ఒకే నెలలో మూడు స్థిరాస్తి ప్రదర్శనలు
క్రెడాయ్ హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి
ఆగస్టు నెలలో వేర్వేరు ప్రాంతాల్లో షోలు
ప్రదర్శనలో 200 సంస్థలు; 700 ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షోలను నిర్వహించనుంది. క్రెడాయబిలిటీ నేపథ్యంలో ఆగస్టు నెలలో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు ప్రాంతాల్లో స్థిరాస్తి ప్రదర్శనలు జరగనున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి, అవకాశాలను గృహ కొనుగోలుదారులకు వివరించడంతో పాటు వారి నిర్దిష్ట అవసరాలు, ప్రాంతాల ప్రాధాన్యతలు, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాపర్టీల ఎంపికకు వీలుంటుంది.
క్రెడాయ్ సభ్యులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయి కాబట్టి పారదర్శకత, విశ్వసనీయత ఉంటుంది. మూడు ప్రాపర్టీ షోలలో కలిపి సుమారు 200 నిర్మాణ సంస్థలు, 600–700 ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని రకాల నివాస సముదాయాలు షోలో ఉంటాయి. ఈమేరకు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన స్థిరమైన పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిభావంతులైన శ్రామికశక్తిని కలిగిన ప్రపంచ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు అపార వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. జనరల్ సెక్రటరీ బీ జగన్నాథరావు మాట్లాడుతూ.. స్థిరాస్తి పెట్టుబడులకు మాత్రమే కాకుండా హైదరాబాద్ సురక్షితమైన పని వాతావరణం, కాస్మోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్నాయని గుర్తు చేశారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్ జైదీప్ రెడ్డి..
క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమబద్ధమైన, స్థిరమైన వృద్ధిని కలిగిన హైదరాబాద్ మెరుగైన జీవన నాణ్యతను, ఆర్ధిక స్థిరత్వాన్ని, సప్టెయినబులిటీతో ఉందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 884 ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్‌లు ఉండగా.. వీటిలో ఎక్కువ భాగం క్రెడాయ్ సభ్యుల ప్రాజెక్టులేనని గుర్తు చేశారు. ప్రాపర్టీ షోలో ప్రదర్శించే అన్ని ప్రాజెక్ట్‌లు గ్రీన్ లివింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మితమైనవేని చెప్పారు.
ప్రాపర్టీ షోలు ఎప్పుడంటే..
» ఆగస్టు 2 – 4న మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో
» ఆగస్టు 9 – 11న కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్స్‌లో
» ఆగస్టు 23 – 25న నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ సెంటర్‌లో
మూడు షోలు ఎందుకంటే...
» ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉండటంతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ స్తబ్ధుగా ఉంది. ఇలాంటి తరుణంలో నగర రియల్టీ మార్కెట్ అభివృద్ధి, అవకాశాలను నగరవాసులకు తెలియజేయాలి.
» హైదరాబాద్‌లో 70 శాతం అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్టే. అయా ప్రాపర్టీల వివరాలతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత రేటు ఉందో తెలిసిపోతుంది. ఎప్పటిలాగే ఒకే ప్రాంతంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తే కేవలం లగ్జరీ, ఎగువ మధ్యతరగతి ప్రాపర్టీలే ప్రదర్శనలో ఉంటాయి. అందుకే ప్రాంతాల వారీగా ప్రాపర్టీ షో నిర్వహిస్తే ఆయా ప్రాంతాల్లోని అన్ని తరగతుల గృహాలు ప్రదర్శనలో ఉంటాయి.
» క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు విశ్వసనీయత ఉంది. ఇలాంటి వేదిక మీదుగా స్థిరాస్తి రంగం, నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రతిపాదనలను ప్రజలకు చేరవేసే వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment