వైన్ షాపుల నుంచి పన్ను వసూలు చేశాకే సరుకు ఇస్తాం
ఆ సొమ్మును ప్రభుత్వానికి చెల్లిస్తాం.. ఈ వెసులుబాటు వ్యాట్ చట్టం కల్పించింది
రూ. 400 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ విభాగానికి ఎక్సైజ్ శాఖ సమాధానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్) పరిధిలో ఎలాంటి పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. తాము ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు నిర్వహించట్లేదని.. మద్యం వ్యాపారుల నుంచి నేరుగా ఆర్థిక శాఖ ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధిలో పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది.
ఈ మేరకు రూ. 400 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలను పంపాలని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ రాసిన లేఖకు ఇటీవల ఎక్సైజ్ యంత్రాంగం సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం జీఎస్టీ పరిధిలో లేదని... ఈ వ్యాపార లావాదేవీలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)నే వసూలు చేస్తామని జీఎస్టీ శాఖకు పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెప్పాయి.
అలా వసూలు చేయడంలో లేదా మద్యం అమ్మకాలకు సంబంధించిన పన్నును ప్రభుత్వానికి చెల్లించడంలో ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేమని స్పష్టం చేసినట్లు చెబుతున్నాయి.
అన్ని వ్యాపారాల్లా కాదు..
జీఎస్టీ వసూలుకు సంబంధించి అన్ని వ్యాపారాల్లాగా మద్యం అమ్మకాలు ఉండవని ఎక్సైజ్ శాఖ తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది. మద్యం తయారీదారులు సరఫరా చేసిన మద్యా న్ని బ్రూవరేజస్ కార్పొరేషన్ ద్వారా వైన్ షాపులకు అమ్ముతామని.. అలా విక్రయించే క్రమంలోనే రిటైలర్ల (వైన్‌షాప్స్) నుంచి మార్కెట్లో మద్యం అమ్మకపు రేటుకు పన్ను తీసుకుంటా మని తెలియజేసింది.
ఆ పన్ను పోను మద్యం అమ్మకాలపై వైన్ షాపు నిర్వాహకులకు కేవలం కమిషన్ ఇస్తామని... మార్కెట్లో మద్యం అమ్మే ధరపై జీఎస్టీ చెల్లించాలన్న వాదన సమంజసం కాదని వెల్లడించింది. ఈ మేరకు వైన్ షాపుల నుంచి పన్ను వసూలు చేసుకొని ప్రభుత్వానికి బ్రూవరేజస్ కార్పొరేషన్ చెల్లించే వెసులుబాటు వ్యాట్ చట్టం ద్వారా ఉందని తెలియజేసింది.
తద్వారా కార్పొరేషన్ పన్ను ఎగవేసిందన్న వాదనలో వాస్తవం లేదని, నగదు లావాదేవీలే నిర్వహించని ప్రభుత్వ సంస్థ.. ప్రభుత్వానికి పన్ను ఎగవేసే వీలుండదని తెలిపింది.
తమకూ వివరాలు ఇవ్వాలన్న సీజీఎస్టీ..
బ్రేవరేజెస్ కార్పొరేషన్ సహా 72 కంపెనీలు రూ. 1,400 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ జీఎస్టీ శాఖ జూలైలో కేసులు నమోదు చేసింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పైనా కేసు పెట్టింది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తమకు కూడా పంపాలని కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) విభాగం ఇటీవల రాష్ట్ర జీఎస్టీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. అందులో తమకు కూడా రూ. 700 కోట్ల వాటా వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment