులు ప్రతిఏటా రిటర్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని జైట్లీ అన్నారు. తుది ముసాయిదాను రూపొందించాక ఇండస్ట్రీ ముందుంచి సలహాలు స్వీకరించాలని నిర్ణయించించారు. -
రైతులకు ‘జీఎస్టీ’ మినహాయింపు
చిన్న వ్యాపారులకు కూడా.. ► చిన్న హోటళ్లపై 5 శాతం పన్ను ► జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం.. మద్దతు బిల్లులకు ఆమోదం న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధి నుంచి రైతులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కోసం కీలక మద్దతు బిల్లులైన సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ)ల తుది ముసాయిదాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ‘వ్యవసాయదారులు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరం లేదు. ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఈశాన్య భారతం, కొండ ప్రాంత రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుంది. అయితే ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)లో చేరొచ్చు’ అని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 50 లక్షల టర్నోవర్ లోపున్న వ్యాపార సంస్థలు.. తక్కువ పన్ను చెల్లించేందుకు ఉద్దేశించిన జీఎస్టీ కాంపొజిషన్ స్కీంను వినియోగించుకోవచ్చని పేర్కొంది. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలపై విధించాల్సిన జీఎస్టీని కౌన్సిల్ 5 శాతంగా(కేంద్రం 2.5 శాతం, రాష్ట్రం 2.5 శాతం) నిర్ణయించింది. రూ. 50 లక్షలు దాటిన రెస్టారెంట్లు రెగ్యులర్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హుస్ముఖ్ అధియా చెప్పారు. బడ్జెట్ మలి విడత సమావేశాల్లో.. స్టేట్ జీఎస్టీ(ఎస్జీఎస్టీ), యూనియన్ టెరిటరీ జీఎస్టీ(యూటీజీఎస్టీ) బిల్లులను ఈ నెల 16న జరిగే భేటీలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించి ఆమోదిస్తుందని జైట్లీ తెలిపారు. జీఎస్టీ ముసాయిదా చట్టంలో 40 శాతం వరకు పన్ను(కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం) విధించాలన్న నిబంధన ఉంటుందని, అయితే అమల్లోకి వచ్చే సగటు పన్ను రేట్లు గతంలో ఆమోదించిన 5, 12, 18, 28 శాతాలుగానే ఉంటాయన్నారు. ‘రేట్లు కౌన్సిల్ నిర్ణయించినట్లే ఉంటాయి. అయితే కస్టమ్స్ చట్టంలో మాదిరి పన్ను విధింపునకు అవకాశం కోసం పన్ను పరిమితి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొన్ని వస్తువులు, సరుకులపై పన్ను పెంచితే పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం ఉండదు’ అని వివరించారు. సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను 9 నుంచి మొదలయ్యే బడ్జెట్ మలి విడత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం కోసం ప్రవేశపెడతామని, జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను కౌన్సిల్ ఆమోదించాక.. రాష్ట్రాల నష్టపరిహార బిల్లు, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ, ఐజీఎస్టీలను కేబినెట్ ఆమోదిస్తుందని, తర్వాత అవి పార్లమెంటు ముందుకు, ఎస్జీఎస్టీ రాష్ట్రాల చట్టసభలకు వెళ్తాయని వివరించారు. కౌన్సిల్ మరికొన్ని నిర్ణయాలు ♦ పన్నుచెల్లింపుదారు పన్నులు వాయిదాల్లో కట్టేందుకు అనుమతించే అధికారాన్ని కమిషనర్ స్థాయి అధికారులకు కల్పించడం ♦ ఎగుమతిదారులు చెల్లించిన పన్నులో వారికి రీఫండ్ చేయాల్సిన మొత్తంలో 90 శాతాన్ని దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లో చెల్లించడం ♦ పన్ను రిటర్న్, పన్ను చెల్లింపు, ఇతర వ్యవహారాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్ ♦ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ– తయారీదారులు చెల్లించిన పన్ను)లో రీఫండ్ మొత్తాలను ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీల్లో దేన్నైనా చెల్లించడానికైనా వాడుకునే అవకాశం -
వ్యాట్‌కు మరిన్ని కోరలు!
అదనంగా రూ. 300 కోట్ల ఆదాయమే లక్ష్యం వ్యాట్ చట్టానికి నాలుగు సవరణలు చేసిన ప్రభుత్వం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు {Mయ విక్రయాల లావాదేవీల బిల్లులూ సమర్పించాల్సిందే లెవీ బియ్యం కొనే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకే పన్ను చెల్లింపు బాధ్యత మద్యం ఖాళీ సీసాలు కొనే డిస్టిలరీలు, బ్రూవరీస్లే పన్ను చెల్లించాలి పన్నుల ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యాట్‌కు మరిన్ని కోరలు తగిలించింది. పన్నులను మరింత సమర్థవంతంగా వసూలు చేయడం, ఎగవేతలను అరికట్టడంతో పాటు నిబంధనలను సరళతరం చేసేందుకు ఈ చట్టానికి నాలుగు సవరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరమైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసింది. పన్ను చెల్లించాల్సిన క్రయవిక్రయాల బిల్లులను రిటర్న్‌తో పాటు జత చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మార్పులతో మొత్తంగా దాదాపు రూ. 300 కోట్లు అదనంగా ఖజానాకు చేరతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. - సాక్షి, హైదరాబాద్ రాష్ట్రానికి సమకూరుతున్న రెవెన్యూలో 60 శాతం వరకు వాణిజ్య పన్నుల శాఖ నుంచే రాబడుతున్న ప్రభుత్వం.. ఏటా మరో రూ. 300 కోట్లకు పైగా అదనపు ఆదాయం పొందేందుకు... వ్యాట్ చట్టానికి నాలుగు సవరణలు చేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు చేయడంతో పాటు క్రయ, విక్రయ లావాదేవీల బిల్లులను జత చేస్తూ వ్యాట్ రిటర్న్స్ దాఖలు చేసేలా చట్ట సవరణ చేసింది. లెవీ బియ్యం కొనుగోళ్లలో మిల్లర్లు పన్ను ఎగవేసేందుకు ఉపయోగపడుతున్న 50 రోజుల్లో పన్ను చెల్లించే వెసులుబాటును రద్దు చేసింది. మద్యం ఖాళీ బాటిళ్లను కొనుగోలు చేసే డిస్టిలరీలు, బ్రూవరీస్ కంపెనీలే ఖాళీ బాటిళ్లకు సంబంధించి పన్ను చెల్లించేలా సవరణ చేసింది. ఈ సవరణల వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడదని, పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యాపారులను దారికి తెచ్చుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వ్యాట్ చట్టంలోని లొసుగులను గుర్తించి తగిన సవరణలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు.. వ్యాట్ చట్టం 13వ సెక్షన్లో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉన్న ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇనుము వంటి ఏదైనా ముడి పదార్థాన్ని కొనుగోలు చేసినప్పుడు 5 శాతం పన్ను చెల్లించే డీలర్.. ఆ ముడి పదార్థాన్ని వినియోగ వస్తువుగా మార్చి విక్రయించినప్పుడు ఒక శాతం పన్ను చెల్లిస్తాడు. ఈ ప్రక్రియలో ముడి పదార్థం పనికిరాకుండా పోయి లేదా మరేదైనా నష్టం జరిగి.. విక్రయించిన వస్తువు ధరకన్నా కొనుగోలు చేసిన ముడి పదార్థం ధర ఎక్కువగా ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద 5 శాతం పన్ను మినహాయింపు పొందే వీలుంది. ఈ క్రమంలో ముందుగా చెల్లించిన 5 శాతం పన్నును డీలర్‌కు వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. ఇలాంటి లావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం... ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చే స్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు విక్రయాలతో సంబంధం లేకుండా డీలర్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరణ వల్ల ఖజానాకు రూ. వంద కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా. లావాదేవీల ఆధారాలతోనే పన్ను.. వ్యాపారులు చూపిన ‘వ్యాట్ రిటర్న్స్’ ఆధారంగానే ఇప్పటివరకు పన్ను విధించడం, చెల్లించడం జరుగుతోంది. అయితే ఒక డీలర్ ఒక నెలలో రూ. కోటి వ్యాపారం చేసినా రిటర్న్స్‌లో మాత్రం రూ. 50 లక్షల విక్రయాలను చూపి, ఆ మేరకే పన్ను కడుతున్నారు. ఇందులోనూ అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇక నుంచి రిటర్న్స్ దాఖలు సమయాల్లో ఆయా కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులను కూడా జత చేసేలా చట్టంలో సవరణ చేసింది. దీనివల్ల ఏటా మరో రూ. 100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని సర్కారు అంచనా. లెవీ కొనుగోళ్లలో ఎగవేతకు చెక్! రూపాయికి కిలో బియ్యం, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖల ద్వారా మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తాయి. రూ. వందల కోట్లలో జరిగే ఈ లావాదేవీలకు సంబంధించి మిల్లర్లు విక్రయించిన బియ్యంపై 5 శాతం వ్యాట్ చెల్లించాలి. దీనిని 50 రోజుల్లో చెల్లించే వెసులుబాటు సెక్షన్ 22 (3సీ) కింద ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు పన్ను సొమ్మును 50 రోజుల పాటు ఇతర లావాదేవీలకు వినియోగించడం లేదా అదే మొత్తంతో ధాన్యం సేకరించి, బియ్యంగా మార్చి మళ్లీ ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలకే విక్రయించడం వంటివి చేస్తున్నారు. అంతేగాకుండా ఈలోపు నష్టాలను చూపి పన్ను ఎగ్గొడుతున్నారు. దీంతో ఇక ‘సోర్స్ ఆన్ ది సేల్ ఆఫ్ ది రైస్’ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా లెవీ బియ్యం కొనుగోలు చేసిన ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలే 5 శాతం వ్యాట్‌ను మినహాయించుకొని మిల్లర్లకు బియ్యం ధరను చెల్లిస్తాయి. ఈ వ్యాట్ సొమ్మును వాణిజ్య పన్నుల శాఖ ఖాతాలో జమచేస్తాయి. ఖాళీ సీసాలపై వ్యాట్‌లోనూ మార్పు.. వ్యాట్ సెక్షన్ 22 (3డీ) ప్రకారం పాత సీసాలను డిస్టిలరీలకు విక్రయించే డీలర్లే.. సీసాల లెక్కను బట్టి వ్యాట్ చెల్లించేవారు. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో ఇకపై డిస్టిలరీస్, బ్రూవరీస్ కంపెనీలే 5 శాతం పన్ను చెల్లించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీని ప్రకారం.. పాత బాటిళ్లకు సంబంధించిన 5 శాతం పన్ను సొమ్మును డిస్టిలరీస్, బ్రూవరీస్ కంపెనీలు డీలర్లకు చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకొని ప్రభుత్వానికి చెల్లిస్తాయి.