సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం గురువారం 333 దరఖాస్తులు అందినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఉత్సాహపడుతున్నవారి నుంచి బుధవారం వరకు 666 దరఖాస్తులు అందగా, నాలుగోరోజు కూడా కలిపి మొత్తంగా 999 దరఖాస్తులు కమిటీకి చేరినట్టు అయింది. గురువారం పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించినవారిలో మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జైపాల్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, పాండు తదితరులు ఉన్నారు.
ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాలకు చెందిన నాయకులు దరఖాస్తులు సమర్పించి టికెట్ వస్తుందా లేదా అన్న దానిపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీరిలో మెజారిటీ ‘నాన్ సీరియస్’అభ్యర్థులే ఉన్నారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని అనుకునే నేతలంతా వారి వారి సీనియారిటీ, స్థానికంగా బలం, పార్టీలో పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో పలుకుబడి వంటి వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్ తాజాగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే ముఖ్యనేతలంతా రాబోయే మూడురోజుల్లో మరీ ముఖ్యంగా, వచ్చే శని, ఆదివారాల్లో తాము పోటీచేసే స్థానాలకు దరఖాస్తులు అందజేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారనే దానిపైనా స్పష్టత వస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment