నన్నడగొద్దు ప్లీజ్‌ | love docter returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Fri, Jul 28 2017 11:51 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

నన్నడగొద్దు ప్లీజ్‌ - Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ రామ్, ప్లీస్‌ సజెస్ట్‌ మి సమ్‌థింగ్‌ ప్లీజ్‌. నేను నా లవ్‌ మేటర్‌ 3 నెలల క్రితం ఇంట్లో చెప్పాను. ఆ అబ్బాయి బ్రాహ్మిన్, మేము రెడ్డి. మా ఇంట్లో వాళ్లకి చాలా క్యాస్ట్‌ పిచ్చి ఉంది. అస్సలు ఒప్పుకోవట్లేదు. నన్ను బలవంతంగా వాళ్ల మాటకు ఒప్పుకునేలా చేస్తున్నారు. ఏమైనా అంటే చస్తాం అంటున్నారు. ‘బంధువులందరి ముందు మేము ఈ పెళ్లి చేయలేం. అసలు నువ్వు చేసింది తప్పు అవన్నీ మర్చిపో’ అన్నారు. 3 నెలలు టైమ్‌ తీసుకున్నా. ఆఫీస్‌కి వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్నా కానీ నో ఛేంజ్‌. నాకు వేరే లైఫ్‌ అంటే భయంగా ఉంది. మళ్లీ మా ఇంట్లో ఆ మాటే చెప్పాను. వేరే వాళ్లతో లైఫ్‌ అంటే నాకు డైజెస్ట్‌ అవట్లేదు అని. వాళ్లు చాలా సీరియస్‌ అయ్యారు.‘ ఇన్ని ఏళ్లు మేం నిన్ను పెంచాం. మా కోసం అంత కూడా చెయ్యవా? అంటున్నారు. ఊర్లో పరువు పోతుంది.

మేం తల ఎత్తుకోలేం. దానికన్నా చావు బెటర్‌’ అంటున్నారు. ‘నువ్వు మేం చెప్పింది వింటాను, మారుతాను అంటే మేము బతుకుతాం. లేకపోతే లేదు’ అన్నారు. ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లో వాళ్లు ‘ఆ అమ్మాయి వాళ్లింట్లో ఒప్పుకున్నప్పుడు చూద్దాం’ అన్నారట. వాళ్లు కూడా ‘వేరే క్యాస్ట్‌ అయితే చాలా ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. ఇక మీరే ఆలోచించుకోండి’ అని చెప్పారట. మొన్న ఓ రోజు మా అమ్మ చచ్చిపోతానంది. అప్పుడు ఆమెను ఆపి ‘నేను ఇక ఎప్పుడూ ఆ టాపిక్‌ తీయను. మర్చిపోతా అని’ ప్రామిస్‌ చేశాను. ఆఫీస్‌కి వెళ్లడం స్టార్ట్‌ చేశాను. ఆఫీస్‌కెళ్తే ఆ అబ్బాయి కనిపిస్తాడు, కానీ ఇంట్లో ఉంటే నాకు ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నాడు. నేను మామూలు అవ్వాలి అని ఆఫీస్‌కి వెళదాం అనుకున్నాను. ఆ అబ్బాయి కూడా కెరీర్‌ స్పాయిల్‌ చేసుకున్నాడు. ఆఫీస్‌కి రావడం లేదు.

ఆ అబ్బాయిని మర్చిపోతానని ఇంట్లో అయితే చెప్పాను. కానీ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించే పరిస్థితిలో లేను. అక్టోబర్‌లో పెళ్లి చేస్తాం అంటున్నారు. నాకు ఇప్పుడే వద్దు అంటే వినట్లేదు. ‘ఇప్పటికే బంధువులందరూ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు అని అడుగుతున్నారు. మేం చేద్దాం అనుకునే సరికి నువ్వు ఇలాంటి పని చేశావు. మేమయితే అక్టోబర్‌లో చేసేస్తాం’ అన్నారు. కానీ నాకు ఆ మాట వింటుంటే కోపం వస్తోంది. పెళ్లి అంటే ఏడుపొస్తోంది. బాధ అనిపిస్తోంది. నచ్చట్లేదు. వేరే అతనితో లైఫ్‌ని స్టార్ట్‌ చేయాలి అని తలుచుకుంటేనే ఉండాలని లేదు. కానీ నాకు ఏ చాన్సూ లేదు. ప్లీజ్‌ ఏమైనా హెల్ప్‌ చేయండి. నేను త్వరగా ఆ అబ్బాయి ఆలోచన నుండి బయటకు రావాలి అండ్‌ పెళ్లి లైఫ్‌ అంటే ఇంట్రస్ట్‌ రావాలి. రిప్లై ప్లీజ్‌... – మానస

మానసా! కులాల మధ్య పెళ్లిళ్లకు పెద్దలు వద్దనడానికి ఒక కారణం ఉంది. మీ ట్రెడిషన్స్‌ వాళ్ళ ట్రెడిషన్స్‌ ఒకలాగే ఉండవు. అమ్మాయి కష్టపడుతుందేమోనని. నువ్వెలాగూ అబ్బాయిని మరిచిపొయ్యి పెళ్లికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నావు. అలాంటప్పుడు తొందరపడవద్దని అమ్మానాన్నలకు ప్రేమగా అర్థమయ్యేలాగా చెప్పు. మానసికంగా పెళ్లికి రెడీగా లేనప్పుడు పెళ్లి చేస్తే వివాహబంధం గట్టిగా ఉండదని ఎక్స్‌ప్లెయిన్‌ చెయ్యి.

నీ సంతోషాన్ని మించి నీ పేరెంట్స్‌కి వేరే ఆలోచనే ఉండదు, వాళ్ల భయం అంతా నువ్వు ఈ లోపు ఆ పిల్లోడిని చేసుకోవాలనుకుంటున్నావేమో అని అనుమానమే! ‘‘ఏంటి సార్‌ మీరు కూడా ఇవాళ్టి యూత్‌కి కులం బయట పెళ్లిళ్లు వద్దని చెబుతున్నారు. కులాంతర వివాహాలు ఉంటేనే కదా ఈ కుల గజ్జి ఖతం అయ్యేది సార్‌!?!’’ తొక్కలోపల అరటిపండు ఉండడం ఎంత నిజమో కులాంతర వివాహాల్లో కొత్త సమాజం ఇమిడి ఉందన్నది అంతే నిజం. కానీ మానస అమ్మానాన్నలను కూడా ప్రేమిస్తుంది. అందుకే వాళ్ల ఆలోచనను గౌరవిస్తోంది. ‘‘అరటిపండును కులాంతర వివాహాలతో భలే కలిపారు సార్‌ యూ డిజర్వ్‌ అరటిపండు’’ అని నవ్వింది నీలాంబరి.
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement