ఇళ్ల ధరలకు రెక్కలు! | Housing prices may rise 10 to 15per cent by April | Sakshi
Sakshi News home page

ఇళ్ల ధరలకు రెక్కలు!

Published Tue, Mar 29 2022 3:54 AM | Last Updated on Tue, Mar 29 2022 3:54 AM

Housing prices may rise 10 to 15per cent by April - Sakshi

ముంబై:  నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్‌ (భారత రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్‌ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా   గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది.

క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్‌ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్‌లకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్‌ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్‌ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 

ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్‌లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్‌లకు ప్రాజెక్ట్‌ సైట్‌లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది.

తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్‌ భారతదేశంలోని ప్రైవేట్‌ రియల్టీ డెవలపర్‌ల అత్యున్నత వేదిక. 1999లో  స్థాపించబడిన ఈ అసోసియేషన్‌ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది.  

చౌక గృహాలపై ఎఫెక్ట్‌...
‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో  ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్‌ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్‌టీ రేటును తగ్గించాలి.  సిమెంట్, స్టీల్‌ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్‌లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ని క్లెయిమ్‌ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్‌ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్‌మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్‌ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు.

వ్యయ భారాలు
స్టీల్‌ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్‌ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి.  ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి.
– దీపక్‌ గొరాడియా, క్రెడాయ్‌–ఎంసీహెచ్‌ఐ ప్రెసిడెంట్‌  

రికవరీకి విఘాతం
రెసిడెన్షియల్‌ సెక్టార్‌ సెగ్మెంట్లలో డిమాండ్‌ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న  పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది.      
– రమేష్‌ నాయర్, కొలియర్స్‌ ఇండియా సీఈఓ

గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్‌ ధరలు భారీగా పెరిగాయి. దీనితో  ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్‌పుట్‌ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము.  దీనితో మా లాభాల మార్జిన్‌లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి.  
– సరాంశ్‌ ట్రెహాన్,  ట్రెహాన్‌ గ్రూప్‌ ఎండీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement