
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు.
కేసీఆర్ కాళ్లు మొక్కి..
ఇదిలా ఉంటే.. గాంధీభవన్‌లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment