
6.7 శాతం నుంచి 6.5 శాతానికి సవరణ
టారిఫ్‌లు, ప్రపంచీకరణ తిరోగమనం ఫలితం
దేశీ వినియోగం బలంగా ఉంటుందన్న అంచనా
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.7 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను తాజాగా 6.5 శాతానికి సవరించింది. 2024–25 సంవత్సరం మాదిరే వృద్ధి అంచనాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే రుతుపవనకాలం సాధారణంగా ఉంటుందని, కమోడిటీ, చమురు ధరలు కనిష్ట స్థాయిల్లోనే ఉంటాయన్న అంచనాల ఆధారంగా ఈ వృద్ధి రేటును ఇస్తున్నట్టు ఎస్‌అండ్‌పీ తెలిపింది.
ద్రవ్యోల్బణం తగ్గడం, బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, తక్కువ రుణ వ్యయాలు ఇవన్నీ భారత్‌లో విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతాయని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం, ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో చాలా వాటిల్లో దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్‌లు ఈ ఏడాది అంతటా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది.
ఒక శాతం వరకు రేట్ల తగ్గింపు..
‘‘ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరో 0.75 శాతం నుంచి 1 శాతం వరకు ప్రస్తుత సైకిల్‌లో తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ చమురు రేట్ల ఫలితంగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లకి‡్ష్యత స్థాయి 4 శాతానికి సమీపంలో 2025–26లో ఉండొచ్చు’’అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. బలమైన దేశీ డిమాండ్‌తో వర్ధమాన దేశాలు నిలదొక్కుకుంటాయని పేర్కొంది. దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో 2025లో యూఎస్ ఫెడ్ మరొక్కసారే 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
రోడ్డు ప్రమాదాలతో జీడీపీకి నష్టం
ఏటా 3 శాతం కోల్పోవాల్సి వస్తోంది: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశంలో ఏటా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి కారణంగా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తోందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్–భారత్ భాగస్వామ్యంతో ఢిల్లీలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. దేశానికి రహదారి ప్రమాదాలు అతి ముఖ్యమైన సమస్యగా ఉన్నట్టు చెప్పారు. ఏటా 4.80 లక్షల రహదారి ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. ఇందులో 10,000 మంది 18 ఏళ్లలోపు ఉంటుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదొక ప్రధానమైన ప్రజారోగ్య సమస్యే కాకుండా, ఏటా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఖర్చు ఆదా చేసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాలను సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతన్నట్టు చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సాయాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు.
‘‘ప్రమాద బాధితుల సాయానికి ముందుకు వచ్చే మూడో పక్ష వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రమాదం లేదా ప్రమాదం అనంతరం ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గరిష్టంగా రూ.1,50,000 లేదా ఏడేళ్ల పాటు చికిత్స వ్యయాలకు చెల్లింపులు చేయనున్నాం’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు.