సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్‌షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది.
ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు.
హైదరాబాద్ శివార్లలో భారీగా..
భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్‌షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి.
ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్‌నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్‌లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్‌గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.
ఆదిలాబాద్‌లో 979, ఆసిఫాబాద్‌లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment