అక్షయ తృతీయ బంగారం కొంటున్నారా?
న్యూఢిల్లీ : హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయను పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఏదైనా కార్యం తలపెడితే లాభాలపంట పండుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గోరెడు బంగారమైనా కొనాలని మగువలు ఆశపడతారు. అలాగే పురుషులు కూడా వాహనాలు, ఆస్తులు కొనాలని కోరుకుంటారు. అలా సంపద లక్ష్మిని అక్షయ తృతీయరోజు తమ ఇంటికి ఆహ్వానిస్తే తమ సంపద రెట్టింపు అవుతుందని భావిస్తారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బంగారం దుకాణదారులు, నగల వర్తకులు పెద్ద పెద్ద ప్రకటనలతో, బోలెడు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మామూలే. అయితే అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఎంత వరకు సబబు? అసలు ఆ రోజు ఆస్తులు కొనుగోలు చేయడం లాభమా? నష్టమా? దీనిపై ఎనలిస్టులు ఏమంటున్నారు?
గత అక్షతతృతీయ నాటితో పోలిస్తే కొనుగోళ్లు పెరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చెబుతోంది. ఈమధ్య కాలంలో కేంద్రం బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించడంతో అక్షయతృతీయ నాడు పసిడి కొనుగోళ్లు పుంజుకోనున్నాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా ఉంటాయని ముంబైకి చెందిన బంగారం వ్యాపారులు అంటున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితిలో బంగారం, నగలు కొనడంపై మాత్రం ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో పసిడికి డిమాండ్ బాగా తగ్గిందని, బులియన్ మార్కెట్లోనూపసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అంతర్జాతీయంగా డాలర్ ఇంకింత బలపడి బంగారానికి డిమాండ్ తగ్గి మున్ముందు ధరలు మరింత దిగివచ్చే అవకాశం ముందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సో... ఇపుడు బంగారం కొనకపోవడమే మంచిదంటూ కొంతమంది ఎనలిస్టులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
పది గ్రాముల బంగారం ధర రూ.25,500-26,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉందనీ.. ఈనేపథ్యంలో పండుగనాడు బంగారం, వెండి భారీగా కొనుగోలు చేయకపోవడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ అయినందున మరో 2నెలలపాటు మాత్రం ధరలు ప్రస్తుతం కొంచెం మెరుగ్గా ఉన్నా, తర్వాత మరింత క్షీణించే అవకాశం ఉందని వారు గట్టిగా వాదిస్తున్నారు.
ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి కూడా పెద్ద ఆశాజనకంగా ఉన్న సూచనలు కనిపించడంలేదు. ఢిల్లీ, ముంబై, నోయిడా తదితర ప్రాంతాల్లో ఈ రంగం బాగా దెబ్బతిందని, దాదాపు 15-20 శాతానికి ధరలు పడిపోయాయని కన్సల్టెంట్ సంస్థ జెఎల్ఎల్ అభిప్రాయపడుతోంది. ఇండియా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం 2016 మార్చి తరువాత మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.