విశ్వసనీయత దెబ్బతీస్తే సహించేది లేదు
నివేదిక తర్వాత అధికారులపై కఠినచర్యలు: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్శాఖకు చెడ్డపేరు వస్తోందని, కీలక పదవుల్లోని వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎౖMð్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలే తప్ప.. సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ సొంతంగా విధివిధానాలు ఎలా ఖరారు చేస్తుందని మంత్రి అధికారులపై మండిపడ్డారు. తనశాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో శాఖ ప్రతిష్ట దెబ్బతినడమేకాక, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించారు. అనుమతుల అంశంపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఎక్సైజ్శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదిక ఆధారంగా కఠినచర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా
మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘాపెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణవేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారి వెన్నులో వణుకు పుట్టించేలా చర్యలు ఉండాలని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీ, సరఫరా, విక్రేతలు, సప్లయ్ నెట్‌వర్క్ వారి డేటాబేస్ తయారు చేయాలని, తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసు శాఖ సమన్వయంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు పని చేయాలని తెలిపారు.
మాదక ద్రవ్యాలను అరికట్టడమేకాక.. వాటితో కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కలి్పంచేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియో రూపంలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నా రు. ఈ సమావేశంలో ఎక్సైజ్శాఖ కమిషనర్, ఎండీ ఇ.శ్రీధర్, అడిషనల్ కమిషనర్ అజయ్రావు, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం, ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment