సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ వైద్యాన్ని మరింత ప్రియం చేసేలా జీఎస్టీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. వైద్యసేవలపై విధించే జీఎస్టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకునే వెసులుబాటుపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్పొరేట్ లేదా ఖరీదైన వైద్య సేవలు పొందే రోగుల నుంచి ఆసుపత్రులు ఆమేరకు పన్నును వసూలు చేయనున్నాయి.
గతంలో ఐసీయూ, సీసీయూ, ఐసీసీయూ, ఎన్‌ఐసీయూ చికిత్సలు కాకుండా రూ.5 వేల కన్నా ఎక్కువ రోజువారీ అద్దె చెల్లించి ఆసుపత్రిలో ఉండే రోగులకు వైద్యసేవలపై జీఎస్టీ విధించేవారు. ఈ జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద తిరిగి మళ్లీ ఆ జీఎస్టీని మొత్తాన్ని పొందేవి. తదనుగుణంగా రోగులకు ఇతర సేవల రూపంలో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించేవి.
ఇప్పుడు తిరిగి ఐటీసీ పొందే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో జీఎస్టీకి అదనంగా ఇతర సేవలపై కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఫలితంగా రోగులపై పన్నుభారం పెరగనుంది. అయితే, ఈ నిబంధన మినహాయింపు రాష్ట్రస్థాయిలో జరిగేది కాదని, జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment