సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది.
టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్‌కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్‌కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
Comments
Please login to add a commentAdd a comment