Manoharan
-
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్‌వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. డీబీఎస్‌కు సానుకూలం: మూడీస్ సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్‌వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్‌కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది. ‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్‌లో విలీనం అంశం ఎల్వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలతో బుధవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్ విదేశీ బ్యాంకులో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్‌కుమార్ తెలిపారు. -
కోయంబత్తూర్ రేప్ దోషికి ఉరే సరి
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ ఘటనలో దోషిగా తేలిన మనోహరన్‌కు మరణ శిక్షే సరైన శిక్ష అని గురువారం సుప్రీంకోర్టు పునః నిర్ధారించింది. ఈ మేరకు ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోయంబత్తూర్‌లో 2010 అక్టోబర్ 29న పాఠశాలకు వెళ్తున్న పదేళ్ల బాలికను, ఏడేళ్ల ఆమె తమ్ముడిని మనోహరన్, మోహన కృష్ణన్ అనే ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. పిల్లలిద్దరి చేతులు కట్టేసి, ఆ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారికి విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. విష ప్రభావంతో కూడా ఆ చిన్నారులు చనిపోకపోవడంతో.. వారిని చేతులు, కాళ్లు కట్టేసి పరంబికులం–అక్సియార్ ప్రాజెక్టు కాలువలో పడేసి ప్రాణాలు తీశారు. ఆ తరువాత పోలీసుల ఎన్కౌంటర్లో మోహన కృష్ణణ్ హతమయ్యాడు. మనోహరన్‌కు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు ఆ తీర్పును సమర్ధించింది. ఈ ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు సైతం వారికి ఉరే సరైన శిక్ష అని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన దారుణంగా ఆ ఘాతుకాన్ని అభివర్ణించింది. అనంతరం మనోహరన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్ ఖన్నా గత తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్‌ను 2:1 తేడాతో తోసిపుచ్చారు. మరణ శిక్షను ఇద్దరు న్యాయమూర్తులు సమర్ధించగా, జస్టిస్ ఖన్నా మాత్రం చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడం సరైన శిక్ష అవుతుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీ జడ్జీల తీర్పు మేరకు మనోహరన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది. -
ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా?
-
ఒకరికి ఒకరు
ఈ జంట లలితమనోహరం ప్రాంతాలు, మతాల హద్దులు చెరిపి ఒక్కటయ్యారు జబ్బున పడ్డ భర్తకు అన్నీ తానైన భార్య కిడ్నీ దానం చేసి ప్రాణం నిలిపిన త్యాగం హైదరాబాద్: ప్రేమంటే ఆకర్షణ కాదు.. అవసరం అంతకంటే కాదు.. ప్రేమంటే ఓ నమ్మకం... ఓ బాధ్యత.. గౌరవం.. వెలకట్టలేని త్యాగం! ముప్పై ఆరేళ్ల క్రితం రెండు హృదయాల మధ్య చిగురించిన ఆ ప్రేమ కేవలం సుఖాల్లోనే కాదు పుట్టెడు కష్టాల్లోనూ తోడుగా నిలిచింది. తల్లి జన్మనిస్తే.. మృత్యువుతో పోరాడుతున్న భర్తకు ఆమె పునర్జన్మనిచ్చింది. నేటితరం ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది!! ఆయనది దక్షిణం.. ఆమెది ఉత్తరం.. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ బృందావన్ కాలనీకి చెందిన ఎన్.మనోహరన్, జయలలితల ప్రాంతాలే కాదు.. మతాలు కూడా వేర్వేరు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం రిటైరయ్యారు. ఈయన పూర్వీకులు తమిళనాడులోని మదురైకి చెందినవారు. తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ వచ్చి తిరుమలగిరిలో స్థిరపడ్డారు. జయలలిత స్వస్థలం ఢిల్లీ. ఆమె తల్లిదండ్రులూ హైదరాబాద్ తిరుమలగిరిలోని మనోహరన్‌కు చెందిన ఇంట్లో అద్దెకు దిగారు. అద్దె కోసం వెళ్లి ప్రేమలో.. మనోహరన్ తల్లి ఆర్మీలో 4వ తరగతి ఉద్యోగం చేసేది. కొడుకుతో కలసి మిలట్రీ క్వార్టర్స్‌లో ఉండేది. ఓ రోజు మనోహరన్ తిరుమలగిరిలోని సొంతింటికి అద్దె కోసం వెళ్లాడు. అక్కడ జయలలిత తారసపడింది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను చూసేందుకు మిలట్రీ క్వార్టర్స్ నుంచి రోజూ సాయంత్రం సొంతింటికి వచ్చేవాడు. ఓ రోజు ఆమె ముందు ప్రేమను వ్యక్తపరిచాడు. జయలలిత కంగారుపడి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. చివరకు ఆమె మనసులో ప్రేమ చిగురించింది. అలా కొంతకాలం గడిచిపోయింది. చివరకు ఓ రోజు మనోహరన్... జయలలిత తండ్రి వద్దకు వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అందుకు ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుమార్తెను ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేశారు. అయినా జయను పెళ్లి చేసుకోవాలని భావించాడు మనోహరన్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చేయిపట్టుకుని తన తల్లి వద్దకు తీసుకెళ్లాడు. మతాలు వేరు కావడంతో తొలుత ఆమె కూడా వారి పెళ్లికి అంగీకరించలేదు. మనోహరన్ నచ్చజెప్పడంతో చివరకు తల్లి అంగీకరించింది. వీరి పెళ్లిని అడ్డుకునేందుకు జయలలిత తల్లిదండ్రులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు 1982 ఏప్రిల్ 5న ఇద్దరికీ రహస్య ప్రదేశంలో వివాహం జరిగింది. అలా ఒక్కటైన వీరు చాలాకాలం సంతోషంగా ఉన్నారు. వీళ్ల ప్రేమకు ప్రతి రూపంగా ఒక బాబు, ఒక పాప జన్మించారు. అంతలోనే పిడుగుపాటు.. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలోనే పిడుగులాంటి వార్త. మనోహరన్‌కు 2 కిడ్నీలు పాడైనట్లు తేలింది. ఇక తాను ఎక్కువ కాలం బతకనని తెలిసి మనోహరన్ కుంగిపోయాడు. కానీ భార్య జయలలిత మాత్రం భర్తను ఎలాగైనా బతికించుకోవాలని భావించింది. భర్తను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. రక్త సంబంధీకుల కిడ్నీలు మాత్రమే మ్యాచ్ అవుతాయని వైద్యులు చెప్పారు. అయినా వినకుండా తన కిడ్నీని పరీక్షించాల్సిందిగా ఆమె కోరింది. చివరకు వైద్యులు పరీక్షించారు. 14 రకాల టెస్టులు చేశారు. అదృష్టవశాత్తూ ఆమె కిడ్నీ ఆయనకు సరిపోయింది. 1994 జూన్ 4న అపోలో ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. భార్య కిడ్నీ భర్తకు సరిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత మనోహరన్ భార్య ఇచ్చిన కిడ్నీతోనే జీవిస్తున్నారు. భార్య కూడా ఒకే కిడ్నీతో జీవిస్తోంది. ఇటీవల మనోహరన్‌కు గుండెపోటు వచ్చింది. ఇక బతకనేమోననుకున్న భర్తకు బాసటగా నిలిచింది జయ. ధైర్యం చెప్పి బైపాస్ సర్జరీ చేయించింది. ఇలా ప్రతి సందర్భంలో అండగా నిలిచి.. ప్రేమను మాత్రమే కాదు జీవితాన్నీ పంచుతోంది. ఇప్పుడు మనోహరన్ వయసు 63. జయకు 56 ఏళ్లు. వీరిద్దరి పిల్లలు కూడా ప్రేమ వివాహాలే చేసుకోవడం విశేషం. ఆమె లేనిదే నేను లేను: మనోహరన్ మృత్యువుతో పోరాడుతున్న సమయంలో ఆమె నాకు అండగా నిలిచింది. కిడ్నీ దానం చేసి మళ్లీ ఊపిరిపోసింది. ఆమె త్యాగం మర్చిపోలేనిది. వెలకట్టలేనిది. ఏం చేసినా ఆమె రుణం తీర్చుకోలేను. ప్రేమించడం తప్పు కాదు.. ప్రేమను నిలబెట్టుకోవడంలోనే గొప్పతనం దాగి ఉంది. కానీ నేటి ప్రేమికుల్లో చాలా మంది గిఫ్ట్‌లు, టైంపాస్ కోసం ప్రేమను వాడుకుంటున్నారు. ఇది బాధాకరం. ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా?: జయలలిత ఇతరులను ఇష్టపడితే వారి సుఖంలోనే కాదు కష్టాల్లో కూడా పాలుపంచుకోవాలి. నా కోసం ఆయన ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఆయన కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ప్రేమించడం తప్పు కాదు దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. అందరి జీవితాల్లాగే మా మధ్య కూడా అప్పుడప్పుడు చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా సర్దుకుపోతాం. మా పిల్లలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. -
నిశ్చితార్థానికి ముందే...తీవ్ర విషాదం
చెన్నై: మూడురోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో మృత్యు దేవత వికటాట్టహాసం చేసింది. బంధుమిత్ర సపరివారంతో ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో అకస్మాత్తుగా శ్మశాన వాతావరణం అలుముకుంది. ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ...కుటుంబంలోని ముగ్గురు విగజీవులుగా మారిపోయారు. ఈ విషాద ఘటన మృతుల బంధువులను తీవ్రంగా కలవరపర్చింది. తమిళనాడులోని ఈరోడ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. కోటిఆశలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టాల్సిన యువతి, తల్లిదండ్రులతో పాటు అర్థాంతరంగా తనువు చాలించింది. మానసిక ఒత్తిడి కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చిన్నయం పాలెంకు చెందిన కాబోయే వధువు క్రితిక(31) ఆమె తండ్రి, ప్రైవేట్ బ్యాంకు మేనేజర్, మనోహరన్ (60) తల్లి రాధామణి(55) గురువారం విషం సేవించి తనువు చాలించారు. శుక్రవారం పాలు అమ్ముకునే వ్యక్తి తలుపు తట్టినా.. స్పందన రాకపోవడంతో బందువులకు సమాచారం అందించాడు. తర్వాత, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగలు గొట్టడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలంలో మనోహర్ రాసిన మూడు సూసైడ్ నోట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమితం ఆసుపత్రికి తరలించారు. అయితే తమ అంత్యక్రియలకోసం కొంత డబ్బును కూడా అక్కడ ఉంచడం మరింత విషాదాన్ని నింపింది. కాగా క్రితికకు కేరళకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 6) వీరిద్దరి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. దీనికి సంబందించిన ఆహ్వానాలను కూడా బంధువులందరికీ పంపించారు. ఇంతలోనే ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది.