సాక్షి, హైదరాబాద్: పార్టీ టికెట్ల కోసం దాఖలైన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర బీజేపీ సిద్ధమౌతోంది. ఆశావహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు వాటి పరిశీలన కీలకంగా మారింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీల మధ్య అప్లికేషన్లు స్వీకరించగా మొత్తం 6,003 దరఖాస్తులు అందాయి. నియోజకవర్గాల వారీగా వివిధ స్థాయిల్లో వీటిని పరిశీలించి, వడపోతకు సిద్ధం చేసేందుకు కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం దరఖాస్తులను జిల్లాలు, నియోజకవర్గాల వారీ గా కట్టలు కట్టి, ఓ జాబితా రూపొందించేందుకు పార్టీ కార్యాలయంలో కసరత్తు సాగుతోంది. ఈ ప్రక్రియ ముగిశాక దరఖాస్తుల పరిశీలనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నలుగురైదుగురు నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లతో ఓ తాత్కాలిక జాబితాను సిద్ధం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అభ్యర్థుల ఎంపిక నిమిత్తం పంపేందుకు మరికొంత సమయం పట్టొచ్చునని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే రాష్ట్ర ఎన్నికల కమిటీని పార్టీ నాయకత్వం నియమించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
నేటి నుంచి జిల్లాల వారీ సమావేశాలు
మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు ముఖ్య నేతలు తరలనున్నారు. ఈ భేటీల్లో జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల వారీగా అందిన దరఖాస్తులు, పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్, ఎంపీ సోయం బాపూరావు హాజరవుతారని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment