ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్‌బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్‌వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్‌వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్‌లో ఎల్‌వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్‌బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్‌వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది.
డీబీఎస్‌కు సానుకూలం: మూడీస్
సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్‌వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్‌వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్‌కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్‌వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది.
‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్‌లో విలీనం అంశం ఎల్‌వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్‌వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్‌బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది.
తాజా పరిణామాలతో బుధవారం బీఎస్‌ఈలో ఎల్‌వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది.
విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్
విదేశీ బ్యాంకులో ఎల్‌వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్‌లో ఎల్‌వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్‌బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్‌కుమార్ తెలిపారు.
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
Published Thu, Nov 19 2020 5:08 AM | Last Updated on Thu, Nov 19 2020 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment