న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్‌వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.
మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.
చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు
ఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.
ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.
దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది
Comments
Please login to add a commentAdd a comment