ఒకరికి ఒకరు
ఈ జంట లలితమనోహరం
ప్రాంతాలు, మతాల హద్దులు చెరిపి ఒక్కటయ్యారు
జబ్బున పడ్డ భర్తకు అన్నీ తానైన భార్య
కిడ్నీ దానం చేసి ప్రాణం నిలిపిన త్యాగం
హైదరాబాద్: ప్రేమంటే ఆకర్షణ కాదు.. అవసరం అంతకంటే కాదు.. ప్రేమంటే ఓ నమ్మకం... ఓ బాధ్యత.. గౌరవం.. వెలకట్టలేని త్యాగం! ముప్పై ఆరేళ్ల క్రితం రెండు హృదయాల మధ్య చిగురించిన ఆ ప్రేమ కేవలం సుఖాల్లోనే కాదు పుట్టెడు కష్టాల్లోనూ తోడుగా నిలిచింది. తల్లి జన్మనిస్తే.. మృత్యువుతో పోరాడుతున్న భర్తకు ఆమె పునర్జన్మనిచ్చింది. నేటితరం ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది!!
ఆయనది దక్షిణం.. ఆమెది ఉత్తరం..
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ బృందావన్ కాలనీకి చెందిన ఎన్.మనోహరన్, జయలలితల ప్రాంతాలే కాదు.. మతాలు కూడా వేర్వేరు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం రిటైరయ్యారు. ఈయన పూర్వీకులు తమిళనాడులోని మదురైకి చెందినవారు. తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ వచ్చి తిరుమలగిరిలో స్థిరపడ్డారు. జయలలిత స్వస్థలం ఢిల్లీ. ఆమె తల్లిదండ్రులూ హైదరాబాద్ తిరుమలగిరిలోని మనోహరన్‌కు చెందిన ఇంట్లో అద్దెకు దిగారు.
అద్దె కోసం వెళ్లి ప్రేమలో..
మనోహరన్ తల్లి ఆర్మీలో 4వ తరగతి ఉద్యోగం చేసేది. కొడుకుతో కలసి మిలట్రీ క్వార్టర్స్‌లో ఉండేది. ఓ రోజు మనోహరన్ తిరుమలగిరిలోని సొంతింటికి అద్దె కోసం వెళ్లాడు. అక్కడ జయలలిత తారసపడింది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను చూసేందుకు మిలట్రీ క్వార్టర్స్ నుంచి రోజూ సాయంత్రం సొంతింటికి వచ్చేవాడు. ఓ రోజు ఆమె ముందు ప్రేమను వ్యక్తపరిచాడు. జయలలిత కంగారుపడి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. చివరకు ఆమె మనసులో ప్రేమ చిగురించింది. అలా కొంతకాలం గడిచిపోయింది. చివరకు ఓ రోజు మనోహరన్... జయలలిత తండ్రి వద్దకు వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అందుకు ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుమార్తెను ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేశారు. అయినా జయను పెళ్లి చేసుకోవాలని భావించాడు మనోహరన్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చేయిపట్టుకుని తన తల్లి వద్దకు తీసుకెళ్లాడు. మతాలు వేరు కావడంతో తొలుత ఆమె కూడా వారి పెళ్లికి అంగీకరించలేదు. మనోహరన్ నచ్చజెప్పడంతో చివరకు తల్లి అంగీకరించింది. వీరి పెళ్లిని అడ్డుకునేందుకు జయలలిత తల్లిదండ్రులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు 1982 ఏప్రిల్ 5న ఇద్దరికీ రహస్య ప్రదేశంలో వివాహం జరిగింది. అలా ఒక్కటైన వీరు చాలాకాలం సంతోషంగా ఉన్నారు. వీళ్ల ప్రేమకు ప్రతి రూపంగా ఒక బాబు, ఒక పాప జన్మించారు.
అంతలోనే పిడుగుపాటు..
సంసారం సాఫీగా సాగుతున్న సమయంలోనే పిడుగులాంటి వార్త. మనోహరన్‌కు 2 కిడ్నీలు పాడైనట్లు తేలింది. ఇక తాను ఎక్కువ కాలం బతకనని తెలిసి మనోహరన్ కుంగిపోయాడు. కానీ భార్య జయలలిత మాత్రం భర్తను ఎలాగైనా బతికించుకోవాలని భావించింది. భర్తను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. రక్త సంబంధీకుల కిడ్నీలు మాత్రమే మ్యాచ్ అవుతాయని వైద్యులు చెప్పారు. అయినా వినకుండా తన కిడ్నీని పరీక్షించాల్సిందిగా ఆమె కోరింది. చివరకు వైద్యులు పరీక్షించారు. 14 రకాల టెస్టులు చేశారు. అదృష్టవశాత్తూ ఆమె కిడ్నీ ఆయనకు సరిపోయింది. 1994 జూన్ 4న అపోలో ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. భార్య కిడ్నీ భర్తకు సరిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత మనోహరన్ భార్య ఇచ్చిన కిడ్నీతోనే జీవిస్తున్నారు. భార్య కూడా ఒకే కిడ్నీతో జీవిస్తోంది. ఇటీవల మనోహరన్‌కు గుండెపోటు వచ్చింది. ఇక బతకనేమోననుకున్న భర్తకు బాసటగా నిలిచింది జయ. ధైర్యం చెప్పి బైపాస్ సర్జరీ చేయించింది. ఇలా ప్రతి సందర్భంలో అండగా నిలిచి.. ప్రేమను మాత్రమే కాదు జీవితాన్నీ పంచుతోంది. ఇప్పుడు మనోహరన్ వయసు 63. జయకు 56 ఏళ్లు. వీరిద్దరి పిల్లలు కూడా ప్రేమ వివాహాలే చేసుకోవడం విశేషం.
ఆమె లేనిదే నేను లేను: మనోహరన్
మృత్యువుతో పోరాడుతున్న సమయంలో ఆమె నాకు అండగా నిలిచింది. కిడ్నీ దానం చేసి మళ్లీ ఊపిరిపోసింది. ఆమె త్యాగం మర్చిపోలేనిది. వెలకట్టలేనిది. ఏం చేసినా ఆమె రుణం తీర్చుకోలేను. ప్రేమించడం తప్పు కాదు.. ప్రేమను నిలబెట్టుకోవడంలోనే గొప్పతనం దాగి ఉంది. కానీ నేటి ప్రేమికుల్లో చాలా మంది గిఫ్ట్‌లు, టైంపాస్ కోసం ప్రేమను వాడుకుంటున్నారు. ఇది బాధాకరం.
ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా?: జయలలిత
ఇతరులను ఇష్టపడితే వారి సుఖంలోనే కాదు కష్టాల్లో కూడా పాలుపంచుకోవాలి. నా కోసం ఆయన ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఆయన కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ప్రేమించడం తప్పు కాదు దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. అందరి జీవితాల్లాగే మా మధ్య కూడా అప్పుడప్పుడు చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా సర్దుకుపోతాం. మా పిల్లలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.