
న్యూఢిల్లీ: ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగం చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత మోసాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి 426 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 14 మంది సీఏలు, లాయర్లు, డైరెక్టర్ల వంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. 2020–21లో సీజీఎస్‌టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ).. నకిలీ ఐటీసీల విషయంలో 8,000 పైచిలుకు కేసులు నమోదు చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది.
సాధారణంగా జీఎస్‌టీ విధానంలో.. ఉత్పత్తిపై పన్ను చెల్లించేటప్పుడు సంస్థలు తాము ముడి వస్తువులపై (ఇన్‌పుట్) కట్టిన పన్ను తగ్గించుకుని, చెల్లించవచ్చు. అయితే, ఇన్‌పుట్ విషయంలో కొందరు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించడం ద్వారా ఐటీసీ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు సీబీఐసీ వివరించింది. దీనిపై దేశవ్యాప్తంగా 2020 నవంబర్ 9 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,200 సంస్థలకు సంబంధించి 500 కేసులు గుర్తించినట్లు, 24 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment