
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని.. జీపీఆర్ ద్వారా నలుగురు కార్మికులను మార్క్ చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రేపు(ఆదివారం) రాత్రిలోపు వారి ఆచూకీ దొరికే అవకాశముందని.. మిగిలిన వారి జాడ తెలుసుకునేందుకు మరింత సమయం పడుతుందన్నారు. మొత్తం 8 మంది కార్మికులలో నలుగురిని గుర్తించామని, మిగతా నలుగురు టీబీఎం మిషన్ అవతలి వైపున ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం మిషన్ మొత్తం కట్ చేశామని వెల్లడించారు.
టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి రెస్క్యూ చేస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని.. ఘటనపై ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. మరో వైపు, టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్‌వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే.
ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment