Tonic
-
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత! -
టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశమే లేకపోవడం గమనార్హం. ఇక.. ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్‌ను బాటిల్స్‌గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్‌గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు వెసలుబాటు కల్పించారు. ఇక.. టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు శివారులో వైన్ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్‌లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. -
హైదరాబాద్‌ను ఆగం చేస్తున్న బయో వ్యర్థాలు.. రోగాల కుంపటిగా..!
సూదిమందు.. వాడిపడేసిన కాటన్.. టానిక్ సీసా.. ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఇప్పటికీ అనేక ఆస్పత్రులు తమ వ్యర్థాలను ఆరు బయట తగులబెడుతుండడంతో అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలతో మెడికల్ హబ్‌గా గుర్తింపు పొందిన గ్రేటర్‌ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మెజారిటీ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లకు పీసీబీ అనుమతులు, జీవ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్లు లేకపోవడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,919 ఆస్పత్రుల్లో 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, శివారు పురపాలికల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్లు గాలిలో కలిసి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ చెత్తతోనే వ్యర్థాలు ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం– 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఈ నిబంధనలు అమలు కావడంలేదు. గాందీ, ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్ సహా పలు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ పొగ పీల్చుకున్న వారిలో 20 శాతం మంది అస్వస్థతకు గురవుతున్నారు. విదేశాల్లో ఇలా.. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాడ్ తదితర విదేశాల్లో ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకర రసాయనాలు, ఇతర ఉద్గారాలు గాలిలో కలువకుండా ఎప్పటికప్పుడు దహనం చేస్తున్నారు. వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు. అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్ ట్రీట్ మెంట్ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిపై పెద్ద గుంత తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యర్థాలతో అనర్థాలివే: హెచ్ఐవీ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్‌ను వథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు రోగుల రక్తంతో తడిసిన దుప్పట్లు, సర్జికల్ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. అయినా జీవ వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్పు కనిపించడం లేదు. – ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (చదవండి: మద్యం ‘మత్తు’లో ఎవరెవరు?) -
టానిక్ సీసా మూత మింగిన బాలుడు
ఒడిశా, సోంపేట: మండలంలోని రుషికుడ్డ గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు టానిక్ సీసా పైకప్పు మింగడటంతో గొంతులోకి ఇరుక్కుంది. వెంటనే వైద్యులు తగిన వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం... గ్రామానికి చెందిన కర్రి యోగేశ్వరరావు, గీత దంపతుల కుమారులు సాత్విక్(4), రాము (9 నెలలు) తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్కడ కింద పడి ఉన్న టానిక్ సీసా పైకప్పును బాలుడు మింగి వేశాడు. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన సోంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మంచు ప్రదీప్‌కుమార్, ఎం సాగర్ శస్త్రచికిత్స చేసి గొంతు నుంచి దాన్ని బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు వైద్యులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. -
‘టానిక్’లో బాహాబాహీ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం:36లోని టానిక్ మద్యం దుకాణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు, మద్యం షాపు బౌన్సర్లకు మధ్య తీవ్ర గొడవ జరిగింది. మద్యం కోసం వచ్చిన ఐదుమంది యువకులు నిబంధనలకు విరుద్ధంగా ఖరీదైన మద్యం సీసా మూతతీసి తాగేందుకు యత్నించారంటూ ఈ గొడవ జరిగింది. పొలీసులు తెలిపిన మేరకు.. నగరంలోనే ఖరీదైన మద్యం షాపు టానిక్ పేరుతో నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న శ్రీకాంత్, రేవంత్‌తో సహా ఐదుగురు స్నేహితులు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్పక్కన ఉన్న ఎయిర్ లైవ్ పబ్‌లో మద్యం సేవించి స్నేహితుడి బర్త్‌డే విందును ఘనంగా చేసుకున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతలో మద్యం మత్తులోనే ఈ ఐదుగురు స్నేహితులు టానిక్ మద్యం షాపుకు వెళ్లారు. శ్రీకాంత్ అక్కడున్న జానీవాకర్ మద్యం సీసా మూత తీసి తాగేందుకు యత్నిస్తుండగా బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో మాటామాటా పెరిగింది. బౌన్సర్లు శ్రీకాంత్ ముఖంపై కొట్టడంతో కళ్లద్దాలు పగిలిపోయాయి. ఆపడానికి యత్నించిన మిగతా నలుగురు స్నేహితులు కూడా ఈ గొడవలో పాల్గొన్నారు. షాపులో న్యూసెన్స్ చేశారంటూ మేనేజర్ సుధాకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వికటించిన మందులు
విశాఖపట్నం , అగనంపూడి (గాజువాక): ఒక సిరప్ బదులు మరో సిరప్ ఫార్మాసిస్ట్ ఇవ్వడంతో ఆ మందు వికటించి చిన్నారిని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన అగనంపూడిలో చోటు చేసుకుంది. అగనంపూడి నిర్వాసితకాలనీ కొత్తూరుకు చెందిన సీతిన గణేష్, రూపల మూడేళ్ల పాప హేమచంద్రికకు జ్వరం, జలుబు చేయడంతో అగనంపూడి ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలోని పిల్లల వైద్యనిపుణుడు జ్వరానికి, జలుబుకు సిరప్లు మందుల చీటిపై రాశాడు. అయితే పొరపాటున ఫార్మాసిస్ట్ వేరే సిరప్లు ఇవ్వడం, వాటిని పాపకు పట్టడంతో ఒళ్లంతా రంగుమారిపోయి, దద్దుర్లు వచ్చాయి. అంతలోనే స్పృహ తప్పిపోవడంతో వెంటనే అగనంపూడి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా మందులు మారిపోయినట్టు గుర్తించిన సిబ్బంది కేజీహెచ్‌కు పంపించారు. పాప పరిస్థితి విషమంగా మారుతుండడంతో పాప తల్లిదండ్రులు గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదే విషయంపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, పోలీస్ ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తెలుగు మందులు
♦ టానిక్‌లు, మందు గోళీలపై ‘మన భాష’లో పేర్లు ♦ గ్రామీణ ప్రాంతాల ప్రజలు, నిరక్షరాస్యులకు తప్పనున్న తిప్పలు ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు రోగులకు సమస్య ఉండదు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్యశాఖలో పలు రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందులపై తెలుగులో పేర్లు ముద్రిస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, కనీస అక్షర జ్ఞానం ఉన్న వారికి సులువుగా మందుల పేర్లు అర్థమై ఎలా వాడాలో తెలిసిపోతుంది. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అయ్యే డ్రగ్స్ పక్కదారి పట్టే అవకాశం ఏమాత్రం ఉండదు. వీటిని ఎవరైనా బయటి మెడికల్ దుకాణాలకు విక్రయించినా సులువుగా గుర్తించొచ్చు. – డాక్టర్ రాంకిషన్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలమూరు : తెలుగు మందులు.. అన గానే ఇవేవో తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యే మందులు కావు! ఇందులో కొన్ని ఇక్కడ తయారవుతాయి కావొచ్చు కానీ భాషతో ఈ మందులకేం సంబంధం లేదు!! గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యుల ఇబ్బందులను తీర్చడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు సరఫరా అయ్యే మందులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే ప్రతీ టానిక్ సీసా, టాబ్లెట్ సాషెట్పై ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేర్లు ముద్రిస్తున్నారు. ఇకపై పక్కాగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను కొందరు ప్రైవేట్ మందుల దుకాణాలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై ‘గవర్నమెంట్ సప్లై.. నాట్ ఫర్ సేల్’ అన్ని చిన్న అక్షరాలతో ఉన్నా ఇంగ్లిష్ టానిక్ సీసాలు, టాబ్లెట్ షీట్లపై తెలుగులో ఉన్న పేర్లు తెలుగు మందులు దరికీ అర్థం కాదు కాబట్టి ప్రైవేట్ షాపుల్లో అమ్మకాలు యథేచ్చగా సాగేవి. ప్రస్తుతం మందుల పేర్లే కాకుండా హెచ్చరికను సైతం పెద్ద అ క్షరాలతో ‘తెలంగాణ ప్రభుత్వం ఉచిత సరఫరా.. అమ్మడానికి కాదు’ అని తెలుగులో ముద్రించారు. దీంతో సామాన్యులు సైతం ఇవి ఉచితంగా సరఫరా చేసే మందులు అన్ని గుర్తించడం సులువవుతోంది. ఆంగ్లం.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల పేర్ల ముద్రణలో మార్పులు చేసింది. గతంలో ఆంగ్లంలోనే పేర్లు ఉండడంతో పెద్దగా చదువుకోలేని పల్లె వాసులకు పూర్తిగా అవగాహన ఉండేది కాదు. ఫార్మసిస్టులు చెప్పినా ఇంటికి వెళ్లాక వాడడంతో అయోమయంలో నెలకొనేది. ఆకుపచ్చ రంగు మాత్రలు ఉదయం.. తెలుపు రంగు మాత్రలు ఉదయం, రాత్రి వేసుకోవాలని నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా సిబ్బంది చెప్పేవారు. ప్రస్తుతం ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేర్లు ముద్రిస్తుండడంతో కనీస అక్షర జ్ఞానం ఉన్న వారు సైతం సులువుగా గుర్తుపట్టే అవకాశం ఉంది. ఇదివరకు మాదిరిగా మాత్రలు మందులపై పేర్లు చదవడానికి రాక ఒకదానికి బదులుగా మరొకటి వేసుకునేపరిస్థితి ఇక ఉండబోదని ఫార్మసిస్టులు, వైద్యులు చెబుతున్నారు.