నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హలో... రామ్ సర్, నేను ఒక అమ్మాయిని టెన్త్ క్లాస్ నుంచి ప్రేమిస్తున్నాను. తాను కూడా నన్ను ప్రేమిస్తోంది. నేనంటే తనకు చాలా ఇష్టం. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే నా లైఫ్‌లో ఎంత పెద్ద విజయం అయినా సాధించగలను అనే నమ్మకం ఉండేది. సడన్‌గా వన్ ఇయర్ నుంచి తనలో టోటల్‌గా ఛేంజ్. మిడ్‌నైట్ వరకు ఫోన్ బిజీ వస్తోంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే ఫ్రెండ్స్ అంటుంది. తన మీద నాకు అనుమానం లేదు. బట్ తాను నన్ను చాలా డిస్ట్రబ్ చేస్తోంది. తాను చేసే పని తప్పు అని చెబితే ‘నువ్వు నన్ను అనుమానిస్తున్నావా?’ అంటుంది. ‘నువ్వు నాకు వొద్దు, నాకు బ్రేక్‌అప్ చెప్పు’ అంటే... ‘నేను నీకు బ్రేక్‌అప్ చెప్పను. ఇష్టం లేకపోతే మాట్లాడకు. నా లైఫ్ అంతా నువ్వే ఉంటావ్ . నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఏమీ చేయలేను.
ఎగ్జామ్స్ తరవాత నీతో హ్యాపీగా ఉంటాను. నాకోసం వెయిట్ చేయి’ అంటోంది. తను నన్ను మోసం చేస్తోందేమో అని భయం వేస్తోంది. నేను షార్ట్‌ఫిల్మ్స్ చేస్తాను. ఇప్పుడు నాకు బిగ్ స్క్రీన్ నుంచి రైటర్‌గా మంచి అవకాశం వచ్చింది. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. తనతో మాట్లాడకుండా నేను ఉండలేను. తనలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. మేమిద్దరం డిగ్రీ ఫైనల్ ఇయర్. నన్ను మోటివేట్ చేయటానికి కూడా ఎవరు లేరు. ప్లీజ్ సర్ నాకు ఆన్సర్ ఇవ్వండి. – భరత్ కుమార్
నీలాంబరి సైగలు చేస్తోంది... అర్థంకాక ‘క్యా హై’ అని అడిగాను. మళ్లీ కనుబొమ్మలు ఎగరేస్తోంది. ‘మౌన వ్రతమా?’ అన్నాను... ‘యహే.. అర్థం కాదా?’ అన్నట్టు రుసరుస చూసింది. ‘ఇప్పుడు ఏమైందని నాలుకకు నాట్స్ వేసి కనుబొమలతో డాన్స్ చేయిస్తున్నావు..?’ అన్నాను. నాకు విషయం అర్థం కావడం లేదన్నాను. కోపంతో నీలాంబరి సర్రున లేచింది. అమ్మో డేంజర్ సిగ్నల్. నీలాంబరి కాలు మీద కాలు వేసినా, అరికాలి మీద లేచినా డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేయడం కరెక్ట్ అని తెలిసి కుర్చీ మీద ఉన్న తుండు విసిరి రూములో ఉన్న భారీ బల్లను మా ఇద్దరి మధ్యలోకి సటక్ ఫటక్ అని లాగాను. సిగ్నల్ అర్థమై సేఫ్టీ మెయిన్‌టెయిన్ చేశాను.
విషయం అర్థం చేసుకోండి భరత్ గారు. అమ్మాయి తుర్రు. నీకు ఎలా చెప్పాలో తెలియక వంద సిగ్నల్స్ ఆల్రెడీ ఇచ్చింది. అమ్మాయి లవ్ మీద నుంచి కర్చీఫ్ తీసి నెత్తిన వేసుకుని, కెరీర్ మీద మైండ్ పెట్టుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. ఇంకో కర్చీఫ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ నీలాంబరి ప్రాబ్లమ్ ఏంటి..? ఆకలి మీద ఉన్న నీలాంబరి గ్యాప్ లేకుండా అరటి పళ్లు మెక్కి ఎక్కిళ్లు ఆపుకోవడానికి ఊపిరి బిగబట్టి కూర్చుంది అంతే!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com