
సొమ్ము లేదు.. ధాన్యం లేదని చేతులెత్తేసిన 314 మంది మిల్లర్లు
మిగతా మిల్లర్లకు మరో మూడు నెలల గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బకాయిల వసూలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..పౌరసరఫరాలశాఖ రూ.3,300 కోట్లపైన ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. 2022–23 యాసంగిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరించింది. ఇందులో సెంట్రల్ పూల్‌కు ఇచ్చే పారాబాయిల్డ్ బియ్యం, రాష్ట్ర అవసరాలకు బియ్యం కోసం దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు మరాడించారు.
మిగతా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ఈ ధాన్యం విలువ రూ.7వేల కోట్లు. అయితే అప్పటికే కొంతమంది మిల్లర్లు తా ము ధాన్యాన్ని మిల్లింగ్ చేయలేమని చేతులెత్తేసి..తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అక్రమంగా విక్రయించడం, మిల్లింగ్ చేసి బియ్యాన్ని సరిహద్దులు దాటించేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిల్లర్ల వద్ద ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యంపై దృష్టి పెట్టారు. రికవరీ చేయాల్సిందేనని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ధాన్యం రికవరీకి జాతీయస్థా యిలో వేలానికి టెండర్లు ఆహ్వానించగా, నాలుగు సంస్థలు ముందుకొచ్చాయి. రికవరీ చేయాల్సిన ధాన్యానికి బదులు అప్పటి ధాన్యం విలువకు అదనంగా రూ. 200కు పైగా చేర్చి వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా మొత్తానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువను ప్రభుత్వం రాబట్టింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లర్ల వద్దే ఉండిపోయింది.
దీన్ని ‘వేలం ధాన్యం’గా పేర్కొంటున్న మిల్లర్లు..ధాన్యం బకాయి పడడాన్ని అత్యంత సాధారణ విషయంగా చెబుతున్నారు. మిల్లర్ల సంఘం ముఖ్య నాయకుడిగా చెప్పుకుంటున్న ఓ మిల్లరే దాదాపు రూ.400 కోట్ల విలువైన టెండర్ ధాన్యం బకాయి పడ్డట్టు సమాచారం. నాయకులుగా చెప్పుకునేవారు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా, వ్యాపారం కొనసాగిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది.
తూతూమంత్రంగా రెవెన్యూ రికవరీ యాక్ట్, క్రిమినల్ కేసులు
ధాన్యం బకాయిలు చెల్లించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్‌లో ధాన్యం మిల్లింగ్‌కు ఇవ్వబోమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద యజమాని పేరిట ఉన్న భూములను వేలం వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మిల్లర్లు తాము విక్రయించిన ధాన్యం నుంచి కొంతమేర రికవరీ చూపించి తాత్కాలికంగా తప్పించుకున్నారు. 314 మంది మిల్లర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
తమ దగ్గర ధాన్యం లేదు.. దానికి సమానమైన సొమ్ము కూడా లేదన్నారు. వీరి నుంచి రావాల్సిన సుమారు రూ. 1,000 కోట్లు.. రాని బకాయిల కింద ప్రభుత్వం జమకట్టింది. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించింది. నర్సాపూర్‌లోని ఓ మిల్లర్‌కు చెందిన 1.31 ఎకరాల భూమిని రూ. 2.12 కోట్లకు వేలం వేసింది.
ప్రతి జిల్లాలో కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఏమైందో ఏమో గానీ మిల్లర్లపై చర్యలు నిలిచిపోవడంతోపాటు ధాన్యం కేటాయింపులో కూడా షరతులతో కూడిన సడలింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద నుంచి రావాల్సిన రూ.3,300 కోట్ల బకాయిలు ఇప్పట్లో రికవరీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
తాజాగా మరో మూడు నెలల గడువు
మిల్లర్ల నుంచి బకాయి ధాన్యం వసూలుకు మరో మూడు నెలల గడువు ఇస్తూ ఈ నెల 11న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం ధాన్యం ఎలాగూ ఉండదు కాబట్టి..దానికి సమానమైన నగదు వసూలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 314 మంది మిల్లర్లు ఇప్పటికే మొండికేయగా, మూడు నెలల కాలంలో ఎంత మంది చెల్లిస్తారో తెలియని పరిస్థితి. కఠిన చట్టాలను ప్రయోగిస్తే మిల్లర్లు తిన్న సొమ్ము కక్కేందుకు అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం కదలడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment