Moodys report
-
5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్ (ఆగస్టు అప్డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జీ20 వృద్ధి తీరు ఇది... జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం. -
3.5 లక్షల కోట్ల డాలర్లు.. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో జీ–20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంచనాలనూ వ్యక్తం చేసింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణ విషయంలో కొంత వెనుకబాటుకు గురయ్యే వీలుందని అంచనా వేసింది. సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, బ్యూరోక్రసీ నిర్ణయాల్లో నెమ్మది వంటి అంశాలు తమ ఈ అంచనాలకు కారణంగా పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేసే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనాల్లో ముఖ్యాంశాలు... బ్యూరోక్రసీ స్థాయిలో లైసెన్సులను పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు నెలకొల్పడం, ఇందుకు సంబంధించి ఆమోద ప్రక్రియలో నెమ్మది చోటుచేసుకునే వీలుంది. ప్రాజెక్టుల అమలూ ఆలస్యం కావచ్చు. ఆయా అంశాలు దేశానికి ఎఫ్‌డీఐ ఆకర్షణను కొంత తగ్గించవచ్చు. అదే సమయంలో ఈ విషయంలో ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుంది. పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, చిన్న కుటుంబాల పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలు దేశంలో సిమెంట్, గృహ నిర్మాణం, కొత్త కార్ల కోసం డిమాండ్‌ను పెంచుతుంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం.. ఉక్కు, సిమెంట్ రంగాలకు కలిసి వచ్చే అంశం. కాలుష్యం కట్టడికి, పునరుత్పాదకత రంగానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనీయాంశం. ఇది పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తయారీ, మౌలిక రంగాలకు సంబంధించిన డిమాండ్ వచ్చే దశాబ్ద కాలంలో వార్షికంగా 3 నుంచి 12 శాతం మేర నమోదుకావచ్చు. అయతే 2030 నాటికి భారతదేశ సామర్థ్యం చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుంది. ఎకానమీ పటిష్టంగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక తయారీ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు బలహీనంగానే కొనసాగే వీలుంది. ఎకానమీ సంస్కరణల విషయంలో పరిమితులు, విధాన నిర్ణయాల్లో అమలు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. భూసేకరణ నిర్ణయాల్లో ఆమోదాలు, నియంత్రణా పరమైన క్లియరెన్స్‌లు, లైసెన్సులు పొందడం, వ్యాపారాలను స్థాపించడం వంటి వాటి కోసం ఎంత సమయం అవసరమో ఖచ్చితంగా తెలియకపోవడం భారత్ విధాన పరమైన అంశాల్లో ప్రధాన లోపం. ఇది ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యాలకు కారణం అవుతోంది. ఆయా అంశాలతో పాటు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వేగంలేకపోవడం విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. అవినీతిని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, పన్నుల వసూళ్లు బేస్ పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే వీటిలోనూ అవరోధాలు కనబడుతున్నాయి. కార్మిక చట్టాల్లో సౌలభ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను విస్తరించడం, తయారీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంసహా గత కొన్ని సంవత్సరాలుగా పలు రంగాల పురోగతికి చేపట్టిన చర్యలు పటిష్టవంతంగా అమలు జరిగితే అది దేశ పటిష్ట అధిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
మూడీస్ నివేదిక: సామాన్యులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెరుగుతున్న రుణ వ్యయాలు, సుదీర్ఘమైన రష్యా–ఉక్రెయిన్ వివాదం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో ప్రపంచంలో రుణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇంధనం, ఆహార వ్యయాల పెరుగుదలతోపాటు గృహాల కొనుగోలు శక్తిని ఈ పరిణామాలు బలహీనపరుస్తున్నాయని తెలిపింది. దీనితోపాటు కంపెనీలకు ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతున్నాయని, పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింటోందని వివరించింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ►సావరిన్ డెట్ ఇష్యూయర్స్‌కు సంబంధించి రుణ వ్యయాలు పెరిగేకొద్దీ ఈ ఇన్‌స్ట్రమెంట్ల స్థిరత్వం సవాలుగా ఉంటుంది. ఇప్పటికీ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం నుండి పూర్తిగా కోలుకోని పరిస్థితుల్లో రుణ సమీకరణలో క్లిష్ట పరిస్థితులు మరింత ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ►గ్లోబల్ క్రెడిట్ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. పెరుగుతున్న రుణ వ్యయాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ సైనిక వివాదం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఇంధనం– వస్తువుల ధరలు పెరగడం వంటి అంశాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో సరఫరాల సమస్య తీవ్రతరంగా ఉంది. ఆర్థిక మార్కెట్ అస్థిరత పెరిగింది. ►అనేక దేశాల్లోని కేంద్ర బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణానికి ప్రతిస్పందనగా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించడంతో, ఆర్థిక మార్కెట్ పరిస్థితులు అంతర్జాతీయంగా క్లిష్టంగా మారాయి. వడ్డీరేట్ల పెంపు కొనసాగే అవకాశాల నేపథ్యంలో కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు నెలకొన్నాయి. ►ఆర్థిక వృద్ధికి ప్రతికూలతలు అసాధారణంగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఎకానమీ అవుట్‌లుక్‌ను మరింత దిగజార్చేందుకు అనేక పరిణామాలు పొంచిఉన్నాయి. ► వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం, దీర్ఘకాలిక సప్లై చైన్ అంతరాయాలు, చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే తీవ్ర మందగమనంలో కొనసాగే అవకాశాలు, కోవిడ్–19 యొక్క కొత్త, మరింత ప్రమాదకరమైన వేరియంట్ల అవకాశాలు, దీనిపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు ప్రపంచాన్ని మరికొంతకాలం సవాళ్ల వలయంలోనే ఉంచే అవకాశం ఉంది. ► ఈ అసాధారణమైన అధిక అనిశ్చితి తదుపరి ఆరు నుండి ఎనిమిది నెలల్లో ఇంధప ధరల తీవ్ర ఒడిదుడుకులు, ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది. ► మేనెల్లో మూడీస్ జీ–20 ఆర్థిక వ్యవస్థల ఎకానమీ వృద్ధి అంచనాను ఈ ఏడాదికి 3.1 శాతానికి, వచ్చే ఏడాదికి 2.9 శాతానికి తగ్గించింది. అంతక్రితం ఈ అంచనాలు వరుసగా 3.6 శాతం, 3 శాతంగా ఉన్నాయి. -
భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) పటిష్ట లాభాల బాటన పయనించనుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ఒకటి తెలిపింది. మొండి బకాయిలు (ఎన్పీఏ) తగ్గడం, ప్రీ–పొవిజినింగ్ ఆదాయాల్లో (నష్టాన్ని భర్తీ చేసే విధంగా నికర వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు, తక్కువ వ్యయాలు నెలకొన్న పరిస్థితి) వృద్ధి దీనికి కారణంగా పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మెరుగైన లాభదాయకత, రుణ వృద్ధిలో మంచి రికవరీ కారణంగా కేంద్ర మూలధన కల్పన అవసరం తగ్గుతుంది. ఇది అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంలో తగిన మూలధన నిర్వహణ కొనసాగడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వద్ద మూలధన నిష్పత్తులు గత సంవత్సరంలో గణనీయంగా మెరుగయ్యాయి. కేంద్రం నుంచి సకాలంలో తగిన మద్దతు దీనికి కారణం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లాభదాయకతను సద్వినియోగం చేసుకుంటూ, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ నుండి మూలధనాన్ని సమీకరించడానికి చురుగ్గా ప్రయత్నించాయి. రేటెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు అసెట్–వెయిటెడ్ సగటు సాధారణ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) రేషియో 2021 చివరి నాటికి 15.8 శాతం. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో రుణ వృద్ధిని పెంచుకోడానికి దీనిని ప్రైవేటు బ్యాంకింగ్ వినియోగించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడ్డం– మార్కెట్ నుండి ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం నుండి మూలధన మద్దతుపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయ వడ్డీ రేట్లు క్రమంగా పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి. అయితే డిపాజిట్లపై వడ్డీలూ పెరగడం వల్ల సమీకరణ వ్యయాలూ కొంచెం పెరగవచ్చు. స్థిరమైన రుణ నాణ్యత, మొండి బకాయిల సవాళ్లను ఎదుర్కొనడానికి అమలు చేస్తున్న నిబంధనలు బ్యాంకుల ప్రొవిజనింగ్స్ (ఎన్పీఏలకు కేటాయింపులు) అవసరాలను తగ్గిస్తాయి. రుణాలపై ఆదాయాలు రేటెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో 2021 డిసెంబర్ ముగిసే నాటికి 0.6 శాతం. ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో 1.5 శాతం. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా 0.4 శాతం క్షీణత, 0.7 శాతాలుగా ఉన్నాయి. మొండి బకాయిల (ఎన్పీఎల్) రేషియోలు తగ్గుతాయి. రైటాఫ్‌ల నుంచి వసూళ్లు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల నేపథ్యంలో కొత్త ఎన్‌పీఎల్‌ల స్థిరత్వం వంటి అంశాలు దీనికి కారణం. కార్పొరేట్ ఆదాయాల్లో పెరుగుదల, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో నిధుల సమీకరణ ఇబ్బందులు తగ్గడం రుణ వృద్ధికి దారితీసే అంశం. 2020–21లో రుణ వృద్ధి రేటు 5 శాతం అయితే 2022–23లో ఈ రేటు 12 నుంచి 13 శాతం వరకూ పెరగవచ్చు. 2021–22లో వృద్ధి 9.3 % మూడీస్ నివేదిక ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన రికవరీని సాధిస్తుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.3 శాతంగా నమోదవుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.4 శాతంగా ఉంటుంది. వినియోగ, వ్యాపార విశ్వాసాలు మెరుగుపరచడంతోపాటు దేశీయ డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. ఆయా అంశాలు ఆర్థిక పురోగతికి, రుణ వృద్ధికి దోహదపడతాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎకానమీకి తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరలు, రూపాయి విలువ వంటి అంశాలపై ఈ ప్రభావం పడవచ్చు. ఇది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకూ దారితీయవచ్చు. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..! -
మారిన మూడీస్ ‘అవుట్‌లుక్’,భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే?
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. జంక్ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సెప్టెంబర్ చివరి వారంలో మూడీస్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఎకానమీ మూలస్తంభాలు పటిష్టంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు వివరించారు. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణ్యం, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో మూడీస్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేసినా, రేటింగ్‌ను మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడీస్ చెప్పిన ముఖ్యాంశాలు... ♦భారత్ ఫారిన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూయెర్ రేటింగ్స్, లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌ను కూడా ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు మూడీస్ తాజాగా విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ♦ మూలధనం, ద్రవ్యలభ్యత, బ్యాంకులు, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ సంస్థల పరిస్థితులు గతంతో పోల్చితే ఇప్పుడు మెరుగుపడినట్లు మూడీస్ వివరించింది. ♦ అయితే రుణ భారాలపై అప్రమత్తత అవసరమని సూచించింది. మూడీస్ తాజా ప్రకటన ప్రకారం 2019లో జీడీపీలో భారత్ రుణ భారం 74 శాతం. 2020 జీడీపీలో ఇది 89 శాతానికి చేరింది. సమీపకాలంలో దాదాపు 91 శాతంగా ఉండే అవకాశం ఉంది. రుణ భారాల నిష్పత్తుల తగ్గాలంటే, దేశానికి భారీ వృద్ధి రేటు అవసరం. ♦ ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో మరింత తగ్గుతుందన్న అంచనాలను మూడీస్ వెలువరించింది. ♦ ద్రవ్యలోటు తగ్గితే దేశ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనతలు మరింత తగ్గుతాయని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి (రూ.15,06,812 కోట్లు) కట్టడి చేయాలన్నది 2021–22 బడ్జెట్ లక్ష్యం. 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా కష్టాల్లో ఈ లోటు ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ పరిస్థితులు బాగున్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు కరోనా ముందస్తుకాలంకన్నా మెరుగుపడే అవకాశం ఉంది. 2020–21లో జీడీపీ 7.3 శాతం పతనం అయితే, 2021–22లో 9.3 శాతంగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతంగా నమోదుకావచ్చు. ♦ వ్యాక్సినేషన్ పెరగడంతో మూడవవేవ్ ముప్పు ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉండకపోవచ్చు. ♦ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన, సంస్కరణాత్మక చర్యలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశం చక్కటి వృద్ధి బాటన దూసుకుపోయే అవకాశం ఉంది. రేటింగ్‌ల తీరు... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. ప్రాముఖ్యత ఎందుకు? అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. -
2021-22 వృద్ధి రేటు అంచనాలను భారీగా కోత
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి భారీ వృద్ధి అంచనాలకు భారీగా కోతపెడుతున్న సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ చేరింది. ఫిబ్రవరిలో వేసిన 13.7 శాతం వృద్ధి అంచనాలను భారీగా 4.4 శాతం తగ్గించి 9.3 శాతానికి కుదించింది. తాజా పరిస్థితులు ఎకానమీ రికవరీకి తీవ్ర అడ్డంకిగా మారాయని మూడీస్ పేర్కొంది. ఈ ప్రతికూల ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. మూడీస్ ప్రస్తుతం ఇతర రేటింగ్ దిగ్గజ సంస్థలు- ఎస్అండ్పీ, ఫిచ్ తరహాలోనే భారత్‌కు ‘చెత్త’ స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువగా ‘నెగటివ్ అవుట్‌లుక్‌తో బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4-మే 17, మే 18-మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వరకూ క్షీణరేటు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నాల్గవ త్రైమాసికంలో పరిస్థితి కుదుటపడుతున్నట్లు కనిపించినా ఊహించని రీతిలో కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడీస్ భారత్ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే.. అధిక రుణ భారం (జీడీపీలో దాదాపు 90 శాతానికి చేరుతుందన్న అంచనా) బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థలు సార్వభౌమ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడులను తీవ్రతరం చేస్తున్నాయి. సెకండ్ వేవ్‌తో ఉత్పన్నమైన పరిస్థితలు భారత్ ఆరోగ్య వ్యవస్థపై ప్రతికూలను చూపుతున్నాయి. ఆసుపత్రులు క్రిక్కిరిసిపోయిన పరిస్థితి. మెడికల్ సరఫరాల్లో తీవ్ర కొరత ఏర్పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై 2020 తరహా తీవ్ర పర్యవసానాలు ఉండబోవు. ఆయా స్థానిక చర్యలు స్వల్పకాలమే కొనసాగే అవకాశం ఉండడం, వ్యాపారాలు, వినియోగదారులు కరోనాతో కలిసి పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తుండటం దీనికి కారణం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలు 7.9 శాతంగా ఉండే వీలుంది. దీర్ఘకాలంలో 6 శాతంగా ఉండవచ్చు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంలో విధాన నిర్ణయ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021-22లో 10.8 శాతం ఉంటుందని క్రితం వేసిన అంచనాలు మరింతగా 11.8 శాతానికి పెంపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉన్న రుణ భారం 2023లో 92 శాతానికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు దిగ్గజ రేటింగ్ సంస్థలు ఇలా... ఎస్అండ్పీ గ్లోబల్ 2021-22 ఆర్థిక సంవత్సరం 11 శాతం వృద్ధి తొలి (మార్చి) అంచనాలను దిగువముఖంగా సవరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కరోనా కొత్త కేసులు మే చివరినాటికి గరిష్టానికి చేరి, అక్కడినుంచీ పెరక్కుండా తగ్గుతూ వస్తే, భారత్ 9.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. అయితే జూన్ చివరి వరకూ ఈ పరిస్థితి లేకపోతే 8.2 శాతానికి కూడా వృద్ధి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత్‌కు ఎస్అండ్పీ 13 సంవత్సరాలుగా స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ రేటింగ్‌ను ఇస్తోంది. రెండేళ్లు ఈ రేటు మార్చబోమని కూడా ఇటీవలే భరోసా ఇచ్చింది. ఇక ఫిచ్ రేటింగ్స్ అంచనా ఇప్పటి వరకూ 2021-22లో 12.8 శాతంగా కొనసాగుతోంది. అయితే 2022-23లో ఇది 5.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ఫిచ్ దేశానికి నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ అవుట్‌లుక్ ఇస్తోంది. అయితే ఫిచ్ గ్రూప్ సంస్థ- ఫిచ్ సొల్యూషన్ మాత్రం 2020-21 వృద్ధి అంచనాలను ఇప్పటికే 12.8 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. కోతల బాటనే నోమురా జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం- నోమురా కూడా భారత్ 2021-22 వృద్ధి అంచనాలకు భారీ కోత పెట్టింది. తొలి 12.6 శాతం అంచనాలను 10.8 శాతానికి కుదించింది. ఆర్థిక క్రియాశీలతకు సంబంధించి తన ప్రొప్రైటరీ ఇండెక్స్ మే 9వ తేదీతో ముగిసిన వారంలో 64.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. వారం వారీగా ఇది 5 శాతం పతనమని పేర్కొన్న నోమురా, 2020 జూన్ నాటి పరిస్థితికి ఆర్థిక క్రియాశీలత జారిపోయిందని తెలిపింది. ఇండెక్స్‌లో భాగమైన రవాణా విభాగం 10 శాతం పడిపోయిందనీ, విద్యుత్ డిమాండ్ 4.1 శాతం తగ్గిందని వివరించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎకానమీ రికవరీకి తీవ్ర విఘాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. తద్వారానే మహమ్మారి వేగాన్ని నియంత్రించవచ్చని సూచించింది. దేశంలో ఆరోగ్య రంగంపై వ్యయాలు మరింత పెంపుపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి ఉద్ఘాటిస్తోందని తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. కేర్ అంచనాలు... నాల్గవసారి! కేర్ రేటింగ్స్ మంగళవారం మరోసారి భారత్ 2021-22 వృద్ధి అంచనాలను సవరించింది. 10.2 శాతం నుంచి 9.2 శాతానికి అంచనాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 2021 మార్చి 24న సంస్థ 11 నుంచి 11.2 శాతం అంచనాలను వెలువరించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 5న 10.7 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 21న మరింతగా 10.2 శాతానికి సవరించింది. తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్! భారత్ ‘తీవ్ర జీవనోపాధి సంక్షోభం’ దిశగా పయనించే అవకాశం ఉందని బెల్జియంకు చెందిన ఇండియన్ ఎకనమిస్ట్ ప్రముఖ ఎకనమిస్ట్ జీన్ డ్రెజ్ హెచ్చరించారు. సెకండ్‌వేవ్ తీవ్రత, రాష్ట్రాల స్థానిక ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యం- శ్రామిక వర్గంపై పిడుగుపాటుగా మారవచ్చని ఒక ఇంటర్వ్యూలో సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆంక్షల వల్ల ఏర్పడిన పరిస్థితి ‘దాదాపు జాతీయ లాక్డౌన్’ను తలపిస్తోందని అన్నారు. 2024–25 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యం ‘‘సాకారమయ్యే’’ అవకాశమే లేదని అన్నారు. దేశానికి సంబంధించి భారత్‌లో కొన్ని వర్గాల ‘‘సూపర్–పవర్ ఆశయాలు’’ సాధ్యమబోవని అభిప్రాయపడ్డారు. శ్రామిక వర్గం పరిస్థితి 2020కన్నా ప్రస్తుతం భిన్నంగా ఏమీ లేదని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వానికి సలహాలను ఇచ్చిన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)లో జీన్ డ్రెజ్ సభ్యుడు కావడం గమనార్హం. భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికీ కష్టమే : నిషా దేశాయ్ బిస్వాల్ వాషింగ్టన్: భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికి కూడా కష్టకాలంగానే ఉంటుందని అమెరికా-భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కరోనా వైరస్ పరమైన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలియగానే అమెరికా కార్పొరేట్ సంస్థలు అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటానికి టాప్ 40 కంపెనీల సీఈవోలతో కొత్తగా గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు తెలిపారు. భారత్ మళ్లీ పుంజుకుంటుంది: ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి: భారత్ 2022లో తిరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రకటించింది. భారత జీడీపీ 10.1 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2021 సంవత్సరానికి మాత్రం భారత వృద్ధి అవకాశాలు చాలా బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారికి నూతన కేంద్రంగా భాతర్ మారడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక స్థితిపై వార్షిక మధ్యంత నివేదికను మంగళవారం విడుదల చేసింది. చదవండి: ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
కరోనా సెకండ్‌వేవ్: ఎకానమీ కష్టాలు!
సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్ సెకండ్‌వేవ్ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది. ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్ తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2021లో రెండంకెల్లో వృద్ధి రేటు ఉన్నా 2020లో అతి తక్కువ స్థాయి గణాంకాలే(బేస్ ఎఫెక్ట్) ఇందుకు ప్రధాన కారణమవుతోందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా, పాక్షిక లాక్డౌన్ వల్ల పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని పలువురు సీఈవోలు తమ సర్వేలో అభిప్రాయపడినట్లు సీఐఐ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సెకండ్‌వేవ్ కేసుల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 1.4 శాతం నష్టం జరగనుందని బ్రిటిష్ బ్రోకరేజ్ దిగ్గజం– బార్ల్కేస్ అంచనావేస్తోంది. కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనా కేసుల తీవ్రత, ధరల పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత తత్సంబంధ సవాళ్లు తిరిగి ఎకానమీ రికవరీ వేగంపై అనుమానాలను సృష్టిస్తున్నాయి. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యలో గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో సీఐఐ, మూడీస్, బార్ల్కేస్ అంచనాలను వేర్వేరుగా పరిశీలిస్తే.. (దేశవ్యాప్త లాక్డౌన్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు) ఆర్థికాభివృద్ధి బాటలో అవరోధమే: మూడీస్ ► భారత్ వృద్ధి సానుకూల అంచనాలకు కోవిడ్–19 తాజా కేసులు సవాళ్లు విసురుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతకు సెకండ్‌వేవ్ అవరోధమే. అయినా జీడీపీ 2021లో రెండంకెల్లో వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. దీనికి ప్రధాన కారణం గత ఏడాది అతి తక్కువ స్థాయి (బేస్ ఎఫెక్ట్) గణాంకాలు కావడమే. ► 2020లో దేశ వ్యాప్తంగా జరిగిన కఠిన లాక్డౌన్ తరహా పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకపోవచ్చు. లాక్డౌన్ కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా మాత్రమే పరిమితమవవచ్చు. దీనివల్ల 2020లో జరిగిన ‘లాక్డౌన్’ నష్టం తిరిగి 2021లో ఏర్పడదు. ► ఏప్రిల్ 12 వరకూ చూస్తే, భారత్ కోవిడ్–19 వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,70,179గా ఉంది. భారత్‌లో యువత తక్కువగా ఉండడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంది. ► వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడంసహా కోవిడ్–19 కట్టడికి తీసుకునే పలు చర్యలు భారత్‌ను ‘క్రెడిట్–నెగటివ్’ ప్రభావం నుంచి తప్పిస్తాయి. ► ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2021లో 12 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాం. అయితే వృద్ధి అంచనాలను తాజా పరిస్థితులు దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కేసులు పెరగడం ఆర్థిక క్రియాశీలతను అలాగే కన్జూమర్ సెంటిమెంట్‌నూ దెబ్బతీస్తుంది. ► కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు కమోడిటీ ధరల పెరుగుదల డిమాండ్‌కు అవరోధంగా మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులను భారత్ ఇప్పటికే ఎదుర్కొంటోంది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్ కొంత ఎక్కువగానే ఉంది. ► దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర సెకండ్‌వేవ్‌కు కేంద్రంగా నిలవడం గమనార్హం. ఏప్రిల్ 12 నాటికి యాక్టివ్ కేస్లోడ్లో 50 శాతం ఇక్కడే ఉంది. (విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు ) వారానికి 1.25 బిలియన్ డాలర్ల నష్టం: బార్లే్కస్ ♦ సెకండ్‌వేవ్ తీవ్రత వ్యాపారాలు, రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. పలు రాష్ట్రాల్లో స్థానిక లాక్డౌన్ల వల్ల వారానికి ఆర్థిక వ్యవస్థ సగటున 1.25 బిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.75 చొప్పున చూస్తే దాదాపు రూ. 9,375 కోట్లు) నష్టం జరుగనుంది. ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో దాదాపు 140 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) నష్టపోతుంది. నియంత్రణలు తక్కువగా ఉన్న వారం రోజుల క్రితం వారానికి ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 0.52 బిలియన్ డాలర్లే. ♦ మే నెల వరకూ ప్రస్తుత ఆంక్షలు కొనసాగితే ఇటు ఆర్థిక వ్యవస్థకు అటు వాణిజ్య కార్యకలాపాలకు రెండింటికీ కలిసి దాదాపు 10.5 బిలియన్ డాలర్ల నష్టం జరగనుంది. ♦ రెండు నెలలు రవాణాకు సంబంధించి జరిగే ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5.2 బిలియన్ డాలర్ల నష్టం తీసుకువస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌లలో నియంత్రణలు కఠినతరం ఆవుతుండడం ‘మొబిలిటీ’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ♦ సెకండ్‌వేవ్ కేసుల్లో 81 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలే అత్యధిక ఆర్థిక క్రియాశీలత కలిగిన రాష్ట్రాలు కావడం గమనార్హం. అందువల్లే ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ♦ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదవుతుంది. దీనికి బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. కాగా కేసులు మరింత తీవ్రతరం కావడం, కఠిన లాక్డౌన్ పరిస్థితులు తలెత్తితే వృద్ధి రేటు మరింత పడిపోడానికే అవకాశం ఉంది. ♦ తాజా అంచనాల ప్రకారం, మే నెలాంతానికి కొత్త కేసుల పెరుగుదల సంఖ్యలో స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ విస్తృతి, మెరుగైన వైద్య సదుపాయాలు, ఉపాధి కల్పనకు చర్యలు వంటి అంశాలు భారత్ సమీప భవిష్యత్ ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఉత్పత్తి పతనంపై సీఈవోల ఆందోళన: సీఐఐ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పాక్షిక లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడుతుందని 75 శాతం సీఈవోలు అభిప్రాయపడ్డారని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. కరోనా.. లాక్డౌన్ అంశాలపై సీఐఐ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. కరోనా కర్ఫ్యూ, మైక్రో కంటైన్మెంట్, కరోనా నియంత్రణ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటివి సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రత చెందకుండా నియంత్రిస్తున్నప్పటికీ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలపై మహమ్మారి ప్రభావం పడకుండా చూడాల్సి ఉందని సీఐఐ పేర్కొంది. ఇందుకు తగిన చర్యలు అవసరమని పలు పరిశ్రమల సీఈవోలు అభిప్రాయపడ్డారని తెలిపింది. సీఈవోలు పాక్షిక లాక్డౌన్ పెడతారని భావిస్తున్నారని, అదే జరిగితే వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం, సరకు రవాణాకు అంతరాయం ఏర్పడి పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. సీఐఐ నిర్వహించిన పోల్ సర్వేలో 710 మంది (75శాతం) సీఈవోలు ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపింది. సరకు రవాణాపై నియంత్రణ తీసుకొస్తే తమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని 60శాతం సీఈవోలు తెలిపారని సీఐఐ వెల్లడించింది. సరకు రవాణాకు అనుకూలించే పర్యావరణ వ్యవస్థపై ఆంక్షలు విధిస్తే ఉత్పత్తి నష్టపోతామని 56 శాతం సీఈవోలు తెలిపారు. ఈ పోల్ సర్వేలో 68శాతం ఎంఎస్ఎంఈ సీఈవోలతోపాటు తయారీ, సేవల రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. భారతీయ పరిశ్రమలు ఆరోగ్య, భద్రత ప్రోటోకాల్స్ పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయని 96 శాతం సీఈవోలు చెప్పగా... పాక్షిక లాక్డౌన్ కన్నా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడం మంచిదని 93శాతం సీఈవోలు పోల్ ద్వారా వెల్లడించారని సీఐఐ పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలు విధించినప్పటికీ కార్మికులను అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలని, సరకు రవాణా ఆగకుండా చూడాలని 60శాతం సీఈవోలు తెలిపారు. ఈ సమయంలో కార్మికులు, పరిశ్రమ సిబ్బంది ఆరోగ, భద్రత ప్రోటోకాల్స్ కఠినంగా పాటించేలా చూడాలని వారు తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ కఠిన అమలు: టీవీ నరేంద్రన్ సీఐఐ అధ్యక్షుడు(ఎన్నికైన) టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమూహాలుగా ఒకే చోట చేరడం, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి తరచూ నిర్వహించే కార్యక్రమాలపైనా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. టీకా మహోత్సవ్‌లో పరిశ్రమల కార్మికలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల్లోని 65 కార్యాలయాలను కోరామని తెలిపారు. 10.5 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు: గోల్డ్‌మన్ శాక్స్ భారత్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉండొచ్చని లోగడ వేసిన అంచనాలను తాజాగా 10.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం విధిస్తున్న లాక్డౌన్లు వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. -
రిటైల్ రుణ గ్రహీతలకు కష్ట కాలమే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల రిటైల్ కస్టమర్లకు ప్రత్యేకించి దిగువ ఆదాయ రుణ గ్రహీతలకు కష్టాలు కొనసాగుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు రుణ వ్యయాలు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలిపింది. మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపిన ముఖ్యాంశాలు చూస్తే... కరోనా ప్రారంభ దశలో ఊహించినదానికన్నా మెరుగ్గా ప్రస్తుత బ్యాంకింగ్ రుణ నాణ్యత ఉంది. ప్రత్యేకించి కార్పొరేట్ రుణాల విషయంలో బ్యాంకింగ్ బాగుంది. మొండిబకాయిలకు సంబంధించి తగినకేటాయింపులు జరపడం దీనికి ఒక కారణం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల వల్ల మధ్య, చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) రుణ గ్రహీతలు ఇబ్బందులు పడ్డారు. ఎకనమీ రికవరీ దశలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విభాగానికి సంబంధించి రుణ నాణ్యతలో సవాళ్లు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు తగిన ఫలితాన్ని ఇచ్చాయి. ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగం బ్యాంకింగ్ రుణ నాణ్యత బాగుంటుంది. అయితే కేంద్రం నుంచి తాజా మూలధన కల్పన కొంత ఊరటనిచ్చే అంశం. 2021 చివరి ఆరు నెలల కాలంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యత మరింత దెబ్బతినవచ్చు. 2022లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఆటో, చిన్న వ్యాపారాల్లో ఒడిదుడుకులు దీనికి కారణంగా మారే వీలుంది. తగిన స్థాయిలో వృద్ధి, ద్రవ్యలోటు అంచనాలు వృద్ధి, ద్రవ్యలోటు అంచనాల విషయంలో 2021-22 బడ్జెట్ వాస్తవికతకు అద్దం పడుతోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో 2021-22లో ప్రభుత్వ ఆదాయ– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 6.8 శాతానికి కట్టడి చేస్తామని పేర్కొంటూ, వృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ద్రవ్యపరమైన బలహీన పరిస్థితి భారత్‌కు 2021కు ‘క్రెడిట్’ సవాళ్లను విసురుతుందనీ మూడీస్ పేర్కొంది. ద్రవ్యలోటును బడ్జెట్ ప్రతిపాదనలకన్నా తక్కువగా ఉంచాల్సిన అవసరాన్ని మూడీస్ సూచించింది. అలాగే భారత్ రుణ భారాన్నీ మూడీస్ ప్రస్తావించింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకోవాలి. వ్యత్యాసం– ద్రవ్యలోటు అంచనాలను 9.5 శాతానికి (2020-21 స్థూల దేశీయోత్పిత్తి-జీడీపీలో) సవరిస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. 2020-21 బడ్జెట్ ప్రకారం 3.5 శాతం వద్ద (రూ. రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యం. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలన్నది బడ్జెట్ లక్ష్యమని వివరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళతామని ఆర్థికమంత్రి భరోసాను ఇచ్చారు. 2019-20లో ద్రవ్యలోటు 4.6 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021-22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023-24 నాటికి 5 శాతానికి, 2024-25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. జీడీపీలో రుణ నిష్పత్తి 90 శాతానికి దాటిపోయే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 2019లో ప్రభుత్వ రుణ–జీడీపీ నిష్పత్తి 72 శాతంగా ఉంది. రేటింగ్ విషయంలో ఈ అంశం చాలా కీలకమైనది. వృద్ధి అంచనాలు 13.7 శాతానికి పెంపు భారత్ ఎకానమీ 2021–22లో 13.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత ఏడు శాతానికి పరిమితం అవుతుందని విశ్లేషించింది. ఈ మేరకు నవంబర్ అంచనాలను గణనీయంగా మెరుగుపరచింది. అప్పట్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిని 10.8 శాతంగా అంచనావేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణతను 10.6 శాతంగా పేర్కొంది. సాధారణ పరిస్థితులు నెలకొనడం, వ్యాక్సినేషన్ వేగవంతంతో మార్కెట్లో విశ్వాసం మెరుగుపడ్డం తన క్రితం అంచనాల తాజా సవరణకు కారణమని మూడీస్ వివరించింది. సంస్కరణల అమలు ఇప్పటికీ భారత్‌కు సవాళ్లు విసురుతున్న అంశమేనని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలో ఇంకా అస్పష్టత ఉందని విశ్లేషించింది. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
మార్కెట్లకు స్వల్ప నష్టాలు
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు లాభాలను నమోదుచేసిన దేశీ ప్రధాన స్టాక్ సూచీలు వారాంతాన నీరసించిపోయాయి. శుక్రవారం ఉదయం ఏకంగా 4 శాతం వరకు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరకు 131 పాయింట్లు (0.44 శాతం) నష్టంతో 29,815 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 31,126 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్.. ఈ స్థాయి నుంచి చూస్తే 1,310 పాయింట్లను కోల్పోయింది. భారత జీడీపీ 2020లో కేవలం 2.5 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన అంచనాను సవరించడం, అంతర్జాతీయంగా కోవిడ్–19 (కరోనా) వైరస్ మరణాలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఒక దశలో 29,347 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో 8,522 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ ముగింపు సమయానికి కోలుకుని 19 పాయింట్ల లాభంతో 8,660 వద్ద క్లోజయింది. ఉదయం సెషన్లో ఈ సూచీ 8,949 గరిష్ట స్థాయికి చేరింది. వైరస్ వ్యాప్తి కారణంగా కుంగిపోయిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించినప్పటికీ.. ఇవేవీ మార్కెట్‌ను నిలబెట్టలేకపోయాయి. రెపో రేటు 4.4 శాతానికి దిగిరావడం బుల్స్‌కు శక్తిని ఇవ్వకపోగా, బేర్స్‌కు పట్టు పెంచింది. దీంతో వరుసగా 6వ వారంలోనూ సూచీలు నష్టాలనే నమోదు చేశాయి. 20,000 పాయింట్ల దిగువన బ్యాంక్ నిఫ్టీ టర్మ్లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం ప్రకటన వెలువడిన అనంతం బ్యాంక్ నిఫ్టీ 19,580 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఉదయం సెషన్లో 21,462 పాయింట్లకు చేరిన ఈ సూచీ చివరకు 1.81 శాతం లాభపడి 19,969 వద్ద ముగిసింది. బంధన్ బ్యాంక్ అత్యధికంగా 17% వరకు లాభపడగా.. ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు 6.5% శాతం లాభపడ్డాయి. వాటాల విక్రయంతో కేంద్రానికి 13,883 కోట్లు టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీ) కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 11,500 కోట్లను సమకూర్చుకుంది. టీహెచ్‌డీసీలో 74.49 శాతం వాటాను (విలువ రూ. 7,500 కోట్లు), ఎన్‌ఈఈపీసీలో 100 శాతం వాటాను (రూ. 4,000 కోట్లు) మరో ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి విక్రయించింది. మరోవైపు, కామరాజర్ పోర్ట్‌లో 66.67 శాతం వాటాను కూడా కేంద్రం చెన్నై పోర్ట్ ట్రస్టుకు విక్రయించింది. ఈ వాటా అమ్మకం విలువ రూ. 2,383 కోట్లు. -
దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్
దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్ తగిలింది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ భారత క్రెడిట్ రేటింగ్స్ అంచనాలను తగ్గించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్‌కు కేటాయించబోతున్నట్లు మూడీస్ అంచనా వేసింది. దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణబారం నేపథ్యంలో రేటింగ్స్ తగ్గాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్థి మందగమనం వల్ల ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం కలుగుతుందని మూడీస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ ఫోస్టర్ తెలిపారు. మూడీస్ ప్రకటన తర్వాత ఒక నెల రోజులు డాలర్, రూపాయలను పంపిణీ చేయలేమని ఫార్వర్డ్స్ రోస్ ప్రకటించడం గమనార్హం. వినియాగదారుల రుణాలు తీర్చడంలో ప్రధాన వనరుగా ఉన్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలలో సమస్యలు అంత త్వరగా తీరబోవని తెలిపింది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారతదేశ దృక్పథాన్ని అభినంధించడం విశేషం. -
వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ 7.5శాతం నుంచి 6శాతానికి తగ్గించింది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొనుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్రమక్రమంగా పుంజుకొని వృద్ధి రేటు 6.9శాతానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.5శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ గతంలో అంచనా వేసిన విషయం విదితమే. కానీ, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా వృద్ధి రేటును బ్యాంక్ తగ్గించిందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఆశాజనకంగా లేదని తెలిపింది. ఇటీవల కాలంలో ప్రకటించిన పారిశ్రామిక రాయితీలతో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పుంజుకుంటుందో వేచిచూడాలని పేర్కొంది. గత వారం రేటింగ్ ఏజెన్సీ ప్రకటించిన మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు అంచనాను 6.2 శాతం నుండి 5.8 శాతానికి తగ్గించింది. అయితే క్షీణించిన వృద్ధి రేటు కారణంగా ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి ఇబ్బందులను ఎదుర్కోనుందని నివేదిక తెలిపింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం రూ 1.5 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని కోల్పోనుందని తెలిపింది. ప్రభుత్వం ఆర్థక వ్యవస్థ పుంజుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా క్షీణించిన వృద్ధి రేటు ఆందోళన కలిగించే అంశమని నివేదిక స్పష్టం చేసింది. -
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు ఆవిరి!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. గతంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రభుత్వం ధరల పెరుగుదలను నిలిపివేసిన మాదిరిగా ఈసారి కూడా తాత్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్–మే సమయంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఉండగా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈకాలంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించే అవకాశం ఉందని అంచనావేస్తోంది. ఈ నిర్ణయం వెలువడితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషించింది. -
మోదీ సర్కార్‌కు చమురు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ వృద్ధికి అధిక ముడిచమురు ధరలు ప్రధాన అవరోధమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. మూడీస్ ఇటీవల నిర్వహించిన మార్కెట్ పోల్స్‌లో 175 మంది ఇన్వెస్టర్లను పలుకరించగా వారంతా భారత వృద్ధి రేటుకు అధిక చమురు ధరలు ప్రధాన సవాల్‌గా చెప్పుకొచ్చారు. ద్రవ్య లోటును 3.3 శాతానికి కుదించే క్రమంలోనూ పలు రిస్క్‌లు పొంచిఉన్నాయని మూడీస్, ఐసీఆర్ఏ సింగపూర్, ముంబయిల్లో నిర్వహించిన సర్వేలో ఇన్వెస్టర్లు స్పష్టం చేశారు. మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సమకూర్చే మూలధన ప్యాకేజ్ ఏమాత్రం సరిపోదని వారు పెదవివిరిచారు. ఇన్వెస్టర్ల అభిప్రాయాల తరహాలోనే అధిక చమురు ధరలు వృద్ధి రేటుకు ప్రధాన సవాల్‌గా తాము కూడా పరిగణిస్తున్నామని మూడీస్ పేర్కొంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 66 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అవి బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం
2020 నాటికి తప్పదంటున్న మూడీస్ నివేదిక న్యూఢిల్లీ: ఎస్బీఐ సహా తన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2020 నాటికి రూ.1.2 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. బ్యాలెన్స్ షీట్ల పటిష్టతకు అవసరమని పేర్కొన్న ఈ మొత్తం పరిమాణం ప్రభుత్వ ప్రణాళికా పరిమాణానికన్నా అధికంగా ఉండడం గమనార్హం. 2019 మార్చి నాటికి 22 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో ఇప్పటికే కేంద్రం రూ.25,000 కోట్లు సమకూర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకన్నా... అవసరమైతే మరింత సమకూర్చుతామని కూడా కేంద్రం హామీ ఇస్తోంది. కాగా, మార్చి 11వ తేదీ నాటికి ఈ 11 బ్యాంకుల పనితీరును కూడా మూడీస్ సమీక్షించింది. రానున్న 12 నెలల్లో సైతం బ్యాంక్ అసెట్ క్వాలిటీ ఒత్తిడిలో ఉంటుందని పేర్కొంది.