మద్యం ఎలైట్‌గా అమ్ముతామంటూ రంగంలోకి
తొలుత విదేశీ మద్యం విక్రయం పేరుతో ప్రవేశం
ఆ తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్‌కు అనుమతి
ఆనక ఏ4 షాపుల్లోనూ భాగస్వామ్యం
అడిగిందే తడవుగా అన్ని అనుమతులూ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ
రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ స్టోర్స్‌కు ప్రతిపాదనలు
న్యాయపరమైన అడ్డంకుల భయంతో వెనుకడుగు
తనిఖీలు లేకుండా అడ్డగోలుగా షాపుల నిర్వహణ
సహకరించిన అధికారులకు కీలక పోస్టింగులు
లిక్కర్ దందాకు గ్రేట్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది.
ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’
ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్‌బీసీఎల్‌కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్‌మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్‌ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి.
చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక..
ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది.
క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది.
అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్‌గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్‌షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్‌షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం.
ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్
సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్‌లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment