ఎక్కడ.. ఎవరు? | Competition for MP tickets in BJP: Telangana | Sakshi
Sakshi News home page

ఎక్కడ.. ఎవరు?

Published Mon, Jan 1 2024 3:47 AM | Last Updated on Mon, Jan 1 2024 3:47 AM

Competition for MP tickets in BJP: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి మొదలైంది. నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు రూట్‌ క్లియర్‌ అనే ప్రచారం నేపథ్యంలో మిగిలిన 13 స్థానాల్లో మాత్రం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల ఖరారుపై స్పష్టత వచ్చేలా చూస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఇందుకు అవసరమైన కసరత్తు వేగవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ను ఆయన ఆదేశించినట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎంపీ టికెట్ల కోసం తీవ్రపోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌) మినహాయిస్తే, మల్కాజ్‌గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. 

► మెదక్‌ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు  దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. 

► మహబూబ్‌నగర్‌ సీటు విషయానికొస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. 

► చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సై అంటున్నారు.

► భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్‌ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. 

► మహబూబాబాద్‌  టికెట్‌కు తేజావత్‌ రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్‌ పోటీ పడుతున్నారు.  

► ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్‌ లేదా గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్‌రావులకు అవకాశం ఇస్తారా చూడాలి. 

► నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా లేకపోతే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత బరిలో దింపుతారా చూడాలి. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు.  

► పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. 

మల్కాజ్‌గిరి.. ఈటల గురి
మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ పోటీకి సై అంటున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన అమిత్‌ షాతో విడిగా ఈటల భేటీ అయ్యారు. లోక్‌సభకు పోటీపై మాట్లాడేందుకు సమయం కావాలని కోరగా, రెండు, మూడురోజుల్లో ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది. పి.మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, ఎన్‌.రామచందర్‌రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్‌.మల్లారెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ  మల్కాజ్‌గిరి టికెట్‌ ఇవ్వడానికి వీలుపడని పక్షంలో జహీరాబాద్, మెదక్‌ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్న సంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం.  

జహీరాబాద్‌.. ఏలేటి సురేశ్‌ రెడ్డి 
జహీరాబాద్‌ నుంచి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఈ లోక్‌సభ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన వ్యాపారవేత్త ఏలేటి సురేశ్‌రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే ఆయన కిషన్‌రెడ్డిని కోరినట్టు తెలిసింది. ఈ విషయమై అధిష్టానానికీ విజ్ఞప్తి చేయగా, జనవరి 2న ఢిల్లీ వచ్చి కలవాలని ఆయనకు అమిత్‌షా చెప్పినట్లు తెలిసింది.  డాక్టర్‌ కె.లక్ష్మణ్, వీరశైవ లింగాయత్‌ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్‌ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 

వరంగల్‌.. మందకృష్ణ 
వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మరికొందరూ ఇదే సీటుకు పోటీపడుతున్నారు.

నాగర్‌ కర్నూల్‌..బంగారు శ్రుతి
నాగర్‌కర్నూల్‌ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని బరిలో దింపవచ్చునని లేదంటే ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. 

హైదరాబాద్‌..రాజాసింగ్‌ 
హైదరాబాద్‌ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో  జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన  భగవంత్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement