న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) పటిష్ట లాభాల బాటన పయనించనుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ఒకటి తెలిపింది. మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గడం, ప్రీ–పొవిజినింగ్ ఆదాయాల్లో (నష్టాన్ని భర్తీ చేసే విధంగా నికర వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు, తక్కువ వ్యయాలు నెలకొన్న పరిస్థితి) వృద్ధి దీనికి కారణంగా పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- మెరుగైన లాభదాయకత, రుణ వృద్ధిలో మంచి రికవరీ కారణంగా కేంద్ర మూలధన కల్పన అవసరం తగ్గుతుంది. ఇది అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంలో తగిన మూలధన నిర్వహణ కొనసాగడానికి దోహదపడుతుంది.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) వద్ద మూలధన నిష్పత్తులు గత సంవత్సరంలో గణనీయంగా మెరుగయ్యాయి. కేంద్రం నుంచి సకాలంలో తగిన మద్దతు దీనికి కారణం.
- ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లాభదాయకతను సద్వినియోగం చేసుకుంటూ, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ నుండి మూలధనాన్ని సమీకరించడానికి చురుగ్గా ప్రయత్నించాయి.
- రేటెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు అసెట్–వెయిటెడ్ సగటు సాధారణ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) రేషియో 2021 చివరి నాటికి 15.8 శాతం. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో రుణ వృద్ధిని పెంచుకోడానికి దీనిని ప్రైవేటు బ్యాంకింగ్ వినియోగించుకుంది.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడ్డం– మార్కెట్ నుండి ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం నుండి మూలధన మద్దతుపై ఆధారపడటం తగ్గుతుంది.
- దేశీయ వడ్డీ రేట్లు క్రమంగా పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి. అయితే డిపాజిట్లపై వడ్డీలూ పెరగడం వల్ల సమీకరణ వ్యయాలూ కొంచెం పెరగవచ్చు.
- స్థిరమైన రుణ నాణ్యత, మొండి బకాయిల సవాళ్లను ఎదుర్కొనడానికి అమలు చేస్తున్న నిబంధనలు బ్యాంకుల ప్రొవిజనింగ్స్ (ఎన్‌పీఏలకు కేటాయింపులు) అవసరాలను తగ్గిస్తాయి. రుణాలపై ఆదాయాలు రేటెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో 2021 డిసెంబర్ ముగిసే నాటికి 0.6 శాతం. ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో 1.5 శాతం. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా 0.4 శాతం క్షీణత, 0.7 శాతాలుగా ఉన్నాయి.
- మొండి బకాయిల (ఎన్‌పీఎల్) రేషియోలు తగ్గుతాయి. రైటాఫ్‌ల నుంచి వసూళ్లు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల నేపథ్యంలో కొత్త ఎన్‌పీఎల్‌ల స్థిరత్వం వంటి అంశాలు దీనికి కారణం.
- కార్పొరేట్ ఆదాయాల్లో పెరుగుదల, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో నిధుల సమీకరణ ఇబ్బందులు తగ్గడం రుణ వృద్ధికి దారితీసే అంశం. 2020–21లో రుణ వృద్ధి రేటు 5 శాతం అయితే 2022–23లో ఈ రేటు 12 నుంచి 13 శాతం వరకూ పెరగవచ్చు.
2021–22లో వృద్ధి 9.3 %
మూడీస్ నివేదిక ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన రికవరీని సాధిస్తుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.3 శాతంగా నమోదవుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.4 శాతంగా ఉంటుంది. వినియోగ, వ్యాపార విశ్వాసాలు మెరుగుపరచడంతోపాటు దేశీయ డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. ఆయా అంశాలు ఆర్థిక పురోగతికి, రుణ వృద్ధికి దోహదపడతాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎకానమీకి తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరలు, రూపాయి విలువ వంటి అంశాలపై ఈ ప్రభావం పడవచ్చు. ఇది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకూ దారితీయవచ్చు.
చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..!
Comments
Please login to add a commentAdd a comment