Kidney donation
-
సీఎం జగన్ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా..
కిడ్నీ దానం చేసి ఆ తల్లి కుమారుడికి మరోసారి ప్రాణం పోస్తే..జగనన్న ఆ కుటుంబానికి చేదోడుకు నిలిచారు. కిడ్నీ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును మొత్తం భరించడంతో పాటు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేసి.. ఆ యువకుడ్ని ప్రభుత్వ ఉద్యోగానికి సీఎం సిఫార్సు చేశారు. కష్టంలో తమకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామంటోంది ఆ కుటుంబం కొనకనమిట్ల: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేము వెలుగొండయ్య, మార్తమ్మల కుమారుడు వేము శ్రీనివాసులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషిస్తూ తమ్ముడు బాబూరావును చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కిడ్నీ దెబ్బతిందని చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తల్లడిల్లింది. ఇంటికి ఆదరవుగా ఉన్న కుమారుడికి చిన్న వయసులోనే కిడ్నీ దెబ్బతినడంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా మదనపడ్డారు. కుమారుడిని బతికించేందుకు తల్లీ మార్తమ్మ తన కిడ్నీ ఇవ్వడానికి ధైర్యం చేసింది. కానీ కిడ్నీ మార్చేందుకు హాస్పిటల్ ఖర్చు రూ.10 లక్షల వరకు అవుతుండటంతో ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈబీసీ నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురం పట్టణానికి వచ్చారు. తన కుమారుడు శ్రీనివాసులను తీసుకొని తల్లి మార్తమ్మ సీఎం జగన్‌ను కలిసేందుకు మార్కాపురం వచ్చారు. రోడ్డు పక్కన నిల్చోని ఉన్న వారిని గమనించిన సీఎం వారి దగ్గరకు వచ్చి పలకరించి వివరాలు తెలుసుకున్నారు. కుమారుడిని బతికించేందుకు తన కిడ్నీ ఇస్తానని, మార్పిడికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని సీఎంకు విన్నవించారు. సీఎం జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని, బీఎస్సీ నర్సింగ్ చదివిన నీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, కిడ్నీ దానం చేసిన తల్లివైన నీకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్ దినేష్‌కుమార్‌కు సమస్యను పరిష్కరించమని ఆదేశాలిచ్చారు. హామీ నెరవేర్చిన సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. హామీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కలెక్టర్ రూ.లక్ష చెక్కును ఇచ్చారు. ఈ తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు మంజూరు కావడంతో విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆరోగ్యంగా ఉన్నాడు. రాయవరంలో ఉంటున్న మాకు దరిమడుగు వద్ద ఇంటి నివేశన స్థలం ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు రూ.10 లక్షలను ముఖ్యమంత్రి జగనన్న మంజూరు చేయటంతో తన కుమారుడు ప్రసుత్తం ఆరోగ్యంగా ఉన్నాడని శ్రీనివాసులు తల్లి మార్తమ్మ సంతోషం వ్యక్తం చేసింది. సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిన శ్రీనివాసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ డీఎంహెచ్ఓను ఆదేశించారు. దీంతో మార్తమ్మ కుమారుడిని తీసుకొని కలెక్టర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
ఉబర్ డ్రైవర్ ఔదార్యం! అపరిచిత ప్రయాణికుడి కోసం..
మనకు తెలియని వ్యక్తి కనీసం రూ. 10 ఇవ్వాలన్న ఆలోచిస్తాం. అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఏకంగా ఒక అవయవాన్నే దానం చేయడం అంటే వామ్మో అని పిస్తుంది కదా. ఔను ఇక్కడొక ఉబర్ డ్రైవర్ అలానే చేశాడు. ఆ వ్యక్తి డ్రైవర్‌కి తెలియదు. తను డ్రాప్ చేయాల్సిన కస్టమర్ మాత్రమే. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన బిల్ సుమీల్ అనే వ్యక్తి డయాలసిస్ సెంటర్‌కి వెళ్లాలని ఉబర్ బుక్ చేసుకున్నాడు. ఇంతలో తనని పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది. బిల్ సుమీల్ ఆ కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ టిమ్ లెట్స్తో మాటలు కలిపాడు. తన గురించి, తన అనారోగ్యం గురించి డ్రైవర్‌తో పంచుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకోగానే.. సదరు ఉబర్ డ్రైవర్ టిమ్ తన కిడ్నిని సుమీల్‌కి దానం చేసేందుకు రెడీ అయ్యాడు. విచిత్రంగా అతడి కిడ్నీ సుమీల్‌కి సూట్ అయ్యింది. బహుశా దేవుడు ఇందుకోసమే మిమ్మల్ని నా కారులో వచ్చేలా చేశాడని డ్రైవర్ టిమ్ సుమీల్‌కి చెప్పాడు కూడా. కిడ్నీ బదిలీ కోసం సుమీల్‌కి ఆపరేషన్ చేశారు. అది విజయవంతమయ్యింది. ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే సుమీల్ డెలావేర్ యూనివర్సిటీ మూత్రపిండ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఉబర్ డ్రైవర్ టిమ్ లైట్స్ జర్మనీలో నివశిస్తున్నాడు. అయితే ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారని తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అందుకు సంబంధించిన కథనాన్ని ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ ఉబర్ డ్రైవర్ ఔదార్యానికి ఫిదా అవుతూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: విమానంలో అనౌన్సర్‌గా బీజేపీ ఎంపీ..షాక్‌లో ప్రయాణికులు) -
ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన చెల్లి అని తెలిసి భర్త షాక్..!
ఆరేళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భార్య తనకు సొంత చెల్లి అని తెలిసి కంగుతిన్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన కథనాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టును ఈ డిలీట్ చేశారు. సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో అసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. 6 ఏళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబసభ్యులతో పాటు తన కుటుంబసభ్యులు ఎవరనే విషయం కునుగొనేందుకు భర్త ప్రయత్నించాడు. భార్య తరఫు కుటుంబసభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించగా.. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీళ్లిద్దరు అన్నాచెల్లి అని వైద్యులు నిర్ధరించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అనుకుని వాపోయాడు. రెడ్డిట్‌లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. 'మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో.. మున్ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్‌కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి' అని సూచించారు. చదవండి: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా? -
లాలుకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించినట్లు బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆమె సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు తేజస్వీ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి సమయంలో ఆయన సన్నిహితుడు భోలా యాదవ్, కుమారుడు తేజస్వీ యాదవ్, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కుమార్తే మిసా భారతిలు సింగపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం తన కూతురితో కలిసి సింగపూర్ వెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రికి కిడ్నీ ఇచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలి ఆయన కుమార్తె రోహిణి నిర్ణయం తీసుకున్నారు. पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया। डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2 — Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022 ఇదీ చదవండి: ‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోండి’: కాంగ్రెస్ -
లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వైద్యం కోసం కూతురుతో కలిసి ఆయన సింగపూర్ కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో లాలూకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తండ్రికి తన కిడ్నీ దానం చేయాలని రోహిణి నిర్ణయించుకున్నారు. అయితే కూతురు ప్రతిపాదనను లాలూ మొదట్లో వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కానీ చివరికి రోహిణి ఒత్తిడి చేయడం, వైద్యుల సూచన మేరకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది. ఇక లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసేందుకు ఆయన కుమార్తె రోహిణి ముందుకు రావడం పట్ల ఆర్జేడీ పార్టీ శ్రేణులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. చదవండి: నీళ్లలో దూకాడు.. బీజేపీ తరపున జాక్‌పాట్ కొట్టాడు -
ప్రియుడి మోసాన్ని దిగమింగుకుని నవ్వుతూ..
ఇష్టపడే వ్యక్తులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే.. కొన్నిసార్లు చాలా ముఖ్యం కూడా. కానీ, ఆ దయాగుణమే కొందరి జీవితాల్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఏ ప్రేయసి చేయని త్యాగం చేసి.. చివరకు అతని చేతిలో దారుణంగా మోసపోయింది. అయినా ఆమె పెదాలపై చిరునవ్వు విరబూయడం మాత్రం ఆగిపోలేదు. ప్రేమించడం అంటే.. కొందరి దృష్టిలో ప్రేమను ఇవ్వడం.. మరిచిపోవడం!. కానీ, అవతలి వ్యక్తిని తమ సర్వస్వంగా భావించడం అనేదే అసలైన ప్రేమగా నిర్వచించింది ఆ యువతి. ప్రేమలో అవతలి వాళ్లను గౌరవించడంతో ఆగిపోకుండా.. వాళ్లకు ఆపదొస్తే కాపాడుకోవం కూడా బాధ్యత అనుకుంది. అలా అనుకుంది కాబట్టే.. వెల కట్టలేని కానుకను ప్రియుడికి బహుమతిగా సమర్పించుకుంది. కానీ, ఆమె ప్రేమకు అతను అర్హుడు కాదని గుండె బద్దలయ్యే నిజం తెలిసినా.. చిరునవ్వుతో జీవితంలో ముందుకు సాగుతోంది. ప్రేమించిన వ్యక్తి కోసం.. కాలిఫోర్నియాలోని యోర్బా లిండాకు చెందిన కోలీన్ లీ(30).. బహుశా కొందరికి ఈమె గురించి తెలిసే ఉండొచ్చు. ఏడేళ్లు వెనక్కి వెళ్తే.. 2015లో కోలీన్కు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికి గురించి ఏమీ తెలియకున్నా గుడ్డిగా మనసారా ప్రేమించేసింది ఆ యువతి. డేటింగ్ చేసి నాలుగు నెలలు తిరగకుండానే.. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలుసుకుంది. సమస్య ముదరడంతో.. అతన్ని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. అందుకే తన కిడ్నీని దానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో అతనేం బలవంతం చేయలేదు. కానీ, మానసికంగా, భావోద్వేగంగా ఆమెను బాగా ప్రభావితం చేశాడు. అతను ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం ఇబ్బంది పడుతుంటే.. చూస్తూ తట్టుకోలేకపోయింది ఆమె. ఎందుకంటే.. అతన్ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టి. మొత్తానికి అతనికి కిడ్నీ దానం చేసింది. కథ సుఖాంతం కావాలి కదా. అలా జరగలేదు. కొన్ని నెలలపాటు మొక్కుబడిగా ఆమెతో మాట్లాడాడు అతను. ఆ తర్వాత.. ఆమె నిజాయితీకి మెచ్చో లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ ఆమె గుండె బద్దలయ్యే నిజాన్ని చెప్పాడు అతను. చెప్పాపెట్టకుండా ఓరోజు ఆమె దగ్గరికి వెళ్లి.. తాను ప్రేమించలేదని, కేవలం మోసం మాత్రమే చేశానని చెప్పాడతను. సెకండ్ ఛాన్స్- ప్చ్.. అంతే.. ఆమెకు నోట మాట రాలేదు. ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. కానీ, ఆమె సహనం కోల్పోలేదు. ఎందుకంటే ప్రేమలో తాను నిజాయితీగా ఉంది కాబట్టి. మరో అవకాశం ఇవ్వాలని అనుకుంది. కాల్స్ చేసింది. మెసేజ్‌లు పెట్టింది. ప్చ్.. దేనికి బదులు లేదు. పైగా అన్నింటా ఆమెను బ్లాక్ చేశాడు. అంటే.. మరో అవకాశానికి అతను సిద్ధంగా లేడని ఆలస్యంగా అర్థమైంది ఆమెకు. అందుకే అతన్ని వదిలేసింది. జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది. కోలీన్ లీ.. ఇప్పుడు మళ్లీ ఈ పేరు ఎందుకు తెర మీదకు వచ్చింది. ఎందుకంటే.. టిక్‌టాక్‌లో ఆ మధ్య ఓ వీడియో ద్వారా ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది కాబట్టి. ఆమెది ప్రేమ విషాదం.. కానీ, దానికి ఆమె జోడించింది హ్యూమర్‌ను. పది మిలియన్ల వ్యూస్, 3 మిలియన్ల లైకులతో ఆమె వీడియో ఆ షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లో ఇంకా దూసుకుపోతోంది. అందులో ఆమె త్యాగానికి దక్కిన ప్రతిఫలానికి దిగ్భ్రాంతి, సానుభూతి కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను నిజంగా అతనితో నా శేష జీవితాన్ని గడపాలని అనుకున్నా. ఎంతగానో ప్రేమించాను కాబట్టే అతని ప్రాణాన్ని కాపాడాను. కానీ, అతను నాతో చాలా తేలికగా బంధాన్ని తెంచుకున్నాడు. అతని జీవితంలో నేను లేను అనే వాస్తవాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమే. కానీ, జీవితం అక్కడితోనే ఆగిపోకూడదు కదా! అని చిరునవ్వుతో చెప్తోంది కోలీన్ లీ. ఆ నవ్వే ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది కూడా. -
అన్నయ్యకు ప్రేమతో...
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్‌రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాతా దేవ్ లక్నోలోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య సుదీప్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్( ఐఆర్ఎస్) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్‌కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్సీ)లో సుదీప్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్‌కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం. సూరత్‌లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేస్తోన్న సుదీప్ కుమార్‌కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్సీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. çసూరత్‌కు చెందిన బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్‌కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్ లైఫ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్‌కు మ్యాచ్ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత. రాయ్‌పూర్‌కు చెందిన అనుమిత, ఫరిదాబాద్‌కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్‌కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి. ‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్ సుజాత దేవ్ చెప్పారు. ‘‘నేను సుజాతకు థ్యాంక్స్ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్‌కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్ కుమార్ చెప్పారు. -
కరోనాను జయించడమే కాక..
కోల్‌కతా : వయసు పైబడినవారు కరోనా నుంచి కోలుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళ.. కరోనా నుంచి కోలుకోవడమే కాకుండా తన 38 ఏళ్ల కొడుక్కి కిడ్నీ దానం చేసి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఉత్తమ్ కుమార్ ఘోష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం తన తల్లి కల్పన, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాకు వచ్చారు. ఉత్తమ్‌ను పరీక్షించిన ఆర్ఎన్ ఠాగూర్ ఆస్పత్రి వైద్యులు.. మార్చిలో శస్త్ర చికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఉత్తమ్ తల్లి నుంచి అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని భావించారు. అయితే అప్పుడే కరోనా లాక్డౌన్ అమల్లోకి రావడంతో అది కాస్త వాయిదా పడింది. (ఊరట : 63 శాతానికి పెరిగిన రికవరీ రేటు) ఆ తర్వాత కొద్ది రోజులకు అత్యవసర చికిత్సలకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వడంతో.. ఉత్తమ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే సమయంలో తల్లి కొడుకులకు కరోనా సోకడంతో వారిలో ఆందోళన మొదలైంది. కరోనా సోకినవారిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఆర్ బంగూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ కోలుకున్న తర్వాత జూన్ 12 తిరిగి ఆర్ఎన్ ఠాగూర్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ వైద్యులు వారిని 20 రోజులకు పైగా క్వారంటైన్లో ఉంచారు. ఆ తర్వాత మరో రెండు సార్లు వారిద్దరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారు పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారని తెలిశాక.. కిడ్నీ మార్పిడి చేశారు. ఆపరేషన్ తర్వాత తల్లికొడుకుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఉత్తమ్ బాగానే ఉన్నాడని.. తమ అంచనాలకు అనుగుణంగా కోలుకుంటున్నాడని తెలిపారు. (ఫేస్బుక్ బ్యాన్: కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి) -
‘కిడ్నీ డోనర్స్–బయ్యర్స్’పేరుతో వెబ్సైట్
నేరేడ్మెట్: కిడ్నీ విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా, గోవిందనగరం(అంబసముద్రం– తేని)కి చెందిన దీనదయాలన్ సూర్యాశివరామ్ శివ ( ‘కిడ్నీ డోనర్స్–బయ్యర్స్’పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారు కాంట్రాక్ట్ చేస్తే తాను కిడ్నీ ఫెడరేషన్లో ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకునేవాడు. కిడ్నీ విక్రయించడానికి ఆసక్తి ఉన్న వారు అతడిని సంప్రదించగా ముందుగా ఫెడరేషన్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. ఇందుకు గాను తన ఖాతాలో రూ.15వేలు డిపాజిట్ చేయించాలని కోరేవాడు. అనంతరం వారి ఆధార్, పాన్, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించే అతను ఆపరేషన్‌కు ముందు ఒప్పందం ప్రకారం 50శాతం డబ్బులు, తరువాత 50శాతం డబ్బులు చెల్లిస్తారని బాధితులను నమ్మించేవాడు. నకిలీ క్లయింట్ల జాబితాను తయారు చేసి, రూ.కోటి తన ఖాతాలో జమ అవుతున్నట్లు వచ్చిన నకిలీ ఎస్ఎంఎస్లను దాతల ఫోన్లకు పంపేవాడు. ఈ మేరకు ఫెడరేషన్ పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా దాతలకు పంపించి నమ్మించేవాడు. పలువురిని నుంచి ఫీజుల పేరుతో ఖాతాల్లో నగదు జమ చేయించు కున్న అనంతరం వారి ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేవాడు. అతడి చేతిలో మోసపోయిన బాధిడుతు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ వివరాల ఆధారంగా నిందితుడిని నేరేడ్మెట్లో అరెస్టు చేశారు. అతడి నుంచి నకిలీ పత్రాలతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అవయవదానం చేయడానికి అనేక నిబంధనలు, చట్టాలు ఉన్నాయని, ఆన్లైన్లో ప్రకటనలు చూసి మోస పోవద్దని సీపీ సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు రివార్డులను ప్రకటించారు. -
ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. ఇప్పుడేమో..
స్మార్ట్ఫోన్లలో ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్య కోకొల్లలు. చైనాకు చెందిన వాంగ్(17) అనే టీనేజర్ కూడా ఈ కోవకు చెందిన వాడే. ఐఫోన్ కొనాలనే పిచ్చితో కిడ్నీ అమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం చేసిన తప్పిదానికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటున్నాడు. రోజూ డయాలసిస్ చేస్తేనే బతుకుతాడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాంగ్‌కు ఐఫోన్ వాడాలనే కోరిక ఉండేది. అయితే తన దగ్గర అంత డబ్బులేకపోవడంతో కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 2012లో.. 3200 డాలర్లకు(సుమారు 2,24, 000 రూపాయలు) ఓ వ్యక్తి అతడి కిడ్నీని కొనుగోలు చేశాడు. దీంతో ఐఫోన్ 4 కొనుక్కోవడంతో పాటు కుటుంబ అవసరాల కోసం మిగిలిన డబ్బును ఖర్చు చేశాడు. అయితే కొన్ని వారాలుగా అతడి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లగా.. మరో కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకి పాడైపోయిందనే విషయం బయటపడింది. దీంతో ప్రతిరోజూ డయలాసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. కొడుకు బతికించుకునే దారి కనిపించడం లేదంటూ వాంగ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాకుండా వాంగ్ ఆపరేషన్ వెనుక కిడ్నీ రాకెట్ ముఠా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. కాగా ఐఫోన్ కోసం ఇలా ప్రాణాలు తెచ్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఐఫోన్ 4 కొనివ్వలేదని 2011లో చైనాకు చెందిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
అమ్మ కాదంది...అత్తమ్మ ఆదుకుంది
అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పిన వైనమిది. కుటుంబాల్లో సాధారణంగా అత్తాకోడళ్లది ఉప్పు-నిప్పు సంబంధం అన్న పాత భావనను తుడిచేశారు రాజస్థాన్‌కు చెందిన అత్తాకోడళ్లు గనీదేవి(60), సోనికా(32). ముఖ్యంగా ప్రాణాపాయస్థితిలో ఉన్న సోనికాను ఆదుకునేందుకు స్వయానా రక్తసంబంధీకులు కూడా నిరాకరించిన సందర్భంలో ఆమె అత్తగారు చూపించిన ఔదార్యం, ధైర్యం ఆదర్శంగా నిలిచింది. బార్మర్ జిల్లా గాంధీనగర్ నివాసి సోనికాకు రెండు మూత్రపిండాలు పాడైపోయాయి. ఆమె ఆరోగ్యం మూత్రపిండ మార్పిడి తప్ప వేరేమార్గం లేదని ఢిల్లీలోని ఆసుపత్రి వైద్యులు తేల్చారు. దీర్ఘకాలంపాటు డయాలసిస్ సాధ్యపడదు కాబట్టి, మూత్రపిండ మార్పిడి చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని సూచించారు. దీంతో కోడలు ప్రాణాన్ని కాపాడేందుకు అత్తగారు గనీదేవి ముందుకు వచ్చారు. ముఖ్యంగా సోనికా తల్లి భాన్వరి దేవితో పాటు, సోదరుడు, తండ్రి కూడా కిడ్నీదానం చేయడానికి నిరాకరించారు. దీంతో సోనికాను కూతురిగా భావించిన అత్తగారు గనీ దేవి తన మూత్రపిండాన్ని దానం చేయడానికి అంగీకరించారు. సెప్టెంబర్ 13న ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం సోనికా పూర్తిగా కోలుకుంది. తనకు పునర్జన్మ ప్రసాదించిన అత్తమ్మకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. అటు తన తల్లి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడంతో సోనికా ఇద్దరు కుమార్తెలు కూడా సంతోషంగా ఉన్నారు. -
11 నెలల చిన్నారి అవయవదానం
చండీగఢ్: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో బతికే అవకాశంలేని 11 నెలల చిన్నారి కిడ్నీలను ఓ వ్యక్తికి అమర్చారు. నేపాల్‌కు చెందిన దంపతులు 11 నెలల వయసున్న తమ బాబుతో కలసి చండీగఢ్‌లో ఉంటున్నారు. జూలై 6న పిల్లాడు ఊయల నుంచి కిందపడడంతో తలకు దెబ్బతగిలి స్పృహ కోల్పోయాడు. చికిత్స కోసం పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. పిల్లాడు బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల అంగీకారంతో పిల్లాడి 2 కిడ్నీలను మరో వ్యక్తికి ఆపరేషన్‌చేసి అమర్చారు. ఆస్పత్రి చరిత్రలో అవయవదానం చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా ఈ పిల్లాడు నిలిచాడు. కిడ్నీలను చిన్నారులకే అమర్చాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఓ రోగితో బాలుడి కిడ్నీలు మ్యాచ్ కావడంతో ఆ వ్యక్తికే అమర్చారు. -
సినీ నటుడు బాలాజీని విచారించిన పోలీసులు
సాక్షి, బంజారాహిల్స్: తన భార్యకు కిడ్నీ ఇచ్చిన తనకు ఎలాంటి చికిత్స చేయించకుండా బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న సినీ నటుడు బాలాజీపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ నిమిత్తం బా లాజీని స్టేషన్‌కు పిలిపించారు. కిడ్నీ మార్పిడి, బాధితురాలి నుంచి కిడ్నీ సేకరణ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. తాము చట్ట ప్రకార మే లక్ష్మి నుంచి కిడ్నీని తీసుకున్నామని అందుకు తగిన డాక్యుమెంట్లను అందజేశారు. మానవతా దృక్ఫథంతోనే ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. కిడ్నీ తీసుకునే ముందు ఆరుగురు డాక్టర్ల బృందం సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిపారు. తనకు రూ. 20 లక్షలు ఇస్తామని, తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు సిని మాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పినందునే తాను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని భాగ్యలక్ష్మి తెలిపింది. తనకు రావాల్సిన డబ్బుల విషయమై ఫోన్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై నటి శ్రీరెడ్డితో కలిసి మానవ హక్కుల కమిషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా?
-
ఒకరికి ఒకరు
ఈ జంట లలితమనోహరం ప్రాంతాలు, మతాల హద్దులు చెరిపి ఒక్కటయ్యారు జబ్బున పడ్డ భర్తకు అన్నీ తానైన భార్య కిడ్నీ దానం చేసి ప్రాణం నిలిపిన త్యాగం హైదరాబాద్: ప్రేమంటే ఆకర్షణ కాదు.. అవసరం అంతకంటే కాదు.. ప్రేమంటే ఓ నమ్మకం... ఓ బాధ్యత.. గౌరవం.. వెలకట్టలేని త్యాగం! ముప్పై ఆరేళ్ల క్రితం రెండు హృదయాల మధ్య చిగురించిన ఆ ప్రేమ కేవలం సుఖాల్లోనే కాదు పుట్టెడు కష్టాల్లోనూ తోడుగా నిలిచింది. తల్లి జన్మనిస్తే.. మృత్యువుతో పోరాడుతున్న భర్తకు ఆమె పునర్జన్మనిచ్చింది. నేటితరం ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది!! ఆయనది దక్షిణం.. ఆమెది ఉత్తరం.. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ బృందావన్ కాలనీకి చెందిన ఎన్.మనోహరన్, జయలలితల ప్రాంతాలే కాదు.. మతాలు కూడా వేర్వేరు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం రిటైరయ్యారు. ఈయన పూర్వీకులు తమిళనాడులోని మదురైకి చెందినవారు. తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ వచ్చి తిరుమలగిరిలో స్థిరపడ్డారు. జయలలిత స్వస్థలం ఢిల్లీ. ఆమె తల్లిదండ్రులూ హైదరాబాద్ తిరుమలగిరిలోని మనోహరన్‌కు చెందిన ఇంట్లో అద్దెకు దిగారు. అద్దె కోసం వెళ్లి ప్రేమలో.. మనోహరన్ తల్లి ఆర్మీలో 4వ తరగతి ఉద్యోగం చేసేది. కొడుకుతో కలసి మిలట్రీ క్వార్టర్స్‌లో ఉండేది. ఓ రోజు మనోహరన్ తిరుమలగిరిలోని సొంతింటికి అద్దె కోసం వెళ్లాడు. అక్కడ జయలలిత తారసపడింది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను చూసేందుకు మిలట్రీ క్వార్టర్స్ నుంచి రోజూ సాయంత్రం సొంతింటికి వచ్చేవాడు. ఓ రోజు ఆమె ముందు ప్రేమను వ్యక్తపరిచాడు. జయలలిత కంగారుపడి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. చివరకు ఆమె మనసులో ప్రేమ చిగురించింది. అలా కొంతకాలం గడిచిపోయింది. చివరకు ఓ రోజు మనోహరన్... జయలలిత తండ్రి వద్దకు వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అందుకు ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుమార్తెను ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేశారు. అయినా జయను పెళ్లి చేసుకోవాలని భావించాడు మనోహరన్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చేయిపట్టుకుని తన తల్లి వద్దకు తీసుకెళ్లాడు. మతాలు వేరు కావడంతో తొలుత ఆమె కూడా వారి పెళ్లికి అంగీకరించలేదు. మనోహరన్ నచ్చజెప్పడంతో చివరకు తల్లి అంగీకరించింది. వీరి పెళ్లిని అడ్డుకునేందుకు జయలలిత తల్లిదండ్రులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు 1982 ఏప్రిల్ 5న ఇద్దరికీ రహస్య ప్రదేశంలో వివాహం జరిగింది. అలా ఒక్కటైన వీరు చాలాకాలం సంతోషంగా ఉన్నారు. వీళ్ల ప్రేమకు ప్రతి రూపంగా ఒక బాబు, ఒక పాప జన్మించారు. అంతలోనే పిడుగుపాటు.. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలోనే పిడుగులాంటి వార్త. మనోహరన్‌కు 2 కిడ్నీలు పాడైనట్లు తేలింది. ఇక తాను ఎక్కువ కాలం బతకనని తెలిసి మనోహరన్ కుంగిపోయాడు. కానీ భార్య జయలలిత మాత్రం భర్తను ఎలాగైనా బతికించుకోవాలని భావించింది. భర్తను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. రక్త సంబంధీకుల కిడ్నీలు మాత్రమే మ్యాచ్ అవుతాయని వైద్యులు చెప్పారు. అయినా వినకుండా తన కిడ్నీని పరీక్షించాల్సిందిగా ఆమె కోరింది. చివరకు వైద్యులు పరీక్షించారు. 14 రకాల టెస్టులు చేశారు. అదృష్టవశాత్తూ ఆమె కిడ్నీ ఆయనకు సరిపోయింది. 1994 జూన్ 4న అపోలో ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. భార్య కిడ్నీ భర్తకు సరిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత మనోహరన్ భార్య ఇచ్చిన కిడ్నీతోనే జీవిస్తున్నారు. భార్య కూడా ఒకే కిడ్నీతో జీవిస్తోంది. ఇటీవల మనోహరన్‌కు గుండెపోటు వచ్చింది. ఇక బతకనేమోననుకున్న భర్తకు బాసటగా నిలిచింది జయ. ధైర్యం చెప్పి బైపాస్ సర్జరీ చేయించింది. ఇలా ప్రతి సందర్భంలో అండగా నిలిచి.. ప్రేమను మాత్రమే కాదు జీవితాన్నీ పంచుతోంది. ఇప్పుడు మనోహరన్ వయసు 63. జయకు 56 ఏళ్లు. వీరిద్దరి పిల్లలు కూడా ప్రేమ వివాహాలే చేసుకోవడం విశేషం. ఆమె లేనిదే నేను లేను: మనోహరన్ మృత్యువుతో పోరాడుతున్న సమయంలో ఆమె నాకు అండగా నిలిచింది. కిడ్నీ దానం చేసి మళ్లీ ఊపిరిపోసింది. ఆమె త్యాగం మర్చిపోలేనిది. వెలకట్టలేనిది. ఏం చేసినా ఆమె రుణం తీర్చుకోలేను. ప్రేమించడం తప్పు కాదు.. ప్రేమను నిలబెట్టుకోవడంలోనే గొప్పతనం దాగి ఉంది. కానీ నేటి ప్రేమికుల్లో చాలా మంది గిఫ్ట్‌లు, టైంపాస్ కోసం ప్రేమను వాడుకుంటున్నారు. ఇది బాధాకరం. ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా?: జయలలిత ఇతరులను ఇష్టపడితే వారి సుఖంలోనే కాదు కష్టాల్లో కూడా పాలుపంచుకోవాలి. నా కోసం ఆయన ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఆయన కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ప్రేమించడం తప్పు కాదు దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. అందరి జీవితాల్లాగే మా మధ్య కూడా అప్పుడప్పుడు చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా సర్దుకుపోతాం. మా పిల్లలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. -
మనిషే గెలిచిన వేళ..
కొట్టాయం: మతాలకు కాదు మనిషికే విలువ ఇవ్వాలని నిరూపించాడు ఓ బిషప్. కళ్లకు కనిపించని మతం కన్న.. కష్టాల్లో కళ్లముందే కదలాడుతున్న సాటిమనిషిని ఆదుకోవడమే ఓ మనిషిగా ప్రథమ కర్తవ్యం అని అని స్పష్టంగా చెప్పాడాయన. కేరళలో ఓ కాథలిక్ చర్చికి బిషప్ గా పనిచేస్తోన్న జాకబ్ మురికాన్ అనే వ్యక్తి ఓ ముప్పై ఏళ్ల హిందూ యువకుడికి తన కిడ్నీ దానం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని గత శుక్రవారం అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. 'ఒక బిషప్ గా పనిచేస్తూ ఒకరి జీవితాన్ని కాపాడేందుకు తన మూత్రపిండాన్ని దానంగా ఇవ్వడం బహుషా చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యి ఉండొచ్చు. సూరజ్ చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. అతడి కుటుంబానికి అతడే దిక్కు. భార్యను తల్లిని తనే చూసుకోవాలి. నాలుగేళ్ల కిందటే తన తండ్రిని కోల్పోయాడు. అతడి గురించి తెలుసుకున్న బిషప్ తన కిడ్నీని దానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ జూన్ 1న ఎర్నాకుళంలోని లేక్‌షోర్ ఆస్పత్రిలో జరుగుతుంది' అని కిడ్నీ ఫెడరేషన్ చైర్మన్ ఫాదర్ డేవిస్ చిరమాల్ అన్నారు. -
కిడ్నీ దానాలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అవయవదానాలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. మూత్రపిండాల(కిడ్నీల) దానం ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ శుక్రవారం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఆ మేరకు నోటో(నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్) అధికారిక వెబ్ సైట్ www.notto.nic.in లో సంపూర్ణ వివరాలను పొందుపర్చింది. కిడ్నీ దానాలకు సంబంధించి సభ్య సమాజం నుంచి మరిన్ని సూచనలు అవసరమని, అట్టి సలహాలను జనవరి 16లోగా వెబ్ సైట్ లో సూచించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. నూతన మార్గదర్శకాల ద్వారా కిడ్నీ గ్రహీతలు, దాతల సంఖ్యలో భారీ తేడాలు, అవయవ మార్పిడిలో రాష్ట్రాల మధ్య సమన్వయలోపం తదితర ఆటంకాలను అధిగమించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ, ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమైన రోగులు ముందుగా www.notto.nic.in ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. అది కూడా ఒక ఆసుపత్రి ద్వారా ఒకసారి మాత్రమే రిజిస్టర్ చేయించుకోవాలి. గ్రహీత వయసు 65 సంవత్సరాలు మించకూడదు. ఆయా రాష్ట్రాలు, లేదా టెరిటరీల పరిధిలోని కిడ్నీ అడ్వయిజరీ కమిటీల ఆమోదంతో రోగుల పేర్లను ఆన్ లైన్ స్క్రోలింగ్ లో ఉంచుతారు. అలాగే దాతల వివరాలను కూడా ఆన్ లైన్ లో ఉంచుతారు. దాతలు, గ్రహీతల మధ్య సమన్వయం మెరుగుపర్చేలా ఒకే ప్రాంతంలో లేదా ఒకే రాష్ట్రం వారికి ముందుగా మార్పిడి అవకశం కల్పిస్తారు. ఒకవేళ సదరు రోగికి తగిన కిడ్నీ దాత ఆ రాష్ట్రంలో లేనట్లయితే మిగతా రాష్ట్రంలోని దాతలను సంప్రదిస్తారు. ఈ వ్యవహారాన్నంతటినీ రొటో నిర్వహిస్తుంది. -
హృదయరాగం!
గ్రేట్ లవ్ స్టోరీస్ * వాళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? * ఎందుకు దగ్గరయ్యారు? * ఎలా ఒక్కటయ్యారు? ‘‘ప్రేమ అంటే జీవితం. ప్రేమకు దూరమైతే...జీవితానికి దూరం అయినట్లే!’’ రకరకాల ఎగ్జిబిషన్లకు వెళ్లడం అంటే కేల్ ఫ్రోలిక్కు ఎంతో ఇష్టం. ఆ ఇష్టానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... కొత్త వస్తువులను చూడవచ్చు. రెండు... కొత్త మనుషులను కలవవచ్చు! ఆరోజు ఒక ఫ్రెండ్‌తో కలసి డాన్విల్లీ టౌన్ (ఇండియానా, అమెరికా)లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్‌కు వచ్చాడు కేల్. అక్కడ అతనికి చెల్సియా అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. కొన్ని గంటల వ్యవధి లోనే వారి చిరు పరిచయం గాఢ పరిచయమై, అది మరింత గాఢ స్నేహంగా మారింది. ‘‘ఇంత చలాకీగా ఎలా ఉండగలుగు తున్నారు? ఆ రహస్యమేదో నాకు కూడా చెబితే రుణపడి ఉంటాను’’ అంటూ చిన్నగా నవ్వింది చెల్సియా. ‘‘ఎందుకంటే... కొద్దిరోజుల్లోనే నేను చనిపోతున్నాను కాబట్టి’’ అన్నాడు కేల్. ఉలిక్కిపడింది చెల్సియా.‘‘అదేంటి అలా అన్నావు?’’ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘నేను తమాషా కోసం అనలేదు. నిజమే చెబుతున్నాను. నా కిడ్నీలు పాడై పోయాయి. ఎంత త్వరగా కిడ్నీలు మారిస్తే అంత మంచిది. లేకపోతే చాలా కష్టం అన్నారు డాక్టర్లు. చాలా కష్టం అనే మాటను డాక్టర్ల నోటి నుంచి వినడం ఇది రెండోసారి. మా నాన్న చనిపోవడానికి కొంత కాలం ముందు కూడా ఇలాంటి మాటే విన్నాను. నేను కూడా చని పోతానేమో’’ గంభీరంగా అన్నాడు కేల్. ‘‘ఛ... అలా అనవద్దు. నువ్వు నిండు నూరేళ్లూ బతుకుతావు’’ అంటూ- ‘‘అవునూ... కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఇబ్బంది ఏమిటి? డబ్బుల సమస్యా లేక డోనర్స్ ఎవరూ లేరా?’’ అడిగింది చెల్సియా. ‘‘డబ్బు ఉంది, కిడ్నీ దానం చేయడానికి బంధుమిత్రులు రెడీగా ఉన్నారు. కానీ మ్యాచ్ కావడం లేదు. దేవుడు ఇంకా దయ చూపలేదు’’ కాస్త బాధగా అన్నాడు కేల్. ‘‘అయితే నేను ఇస్తాను..’’ అంది చెల్సియా. గట్టిగా నవ్వాడు కేల్. ‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అడిగింది. ‘‘చెల్సియా... మనం ఫ్రెండ్స్‌గా మారి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదని గుర్తుంచుకో...’’ అన్నాడు కేల్. ‘‘స్నేహాన్ని కాలంతో కొలవకు బాస్’’ అంది చెల్సియా అందంగా నవ్వుతూ. చెల్సియా స్నేహంలో మునుపెన్నడూ లేని కొత్త జీవితాన్ని చూశాడు కేల్. ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది! అవి కేవలం ఒక అందమైన అమ్మాయి పెదాల మీద మెరిసే మాటల ముత్యాల్లా ఉండవు. ఆ మాటల్లో ఎంతో ధైర్యం ఉంటుంది. జీవనోత్సాహం ఉంటుంది. ‘‘ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా’’ అరిచింది చెల్సియా తల్లి. కేల్కు కిడ్నీ దానం చేస్తానని చెల్సియా అనడమే అందుకు కారణం. అయితే చెల్సియా తల్లి కోపానికి వెనక్కి తగ్గలేదు. తమ స్నేహం గురించి చెప్పింది, స్నేహితుడి నిస్సహాయత గురించి చెప్పింది. ఎట్టకేలకు ఒప్పించింది. ఆరు నెలల తరువాత ఆపరేషన్‌కు రెడీ అయింది. కేల్ కదిలిపోయాడు. వద్దని ఎన్నో విధాలుగా వారించాడు. కానీ చెల్సియా వినలేదు. కానీ దేవుడు వాళ్ల ప్రార్థన విన్నాడు. చెల్సియా కిడ్నీ కేల్కు మ్యాచ్ అయింది. కిడ్నీ మార్పిడి విజయవంతం అయింది. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పింది చెల్సియా. కేల్ మాత్రం తన ముందున్న దేవతకు కృతజ్ఞతలు చెప్పాడు. కన్నీరు ఆగిపోయింది. కథ మాత్రం ఇక్కడితో ఆగిపోలేదు. త్యాగంతో బలపడిన వారి కథ... ఒక అందమైన ప్రేమకథగా మారిపోయింది. ‘‘చెల్సియా.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టమైతే...’’ కేల్ నోటి నుంచి వచ్చిన వాక్యం పూర్తి కానే లేదు-‘‘మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం’’ అంది చెల్సియా ఆనందంగా. వాళ్లు మొన్న స్నేహితులు. నిన్న ప్రేమికులు. ఈరోజు భార్యాభర్తలు! -
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!
కోడలికి కిడ్నీ దానం చేసిన అత్త న్యూఢిల్లీ: అత్తలందరూ కఠిన హృదయులు కాదని ఆమె నిరూపించింది. ఆపదలో ఉన్న కోడలిని అమ్మకంటే మిన్నగా ఆదుకుని ప్రాణం పోసింది! తొలుత కిడ్నీ ఇస్తానన్న ఆ కోడలి అమ్మ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గగా, అత్త నేనున్నానంటూ ముందుకొచ్చి కిడ్నీ దానం చేసింది. మనసు కదిలించే ఈ ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కిడ్నీ పాడవడంతో బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. కిడ్నీ మార్చాలని వైద్యులు నిర్ణయించారు. కవిత పుట్టింటి, మెట్టినింటి వారికి అదొక సవాలైంది. చివరికి ఆమె తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. సర్జరీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు నిమిషంలో కవిత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కవిత అత్త విమల(65) ‘నేను కిడ్నీ ఇస్తాను’ అంటూ ముందుకొచ్చింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు విమలకు పరీక్షలు జరిపారు. ఆమె కిడ్నీ కవితకు సరిపోతుందని నిర్ధారించారు. గత నెల 23న విమల కిడ్నీని కవితకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయిందని, అత్తాకోడళ్లు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
ప్రాణం నిలుపని కిడ్నీ దానం
రెండు కిడ్నీలూ చెడిపోయిన భర్తను బతికించుకోవాలని ఎంతగానో ఆరాటపడి ంది. ఎలాగైనా భర్త ప్రాణాలు కాపాడాలని భావించి తన రెండు కిడ్నీలలో ఒక దానిని భర్తకు ఇచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. భర్త ప్రాణం దక్కలేదు. ఆమె దాతృత్వం ఫలించలేదు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. లావేరు: మండలంలో ని తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల సూర్యనారాయణ సన్నకారు రైతు. ఉదయం నుంచి పొద్దుపోయేవరకు పొలంపనుల్లో నిమగ్నమయ్యేవాడు. పంటలపై వచ్చిన ఆదాయంతో కుటుం బాన్ని పోషించేవాడు. ఆదర్శరైతుగా పనిచేస్తూ గ్రామస్తులకు పంటల సాగుపై విలువైన సూచనలు అందించేవాడు. అయితే, 2013వ సంవత్సరంలో తరచూ జ్వరం రావడంతో ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించా డు. అక్కడి వైద్యులు పలు వైద్యపరీక్షలు చేసిన అనంతరం రెండు కిడ్నీలు పాడైనట్టు గుర్తించారు. కిడ్నీ అమర్చితే తప్ప బతకడం కష్టమని చెప్పారు. ఎవరైనా కిడ్నీలు దానం చేసేందుకు ముందుకు వస్తే బతికించవచ్చన్నారు. దీంతో ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేని భార్య సుశీల తన కిడ్నీ భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు సుశీల కిడ్నీ భర్తకు పనికి వస్తుందని నిర్ధారించారు. 2014, ఫిబ్రవరి 14న ఆపరేషన్ చేసి సుశీల కిడ్నీని సూర్యనారాయణకు అమర్చారు. కిడ్నీ అమర్చిన తరువాత కొద్ది రోజులు వరకూ సూర్యనారాయణ ఆరోగ్యం బాగుంది. ఇక పర్వాలేదని, భర్త కోసం భార్య సుశీల చేసిన దాతృత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి సూర్యనారాయణ ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకపోయింది. చివరకు సోమవారం(ఈ నెల 23న) తనువు చాలించడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తను, పిల్లలు ఏ పాపం చేశారంటూ రోది స్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మృతునికి భార్యతో పాటు కుమారుడు నవీన్, కుమార్తె సుష్మితలు ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, దన్నాన రాజినాయుడు, దేశెట్టి తిరుపతిరావు, పిల్లా రాములు మంగళవారం సూర్యనారాయణ భార్య, పిల్లలను పరామర్శించారు. -
భర్తల కోసం భార్యల పరస్పర కిడ్నీ దానం
న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధి కారణంగా మృత్యువుకు చేరువైన తమ భర్తలను కాపాడుకునేందుకు ఇద్దరు భార్యలు పరస్పరం కిడ్నీదానం చేశారు. దీంతో వారి భర్తలకు పరస్పర కిడ్నీ మార్పిడి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగింది. బొకారోలోని సెయిల్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎస్బీ రామ్(61), ఎన్డీఎంసీకి చెందిన సీనియర్ అధికారి శాంత్ రామ్(58)లు రెండేళ్ల నుంచి తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల మూత్రపిండాలు మార్పిడి చేసేందుకు వీలుకాకపోవడం, తగిన దాతలు కూడా దొరకకపోవడంతో రెండేళ్లుగా వారు డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని బీఎల్కే హాస్పిటల్ వైద్యులు ఎస్బీ రామ్, శాంత్ రామ్ భార్యలు ఊర్మిళ, గంగాదేవీలను కలిపి పరిస్థితిని వివరించారు. వారిద్దరూ పరస్పర కిడ్నీదానానికి అంగీకరించడంతో ఒకరి కిడ్నీని మరొకరి భర్తకు ఇటీవల విజయవంతంగా అమర్చారు. వీరిలాగే అందరూ ‘పరస్పర కిడ్నీ మార్పిడి’ పద్ధతికి ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు సూచించారు. -
విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
-
విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు మూత్రపిండాలు ఇప్పిస్తామన్న పేరుతో.. కిడ్నీల రాకెట్ నడిపిస్తున్న ఐదుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఉమాదేవి, నాగసాయి అనే ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఈ నిందితులను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మొత్తం రాకెట్‌కు సాయి అనే వ్యక్తి సూత్రధారి అని, అతడే ప్లాన్ తయారుచేస్తాడని తెలిపారు. అతడే కిడ్నీలు ఎరేంజ్ చేస్తాడని, అతడి ద్వారానే మొత్తం వ్యవహారం నడుస్తుందని అన్నారు. చక్రవర్తి శ్రీనివాస్, బాలాజీ సింగ్ అనే మరో ఇద్దరు కూడా ఈ రాకెట్లో ఉన్నారు. బాలాజీ సింగ్ గతంలో కూడా ఇలాంటి వ్యవహారం నడిపించాడు కాబట్టి అతడికి అనుభవం ఉందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి తన కిడ్నీని రెండు లక్షలకు అమ్మడానికి ముందుకు రాగా, అతడి భార్యగా నాగసాయి అనే మహిళను ప్రవేశపెట్టారు. బాలాజీ సింగ్ మధ్యవర్తిగా ఉండి వీళ్లను తీసుకురావడానికి అతడికి 15 వేల రూపాయలు ఇచ్చేవారు. దీనంతటికీ సాయి సూత్రధారి. కిడ్నీలు దానం చేసే విషయంలో తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల నుంచి కూడా ధ్రువీకరణ అవసరం కాబట్టి, ఎమ్మార్వో, ఆర్డీవోల సంతకాలను వేరువేరు వ్యక్తులు ఫోర్జరీ చేశారని, అయితే.. ఎమ్మార్వో సంతకాన్ని వాళ్లు గతంలో చూడకపోవడం వల్ల ఏదో చేతికి వచ్చినట్లు గీసేశారని చెప్పారు. ఆస్పత్రి వర్గాలు ఎందుకో అనుమానం రావడంతో ఈ పత్రాలను అటు ఎమ్మార్వోకు, ఇటు పోలీసులకు కూడా పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంతకం తనది కాదని ఎమ్మార్వో చెప్పడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రోగులకు ఈ వ్యవహారం అంతా తెలియదని, ఎంతో కొంత డబ్బు పెడితే కిడ్నీ దొరుకుతుందన్న విషయం తప్ప.. ఇందులో వీళ్లు ఇంత మోసాలకు పాల్పడే విషయం వారికి తెలియదని చెప్పారు. విజయవాడ కేంద్రంగా ఇంతకుముందు కూడా కిడ్నీల వ్యాపారం నడిచేది. అప్పట్లో ఒకసారి ఇది వెలుగులోకి రావడంతో కొన్నాళ్లు ఆగి, మళ్లీ మొదలైంది.