కేఎఫ్‌ బీర్లు బంద్‌ | Suspension Of Supply Of Kingfisher And Heineken Beer To Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

కేఎఫ్‌ బీర్లు బంద్‌

Published Thu, Jan 9 2025 4:58 AM | Last Updated on Thu, Jan 9 2025 12:18 PM

Suspension of supply of Kingfisher beer to Telangana

బేసిక్‌ ధరలు పెంచనందున తెలంగాణకు కింగ్‌ఫిషర్‌  బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యూబీ కంపెనీ ప్రకటన 

స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్‌ వర్గాల్లో అలజడి

72%తెలంగాణ మార్కెట్‌లోకింగ్‌ఫిషర్‌ బీర్ల బ్రాండ్‌ వాటా

ధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు మంత్రి జూపల్లి

సాక్షి, హైదరాబాద్‌:  ఎ క్సైజ్‌ శాఖకు యునైటెడ్‌ బ్రూవరీస్‌ (యూబీ) కంపెనీ ఝలక్‌ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్‌ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్‌ఎస్‌ఈ(నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌), బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్‌ ఉంది. 

అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్‌ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్‌లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్‌ ధర పెంచాలన్న డిమాండ్‌ ఎక్సైజ్‌  శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది.  

తక్షణమే నిలిపివేస్తున్నాం...
యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్‌ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 

2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్‌ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్‌ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.

పలుమార్లు విజ్ఞప్తులు
ఐదేళ్లుగా బీర్, లిక్కర్‌ తయారీదారులకు బేసిక్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్‌ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్‌కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్‌ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. 

కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీధర్‌ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్‌ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్‌ కంపెనీల బేసిక్‌ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. 

వారం రోజులు ఓకే..
బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్‌లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్‌కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్‌ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. 

అయితే వైన్‌షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్‌ఫిషర్‌ బీర్లకు ఇండెంట్‌ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్‌ విధించే యోచనలో ఎక్సైజ్‌ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.  

చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్‌ ఎండీకి యూబీ కంపెనీ లేఖ
ధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్‌తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్‌ ఎండీ, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ ఆఫీసర్‌ గరీమాసింగ్‌ లేఖ రాశారు. 

ఏప్రిల్‌ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్‌ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్‌ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్‌కు రాసిన లేఖలో గరీమాసింగ్‌ స్పష్టం చేశారు.

ధరలు పెంచడమే న్యాయం 
ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్‌ తయారీ కంపెనీలకు బేసిక్‌ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్‌ ఆఫ్‌ లిక్కర్‌ అండ్‌ బీర్‌ సప్లయర్స్‌

» స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్‌ వర్గాల్లో అలజడి
» మార్కెట్‌లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ తయారు చేసేది యూబీనే

ధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లి
బీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్‌ బ్రూవరీస్‌ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడారు. 

ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్‌ షేర్‌ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్‌ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. 

పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్‌ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్‌ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement