రూ.3 వేల కోట్ల గోల్‌మాల్‌!  | Rs 3000 crore golmal | Sakshi
Sakshi News home page

రూ.3 వేల కోట్ల గోల్‌మాల్‌! 

Published Sun, Mar 3 2019 3:04 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

Rs 3000 crore golmal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన బడా వ్యాపారులు నల్లధనాన్ని ‘తెల్ల’గా మార్చుకోవడానికి, నగదు సమకూర్చుకోవడానికి భారీ ప«థక రచన చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు కొన్ని చిన్న వ్యాపారులతో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని ఏడాది కాలంగా బోగస్‌ ఇన్వాయిస్‌లతో దందా చేపట్టారు. వాస్తవంగా లేని సరుకుతో ‘వ్యాపారం’ చేసిన 18 కంపెనీలు రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ సృష్టించాయి. ఈ మొత్తాన్ని దారి మళ్లిస్తూ జీఎస్టీని మాత్రం ఇన్‌ఫుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)లో లెక్కలు చూపిస్తూ ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం వాటిల్లేలా చేశాయి. గుట్టుగా సాగుతున్న ఈ దందాపై కన్నేసిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు 3 నెలలుగా వరుస దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా... శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఇల్లు, కార్యాలయాల్లో దాడులు చేశారు. అతడిని అరెస్టు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  

ఇన్వాయిస్‌లు రూపొందించి... 
సాధారణంగా సరుకు సరఫరా చేసే వ్యాపారులు/సంస్థలు దాంతో పాటే ఇన్వాయిస్‌ను రూపొందించి ఖరీదు చేసిన వారికి ఇస్తారు. దీని ఆధారంగానే ఆ సరుకు ఖరీదు చేసిన వ్యక్తి డబ్బు ఆన్‌లైన్‌లో, చెక్కులు, డ్రాఫుల ద్వారా సరఫరా చేసిన వారికి ఇస్తుంటాడు. దీనికి సంబంధించిన జీఎస్టీని సరఫరా చేసిన వ్యక్తి/సంస్థ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే వ్యాపారుల వెసులుబాటు కోసం ప్రభుత్వం జీఎస్టీ తక్షణం చెల్లించకుండా ఐటీసీలో చూపించే అవకాశం కల్పించింది. దీంట్లో లోపాలను అధ్యయనం చేసిన కొందరు బడా వ్యాపారులు దాదాపు ఏడాది క్రితం భారీ స్కామ్‌కు తెరలేపారు. కొందరు వ్యాపారుల వద్ద లేని సరుకును తమకు సరఫరా చేసినట్లు ఇన్వాయిస్‌లు సృష్టించారు. ఆ మేరకు డబ్బును వారి ఖాతాల్లోకి బదలాయించారు. ఆపై వారు ఈ మొత్తాన్ని డ్రా చేసి మళ్లీ బడా వ్యాపారులకే ఇస్తూ వచ్చారు. ఇలా చేసి నందుకు వారి నుంచి కొంత మొత్తం కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇలా అనేక కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ఏడాదిలో రూ.3 వేల కోట్ల వ్యాపారాన్ని సృష్టించాయి. చెల్లించాల్సిన జీఎస్టీని ఐటీసీలో చూపిస్తూ కాలం గడిపేస్తున్నారు.  

డీజీజీఐ దర్యాప్తు... 
వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హైద రాబాద్‌లోని డీజీజీఐ కార్యాలయం 2 నెలల క్రితం దర్యాప్తు చేపట్టింది. 45 రోజుల్లో తెలంగాణ, ఏపీ లో 10 మందిని అరెస్టు చేసింది. వీరిలో కొందరు ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి గూడ్స్‌ సరఫరా పేరుతో ఈ స్కామ్‌కు పాల్పడ్డాడు. ఇన్వాయిస్‌ల మీదే ఆధారపడి రూ.35 కోట్ల వ్యాపారం చేశాడు. దీనికి సంబంధించి రూ.6.31 కోట్ల పన్ను ఎగవేశాడు. ఇతడిని అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దందాతో బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. కంపెనీలు కొన్ని సందర్భాల్లో కొందరికి లంచాలు తదితరాలు ఇస్తున్నట్లు సమా చారం. దీనికి అవసరమైన నగదును కంపెనీ ఖాతాల నుంచి చెల్లించలేరు. దీంతో నగదు సమ కూర్చుకోవడానికి ఈ విధానం వినియోగిస్తున్నారని అనుమానిస్తున్నారు. కేసుల్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి డీజీజీఐలో ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement