నిశ్చితార్థానికి ముందే...తీవ్ర విషాదం
చెన్నై: మూడురోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో మృత్యు దేవత వికటాట్టహాసం చేసింది. బంధుమిత్ర సపరివారంతో ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో అకస్మాత్తుగా శ్మశాన వాతావరణం అలుముకుంది. ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ...కుటుంబంలోని ముగ్గురు విగజీవులుగా మారిపోయారు. ఈ విషాద ఘటన మృతుల బంధువులను తీవ్రంగా కలవరపర్చింది.
తమిళనాడులోని ఈరోడ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. కోటిఆశలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టాల్సిన యువతి, తల్లిదండ్రులతో పాటు అర్థాంతరంగా తనువు చాలించింది. మానసిక ఒత్తిడి కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. చిన్నయం పాలెంకు చెందిన కాబోయే వధువు క్రితిక(31) ఆమె తండ్రి, ప్రైవేట్ బ్యాంకు మేనేజర్, మనోహరన్ (60) తల్లి రాధామణి(55) గురువారం విషం సేవించి తనువు చాలించారు. శుక్రవారం పాలు అమ్ముకునే వ్యక్తి తలుపు తట్టినా.. స్పందన రాకపోవడంతో బందువులకు సమాచారం అందించాడు. తర్వాత, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగలు గొట్టడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలంలో మనోహర్ రాసిన మూడు సూసైడ్ నోట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమితం ఆసుపత్రికి తరలించారు. అయితే తమ అంత్యక్రియలకోసం కొంత డబ్బును కూడా అక్కడ ఉంచడం మరింత విషాదాన్ని నింపింది.
కాగా క్రితికకు కేరళకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 6) వీరిద్దరి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. దీనికి సంబందించిన ఆహ్వానాలను కూడా బంధువులందరికీ పంపించారు. ఇంతలోనే ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది.