Cost of construction
-
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
సొంతిల్లు కలే !
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. పెళ్లి సంగతేమో గానీ.. ఇల్లు కట్టాలంటే నేడు భయపడాల్సిన పరిస్థితి. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణానికి చాలా మంది వెనుకాడుతున్నారు. మరీ ముఖ్యంగా పేదలు ప్రభుత్వం మంజూరు చేసే పక్కా గృహాలను సైతం పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా వారికి సొంతిల్లు కలగానే మారుతోంది. సాక్షి, అనంతపురం : ఇటీవల గృహ నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. సిమెంటు, స్టీలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోంది. గడిచిన మూడు వారాల్లో సిమెంటు బస్తాపై రూ.50 చొప్పున రెండు సార్లు ధర పెరిగింది. గతంలో బస్తా ధర రూ.200-210 ఉండగా.. నేడు రూ.300-310 పలుకుతోంది. ఇంతకుముందు జిల్లాలో నెలకు 60 వేల టన్నులకు పైగా సిమెంటు అమ్మకాలు జరిగేవి. పెరిగిన ధరలతో 40 వేల టన్నులకు పడిపోయాయి. 40 వేల టన్నులంటే ఎనిమిది లక్షల బస్తాలన్న మాట. పెరిగిన ధరతో మొత్తమ్మీద నెలకు రూ.8 కోట్లు, ఏడాదికి రూ.96 కోట్ల మేర వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఇనుము ధరలు కూడా పెరిగిపోయాయి. నిన్నటి వరకు వైజాగ్ స్టీలు టన్ను రూ.40 వేలు కాగా, ప్రస్తుతం రూ.53 వేలకు చేరింది. జిల్లాలో నెలకు దాదాపు మూడు వేల టన్నుల స్టీలు అమ్మకాలు జరుగుతున్నాయి. టన్నుపై రూ.13 వేల చొప్పున ధర పెరగడంతో నెలకు రూ.3.90 కోట్ల అదనపు భారాన్ని వినియోగదారులు భరించాల్సి వస్తోంది. ఆశలు అడియాసలే అరకొర ఆర్థిక సాయం, సకాలంలో అందని బిల్లులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో బిల్లుల మంజూరుపై అనుమానాలు, నిర్మాణ సామగ్రి ధరల పెంపు తదితర కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. సొంతిళ్లు కట్టుకోవాలన్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. జిల్లాలో 2006 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో 4,61,472 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటిదాకా 2,86,107 పూర్తయ్యాయి. 1,13,349 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 62,016 ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటికీ మొదలుపెట్టలేదని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే 1,75,365 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కొనసాగిద్దామన్నా..మొదలు పెడదామన్నా సిమెంటు, స్టీలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బీసీ, ఓసీలకు రూ.70 వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో బీసీ, ఓసీలకు రూ.80 వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షల చొప్పున మంజూరు చేస్తోంది. పెరిగిన ధరలతో ఈ మొత్తం ఏ మూలకూ చాలడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి సిమెంటు సరఫరా సిమెంటు కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి పంతం నెగ్గించుకున్నాయి. జూన్ మూడు నుంచి ఈ ధరలు అమలు చేయడంతో సిమెంటు బస్తాపై ఏకంగా రూ.100 పెరిగింది. జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీలు పెద్దగా లేకపోవడంతో వ్యాపారులు వైఎస్సార్ జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు గాను అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లా నుంచి దిగుమతి ఆలస్యమయ్యే పక్షంలో తెలంగాణ రాష్ర్టం నుంచి తెచ్చుకోవాలంటే రెండు శాతం పన్ను భారం పడుతుందేమోనని భయపడుతున్నారు. స్టీలు తగినంత సరఫరా కాకపోవడంతో ధరలు పెరిగిపోయాయి.