న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో జీ–20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంచనాలనూ వ్యక్తం చేసింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణ విషయంలో కొంత వెనుకబాటుకు గురయ్యే వీలుందని అంచనా వేసింది. సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, బ్యూరోక్రసీ నిర్ణయాల్లో నెమ్మది వంటి అంశాలు తమ ఈ అంచనాలకు కారణంగా పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేసే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనాల్లో ముఖ్యాంశాలు...
- బ్యూరోక్రసీ స్థాయిలో లైసెన్సులను పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు నెలకొల్పడం, ఇందుకు సంబంధించి ఆమోద ప్రక్రియలో నెమ్మది చోటుచేసుకునే వీలుంది. ప్రాజెక్టుల అమలూ ఆలస్యం కావచ్చు. ఆయా అంశాలు దేశానికి ఎఫ్‌డీఐ ఆకర్షణను కొంత తగ్గించవచ్చు. అదే సమయంలో ఈ విషయంలో ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుంది.
- పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, చిన్న కుటుంబాల పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలు దేశంలో సిమెంట్, గృహ నిర్మాణం, కొత్త కార్ల కోసం డిమాండ్‌ను పెంచుతుంది.
- ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం.. ఉక్కు, సిమెంట్ రంగాలకు కలిసి వచ్చే అంశం.
- కాలుష్యం కట్టడికి, పునరుత్పాదకత రంగానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనీయాంశం. ఇది పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.
- తయారీ, మౌలిక రంగాలకు సంబంధించిన డిమాండ్ వచ్చే దశాబ్ద కాలంలో వార్షికంగా 3 నుంచి 12 శాతం మేర నమోదుకావచ్చు. అయతే 2030 నాటికి భారతదేశ సామర్థ్యం చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుంది.
- ఎకానమీ పటిష్టంగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక తయారీ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు బలహీనంగానే కొనసాగే వీలుంది. ఎకానమీ సంస్కరణల విషయంలో పరిమితులు, విధాన నిర్ణయాల్లో అమలు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు.
- భూసేకరణ నిర్ణయాల్లో ఆమోదాలు, నియంత్రణా పరమైన క్లియరెన్స్‌లు, లైసెన్సులు పొందడం, వ్యాపారాలను స్థాపించడం వంటి వాటి కోసం ఎంత సమయం అవసరమో ఖచ్చితంగా తెలియకపోవడం భారత్ విధాన పరమైన అంశాల్లో ప్రధాన లోపం. ఇది ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యాలకు కారణం అవుతోంది. ఆయా అంశాలతో పాటు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వేగంలేకపోవడం విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.
- అవినీతిని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, పన్నుల వసూళ్లు బేస్ పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే వీటిలోనూ అవరోధాలు కనబడుతున్నాయి.
- కార్మిక చట్టాల్లో సౌలభ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను విస్తరించడం, తయారీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంసహా గత కొన్ని సంవత్సరాలుగా పలు రంగాల పురోగతికి చేపట్టిన చర్యలు పటిష్టవంతంగా అమలు జరిగితే అది దేశ పటిష్ట అధిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది.
ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా..
Comments
Please login to add a commentAdd a comment