Property prices enalyst
-
ప్రభుత్వం కీలక నిర్ణయం.. చదరపు అడుగు 7వేల నుంచి రూ.10 వేలకి పెరిగింది
అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని పెంచింది. దీంతో బెంగళూరులో అపార్ట్మెంట్ ధరలు 10-20 శాతం పెరిగాయి. శివారు ప్రాంతాల్లోని ఇళ్ల ధరలు గరిష్ట స్థాయిలో పెరుగుదల కనిపించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గైడెన్స్ వ్యాల్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆస్తి విక్రయాన్ని రిజిస్ట్రేషన్ చేసే కనీస ధరను సూచిస్తుంది. దీనిని కొన్ని రాష్ట్రాల్లో సర్కిల్ రేట్ అని పిలుస్తారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులోని సబర్బన్ ప్రాంతాలైన యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, కేఆర్ పురం ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారీగా పెరిగిన చదరపు అడుగు ధర రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని 20-30 శాతం సవరించింది. ప్రాంతాన్ని బట్టి, ఐటీ కారిడార్లలో ఇది 50 శాతానికి చేరుకోవచ్చని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ప్రస్తుతం యలహంకలో ఒక అపార్ట్మెంట్ చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండేది..ఇప్పుడు అది కాస్తా రూ.11,500కి పెరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండగా ఇప్పుడు రూ.10,000కు విక్రయిస్తున్నారు. కేఆర్ పురంలో అపార్ట్మెంట్ ఖరీదు చదరపు అడుగుకు రూ.5,500 నుంచి రూ.500-1000 పెరిగింది. ఎంజీ రోడ్లో 5కిలోమీటర్ల మేర ప్రాపర్టీ ధరలు లొకేషన్ ఆధారంగా చదరపు అడుగుకు రూ. 12,000-30,000. సీబీడీ ప్రాంతంలోని ప్రధాన ప్రాంతాలలో ఒకటైన లావెల్లే రోడ్లో ధరలు చదరపు అడుగు రూ. 20,000-22,000 ఉండగా.. గతంలో చదరపు అడుగుకు రూ.18,000కి పెరిగాయి. ఇందిరానగర్లో ప్రాపర్టీ ధరలు కనీసం రూ.10,000-20,000కి చేరాయి. సమానమైన ఇళ్ల ధరలు బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో మార్గదర్శక విలువ, వాస్తవ ప్రాపర్టీ ధరల మధ్య వ్యత్యాసం దాదాపు 40-50 శాతం ఉండగా..శివార్లలో ఇది దాదాపు 30 శాతం ఉందని స్థానిక రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. చాలా ప్రదేశాలలో మార్గదర్శక విలువ ఇప్పటికే మార్కెట్ విలువలో 40 శాతం కంటే తక్కువగా ఉంది. అందువల్ల, సర్కిల్ రేట్ల పెరుగుదల ప్రధాన ప్రదేశాలలో ధరలలో అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే శివారు ప్రాంతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది అని రియల్టీ కార్ప్స్ డైరెక్టర్ సునీల్ సింగ్ తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.లక్షకి పెరిగింది పెరిగిన గైడెన్స్ విలువ కొన్ని ప్రాంతాలలో ఇళ్లను కొనుగులో చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని రియాల్టీ నిపుణులు భావిస్తున్నారు. ఇది ఎక్కువగా మధ్యతరగతి, లోయర్ ఎండ్ బడ్జెట్ గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారిపై ప్రభావం చూపుతుంది. 14 శాతం పెంపు వారి ఖర్చులను రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచుతుంది’ అని సింగ్ పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం.. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం గైడెన్స్ విలువను చివరిసారిగా పెంచింది కానీ కోవిడ్-19 సమయంలో తగ్గించింది. రెవిన్యూ శాఖ వివరాల ప్రకారం, పెరుగుదలకు ప్రధాన కారణాలలో అంతకంతకూ తరిగిపోతున్న ప్రభుత్వ ఖజానాను నింపేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని, కాబట్టే ప్రాపర్టీ గైడెన్స్ వ్యాల్యూ ధరని పెంచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
అక్షయ తృతీయ బంగారం కొంటున్నారా?
న్యూఢిల్లీ : హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయను పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఏదైనా కార్యం తలపెడితే లాభాలపంట పండుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గోరెడు బంగారమైనా కొనాలని మగువలు ఆశపడతారు. అలాగే పురుషులు కూడా వాహనాలు, ఆస్తులు కొనాలని కోరుకుంటారు. అలా సంపద లక్ష్మిని అక్షయ తృతీయరోజు తమ ఇంటికి ఆహ్వానిస్తే తమ సంపద రెట్టింపు అవుతుందని భావిస్తారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బంగారం దుకాణదారులు, నగల వర్తకులు పెద్ద పెద్ద ప్రకటనలతో, బోలెడు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మామూలే. అయితే అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఎంత వరకు సబబు? అసలు ఆ రోజు ఆస్తులు కొనుగోలు చేయడం లాభమా? నష్టమా? దీనిపై ఎనలిస్టులు ఏమంటున్నారు? గత అక్షతతృతీయ నాటితో పోలిస్తే కొనుగోళ్లు పెరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చెబుతోంది. ఈమధ్య కాలంలో కేంద్రం బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించడంతో అక్షయతృతీయ నాడు పసిడి కొనుగోళ్లు పుంజుకోనున్నాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా ఉంటాయని ముంబైకి చెందిన బంగారం వ్యాపారులు అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో బంగారం, నగలు కొనడంపై మాత్రం ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో పసిడికి డిమాండ్ బాగా తగ్గిందని, బులియన్ మార్కెట్లోనూపసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అంతర్జాతీయంగా డాలర్ ఇంకింత బలపడి బంగారానికి డిమాండ్ తగ్గి మున్ముందు ధరలు మరింత దిగివచ్చే అవకాశం ముందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సో... ఇపుడు బంగారం కొనకపోవడమే మంచిదంటూ కొంతమంది ఎనలిస్టులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పది గ్రాముల బంగారం ధర రూ.25,500-26,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉందనీ.. ఈనేపథ్యంలో పండుగనాడు బంగారం, వెండి భారీగా కొనుగోలు చేయకపోవడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ అయినందున మరో 2నెలలపాటు మాత్రం ధరలు ప్రస్తుతం కొంచెం మెరుగ్గా ఉన్నా, తర్వాత మరింత క్షీణించే అవకాశం ఉందని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి కూడా పెద్ద ఆశాజనకంగా ఉన్న సూచనలు కనిపించడంలేదు. ఢిల్లీ, ముంబై, నోయిడా తదితర ప్రాంతాల్లో ఈ రంగం బాగా దెబ్బతిందని, దాదాపు 15-20 శాతానికి ధరలు పడిపోయాయని కన్సల్టెంట్ సంస్థ జెఎల్ఎల్ అభిప్రాయపడుతోంది. ఇండియా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం 2016 మార్చి తరువాత మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.