వ్యాట్‌కు మరిన్ని కోరలు! | VAT More fangs! | Sakshi
Sakshi News home page

వ్యాట్‌కు మరిన్ని కోరలు!

Published Mon, Mar 30 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

వ్యాట్‌కు మరిన్ని కోరలు!

వ్యాట్‌కు మరిన్ని కోరలు!

అదనంగా రూ. 300 కోట్ల ఆదాయమే లక్ష్యం

వ్యాట్ చట్టానికి నాలుగు సవరణలు చేసిన ప్రభుత్వం
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు
{Mయ విక్రయాల లావాదేవీల బిల్లులూ సమర్పించాల్సిందే
లెవీ బియ్యం కొనే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకే పన్ను చెల్లింపు బాధ్యత
మద్యం ఖాళీ సీసాలు కొనే డిస్టిలరీలు, బ్రూవరీస్‌లే పన్ను చెల్లించాలి

 
పన్నుల ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యాట్‌కు మరిన్ని కోరలు తగిలించింది. పన్నులను మరింత సమర్థవంతంగా వసూలు చేయడం, ఎగవేతలను అరికట్టడంతో పాటు నిబంధనలను సరళతరం చేసేందుకు ఈ చట్టానికి నాలుగు సవరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరమైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసింది. పన్ను చెల్లించాల్సిన క్రయవిక్రయాల బిల్లులను రిటర్న్‌తో పాటు జత చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మార్పులతో మొత్తంగా దాదాపు రూ. 300 కోట్లు అదనంగా ఖజానాకు చేరతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.    
- సాక్షి, హైదరాబాద్
 
రాష్ట్రానికి సమకూరుతున్న రెవెన్యూలో 60 శాతం వరకు వాణిజ్య పన్నుల శాఖ నుంచే రాబడుతున్న ప్రభుత్వం.. ఏటా మరో రూ. 300 కోట్లకు పైగా అదనపు ఆదాయం పొందేందుకు... వ్యాట్ చట్టానికి నాలుగు సవరణలు చేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు చేయడంతో పాటు క్రయ, విక్రయ లావాదేవీల బిల్లులను జత చేస్తూ వ్యాట్ రిటర్న్స్ దాఖలు చేసేలా చట్ట సవరణ చేసింది. లెవీ బియ్యం కొనుగోళ్లలో మిల్లర్లు పన్ను ఎగవేసేందుకు ఉపయోగపడుతున్న 50 రోజుల్లో పన్ను చెల్లించే వెసులుబాటును రద్దు చేసింది. మద్యం ఖాళీ బాటిళ్లను కొనుగోలు చేసే డిస్టిలరీలు, బ్రూవరీస్ కంపెనీలే ఖాళీ బాటిళ్లకు సంబంధించి పన్ను చెల్లించేలా సవరణ చేసింది. ఈ సవరణల వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడదని, పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యాపారులను దారికి తెచ్చుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వ్యాట్ చట్టంలోని లొసుగులను గుర్తించి తగిన సవరణలు చేస్తున్నామని పేర్కొన్నారు.
 
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు..


వ్యాట్ చట్టం 13వ సెక్షన్‌లో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉన్న ‘ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్’ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇనుము వంటి ఏదైనా ముడి పదార్థాన్ని కొనుగోలు చేసినప్పుడు 5 శాతం పన్ను చెల్లించే డీలర్.. ఆ ముడి పదార్థాన్ని వినియోగ వస్తువుగా మార్చి విక్రయించినప్పుడు ఒక శాతం పన్ను చెల్లిస్తాడు. ఈ ప్రక్రియలో ముడి పదార్థం పనికిరాకుండా పోయి లేదా మరేదైనా నష్టం జరిగి.. విక్రయించిన వస్తువు ధరకన్నా కొనుగోలు చేసిన ముడి పదార్థం ధర ఎక్కువగా ఉంటే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద 5 శాతం పన్ను మినహాయింపు పొందే వీలుంది. ఈ క్రమంలో ముందుగా చెల్లించిన 5 శాతం పన్నును డీలర్‌కు వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. ఇలాంటి లావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం... ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చే స్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు విక్రయాలతో సంబంధం లేకుండా డీలర్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరణ వల్ల ఖజానాకు రూ. వంద కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా.
 
 లావాదేవీల  ఆధారాలతోనే పన్ను..
 

వ్యాపారులు చూపిన ‘వ్యాట్ రిటర్న్స్’ ఆధారంగానే ఇప్పటివరకు పన్ను విధించడం, చెల్లించడం జరుగుతోంది. అయితే ఒక డీలర్ ఒక నెలలో రూ. కోటి వ్యాపారం చేసినా రిటర్న్స్‌లో మాత్రం రూ. 50 లక్షల విక్రయాలను చూపి, ఆ మేరకే పన్ను కడుతున్నారు. ఇందులోనూ అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇక నుంచి రిటర్న్స్ దాఖలు సమయాల్లో ఆయా కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులను కూడా జత చేసేలా చట్టంలో సవరణ చేసింది. దీనివల్ల ఏటా మరో రూ. 100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని సర్కారు అంచనా.
 
 లెవీ కొనుగోళ్లలో ఎగవేతకు చెక్!


 రూపాయికి కిలో బియ్యం, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖల ద్వారా మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తాయి. రూ. వందల కోట్లలో జరిగే ఈ లావాదేవీలకు సంబంధించి మిల్లర్లు విక్రయించిన బియ్యంపై 5 శాతం వ్యాట్ చెల్లించాలి. దీనిని 50 రోజుల్లో చెల్లించే వెసులుబాటు సెక్షన్ 22 (3సీ) కింద ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు పన్ను సొమ్మును 50 రోజుల పాటు ఇతర లావాదేవీలకు వినియోగించడం లేదా అదే మొత్తంతో ధాన్యం సేకరించి, బియ్యంగా మార్చి మళ్లీ ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలకే విక్రయించడం వంటివి చేస్తున్నారు. అంతేగాకుండా ఈలోపు నష్టాలను చూపి పన్ను ఎగ్గొడుతున్నారు. దీంతో ఇక ‘సోర్స్ ఆన్ ది సేల్ ఆఫ్ ది రైస్’ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా లెవీ బియ్యం కొనుగోలు చేసిన ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలే 5 శాతం వ్యాట్‌ను మినహాయించుకొని మిల్లర్లకు బియ్యం ధరను చెల్లిస్తాయి. ఈ వ్యాట్ సొమ్మును వాణిజ్య పన్నుల శాఖ ఖాతాలో జమచేస్తాయి.
 
ఖాళీ సీసాలపై వ్యాట్‌లోనూ మార్పు..


వ్యాట్ సెక్షన్ 22 (3డీ) ప్రకారం పాత సీసాలను డిస్టిలరీలకు విక్రయించే డీలర్లే.. సీసాల లెక్కను బట్టి వ్యాట్ చెల్లించేవారు. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో ఇకపై డిస్టిలరీస్, బ్రూవరీస్ కంపెనీలే 5 శాతం పన్ను చెల్లించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీని ప్రకారం.. పాత బాటిళ్లకు సంబంధించిన 5 శాతం పన్ను సొమ్మును డిస్టిలరీస్, బ్రూవరీస్ కంపెనీలు డీలర్లకు చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకొని ప్రభుత్వానికి చెల్లిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement