ఏడడుగుల ఈ బంధం ఎన్నెన్నో జన్మల బంధం
గ్రేట్ లవ్ స్టోరీస్
* వాళ్లిద్దరూ ఎక్కడ కలిశారు?
* ఎందుకు దగ్గరయ్యారు?
* ఎలా ఒక్కటయ్యారు?
‘‘ప్రేమ అంటే జీవితం. ప్రేమకు దూరమైతే...జీవితానికి దూరం అయినట్లే!’’ రకరకాల ఎగ్జిబిషన్‌లకు వెళ్లడం అంటే కేల్ ఫ్రోలిక్‌కు ఎంతో ఇష్టం. ఆ ఇష్టానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... కొత్త వస్తువులను చూడవచ్చు.
రెండు... కొత్త మనుషులను కలవవచ్చు! ఆరోజు ఒక ఫ్రెండ్‌తో కలసి డాన్‌విల్లీ టౌన్ (ఇండియానా, అమెరికా)లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్‌కు వచ్చాడు కేల్. అక్కడ అతనికి చెల్సియా అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. కొన్ని గంటల వ్యవధి లోనే వారి చిరు పరిచయం గాఢ పరిచయమై, అది మరింత గాఢ స్నేహంగా మారింది.
‘‘ఇంత చలాకీగా ఎలా ఉండగలుగు తున్నారు? ఆ రహస్యమేదో నాకు కూడా చెబితే రుణపడి ఉంటాను’’ అంటూ చిన్నగా నవ్వింది చెల్సియా. ‘‘ఎందుకంటే... కొద్దిరోజుల్లోనే నేను చనిపోతున్నాను కాబట్టి’’ అన్నాడు కేల్.
ఉలిక్కిపడింది చెల్సియా.‘‘అదేంటి అలా అన్నావు?’’ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘నేను తమాషా కోసం అనలేదు. నిజమే చెబుతున్నాను. నా కిడ్నీలు పాడై పోయాయి. ఎంత త్వరగా కిడ్నీలు మారిస్తే అంత మంచిది. లేకపోతే చాలా కష్టం అన్నారు డాక్టర్లు. చాలా కష్టం అనే మాటను డాక్టర్ల నోటి నుంచి వినడం ఇది రెండోసారి. మా నాన్న చనిపోవడానికి కొంత కాలం ముందు కూడా ఇలాంటి మాటే విన్నాను. నేను కూడా చని పోతానేమో’’ గంభీరంగా అన్నాడు కేల్.
‘‘ఛ... అలా అనవద్దు. నువ్వు నిండు నూరేళ్లూ బతుకుతావు’’ అంటూ- ‘‘అవునూ... కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఇబ్బంది ఏమిటి? డబ్బుల సమస్యా లేక డోనర్స్ ఎవరూ లేరా?’’ అడిగింది చెల్సియా.
‘‘డబ్బు ఉంది, కిడ్నీ దానం చేయడానికి బంధుమిత్రులు రెడీగా ఉన్నారు. కానీ మ్యాచ్ కావడం లేదు. దేవుడు ఇంకా దయ చూపలేదు’’ కాస్త బాధగా అన్నాడు కేల్. ‘‘అయితే నేను ఇస్తాను..’’ అంది చెల్సియా.
గట్టిగా నవ్వాడు కేల్.
‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అడిగింది.
‘‘చెల్సియా... మనం ఫ్రెండ్స్‌గా మారి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదని గుర్తుంచుకో...’’ అన్నాడు కేల్.
‘‘స్నేహాన్ని కాలంతో కొలవకు బాస్’’ అంది చెల్సియా అందంగా నవ్వుతూ.
చెల్సియా స్నేహంలో మునుపెన్నడూ లేని కొత్త జీవితాన్ని చూశాడు కేల్. ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది! అవి కేవలం ఒక అందమైన అమ్మాయి పెదాల మీద మెరిసే మాటల ముత్యాల్లా ఉండవు. ఆ మాటల్లో ఎంతో ధైర్యం ఉంటుంది. జీవనోత్సాహం ఉంటుంది.
‘‘ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా’’ అరిచింది చెల్సియా తల్లి. కేల్‌కు కిడ్నీ దానం చేస్తానని చెల్సియా అనడమే అందుకు కారణం. అయితే చెల్సియా తల్లి కోపానికి వెనక్కి తగ్గలేదు. తమ స్నేహం గురించి చెప్పింది, స్నేహితుడి నిస్సహాయత గురించి చెప్పింది. ఎట్టకేలకు ఒప్పించింది. ఆరు నెలల తరువాత ఆపరేషన్‌కు రెడీ అయింది. కేల్ కదిలిపోయాడు. వద్దని ఎన్నో విధాలుగా వారించాడు. కానీ చెల్సియా వినలేదు. కానీ దేవుడు వాళ్ల ప్రార్థన విన్నాడు. చెల్సియా కిడ్నీ కేల్‌కు మ్యాచ్ అయింది. కిడ్నీ మార్పిడి విజయవంతం అయింది. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పింది చెల్సియా. కేల్ మాత్రం తన ముందున్న దేవతకు కృతజ్ఞతలు చెప్పాడు.
కన్నీరు ఆగిపోయింది. కథ మాత్రం ఇక్కడితో ఆగిపోలేదు. త్యాగంతో బలపడిన వారి కథ... ఒక అందమైన ప్రేమకథగా మారిపోయింది. ‘‘చెల్సియా.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టమైతే...’’ కేల్ నోటి నుంచి వచ్చిన వాక్యం పూర్తి కానే లేదు-‘‘మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం’’ అంది చెల్సియా ఆనందంగా. వాళ్లు మొన్న స్నేహితులు. నిన్న ప్రేమికులు. ఈరోజు భార్యాభర్తలు!