Moodys Investors Service
-
భారత్ బ్యాంకింగ్.. భేష్
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ‘స్థిర’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ బుధవారం పేర్కొంది. ఆర్థిక వృద్ధి, మెరుగైన ఫైనాన్షియల్ పరిస్థితులు ఇందుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ‘మార్చితో ముగిసే 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కొంత తగ్గుతుందని భావిస్తున్న విషయం వాస్తవం. అయితే దేశ వృద్ధికి సంబంధించి పరిస్థితులు, ఫండమెంటల్స్ అన్నీ పటిష్టంగా ఉన్నాయి. ఆయా అంశాలు బ్యాంకింగ్ రుణ వృద్ధికి, రుణ నాణ్యతకు దోహదపడతాయి’’ అని మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ)కు సంబంధించి బ్యాంకుల రుణ నాణ్యత కొంత ఇబ్బందుల్లోనే ఉంది. వడ్డీరేట్లలో పెరుగుదల దీనికి కారణం. ► అయితే మొత్తంగా చూస్తే, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండిబకాయిలు (ఎన్పీఎల్) నిష్పత్తులు స్వల్పంగా తగ్గాయి. రికవరీలు, ఎప్పటినుంచో పేరుకుపోయిన రుణాల రైటాఫ్‌లు దీనికి కారణం. ► బ్యాంకుల లాభదాయకత గత కొన్నేళ్లుగా మెరుగుపడింది. రుణ–నష్టాల కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) కూడా తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకుల మూలధనం, నిధులు, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత, సరఫరాలు) పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి. ఆయా అంశాలు రుణ వృద్ధికి సైతం మద్దతును ఇస్తున్నాయి. ► అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. బ్యాంకింగ్‌కు స్టేబుల్ అవుట్‌లుక్ కొనసాగించడానికి ఇది కూడా ఒక కారణం. 2023–24లో భారత్ జీడీపీ వృద్ధి 5.5 శాతంగా, 2024–2025లో 6.5 శాతంగా నమోదవుతుందని భావిస్తున్నాం. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) అంచనాలు వేస్తున్నప్పటికీ, క్లిష్ట, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఇది తగిన వృద్ధి రేటే. దీనికి దేశీయ వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు మద్దతును ఇస్తున్నాయి. ► ప్రైవేట్ కార్పొరేట్ల నుంచి కూడా రుణ డిమాండ్ బలంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బ ణం వంటి క్లిష్ట అంశాలు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పెంచడం, కంపెనీలు తమ ఫైనాన్సింగ్ అవసరాలను తక్కువ వ్యయాలతో తీర్చుకోవడానికి దేశీయ బ్యాంకుల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు ఈ అంచనాలకు కారణం. వృద్ధి అంచనా పెంపు 2023–24 భారత్ అంచనాలను కిత్రం 4.8 శాతం నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మూలధన కేటాయింపుల పెంపు (2022–23లో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న మొత్తాలను రూ.10 లక్షల కోట్లకు పెంపు. జీడీపీలో 3.3 శాతం) దీనికి కారణం. అయితే 2022–23కు సంబంధించి తన అంచనాలను 7 శాతం నుంచి (నవంబర్‌లో అంచనా) 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. 2024–25 లో వృద్ధి అంచనాలను 6.5 శాతంగా తన గత తాజా గ్లోబల్ మ్యాక్రో అవుట్‌లుక్‌లో పేర్కొంది. జీ20 దేశాల పురోగతి ఇలా... ఇక జీ20 దేశాల వృద్ధి 2022లో 2.7 శాతంగా ఉంటే, 2023లో 2 శాతానికి తగ్గుతుందని మూడీస్ అంచనావేసింది. అయితే 2024లో 2.4 శాతానికి మెరుగవుతుందని తెలిపింది. చైనాకు సంబంధించి వృద్ధి రేటు 2022ల 3 శాతం ఉంటే, 2023లో 5 శాతానికి మెరుగుపడుతుందని తెలిపింది. దీని ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ కొనసాగిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
బలహీన రూపాయితో భారత్ కంపెనీలు బేఫికర్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్ తాజా నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్ కరెంట్ అకౌంట్ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతుంది. ► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్లను కలిగి ఉన్నాయి. ► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలమే. అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన నిధుల విషయంలో డాలర్ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ► చాలా రేటెడ్ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి. ► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు. ► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. ► భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. భారత్‌కు మూడీస్ రేటింగ్ ఇలా... మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. -
అంతర్జాతీయ సవాళ్లతో భారత్‌కు భయం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్ విషయంలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్‌కు మూడీస్ ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌లో రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’క మార్చింది. తాజాగా మూడీస్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశం క్రెడిట్ ప్రొఫైల్... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్ బేస్ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్ రికవరీకి (కోవిడ్–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం. ► ఎకానమీ, ఫైనాన్షియల్ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నాం. ► అధిక క్యాపిటల్ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి. ► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం. రేటింగ్ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి... భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి. అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్ ప్రొఫైల్‌కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్ రేటింగ్ చర్యకూ దారితీయవచ్చు. – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ -
భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత!
న్యూఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపిస్తూ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం 2022 క్యాలెండర్ ఇయర్ భారతదేశ ఆర్థిక వృద్ధి వృద్ధి అంచనాను 9.1 శాతం నుండి 8.8 శాతానికి కుదించింది. ఈ మేరకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం వెలువరించిన 2022–23 గ్లోబల్ స్థూల ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► డిసెంబర్ త్రైమాసికం 2021 (2021 అక్టోబర్–డిసెంబర్) నుండి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వృద్ధి ఊపందుకున్నట్లు హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ► అయితే ముడి చమురు, ఆహారం, ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం రాబోయే నెలల్లో గృహ ఆర్థిక, వ్యయాలపై ఉంటుంది. ఇంధనం, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న రేట్ల పెంపు విధానం డిమాండ్ రికవరీ వేగాన్ని తగ్గిస్తుంది. ► 2022 ఎకానమీ స్పీడ్‌ను 8.8 శాతానికి తగ్గిస్తున్నా, 2023 వృద్ధి అంచనాలను 5.4 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నాం. ► పటిష్ట రుణ వృద్ధి, కార్పొరేట్ రంగం ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికలు, ప్రభుత్వం మూలధన వ్యయానికి అధిక బడ్జెట్ కేటాయింపుల వంటి అంశాలు పెట్టుబడుల పక్రియ బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. ► అంతర్జాతీయంగా ముడి చమురు, ఆహార ధరలు మరింత పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి వేగాన్ని కొనసాగించేంత బలంగా కనిపిస్తోంది. ► 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం సగటున వరుసగా 6.8 శాతం, 5.2 శాతంగా ఉంటుందని అంచనా. ► అనేక ప్రతికూల కారకాల కారణంగా 2022, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ► సరఫరాల సమస్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించేట్లు చేస్తున్నాయి. ఆయా అంశాలతో సెంట్రల్ బ్యాంకులు కఠిన ద్రవ్య విధానానికి మొగ్గుచూపే పరిస్థితికి దారితీస్తున్నాయి. దీనితోపాటు ఆర్థిక మార్కెట్ అస్థిరత, ఆస్తుల రీప్రైసింగ్, కఠిన ద్రవ్యపరిస్థితుల వంటి అంశాలు ఎకానమీల మందగమనానికి ప్రధాన కారణం. ► మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. అనంతరం రికవరీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా కనబడుతోంది. జీరో–కోవిడ్ విధానంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాదినాటికి ప్రధాన ద్రవ్యోల్బణం రేట్లు (శాతాల్లో) తగ్గుతాయని మేము భావిస్తున్నప్పటికీ, ధర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఆయా అంశాలు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► చైనా వృద్ధి రేటు 2022లో 4.5 శాతం, 2023లో 5.3 శాతం ఉంటాయని భావిస్తున్నాం. అమెరికా, బ్రిటన్ ఎకానమీల వృద్ధి రేటు దాదాపు 2.8 శాతంగా ఉంటుందని అంచనా. కట్టుతప్పిన ద్రవ్యోల్బణం... ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో నమోదుకావాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది.వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం స్పీడ్‌ను తగ్గించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. వచ్చే నెల్లో అరశాతం రేటు పెంపు ఖాయం బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు రెపోను మరో 0.50 శాతం పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషించింది. అలాగే వృద్ధి రేటు అంచనాలనూ 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల బ్యాండ్‌ను 6.2–6.5 శాతం శ్రేణిగా సవరించే వీలుందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి, మధ్య కాలిక ఆర్థిక స్థిరత్వం లక్ష్యాలుగా పాలసీ సమీక్ష ఉంటుందని అభిప్రాయపడింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)కట్టడి లక్ష్యంగా క్యాష్ రిజర్ రేషియో (సీఆర్ఆర్)ను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉందని తెలిపింది. బార్క్లేస్ విశ్లేషణలు నిజమైతే రెపో రేటు 4.90 శాతానికి, సీఆర్ఆర్ 5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడి–వృద్ధి సమతౌల్యత ఆర్బీఐ ముందున్న ప్రస్తుత కీలకాంశమని వివరించింది. -
భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) పటిష్ట లాభాల బాటన పయనించనుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ఒకటి తెలిపింది. మొండి బకాయిలు (ఎన్పీఏ) తగ్గడం, ప్రీ–పొవిజినింగ్ ఆదాయాల్లో (నష్టాన్ని భర్తీ చేసే విధంగా నికర వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు, తక్కువ వ్యయాలు నెలకొన్న పరిస్థితి) వృద్ధి దీనికి కారణంగా పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మెరుగైన లాభదాయకత, రుణ వృద్ధిలో మంచి రికవరీ కారణంగా కేంద్ర మూలధన కల్పన అవసరం తగ్గుతుంది. ఇది అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంలో తగిన మూలధన నిర్వహణ కొనసాగడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వద్ద మూలధన నిష్పత్తులు గత సంవత్సరంలో గణనీయంగా మెరుగయ్యాయి. కేంద్రం నుంచి సకాలంలో తగిన మద్దతు దీనికి కారణం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లాభదాయకతను సద్వినియోగం చేసుకుంటూ, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ నుండి మూలధనాన్ని సమీకరించడానికి చురుగ్గా ప్రయత్నించాయి. రేటెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు అసెట్–వెయిటెడ్ సగటు సాధారణ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) రేషియో 2021 చివరి నాటికి 15.8 శాతం. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో రుణ వృద్ధిని పెంచుకోడానికి దీనిని ప్రైవేటు బ్యాంకింగ్ వినియోగించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడ్డం– మార్కెట్ నుండి ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం నుండి మూలధన మద్దతుపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయ వడ్డీ రేట్లు క్రమంగా పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి. అయితే డిపాజిట్లపై వడ్డీలూ పెరగడం వల్ల సమీకరణ వ్యయాలూ కొంచెం పెరగవచ్చు. స్థిరమైన రుణ నాణ్యత, మొండి బకాయిల సవాళ్లను ఎదుర్కొనడానికి అమలు చేస్తున్న నిబంధనలు బ్యాంకుల ప్రొవిజనింగ్స్ (ఎన్పీఏలకు కేటాయింపులు) అవసరాలను తగ్గిస్తాయి. రుణాలపై ఆదాయాలు రేటెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో 2021 డిసెంబర్ ముగిసే నాటికి 0.6 శాతం. ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో 1.5 శాతం. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా 0.4 శాతం క్షీణత, 0.7 శాతాలుగా ఉన్నాయి. మొండి బకాయిల (ఎన్పీఎల్) రేషియోలు తగ్గుతాయి. రైటాఫ్‌ల నుంచి వసూళ్లు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల నేపథ్యంలో కొత్త ఎన్‌పీఎల్‌ల స్థిరత్వం వంటి అంశాలు దీనికి కారణం. కార్పొరేట్ ఆదాయాల్లో పెరుగుదల, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో నిధుల సమీకరణ ఇబ్బందులు తగ్గడం రుణ వృద్ధికి దారితీసే అంశం. 2020–21లో రుణ వృద్ధి రేటు 5 శాతం అయితే 2022–23లో ఈ రేటు 12 నుంచి 13 శాతం వరకూ పెరగవచ్చు. 2021–22లో వృద్ధి 9.3 % మూడీస్ నివేదిక ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన రికవరీని సాధిస్తుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.3 శాతంగా నమోదవుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.4 శాతంగా ఉంటుంది. వినియోగ, వ్యాపార విశ్వాసాలు మెరుగుపరచడంతోపాటు దేశీయ డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. ఆయా అంశాలు ఆర్థిక పురోగతికి, రుణ వృద్ధికి దోహదపడతాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎకానమీకి తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరలు, రూపాయి విలువ వంటి అంశాలపై ఈ ప్రభావం పడవచ్చు. ఇది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకూ దారితీయవచ్చు. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..! -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్‌వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. డీబీఎస్‌కు సానుకూలం: మూడీస్ సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్‌వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్‌కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది. ‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్‌లో విలీనం అంశం ఎల్వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలతో బుధవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్ విదేశీ బ్యాంకులో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్‌కుమార్ తెలిపారు. -
రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో డిమాండ్, ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ప్రకటించిన రెండవదఫా ఉద్దీపన ఈ దిశలో స్వల్ప ప్రయోజనాలనే అందిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. అక్టోబర్ 12న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎట్‌టీసీ) క్యాష్ వోచర్ స్కీమ్, ప్రత్యేక పండుగల అడ్వాన్స్, రాష్ట్రాలకు వడ్డీరహిత రూ.12,000కోట్ల రుణం, రూ.25,000 కోట్ల అదనపు మూలధన ప్రయోజనాలు కల్పించిన సంగతి తెలిసిందే. రూ.46,700 కోట్ల విలువైన ఈ ఉద్దీపన 2020–21 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.2 శాతం ఉంటుందని అంచనా. రెండు విడతల ఉద్దీపనలనూ కలుపుకుని ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యక్ష వ్యయాలను పరిశీలిస్తే, ఈ మొత్తం జీడీపీలో 1.2 శాతం ఉంటుందని మూడీస్ అంచనావేసింది. బీఏఏ రేటింగ్ ఉన్న ఇతర దేశాల్లో కరోనా సంబంధ ఉద్దీపన జీడీపీలో సగటును 2.5 శాతం ఉందని మూడీస్ తెలిపింది. వ్యయాలకు కఠిన పరిమితులు... వ్యయాల విషయంలో భారత్ కఠిన పరిమితులను ఎదుర్కొంటోందని మూడీస్ పేర్కొంది. జీడీపీలో ప్రభుత్వ రుణ భారం గత ఏడాది 72% ఉంటే, 2020లో దాదాపు 90 శాతానికి పెరగనుందని విశ్లేషించింది. అలాగే ఆదాయాలు తగ్గడం వల్ల ద్రవ్యలోటు జీడీపీలో 12 శాతానికి పెరిగిపోయే పరిస్థితి కనబడుతోందనీ అంచనా వేసింది. -
జీడీపీ మైనస్ 11.5 శాతానికి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని మూడీస్ పేర్కొంది. కరోనా ప్రతికూలతలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించింది. దేశ ద్రవ్య పటిష్టతకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషించింది. కాగా తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020–21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం. ► ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాలకు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. 2020–21 అంచనాలో 3.5% దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే– అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349 కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.6 శాతం. ► జీ–20 దేశాలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ నష్టపోలేదు. ► ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ పరంగా ద్రవ్య పరమైన మద్దతు చర్యలు తీసుకోడానికి పల్లు క్లిష్ట పరిస్థితులు, పరిమితులు ఉన్నాయి. ► బలహీన మౌలిక వ్యవస్థ, కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు వృద్ధికి అవరోధాలు కలిగిస్తున్న అంశాలు. ► ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల మొండిబకాయిల సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► సమీప భవిష్యత్తులో రేటింగ్‌ను పెంచే అవకాశాలు లేవు. ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యలు వృద్ధి బాటలో పురోగతికి సహకరిస్తున్నాయని గణాంకాలు వెల్లడించేవరకూ రేటింగ్ పెంపు ఉండబోదు. భారత్ సావరిన్ రేటింగ్‌ను జూన్‌లో మూడీస్– నెగెటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’కి కుదించింది. ఇది చెత్త స్టేటస్‌కు ఒక అంచ ఎక్కువ. ► పర్యవేక్షణలో పటిష్టత, ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే, వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే వీలుంది. కేర్ రేటింగ్స్ అంచనా మైనస్ 8.2 శాతం కాగా దేశీయ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ శుక్రవారం మరో నివేదికను విడుదల చేస్తూ, 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు మైనస్ 8% నుంచి 8.2% వరకూ ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ అంచనా మైనస్ 6.4% కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తగిన ద్రవ్యపరమైన మద్దతు ఆర్థిక వ్యవస్థకు అందకపోవడమే తమ అంచనాల పెంపునకు కారణమని కేర్ రేటింగ్స్ తెలిపింది. అందరి అంచనాలూ క్షీణతే.. మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో) సంస్థ తాజా క్రితం అంచనా అంచనా గోల్డ్‌మన్ శాక్స్ 14.8 11.8 ఫిచ్ 10.5 5.0 ఇండియా రేటింగ్స్ – రిసెర్చ్ 11.8 5.3 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 6.8 -
‘కరోనా వ్యాక్సిన్‌తో ఫార్మా రంగం వృద్ధి’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో మెజారిటీ రంగాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ ఫార్మా రంగం మాత్రం ఆశాజనక వృద్ధితో దూసుకెళ్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. కరోనా వైరస్‌ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ల(టీకా)ను కనిపెట్టే ప్రయత్నంలో చాలా బిజీగా రీసెర్చ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఫార్మా రంగం ఆర్థికంగా లాభాలు తేకపోవచ్చు గానీ, ఫార్మా పరిశ్రమ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే ఫార్మా రంగం వేగంగా పుంజుకుంటుందని నివేదిక తెలిపింది. ఫార్మా రంగం అభివృద్ధి చెందితే ప్రజలకు మెరుగైన సేవలందుతాయని పేర్కొంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకొచ్చేందుకు దేశానికి చెందిన భారత్ బయోటెక్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాలు ముందంజలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, ఐసీఎమ్ఆర్ సహాయంతో భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కొవాక్సిన్ మొదటగా మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్‌కు సావరిన్ రేటింగ్ కట్
న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్ రేటింగ్)ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్ ‘బీఏఏ2’ అయితే దీనిని ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇక భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది. డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణాలు... ► కోవిడ్–19 మహమ్మారి భారత్ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. అయితే రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదు. ► తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ► ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనుంది. ► ఇక ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురుకానున్నాయి. తక్కువ ఆదాయం–వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉంది. ► ఫైనాన్షియల్ సెక్టార్లో ఒత్తిడి నెలకొనే అవకాశాలు సుస్పష్టం. 2020–21లో జీడీపీ 4 శాతం క్షీణత కోవిడ్–19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. నిజానికి కోవిడ్ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్ ప్రస్తావించింది. పెరగనున్న రుణ భారం: దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుంది. కరోనాకు ముందు 2019–20లో భారత్ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉంది. అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశంలేదు. బీఏఏ– రేటెడ్ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉంది. బీఏఏ స్టేబుల్ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం. ఏమిటి ఈ రేటింగ్..? ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి. ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడీస్ ఇచ్చిన రేటింగ్ ‘బీఏఏ3’ నెగటివ్ అవుట్‌లుక్ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ ‘బీఏఏ3 నెగటివ్’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కరెన్సీకీ కోత భారత ప్రభుత్వ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్ లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌నూ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి కుదించింది. ఇక షార్ట్‌టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది. ఊహించిందే... భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్ కూడా భారత్‌కు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేము భావిస్తున్నాం. – కే. హరిహర్, ట్రెజరర్, ఫస్ట్‌రాండ్ బ్యాంక్ -
కేంద్ర ప్యాకేజీ పై మూడీస్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తితో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం చర్యలతో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కొంత మేర అవకాశముందని.. కరోనా కారణంగా ఎదురైన నష్టాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు మాత్రం ఈ చర్యలు ఉపయోగపడకపోవచ్చని మూడీస్ పేర్కొంది. ఎంఎస్ఎంఈ ప్యాకేజీపై మూడీస్ స్పందిస్తూ.. కరోనా వైరస్‌కు ముందే ఈ రంగం ఒత్తిడిని ఎదుర్కొందని, ప్రస్తుత సంక్షోభం కారణంగా నగదు లభ్యత కష్టాలు మరింత పెరిగాయని మూడీస్ అభిప్రాయపడింది. -
లాభాలకు ‘కోత’!
భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌కు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మూడీస్ కోత విధించింది. దీంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెండు రోజుల రికార్డ్ లాభాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు తగ్గి మూడు వారాల కనిష్ట స్థాయి, 71.30కు చేరడం, ఈ ఏడాది వృద్ధి అంచనాలను నొముర సంస్థ 5.7 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,749 పాయింట్లను తాకినప్పటికీ, చివరకు 330 పాయింట్ల నష్టంతో 40,324 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,908 పాయింట్ల వద్దకు చేరింది. ఈ వారంలో మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ ఆల్‌టైమ్ హైలను తాకింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 18 పాయిట్లు చొప్పున పెరిగాయి. 485 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ సంస్థ మన దేశ క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’ నుంచి ‘ప్రతికూలం’కు తగ్గించింది. మన దేశంలో నెలకొన్న ఆరి్థక బలహీనతలను అధిగమించడంలో ప్రభుత్వం విఫలమైందని, వృద్ధి మరింతగా తగ్గగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైననప్పటకీ, మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ఆ తర్వాత లాభాల్లోకి వచి్చనప్పటికీ, మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. చివరి రెండు గంటల్లో నష్టాలు బాగా పెరిగాయి. ఒక దశలో 95 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 390 పాయింట్లు పడింది. రోజంతా 485 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఎమ్ఎస్సీఐ ఇండియా సూచీ, ఎమ్ఎస్సీఐ గ్లోబల్ స్టాండర్డ్ సూచీల్లో షేర్లలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ సూచీల్లోంచి తీసేసిన షేర్లు నష్టపోగా, చేర్చిన షేర్లు లాభపడ్డాయి. -
మూడీస్ ‘రేటింగ్’ షాక్
న్యూఢిల్లీ: భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టేబుల్)గా ఉంది. ఆరి్థక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్’గానే కొనసాగించింది.పెట్టుబడుల విషయంలో రెండో అతి తక్కువ గ్రేడ్ ఇది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ప్రభుత్వ లక్ష్యం జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతం కంటే ఇది ఎక్కువే. వృద్ధి తక్కువగా ఉండడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో ద్రవ్యలోటు అంచనాలను మూడీస్ పెంచింది. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 2013 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలో 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడిస్ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించడంతో మరిన్ని సంస్కరణలు, దిద్దుబాటు చర్యల దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిచ్ రేటింగ్స్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టేబుల్)గానే కొనసాగిస్తున్నాయి. మూడీస్ అభిప్రాయాలు... ►అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్కలను తెలియజేస్తుంది. ఆరి్థక రంగ వృద్ధి గతం కంటే తక్కువగానే ఉండనుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరి్థక, వ్యవస్థాగత బలహీనతలను పరిష్కరించే విషయంలో ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడాన్ని ఇది కొంత మేర ప్రతిఫలిస్తుంది. ►ఇప్పటికే రుణ భారం అధిక స్థాయిలో ఉండగా, ఇది ఇంకా క్రమంగా పెరిగేందుకు దారితీస్తుంది. ►ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు. ►గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆరి్థక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి. ►ఎన్బీఎఫ్ఐల్లో రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు. ►ఆర్బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆరి్థక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు. ►నెగెటివ్ అవుట్‌లుక్ సమీప కాలంలో రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ఛాన్స్ లే దని తెలియ జేస్తుంది. ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి: కేంద్రం రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగెటివ్‌గా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. దీనివల్ల భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ‘‘ఆరి్థక రంగ మూలాలు పూర్తి బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బాండ్ ఈల్డ్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీసుకున్న వరుస సంస్కరణలు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది’’ అని కేంద్ర ఆరి్థక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2019 భాతర వృద్ధి రేటు 6.1 శాతం, తర్వాతి సంవత్సరంలో 7 శాతంగా ఉండొచ్చన్న ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలను ప్రస్తావించింది. భారత వృద్ధి సామర్థ్యాలు ఏమీ మారలేదన్న ఐఎంఎఫ్, ఇతర సంస్థల అంచనాలను గుర్తు చేసింది. ‘‘అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో చురుకైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు భారత్ పట్ల సానుకూల దృక్పథానికి దారితీస్తాయి. నిధులను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తాయి’’అని పేర్కొంది. -
సంస్కరణలకు మరింత ఊతం
⇒ భారత రుణపరపతికి సానుకూలం ⇒ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాలు దక్కడం వల్ల బీజేపీ రాజ్యసభలో మరింత బలం పెంచుకోగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఇది మరిన్ని సంస్కరణలకు ఊతమివ్వగలదని వివరించింది. ఈ పరిణామం భారత ప్రభుత్వ రుణపరపతి రేటింగ్‌పై సానుకూల ప్రభావం చూపగలదని మూడీస్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న ఎన్డీఏ క్రమంగా పుంజుకుంటుందని, మార్పులు తక్షణమే చోటుచేసుకోబోవని తెలిపింది. ‘ఎన్నికల ఫలితాల ప్రయోజనాలు అధికార పార్టీకి సత్వరమే దఖలు పడవు. ఎందుకంటే వచ్చే ఏడాది కొందరు సభ్యులు రిటైరైతే గానీ ఎగువసభలో మార్పులు, చేర్పులు ఉండవు‘ అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ విలియం ఫాస్టర్ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షాలకు రాజ్యసభలో 30 శాతం సీట్లు ఉన్నాయి. 2018లో రాజ్యసభలో 69 సీట్లు రీ–ఎలక్షన్‌కు రానున్నాయి. వీటిలో పది ఉత్తర్‌ప్రదేశ్ నుంచి, ఒక సీటు ఉత్తరాఖండ్ నుంచి ఉండనున్నాయి. దీంతో అప్పటిదాకా విధానపరమైన చర్యల ఆమోదం కోసం అధికారపక్షం ఇతర పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు, గతేడాది ఆఖర్లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల ఎదురైన ప్రతికూల ఆర్థిక ప్రభావాలను కూడా తట్టుకుని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని నివేదికలో మూడీస్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన జాతీయ విధానాల అజెండాకు గట్టి మద్దతు లభిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. -
భారత్‌పై నామమాత్రమే!
ఎస్బీఐ రిసెర్చ్: రూపాయిపై స్వల్పకాలికంగా ప్రభావం చూపినా... దీర్ఘకాలంలో ఫెడ్ రేటు పెంపు ఎఫెక్ట్ మామూలుగానే ఉంటుంది. ఇక దేశంలో పన్నుల తగ్గింపు ద్వారా వినియోగ డిమాండ్‌ను పెంపొందించాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ చర్యలు అవసరం. ఇక్రా: రూపాయి కోణంలో చూస్తే... భారత్‌కు ఉన్న పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలు (365 బిలియన్ డాలర్లు) దేశానికి లాభించే అంశం. డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67–71 శ్రేణిలో ఉండవచ్చు. సీఐఐ: ఇదిలావుండగా, పెద్ద నోట్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తక్షణం అధిక ప్రభావం చూపుతుందని సీఐఐ పేర్కొంది. ప్రస్తుత, వచ్చే త్రైమాసికాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందని సీఐఐ విశ్లేషించింది. -
వర్ధమాన దేశాలపై ఫెడ్ రేటు దెబ్బ..
పెట్టుబడులు తరలిపోవచ్చని మూడీస్ హెచ్చరిక అమెరికా ఎకానమీ స్థిరపడుతుండటాన్ని ప్రతిబింబిస్తూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం.. వర్ధమాన దేశాలకూ ప్రయోజనకరమే అయినప్పటికీ.. ఆయా దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోయే అవకాశాలుఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో అక్కడ దిగుమతులకు డిమాండ్ పెరగడం వల్ల వర్ధమాన దేశాల ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరగలదని తెలిపింది.అదే సమయంలో ఫెడ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోవచ్చునని.. ఇది వాటిపై ఆధారపడిన సంస్థలకు ప్రతికూలం కాగలదని వివరించింది. అలాగే రాజకీయంగా,విధానాలపరంగా అనిశ్చితికి దారితీయొచ్చని మూడీస్ పేర్కొంది. ఫెడ్ క్రమానుగతంగా మరో రెండు మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని అభిప్రాయపడింది. మొత్తం మీద 2017 ఆఖరు నాటికి వడ్డీ రేట్లు 1.25– 1.5శాతం స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఈ ప్రభావాలు అమెరికా కన్నా మిగతా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపైనే ఎక్కువగా కనిపించవచ్చని వివరించింది. -
ఆయిల్, గ్యాస్ పరిశ్రమకు గడ్డుకాలం!
మూడీస్ నివేదిక * 2016లో ఆయిల్, గ్యాస్ ధరలు బలహీనమేనని అంచనా... * పెట్టుబడులు 25 శాతం వరకూ పడిపోవచ్చని విశ్లేషణ న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ ధరలు ఈ సంవత్సరం కూడా బలహీనంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక మంగళవారం అభిప్రాయపడింది. అధిక సరఫరాలు దీనికి కారణమని తెలిపింది. ఆయా అంశాల నేపథ్యంలో గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, ఉత్పత్తులపై మూలధనం పెట్టుబడులు 20 నుంచి 25 శాతం శ్రేణిలో పడిపోయే అవకాశాలు ఉన్నాయనీ విశ్లేషించింది. ‘చమురు, సహజ వాయువుల పరిశ్రమ: 2016లో మూలధన పెట్టుబడుల, సవాళ్లు’ అన్న శీర్షికన మూడీస్ తాజా నివేదిక విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... * మార్కెట్ షేర్ పెంచుకోవడంపై దృష్టిపెట్టిన ఒపెక్ (ఓపీఈసీ)-పలు ఒపెక్ యేతర ఉత్పత్తి దేశాలు భారీగా ఉత్పత్తులను కొనసాగించడం వల్ల సరఫరాలు అధికంగా కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేత కూడా సరఫరాల పెరుగుదలకు కారణం. * ఉత్పత్తుల తగ్గుదల, ధరలు తక్కువగా ఉండడం వంటి అంశాలు భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో చమురు వినియోగం పెరుగుదలకు దోహదపడుతుంది. * దిగువ స్థాయిలో ధరలు సంబంధిత కమోడిటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు సవాలే. ఇక ఈ రంగం కూడా ‘డిఫాల్ట్స్’ సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు. చమురు అన్వేషణ, ఉత్పత్తి (ఈ అండ్ పీ) కంపెనీల క్యాష్ ఫ్లోస్‌పై ఇప్పటికే దిగువస్థాయి ధరలు ప్రభావం చూపుతున్నాయి. డ్రిల్లింగ్, ఆయిల్‌ఫీల్డ్ సర్వీస్ ప్రొవైడర్ల వంటి ఇతర ఇంధన కంపెనీలపై కూడా ప్రతికూల జాడలు కనిపిస్తున్నాయి. * ట్రెడెడ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2016లో బ్యారల్‌కు సగటున 43 డాలర్లుగా ఉండవచ్చు. అటు తర్వాత ఏడాది 48 డాలర్లకు, 2018లో 53 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. * సవాళ్లను అధిగమించడానికి పరిశ్రమలో కొన్ని కంపెనీల కొనుగోళ్లు, విలీనాల అవకాశం ఉంది. ఫండింగ్ అవసరాలూ అదనపు ఇబ్బందులు సృష్టించవచ్చు. దీనితో దివాలా దిశగా కొన్ని కంపెనీలు నడిచే కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఆయా అంశాలు అసెట్ విలువలు ‘కొనుగోళ్లకు’ ఆకర్షణగా మారేందుకు దోహదపడతాయి. -
భారత్ బ్యాంకింగ్‌కు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ‘అవుట్ లుక్’ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మెరుగుపరిచింది. 2011 నవంబర్ నుంచీ ‘నెగటివ్’లో ఉన్న అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని మూడీస్ పేర్కొంది. దీనివల్ల భవిష్యత్తులో మొండిబకాయిల స్పీడ్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ కారణంగానే అవుట్‌లుక్‌ను మెరుగుపరిచినట్లు వివరించింది. రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు ‘స్టేబుల్ అవుట్‌లుక్’ ఇస్తున్నట్లు మూడీస్ వీపీ, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపారు. ‘భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అవుట్‌లుక్ : మెరుగుపడుతున్న నిర్వహణ : స్థిర అవుట్‌లుక్‌కు దారితీసిన పరిస్థితులు’ శీర్షికన మూడీస్ తాజా నివేదికను ఆవిష్కరించింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... * మొండిబకాయిల పరిస్థితి మెరుగుదల, స్థిర రీతిన మూలధనం అందే అవకాశం, లాభాలు పెరిగే పరిస్థితుల వంటివి అవుట్‌లుక్ పెంపునకు కారణం. * కంపెనీల రుణాల పరిస్థితి భారంగా ఉంది. అందువల్ల మొండిబకాయిల విషయంలో రికవరీ నెమ్మదిగా ఉంటుంది. * మొత్తంమీద భారత్ బ్యాంకింగ్ లాభదాయకత, నికర వడ్డీ మార్జిన్లు రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో స్థిరంగా ఉంటాయి. * 2015, 2016లో స్థూల దేశీయోత్పత్తి రేటు (జీడీపీ) 7.5 శాతంగా ఉండే అవకాశం. దిగువ స్థాయిలో ద్రవ్యోల్బణం, వ్యవస్థాగత సంస్కరణల అమలు వంటి అంశాలు వృద్ధికి ఊతం ఇస్తున్నాయి. తగిన ద్రవ్య, పరపతి విధానం కూడా వృద్ధి వేగానికి దోహదపడే అంశం. -
వృద్ధి అంచనాలకు మూడీస్ కోత..
- 7.5 నుంచి 7 శాతానికి తగ్గింపు - పారిశ్రామిక మందగమనం,పెట్టుబడులు తగ్గడమే కారణం ముంబై: 2015లో భారత్ వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. 2016 వృద్ధి రేటును కూడా 7.6 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. చమురు ధరలు తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఈసీబీ, ఎఫ్‌డీఐలు మినహా ఒక ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చీ, పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే పారిశ్రామిక మందగమనం, పెట్టుబడులు తగ్గడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశాలని వివరించింది. బ్యాంకుల రుణ వృద్ధి రేటు కూడా తక్కువ స్థాయిలో ఉండడాన్ని మూడీస్ నివేదిక ప్రస్తావించింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పలు ఆసియా పసిఫిక్ దేశాల వృద్ధి అంచనాలను కూడా మూడీస్ తగ్గించింది. వర్షాభావ పరిస్థితులు ద్రవ్యోల్బణం కదలికలపై అనిశ్చితి పరిస్థితిని సృష్టించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. చైనా నుంచి బలహీన డిమాండ్ ఈ ప్రాంతంలో ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేసింది. వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నాం: యూబీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు అంచనాలను ఇంతక్రితం 7.5% నుంచి 7.1 శాతానికి తగ్గిస్తున్నట్లు స్విట్జర్లాండ్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ తాజా నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) వృద్ధి రేటు అంచనాలను సైతం 8.3 శాతం నుంచి 7.6%కి దించింది. దేశీయంగా,అంతర్జాతీయంగా భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. 2015-16 తొలి క్వార్టర్ వృద్ధి కేవలం 7% నమోదయిన నేపథ్యంలో ఇప్పటికే పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు భారత్ వృద్ధి రేటు అంచనాలకు కోత పెడుతుండటం తెలిసిందే. పటిష్టంగానే: ఓఈసీడీ భారత్ పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) అంచనా వేసింది. అయితే చైనా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా దిగువముఖ ధోరణిలో కనిపిస్తోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ పేర్కొంది.