మార్కెట్లోకి మళ్లీ కింగ్‌ ఫిషర్‌ బీర్లు! | Kingfisher Beers to Resume Supply in Telangana | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మళ్లీ కింగ్‌ ఫిషర్‌ బీర్లు!

Published Tue, Jan 21 2025 8:51 AM | Last Updated on Tue, Jan 21 2025 9:44 AM

Kingfisher Beers to Resume Supply in Telangana

సరఫరాకు అంగీకరించిన యునైటెడ్‌ బ్రూవరీస్‌ సంస్థ 

తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌తో చర్చలు జరుగుతున్నట్టు ప్రకటన 

బేసిక్‌ ధర పెంచడంతోపాటు బకాయిల చెల్లింపునకు హామీ   

కొంతకాలం పాటు బీర్లు యథాతథంగా సరఫరా చేస్తామని వచ్చిందని వెల్లడి 

ఈ అంశంపై సచివాలయంలో సమావేశమైన ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు 

మద్యం కంపెనీలకు ధరల పెంపు, కొత్త నోటిఫికేషన్‌ అంశాలపై చర్చ? 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ బీర్ల సరఫరా తిరిగి కొనసాగనుంది. బీర్లను యథాతథంగా సరఫరా చేసేందుకు యునైటెడ్‌ బ్రూవరీస్‌ (యూబీ) సంస్థ అంగీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించాం. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌)తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయి.

మేం అడుగుతున్న విధంగా నిర్ణీత కాల వ్యవధిలో ధరలను సవరించేందుకు, బకాయిలను చెల్లించేందుకు కార్పొరేషన్‌ హామీ ఇచి్చంది. ఈ క్రమంలో బీర్‌ వినియోగదారులు, మా సంస్థలో పనిచేసే కారి్మకులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనాల మేరకు కొంతకాలం వరకు బీర్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’అని యూబీ కంపెనీ ప్రతినిధి నిఖిల్‌ మల్పాని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ లిమిటెడ్‌కు సోమవారం రాసిన లేఖలో వెల్లడించారు. సోమవారం నుంచే యూబీ బ్రూవరీస్‌ నుంచి టీజీబీసీఎల్‌ డిపోలకు కింగ్‌ఫిషర్‌ బీర్ల సరఫరా ప్రారంభమైంది. 

తగ్గిపోయిన బీర్ల నిల్వలు
రాష్ట్రంలో అమ్ముడయ్యే బీర్లలో 70 శాతం యూబీ కంపెనీకి చెందినవే. ఈ నెల 8వ తేదీన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం మేరకు.. కింగ్‌ఫిషర్, హెన్‌కీన్‌ బీర్ల సరఫరా నిలిచిపోయింది. అయితే అప్పటికే రాష్ట్రంలోని మద్యం డిపోల్లో సుమారు 11 లక్షల కేసుల కింగ్‌ఫిషర్‌ బీర్లు నిల్వ ఉన్నాయి. వాటితోపాటు ఇతర కంపెనీలు తయారు చేసే మరో ఏడు రకాల బ్రాండ్లు కలిపి మొత్తం 15 లక్షల కేసుల స్టాక్‌ ఉంది. అయితే యూబీ కంపెనీ నిర్ణయం నేపథ్యంలో బీర్ల కొరత రాకుండా ఎక్సైజ్‌ శాఖ జాగ్రత్త పడింది. టీజీబీసీఎల్‌ డిపోల నుంచి గత 12 రోజులుగా రేషన్‌ పద్ధతిలో బీర్లను మార్కెట్‌లోకి పంపింది. సంక్రాంతి పండుగ కూడా ఉండటంతో ఎక్కడా బీర్ల కొరత రాకుండా ఉండేలా చూసింది. అయినా ఆదివారం నాటికి బీర్ల నిల్వ లక్ష కేసులకు తగ్గిపోయింది. ఇంకో రెండు రోజులైతే రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉండేది. ఈలోగానే యూబీ కంపెనీ బీర్ల సరఫరా ప్రారంభించింది. 

రేట్ల పెంపుపై ఏం చేద్దాం? 
ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు సోమవారం సచివాలయంలో ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మద్యం కంపెనీలు అడుగుతున్న విధంగా బేసిక్‌ ధరల పెంపు, సీఎం ఆదేశించిన మేరకు కొత్త కంపెనీల నుంచి మద్యం సరఫరా కోసం నోటిఫికేషన్‌ విడుదల తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.

‘కింగ్‌ ఫిషర్‌’బీర్ల ఉత్పత్తి వేగవంతం! 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించిన యూబీ కంపెనీ వేగంగా బీర్ల ఉత్పత్తి చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఈ కంపెనీకి ఉన్న రెండు బీర్‌ ఫ్యాక్టరీల్లో సోమవారమే బీర్ల తయారీని మొదలుపెట్టింది. నిజానికి రాష్ట్రంలో బీర్ల సరఫరాను వీటిలో రోజుకు సుమారు 15 లక్షల బాటిళ్ల బీర్ల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి బీర్లు సరఫరా చేస్తుంది. అయితే తెలంగాణలో బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించిన సమయంలో.. ఈ రెండు ఫ్యాక్టరీల్లో లేఆఫ్‌ను ప్రకటించింది. ఉత్పత్తిని నిలిపివేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని కారి్మకశాఖకు లేఖ కూడా రాసింది. దీంతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై యాజమాన్యం ప్రతినిధులు, కారి్మక సంఘాల నేతలతో జిల్లా కలెక్టర్‌ క్రాంతి సోమవారం చర్చలు జరిపారు కూడా. అయితే బీర్ల సరఫరా పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాక్టరీల్లో లేఆఫ్‌ ఎత్తివేశారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement