Great Love Stories
-
ప్రేమ కానుక
గ్రేట్ లవ్‌స్టోరీస్ ప్రేమ అంటే ఆనందం మాత్రమే కాదు నిత్యచలన సంగీతం. అబ్బురపరిచే అద్భుతం. అది సరికొత్త ఊహాలోకాలకు ప్రాణం పోస్తుంది. ఊహకు కూడా అందని విషయాలను నిజం చేసి ఆహా అనిపించి ఆశ్చర్యపరుస్తుంది... దీనికి నిలువెత్తు ఉదాహరణ అన్నా, బోరిస్ల ప్రేమకథ! బొరొయంక... రెబ్రింక్స్కై(రష్యా) జిల్లాలోని అందమైన గ్రామీణ ప్రాంతం. సుదీర్ఘ కాలం తరువాత సొంత ఊరుకు వచ్చింది అన్నా. తన కుటుంబం ఒకప్పుడు నివసించిన ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంట్లో ఆమెను రకరకాల జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఆ ఇంట్లోనే తన కలల రాకుమారుడు బోరిస్ గురించి తీయటి కలలు కన్నది. ఆ ఇంట్లోనే తన భవిష్యత్ చిత్రపటానికి ఇంద్రధనస్సుల రంగులు అద్దుకున్నది. ఆ ఇంట్లోనే తమ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. బోరిస్ రెడ్ ఆర్మీలో పనిచేసేవాడు. మరోవైపు అన్నా కుటుంబాన్ని ప్రభుత్వం ‘వర్గ శత్రువు’గా ప్రకటించింది. దీంతో సొంత ఊళ్లోనే అన్నా కుటుంబం అనాథ అయిపోయింది. అన్నాను పెళ్లి చేసుకోవద్దని సన్నిహితులు వారించినా వెనక్కి తగ్గలేదు బోరిస్. పై అధికారుల ఆదేశాల మేరకు పెళ్లైన మూడు రోజులకే రెడ్ ఆర్మీలో విధులు నిర్వహించడానికి బయలుదేరాడు బోరిస్. అన్నా కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఇక బోరిస్ మనసులో అయితే కన్నీటి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ‘ఈ ఎడబాటు కోసమేనా నేను పెళ్లి చేసుకుంది’ అనే చిన్నపాటి వైరాగ్యం ఒకవైపు కలవర పెట్టింది. అంతలోనే ‘ఈ ఎడబాటు ఎన్ని రోజులని? త్వరలోనే మేమిద్దరం కలుసుకుంటాం’ అనే ఆశ మరోవైపు ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆ ఆశ... నిజం కావడానికి అక్షరాలా అరవై సంవత్సరాలు పట్టింది! పెళ్లి తరువాత మూడో రోజు రెడ్ ఆర్మీలో తిరిగి విధులు నిర్వహించడానికి వెళ్లిన బోరిస్ కొద్దికాలం తరువాత అన్నాను చూడడానికి ఊరికి వచ్చాడు. ఎంతో ఆశతో వచ్చిన బోరిస్‌కు పిడుగుపాటులాంటి వార్త తెలిసింది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక అన్నా కుటుంబం... ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని. అన్నా కోసం ఎన్నో చోట్ల వెదికాడు బోరిస్. ‘‘నువ్వు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నావు. అన్నా కుటుంబాన్ని ప్రభుత్వం చంపేసి ఉంటుంది’’ అని కొందరు నిరాశ పరిచారు. ‘‘అలా ఎప్పుడూ జరగదు... అన్నా ఖచ్చితంగా బతికే ఉంది’’ అనేవాడు బోరిస్. అలా ఆశాజనక ఊహలతో అన్నా కోసం సంవత్సరాల నుంచి వేచి చూస్తూనే ఉన్నాడు బోరిస్. 2008 సంవత్సరం. ఊరు గుర్తుకు వచ్చి, అంతకంటే ఎక్కువగా అన్నా గుర్తుకు వచ్చి బొరొయంక వచ్చాడు బోరిస్. అమ్మానాన్నల సమాధుల దగ్గర నివాళులు అర్పించి అన్నా కుటుంబం నివసించిన ఇంటిని చూడడానికి బయలుదేరాడు. చిత్రమేమిటంటే, సైబిరియాలో ప్రవాసంలో ఉంటున్న అన్నా ఇదే సమయంలో ఊరికి వచ్చింది. పాత ఇంట్లోనే ఉంది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు కావడంతో బయటికి వచ్చింది అన్నా. కారు నుంచి దిగివస్తున్న వ్యక్తి బాగా పరిచయం ఉన్నవ్యక్తిలా కనిపిస్తున్నాడు. బోరిస్ అయితే కాదు కదా...! ‘‘నా పేరు బోరిస్...’’ అని తనను తాను పరిచయం చేసుకోబోతున్నాడు బోరిస్.‘కలా? నిజమా?’ అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది అన్నా. అంతలోనే తేరుకొని ‘‘బోరిస్... నేను అన్నా...’’ అందో లేదో బోరిస్ ఆనందానికి అంతు లేదు. ‘‘ఈ క్షణం కోసమే నేను బతికుంది. దేవుడు నాకు పెద్ద ప్రేమకానుక ఇచ్చాడు’’ అన్నాడు. దుఃఖంతో చాలాసేపటి వరకు వారి మధ్య మాటలు ఘనీభవించాయి. నరక ప్రాయమైన ఏకాంత దీవిలో నుంచి ఇద్దరూ బయటికి వచ్చారు. ఆనందంతో ఇద్దరూ మరోసారి ఒక్కటయ్యారు. -
హృదయంతో... నవీన ఉదయంతో!
గ్రేట్ లవ్‌స్టోరీస్ ఎప్పుడో చిన్నప్పుడు నానమ్మ ఏవో జాన పద కథలు చెబుతుంటే అడిగింది సమియా- ‘‘మనం ఊళ్లో ఎందుకుంటున్నాం? అడవుల్లో ఎందుకుండట్లేదు? అక్కడ రకరకాల పక్షులతో ఆడుకోవచ్చు కదా’’ అని. ‘‘నువ్వన్నది నిజమే అనుకో, కానీ అడవిలో అందమైన పిట్టలే ఉండవు. క్రూరమృగాలూ ఉంటాయి. అవి ఏ క్షణాన దాడి చేసి చంపేస్తాయో తెలియదు. అందుకే మనం ఊళ్లలోనే ఉంటాం. ఇక్కడ మనిషికి మనిషి ఆసరా. ఒకరు కష్టాల్లో ఉంటే ఇంకొకరు సహాయం చేస్తారు’’ అని చెప్పింది నానమ్మ. అఫ్గానిస్తాన్‌లోని సంచారక్ జిల్లాలోని సర్-ఎ-పల్ అనే ఊరు సమియాది. ఇప్పుడా ఊరు ఆమెకు ఊరిలా కనిపించ ట్లేదు. మనుషులే క్రూర జంతువులై వేటాడడానికి సిద్ధంగా ఉన్న దట్టమైన అడవిలా భయపెడుతోంది. ఎందుకంటే... ఆరోజు సమియా జీవితంలో చీకటి రోజు. సాయుధులైన ఎనిమిది మంది ఆమెను అపహరించి అత్యాచారం చేశారు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చింది. ఆ రాక్షసులను శిక్షించాలని పోలీసులను ఆశ్రయించాడు సమియా తండ్రి. వాళ్లు పలుకుబడి ఉన్న వాళ్లు కావడంతో పోలీసులు, అధికారులు చేతులెత్తేశారు. మరోవైపు ఊరివాళ్లు సమియాను చిన్నచూపు చూడడం మొదలు పెట్టారు. సూటిపోటి మాటలతో బాధపెట్టడం ప్రారంభించారు. ‘‘ఇక ఈ ఊళ్లో మనం ఉండలేం తల్లీ’’ అని సమియాను కాబూల్‌కు తీసుకెళ్లాడు నాన్న. జీవితం నిస్సారమై... భయ పెడుతూ, బాధపెడుతూ ఉన్న స్థితిలో జోయా పరిచయం సమియాను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘ద రివల్యూషన్ అసోసియేషన్ ఆఫ్ ద వుమెన్ ఆఫ్ అఫ్గానిస్తాన్’ సంస్థ తరపున పని చేస్తున్న జోయా పార్లమెంట్ సభ్యురాలు కూడా. ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచారామె. జోయా దగ్గర బాడీగార్డ్‌గా పని చేస్తున్న ఫరమర్జ్ సమియాను చూశాడు. ఆమె పట్ల జరిగింది విని చలించిపోయాడు. ఆమెను చూస్తేనే అతడి మనసు విచారమయమైపోయేది. ఏదో సాకుతో మాట్లాడేవాడు. కబుర్లతో నవ్వించేవాడు. ‘‘అందరూ ఈయనలాగే ఉంటే ఎంత బాగుండేది!’’ అనుకునేది సమియా. తెలియకుండానే ఫరమర్జ్ను ప్రేమించడం మొదలు పెట్టింది. ఒకరోజు ఆమెలో చిన్న అలజడి... ‘‘నన్ను ఆయన ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరిగే పనేనా? అలాంటప్పుడు ఏవేవో ఊహించుకోవడం ఎందుకు? ఆశలు పెట్టుకోవడం ఎందుకు? భంగపడి బాధపడడం ఎందుకు? ఇప్పు డున్న బాధ చాలు’’ అనుకుంది సమియా. ఒకరోజు సమియాతో ‘‘పెళ్లి చేసుకో మని ఇంట్లో ఒకటే పోరు’’ అన్నాడు ఫరమర్జ. ‘‘చేసుకోవచ్చు కదా’’ అంది నవ్వుతూ సమియా. ‘‘నాకు కూడా చేసు కోవాలనే ఉంది. కానీ నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుందో చెప్పు?’’ అన్నాడు సమియా కళ్లలోకి సూటిగా చూస్తూ. ఫరమర్జ్ ఏం మాట్లాతున్నాడో ఒక్క క్షణం వరకు అర్థం కాలేదు సమియాకి. ‘‘ఏమన్నావు? మరోసారి చెప్పు?’’ అంది నమ్మలేనట్టుగా. ‘‘నీలాంటి అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదు. పెళ్లంటూ చేసుకుంటే నీలాంటి అమ్మాయినే చేసుకుంటాను’’ అన్నాడు ఫరమర్జ్. ఆమెలో ఏదో అలజడి. ‘నాలాంటి అమ్మాయినా, నన్ను కాదా?’ అనుకుంది మనసులో. ఆ మాట అతని మనసుకు వినబడిందో ఏమో... ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు మరుక్షణమే. తక్షణం ఆమె పెదవులపై విరిసిన చిరునవ్వు ఆమె జవాబును చెప్పకనే చెప్పింది. జోయా ఆధ్వర్యంలో వాళ్లిద్దరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ‘సంతోషకరమైన విషయం... నిజమైన స్నేహితుణ్ని కనుక్కోవడం. అంతకంటే సంతోషకరమైన విషయం... నిజమైన స్నేహితుణ్ని భర్తగా పొందడం’ అని పెళ్లికి వచ్చిన ఒక అతిధి అంటుంటే తృప్తిగా నవ్వింది సమియా! -
మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నిన్ను ప్రేమిస్తున్నాను
గ్రేట్ లవ్‌స్టోరీస్ ‘నా కళ్లు నీ కళ్లతో లోకాన్ని చూస్తున్నాయి. నా గుండె నీ గుండె చాటు ప్రేమసవ్వడి అయ్యింది!’ హై-ఫ్లయింగ్ బిజినెస్ ఉమెన్‌గా తన కెరీర్‌తో సంతృప్తిగా, సంతోషంగా ఉంది జోయెన్. సింగపూర్, హాంకాంగ్, ఆస్ట్రేలియా... ఎన్నో దేశాలు తిరిగింది. ‘ఇక తిరిగింది చాలు’ అనుకొని లండన్‌లో ‘మార్కెటింగ్ ఏజెన్సీ’ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో... విధి తనను వెక్కిరించింది. టైప్ 1 డయాబెటిస్తో ముప్ఫై నాలుగో ఏట కంటి చూపును కోల్పోయింది. జోయెన్ లోకం ఒక్కసారిగా చీకటిమయమైపోయింది. ఏ రంగూ, ఏ రూపం కనిపించని శూన్యప్రపంచంలోకి దీనంగా వెళ్లిపోయింది. అయితే అప్పుడప్పుడూ ఆ శూన్యంలో నుంచి కొన్ని నవ్వులు వినిపించేవి. అందుకు కారణం చిన్ననాటి స్నేహితుడు డేవ్. తనని గుర్తు చేసుకుంటే చాలు, ఆమె మనసులో ఆనందాల మల్లెలు పూస్తాయి. తను ఎక్కడుంటే అక్కడ సందడి. నవ్వుల కోలాహలం. అలాంటి వాడి దగ్గర ఒక గంట గడిపినా చాలు, జీవనోత్సాహం ఇంద్రధనుస్సై వెల్లి విరుస్తుంది. అయితే కెరీర్ వేటలో ఎవరి బతుకులు వారివయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఒంటరితనంలో మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నాడు డేవ్. జోయెన్ గురించి తెలిసి ఆమె ఇంటికి వచ్చాడు డేవ్. ఎన్నో రకాలుగా ఆమెకు ధైర్యం చెప్పాడు. చాలాసేపు నవ్వించాడు. కొండలా భారంగా ఉన్న ఆమె మనసు దూదిపింజలా తేలిపోయింది. అన్ని కష్టాలూ నాకే అన్నట్లుగా అలిగిన మనసు ఆహ్లాదపు రెక్కలు తొడుక్కుని తేలియాడింది. ‘‘డేవ్... మళ్లీ ఎప్పుడు వస్తావు?’’ వెళుతున్న డేవ్‌ను అడిగింది జోయెన్. ‘‘ఎప్పుడూ వస్తూనే ఉంటాను’’ అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు డేవ్. ఇచ్చిన మాట తప్పలేదు. ఏ మాత్రం వీలున్నా వచ్చి జోయెన్ను కలిసేవాడు. తన తమ్ముడి బర్త్‌డే వేడుకకు ఆమెను ముఖ్య అతిథిగా పిలిచాడు. ‘‘నా బాల్య స్నేహితురాలు’’ అని అక్కడ అందరికీ పరిచయం చేశాడు. ఒక రోజు ఉన్నట్టుండి... ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను....’’ అన్నాడు. ‘‘ఇప్పటి వరకూ నువ్వు చెప్పిన అన్ని జోకుల కంటే ఇదే పెద్ద జోక్’’ అని బిగ్గరగా నవ్వింది జోయెన్. కానీ ఆ నవ్వులో ఎక్కడో దుఃఖపు జీర! కళ్లలో కనిపించని కన్నీళ్లు!! ‘‘మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ గంభీరంగా అన్నాడు డేవ్. ‘‘ఈ గుడ్డిదాన్ని చేసుకొని ఏం సుఖపడతావు?’’ అంది జోయెన్. ఆమె నోటికి తన చేతిని అడ్డుపెట్టి- ‘‘ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడవద్దు’’ అన్నాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే వారి పెళ్లి ఘనంగా జరిగింది. చూపులేని జోయెన్కు డేవ్ చుక్కాని అయ్యాడు. ఒక ద్వారం మూసిన దేవుడు ఎక్కడో ఒకచోట మరో ద్వారాన్ని తెరిచే ఉంచుతాడట. డేవ్ రూపంలో దేవుడు ఆమెకు కొత్త ద్వారం ఒకటి తెరిచి ఉంచాడు. ఆమె మనో ప్రపంచంలోని ప్రతి దృశ్యం ఇప్పుడు ఆ ద్వారం గుండా కనిపిస్తోంది. -
రుధిర హృదయం
గ్రేట్ లవ్‌స్టోరీస్ బాబిలోన్ చారిత్రక సౌందర్యానికి వన్నె తెచ్చిన వాటిలో కట్టడాలు, కళాకృతులు, నిర్మాణాలు మాత్రమే కాదు... ఒక గొప్ప ప్రేమ కథ కూడా ఉంది. అదే పైరమస్, తిస్బేల ప్రేమకథ. ‘ఇరుగు పొరుగువారు కలిసి మెలిసి ఉండటం, ఒక కుటుంబంలా ఉండటం’ అనేది ఎక్కడైనా సాధ్య పడుతుందేమో కానీ అక్కడ మాత్రం సాధ్యపడదు. బాబిలోన్ నగరంలో ఉన్న ఆ ఇరుగుపొరుగు ఇళ్లలో... ఒక ఇంటి మీద వాలిన కాకి ఇంకో ఇంటి మీద వాలదు. వారి మధ్య తరచూ భగ్గుమనే తగాదాలకు చెప్పుకో దగ్గ బలమైన కార ణాలేవీ లేవు. అయినా వాళ్లు కీచులాడు కుంటూనే ఉండేవారు. చిత్రం ఏమి టంటే, ఆ రెండు ఇళ్లలో ఉండే అమ్మాయి, అబ్బాయి మాత్రం చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవాళ్లు. పెద్దల తగాదాలకు వాళ్లు ఎప్పుడూ విలువ ఇచ్చేవాళ్లు కాదు. వాళ్ల స్నేహాన్ని వదులుకునేవారూ కాదు. వాళ్లే... పైరమస్, తిస్బే. ‘‘మీ తల్లి దండ్రులేమో నిమిషం ఖాళీ దొరికినా కయ్యా నికి కాలు దువ్వుతారు. మీరేమో ప్రాణ స్నేహితుల్లా ఉంటారు’’ అనేవారు పైరమస్, తిస్బేలతో ఊరివాళ్లు. వాళ్ల స్నేహాన్ని చూసి అందరూ ముచ్చట పడేవారు. తిస్బేకు ఏ కష్టం వచ్చినా ‘‘నేనున్నాను’’ అంటూ ముందుకు వచ్చేవాడు పైరమస్. తనకు ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రుల కంటే ముందు పైరమస్‌కు చెప్పుకునేది తిస్బే. కాలక్రమంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. పాత స్నేహం కొత్తగా అనిపించసాగింది. పాత మాటలే కొత్తగా వినిపించసాగాయి. అయితే తిస్బే-పైరమస్ల ప్రేమవ్యవహారం తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దాంతో వారు గట్టిగా తగువులాడుకోవడానికి మరో బలమైన కారణం దొరికింది. ‘‘వాడితో మాట్లాడ్డం కాదు కదా, చూసినా ప్రాణం తీస్తాను’’ అని హెచ్చరించాడు తిస్బే తండ్రి. దాంతో ఇద్దరూ ప్రేమఖైదీలుగా మారిపోయారు. అడుగు తీసి అడుగు వేస్తే ఆంక్షలు. వాటిని ఛేదించలేక సతమతమయ్యేవారు. వాళ్ల రెండు ఇళ్లనూ వేరు చేస్తూ ఒక గోడ ఉంది. ఆ గోడకు ఒక పెద్ద పగులు ఉంది. ఎవరూ చూడనప్పుడు ఆ పగుల్లో నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. ‘‘ఇలా ఎన్ని రోజులు?’’ అని ఒకరోజు అడిగాడు పైరమస్. ‘‘మన పెళ్లి అయ్యేవరకు’’ చిలిపిగా నవ్వి అంది తిస్బే.‘‘అయితే రేపే చేసుకుందాం. మనం ఎప్పుడూ కలుసుకునే నినుసు సమాధి దగ్గరికి వచ్చేయ్’’ అన్నాడు పైరమస్. సరే అందామె. నినుసు సమాధి దగ్గర కంబలి చెట్టు కింద కూర్చుని ప్రియుడి కోసం నిరీక్షిస్తోంది తిస్బే. ఆ నిరీక్షణలో... క్షణమొక యుగంలా ఉంది! గడిచే ప్రతి నిమిషం తమ ప్రేమ జ్ఞాపకాలతో ఆమె మనసు నిండి పోతోంది. అంతలో అడుగుల సడి. ‘పైరమస్ వస్తున్నట్టు న్నాడు’ అంటూ అటు చూసింది తిస్బే. వస్తుంది పైరమస్ కాదు... అసలు మనిషే కాదు... సింహం! ఎక్కడ వేటాడి వస్తోందో... నోరంతా రక్తం! భయంతో పరుగులు తీసింది తిస్బే. ఆ కంగారులో పైట సైతం జారిపోయింది. అలానే వెళ్లి ఒక మాను వెనుక దాక్కుంది. తిస్బే కోసం తెగ తిరిగింది సింహం. ఆమె కనిపించలేదు. కసిగా తన కాలి గోళ్లతో తిస్బే పైటను చీల్చుకుంటూ వెను దిరిగింది. అప్పుడే అక్కడికి వచ్చిన పైరమస్ సింహాన్ని చూశాడు. అతడి గుండెల్లో భయంతో కూడిన అలజడి! ‘నా తిస్బేకు ఏమీ కాలేదు కదా’ అని వడివడిగా కంబలి చెట్టు దగ్గరికి నడిచాడు. తిస్బే పైట చూసి కుప్పకూలిపోయాడు. ‘నా తిస్బేను ఆ సింహం పొట్టన పెట్టుకుంది’ అని రోదించాడు. ఆమె లేని జీవితం తనకు వద్దనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో గుండెల్లో పొడుచుకున్నాడు. కొద్ది క్షణాల తర్వాత అక్కడికి వచ్చింది తిస్బే. రక్తపు మడుగులో ఉన్న పైరమస్ను చూసి విలవిల్లాడి పోయింది. ప్రాణాలతో ఉన్న తిస్బేను చూసి సంతోషంతో పైరమస్ పెదవులు విచ్చుకున్నాయి. కానీ అతని కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. అది తట్టుకోలేని తిస్బే... ‘‘నువ్వు లేని ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఉండలేను’’ అంటూ పైరమస్ గుండెల్లో ఉన్న కత్తిని తీసుకుని పొడుచుకుని ప్రాణాలు విడిచింది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే కంబలి చెట్టు కన్నీరుమున్నీరైంది! -
నీ తోడుగా...
గ్రేట్ లవ్‌స్టోరీస్ ఖీవా (ప్రస్తుతం పాకిస్థాన్‌లోని గుజరాత్ జిల్లాలో ఉన్న ఊరు)లో పొద్దుపోని పిల్ల కవులు సాహిబా మీద రకరకాల పాటలు అల్లి పాడేవారట. ఒకడేమో... ‘డొక్కలు మాడ్చుకొని ఎముకలు తేలిన కరువుసీమ... నీ నవ్వులు విని ఆకాశానికేసి చూసి విన్నావా ఆ నవ్వులు అని అడిగింది. ఆకాశం నీ నవ్వులకు బహుమతిగా వర్షాన్ని ఇచ్చింది’ అని రాస్తే... ఇంకొకడేమో... ‘సూర్యుడిని చూస్తే చాలా అనుమానంగా ఉంది నాకు. రోజూ లోకం కోసం వస్తున్నాడా? నిన్ను చూడ డానికే వస్తున్నాడా?!’ అని రాస్తాడు.సాహిబా ఎక్కడికి వెళితే అక్కడ ఒక అందమైన స్తబ్దత రాజ్యమేలేది. అంగడికి వెళితే... కన్ను తిప్పనీయని ఆమె అందాల మైకంలో పడి ఒక వస్తువుకు బదులు మరొకటి అడిగేవాళ్లు కొనుగోలుదారులు. పప్పు కోసం వచ్చినవాడు ‘ఉప్పు కావాలి’ అని అడిగేవాడు. ఒకడేమో డబ్బులు ఇచ్చి వస్తువులు తీసుకోకుండానే ఆమె అందాన్ని తలచుకుంటూ ఇంటి ముఖం పట్టేవాడు. అంతమంది మతులు పోగొట్టిన అందాలరాశి సాహిబా... మీర్జా ప్రేమలో పడింది. పొడవాటి జుత్తుతో, నవయవ్వన తేజస్సుతో వెలిగిపోయే మీర్జా.. అందంలో సాహిబాకు ఏమాత్రం తీసిపోడు. గుర్రాల్ని దౌడు తీయించడంలో, విలువిద్యలో అతడికి గొప్ప నైపుణ్యం ఉంది. మక్కీ అనే తన గుర్రం మీద రాజకుమారుడిలా వచ్చేవాడు. సాహిబా, మీర్జా ఇద్దరూ ఒకే బడిలో కలిసి చదువుకున్నారు. ఒకరి సంతోషం ఇంకొకరిదై రెట్టింపయ్యేది. ఒకరి దుఃఖం మరొకరిదై సగమయ్యేది. వారి ప్రేమ గురించి ఊరంతా తెలిసిపోయింది. మండిపడ్డాడు సాహిబా తండ్రి. తాహిర్ ఖాన్ అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయిం చాడు. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. తన పెళ్లి గురించిన సమాచారాన్ని మీర్జాకు రహస్యంగా చేరవేసింది సాహిబా. మీర్జా కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమ యంలో ఆ కళ్లు కోపంతో ఎర్రబారాయి. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగడానికి వీలులేదు’ అని పిడికిలి బిగించాడు. తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు కూడా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మొదట బెదిరించారు. ‘మనతో పోలిస్తే వారి బతుకెంత? మన స్థాయికి తగిన అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాం. తనని మర్చిపో’’ అని బతిమాలారు. మీర్జా ఆ బెదిరింపులకు భయ పడలేదు. భావోద్వేగాలకు లొంగిపోలేదు. మీర్జా రాక కోసం ఎదురుచూస్తున్న సాహిబా తన ఇంట్లో ఒక ద్వారాన్ని రహస్యంగా తెరిచి ఉంచింది. ఆ ద్వారం గుండా లోపలికి వచ్చిన మీర్జా... సాహిబాను తనతో పాటు తీసుకెళ్లాడు. ఆమె కనిపించకపోవడంతో ‘ఏదో జరిగింది’ అంటూ సాహిబా సోదరులు కత్తులు, బాణాలతో గుర్రాల మీద బయలుదేరారు. వాళ్లకు మీర్జా- సాహిబాలు గుర్రం మీద వెళ్తూ కనిపించారు. వెంటనే వాళ్లు తమ గుర్రాలను రాక్షస వేగంతో పరుగులు తీయించి, మీర్జా మీద బాణాల వర్షం కురిపించారు. ఒక బాణం సూటిగా పోయి మీర్జా గొంతును చీల్చింది. మరుక్షణం నేల కూలాడు. మరో రెండు బాణాలు అతని గుండెల్లో గుచ్చకున్నాయి. బాధతో విలవిల్లాడాడు. అతడిని కాపాడటానికి రక్షణ వల యంలా నిల్చుంది సాహిబా. బాణాలు ఆమె ఒంటిని చీల్చేశాయి. కానీ వారి ప్రేమను మాత్రం చీల్చలేకపోయాయి. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ... తమ ప్రేమకథను అజరామరం చేసుకుంటూ... ఒక్కటిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారిద్దరూ! గతంలో ఎన్నోసార్లు వెండితెరకు ఎక్కిన మీర్జా-సాహిబాల ప్రేమకథ మరోసారి తెరకెక్కుతోంది. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాల దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ‘మీర్జియా’ పేరుతో తొలిసారి ఓ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం తీస్తున్నాడు. మీర్జా-సాహిబాల ప్రేమకథకు ఇది ఆధునిక రూపం. ఈ సినిమాకు గుల్జార్ స్క్రీన్‌ప్లే రాశారు. -
ఇట్లు నీ ప్రేమికుడు
గ్రేట్ లవ్‌స్టోరీస్ ‘నీ కనురెప్పను తాకి... చినుకు జీవితం ధన్యమైపోయింది. నీ పాదాల్ని తడిమిన మట్టి... కొత్త పరిమళంతో ఊరేగుతోంది.’ తెల్లటి కాగితం మీద ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న అక్షరాలను మురిపెంగా తడిమింది కాంచనమాల. మొయిదీన్ తన కళ్ల ముందున్నట్లే అని పించింది. చిన్నప్పటి నుంచి తనతో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాడు. అతడి గోధుమరంగు కళ్లు, మళ్లీ మళ్లీ వినాలని పించే నవ్వు ఆమెకి చాలా ఇష్టం! కేరళలోని ఇరువజింజి నది ఒడ్డున ఉన్న గ్రామం ‘ముక్కం’. ఇరువజింజి నదే కాంచన-మొయిదీన్‌ల ప్రేమకు సాక్షి. ఒకరోజు... ‘‘కాంచనా... నేను నిన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నాను. నువ్వు డాక్టర్ కాకపోయినా ఫరవాలేదుగానీ కుటుంబ పరువును మంటగలపకు. ఆ ముస్లిం కుర్రాడితో తిరగడం మానెయ్’’ అని కుమార్తెను హెచ్చ రించాడు అచ్యుతన్. ‘‘నీవల్ల బయట తలెత్తుకోలేక పోతున్నానురా’’ అంటూ ముఖం కందగడ్డలా చేసుకుని కొడుకును తిట్టడం మొదలుపెట్టాడు ఉన్నిమొయి. అరవయ్యేళ్ల క్రితం... ఒకబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడితేనే కలికాలం అని బుగ్గలు నొక్కుకునే రోజుల్లో... వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకోవ డమంటే మాటలు కాదు. అందుకే చదువు మాన్పించి కూతుర్ని ఇంటికి పరిమితం చేశాడు అచ్యుతన్. కొడుకును కత్తితో పొడవడానికి సైతం సిద్ధపడ్డాడు ఉన్ని మొయి. అయిన్పటికీ లేఖల రూపంలో వారి ప్రేమ సజీవంగానే ఉంది. ఎట్టకేలకు ఒకరోజు రహస్యంగా కలుసుకున్నారిద్దరూ. రెండు మూడు రోజుల్లో పారిపోయి పెళ్లి చేసుకోవాలను కున్నారు. విషయం అచ్యుతన్‌కు తెలిసి పోయింది. ఈసారి ఆయన ఆగ్రహంతో ఊగిపోలేదు. ‘‘నీ స్వార్థం నువ్వు చూసు కుంటున్నావు. నీ చెల్లెళ్ల భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే వీళ్ల పెళ్లి ఈ జన్మలో జరుగుతుందా!’’ అన్నాడు కన్నీళ్లతో. కరిగిపోయింది కాంచన. చెల్లెళ్ల పెళ్లిళ్లు అయిపోయేవరకు ఇల్లు దాటి బయటికి వెళ్లకూడదనుకుంది. వెళ్లలేదు కూడా! పెళ్లిళ్లు అయిపోయాయి. ‘ఇక నా పెళ్లి వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు’ అనుకున్న కాంచన పెళ్లికి సిద్ధపడింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ తమ్ముడు చనిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోలేక నాన్న గుండెపోటుతో మరణించాడు. మరోవైపు మొయిదీన్ తండ్రి ఉన్నిమొయి చనిపోయాడు. కాలం దొర్లిపోతోంది. మొయిదీన్ జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. బాధ నుంచి ఉపశమనం కోసం సేవా కార్య క్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. కొద్దికాలం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోదామను కున్నారు. పాస్‌పోర్టుల కోసం ప్రయ త్నాలు మొదలెట్టారు. అప్పుడే విధి వారి జీవితంతో మరోసారి ఆడుకుంది. ఓరోజు పడవలో ఊరికి వస్తున్నప్పుడు, పడవ మునిగిపోయి చనిపోయాడు మొయిదీన్. విలవిల్లాడిపోయింది కాంచన. అతడు లేని లోకంలో ఉండలేనంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కానీ చావు కూడా ఆమెను మోసం చేసింది. దాంతో బతకలేక చావలేక అల్లాడిపోయింది కాంచన. ఆమె వేదన గురించి విన్న మొయిదీన్ తల్లి కాంచనను తన ఇంటికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అత్త గారింట్లోనే ఉంటోంది కాంచన. తమ ఊరిలో ‘మొయిదీన్ సేవా మందిర్’ పేరుతో స్వచ్ఛందసేవా సంస్థను ప్రారంభించింది. ఎన్నో రకాలుగా సేవ చేస్తోంది. ఆ సేవా మందిర్‌లో గోడకు వేళ్లాడుతూ కనిపించే మొయిదీన్ నిలువెత్తు చిత్రం... కాంచనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నేటికీ కవిత్వం చెబుతున్నట్లే ఉంటుంది! మొయిదీన్, కాంచనమాలల ప్రేమకథను మలయాళంలో ‘ఇన్ను నింటె మొయిదీన్’ పేరుతో సినిమా తీసి ఘన విజయం సాధించాడు డెరైక్టర్ ఆర్.ఎస్.విమల్. మొయిదీన్‌గా పృథ్వీరాజ్, కాంచనమాలగా పార్వతి నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలే కాదు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. పృథ్వీరాజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. - యాకూబ్ పాషా -
అణువణువూ ఆరోప్రాణమై!
గ్రేట్ లవ్ స్టోరీస్ చైనాలోని షాన్‌డోంగ్ ప్రావిన్స్‌లో ఉన్న చిన్న గ్రామం సుంజియాయు మొత్తం పెళ్లి కళతో సందడిగా ఉంది. అలా అని అక్కడ సామూహిక వివాహాలేమీ జరగడం లేదు. బొగ్గుగనిలో పనిచేసే ‘డూ యున్ఫా’ పెళ్లి మాత్రమే జరుగుతోంది. సాధారణంగా ఒక ఇంట్లో పెళ్లి జరిగితే... ఆ ఇంట్లో మాత్రమే చుట్టాలు పక్కాల సందడి ఉంటుంది. కానీ యున్ఫా పెళ్లికి ఊరు ఊరంతా సందడి నెలకొంది. ఊరి వాళ్లంతా చుట్టాలయ్యారు. ఎందుకంటే అతడు అందరివాడు. మనసున్నవాడు. కొందరు యున్ఫాను సరదాగా ఆట పట్టిస్తున్నారు. కొందరు మాత్రం అతడి గురించి జాలిగా మాట్లాడు కుంటున్నారు. ‘మన యున్ఫా ఉత్త అమాయకుడిలా ఉన్నాడు. సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద తప్ప!’ ‘ఏం అలా అంటున్నావు?’ ‘లేకపోతే ఏంటి? వీడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. వీడికంటే ఒక మెట్టు పైనున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిశ్చింతంగా ఉండొచ్చు కదా!’ ‘అవుననుకో. అందరూ మనలాగే ఆలోచించరు కదా. ఆ అమ్మాయి వాడికి బాగా నచ్చుంటుంది.’ చాలామంది ఇలాగే చర్చిస్తున్నారు. కానీ యున్ఫా అవేమీ పట్టించుకోవడం లేదు. ‘‘అందరూ మాటలతో ప్రేమలో పడతారు. నేను మాత్రం ఆ అమ్మాయి మూగకళ్లను చూసి ప్రేమలో పడిపోయాను’’ అంటూ యూయైని చూసిన తొలి క్షణాల గురించి స్నేహి తులతో చెప్తున్నాడు. పెళ్లికూతురిని చూస్తూ జానపద పాటలు కూడా పాడాడు. ఊరు ఊరంతా ‘ఇది మా ఇంటి పెళ్లి’ అనుకోవడంతో పెళ్లి ఘనంగా జరిగింది. అయిదు నెలల తరువాత... పై అధికారి నుంచి పిలుపు రావడంతో యున్ఫా ఉన్నపళంగా ఆయన క్యాబిన్లోకి వెళ్లాడు. ‘‘మీ ఆవిడకు ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి వార్త వచ్చింది’’... చెప్పాడు అధికారి. యున్ఫాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. మెరుపువేగంతో బయలుదేరాడు. కన్ను మూసి తెరిచేలోగా ఇంట్లో వాలిపోయాడు. ఏమైందో ఏమిటో... అవయవాలన్నీ చచ్చుబడి లేవలేని స్థితిలో ఉంది యూయై. మాట కూడా రావడం లేదు. దీనంగా భర్త వైపు చూసింది. యున్ఫా ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగెత్తాడు. అలా ఎన్నో నెలల వరకు ఆమెను ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నాడు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారు డాక్టర్లు. పైగా కాలేయం, కిడ్నీలు కూడా బాగా పాడైపోయాయని చెప్పారు. యున్ఫాకి పిచ్చి పట్టినట్టయ్యింది. ఆమెకేమైనా అయితే తాను బతకలేడు. ఎలాగైనా తనను బతికించుకోవాలి. అందుకే వైద్యం కోసం ఉన్న పొలం అమ్మాడు. అప్పులు చేశాడు. ఫలానా మొక్కతో వ్యాధి నయం అవుతుందని ఎవరో చెబితే దాని కోసం అడవుల వెంట తిరిగాడు. పాము కాట్లకు గురై ప్రాణాల మీదికి కూడా తెచ్చు కున్నాడు. కానీ ఎన్ని కష్టాలు పడినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద యున్ఫాతో అన్నాడు... ‘‘పెళ్లై ఆరునెలలు కూడా అవ్వలేదు. అంతలోనే ఇలా అయింది. నువ్వు మరో పెళ్లి చేసుకోవడం మంచిది. లేకుంటే ఈ అమ్మాయి సేవలోనే నీ జీవితం వ్యర్థమైపోతుంది.’’ మిగిలినవాళ్లు కూడా ఆయనకు వంత పాడారు. ‘‘యూయైని ఆమె తల్లి దండ్రులకు అప్పగించు. వైద్యానికి నెలకు కొంత సొమ్ము ఇవ్వు. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో. లేకపోతే నీ జీవితం నరకప్రాయ మవుతుంది’ అని చెప్పారు. నిజానికి యున్ఫాకి ఆ ఊరి వాళ్ల మాట వేదం. అందులోనూ పెద్దలు ఒక మాట చెబితే కాదనడు. కానీ ఆ రోజు మాత్రం వారి మాట వినలేదతను. ‘నేనలా చేయలేను’ అన్నట్లుగా చూశాడు. దీనంగా తనవైపే చూస్తోన్న యూయై కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ... ‘‘కంగారు పడకు. నేను నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను’’ అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రమాణం చేశాడు. మరుసటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు యున్ఫా. ఓ తల్లిలాగా అక్కున చేర్చుకుని యూైయెుకి సేవలు చేయడం మొదలు పెట్టాడు. అలా ఆరు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పటికీ కరుణించలేదు. యూయెు పరిస్థితి ఏం మారలేదు. అలానే ఉంది. కానీ ఊరివాళ్లు మాత్రం చాలా మారారు. ఆ దంపతులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. వారికి తమవంతు సహాయం అందిస్తున్నారు. నిజమైన ప్రేమకు నిర్వచనంలా నిలిచిన ఆ ఇద్దరికీ చివరి వరకూ అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. - యాకూబ్ పాషా -
మౌనవీణ గానమిది...
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘అడవి మౌనంగా ఉంటుంది. ఆ మౌనంలో నుంచే మహత్తరమైన గానం వినిపిస్తుంది. ఆ గానంతో పక్షులు తీయగా గొంతు కలుపుతాయి. పచ్చటి అడవి సంగీత కచేరిగా మారుతుంది’... కవి మిత్రుడు అడవి మీద చెప్పిన కవిత పదే పదే గుర్తుకు వస్తోంది మల్వా (మధ్యప్రదేశ్) సుల్తాన్ బజ్ బహదూర్‌కు. మనసు బాలేనప్పుడు, జీవితం మరీ యాంత్రికంగా అనిపించినప్పుడు, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలను కున్నప్పుడు వేటకు వస్తుంటాడు బహదూర్. పేరుకే వేటగానీ అడవి అందాన్ని ఆస్వాదించడమే అతని ఉద్దేశం. ఆ రోజూ అలానే వచ్చాడు. ఉన్న ట్టుండి ఎక్కడి నుంచో తేనెలూరే పాట వినిపించింది. ‘కవి చెప్పినట్లు అడవి పాడుతుందన్నమాట’ అనుకుంటూ అటు వైపు వెళ్లాడు. పాడుతోంది అడవి కాదు... అందమైన అమ్మాయి! తన స్నేహితులతో కలసి గొర్రెలను మేపుతూ పాడుతోంది. బహదూర్‌ను చూసి పాట ఆపింది. ‘ఫరవాలేదు పాడు’ అన్నాడు బహదూర్. ఆమె మళ్లీ పాడడం ప్రారం భించింది. ఆ గానంలో తనను తాను మరిచిపోయాడు బహదూర్. ‘‘నీ పేరేమిటి?’’ అని అడిగాడు. ‘‘రూపమతి’’ అని చెప్పింది. ‘‘రూపమతీ... ఎన్నో కచేరీలు విన్నాను. కానీ ఇంతటి తీయటి స్వరాన్ని ఎప్పుడూ వినలేదు’’ మాట్లాడుతూనే ఉన్నాడు బహదూర్. సిగ్గుపడుతూనే ఉంది రూపమతి. ఇది మొదలు... రూపమతి కోసం వారానికి రెండుసార్లు అడవికి రావడం మొదలెట్టాడు బహదూర్. ఆమె తేనెగాన ప్రవాహంలో ఆనందంగా మునకలు వేసేవాడు. ఒకరోజు- ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘మీరెక్కడా మేమెక్కడా? రాజావారు గొర్రెలు కాసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా రని లోకులు నవ్వుతారు’’ అందామె. ‘‘కొన్ని పనులు జనం కోసం చేయాలి. కొన్ని పనులు మన కోసమే చేయాలి. ప్రేమ, పెళ్లి అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలు. నేను నిన్ను పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాను’’ అన్నాడు బహదూర్. ‘‘నేను మాత్రం కాదంటానా!’’ అన్నట్లు కొంటెగా చూసింది రూపమతి. బజ్ బహదూర్ రూపమతిని పెళ్లి చేసుకోవడం సంచలనాన్ని సృష్టించింది. గొర్రెలు కాసే అమ్మాయిని బహదూర్ పెళ్లి చేసుకొని రాజుల పరువు తీశాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయినా చలించ లేదు బహదూర్. పైగా నర్మదా నది ఒడ్డున ఆమె కోసం మహల్‌ను కట్టాడు. రూపమతిని బహదూర్ పెళ్లి చేసుకోవడం అతడి సన్నిహితులు, బంధువులలో చాలామందికి నచ్చలేదు. తమ మనసులోని కోపానికి పుకార్ల రూపం ఇచ్చారు. ‘బహదూర్ రాజ్య పాలనా వ్యవహారాలు పట్టించుకోవడం లేదు, ఆమే ప్రపంచంగా బతుకుతున్నాడు’ అన్నారు. ‘బహదూర్‌ను బానిసలా మార్చుకుంది రూపమతి’ అన్నారు. ఈ పుకార్లు చివరకు శత్రువుల వరకు చేరాయి. అంతర్గత కలహాలతో బలహీ నంగా ఉన్న మల్వాను జయించడానికి ఇదే అదను అనుకున్నారు. ఆదామ్ఖాన్, పీర్ మహ్మద్ ఖాన్ల ఆధ్వర్యంలో మల్వాపై దాడి జరిగింది. బహదూర్ విజయం సాధించాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అదనపు సైన్యాలు దిగాయి. ఇక బహదూర్‌కు ఓటమి తప్ప లేదు. రాజ్యాన్నే కాదు, రూపమతిని కూడా వశపరుచుకోవాలనుకున్నాడు ఆదామ్. అతన్నుంచి తప్పించుకోవడానికి విషం మింగి మరణించింది రూపమతి. ఆ వార్త వినగానే శత్రువుల వద్ద బందీగా ఉన్న బహదూర్ గుండె బద్దలయ్యింది. ఒకప్పుడు వాళ్లిద్దరినీ కలిపిన ఆ అడవి పాడుతోంది. విషాదాన్ని ఒలికిస్తోన్న ఆ పాట విని సెలయేళ్లు కన్నీళ్లయ్యాయి! - యాకూబ్ పాషా * రూపమతి కోసం బజ్ బహదూర్ నిర్మించిన అందమైన రాజమహల్, దీనికి నీరు సరఫరా చేయడానికి నిర్మించిన రెవ కుంద్ రిజర్వాయర్... ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రేమికులు ఈ ప్రదేశాలను పవిత్ర స్వర్గధామాలుగా చూస్తారు. * రూపమతి పాడిన 26 కవితలను అహ్మద్-ఉల్-ఉమ్రి సంకలనం చేశాడు. ‘ద లేడీ ఆఫ్ ద లోటస్: రూపమతి’ పేరుతో ఎల్.యం.క్రంప్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. -
అజరామరం ఆ ప్రేమకావ్యం
గ్రేట్ లవ్ స్టోరీస్ ఏదో ఒకరోజు... ఆమెను కలుస్తావు. ఆమెకు నీ గతంతో పని లేదు. ఎందుకంటే నీ భవిష్యత్ తనది కాబట్టి! అందమైన యువకుడు రాంఝా గురించి వివరం అడిగితే మనుషుల కంటే ప్రకృతి ఎక్కువగా చెప్పగలుగుతుంది. అతడి వేణు గానామృతంలో పడి అదే పనిగా తలలు ఎలా ఊపిందీ చెట్లు చెబుతాయి. తన నిరంతర చిరునవ్వుల వెనుక రహస్యం అతడి గానమని చీనాబ్ నది చెబుతుంది. తమ మోమున వెన్నెల కురిపించింది రాంఝా మురళీగానమేనని మొఘలు రాజుల కట్టడాలు చెబుతాయి.చీనాబ్ నది ఒడ్డున ఉన్న తాహ్త్ హజరాలో పుట్టి పెరిగాడు ధీడో రాంఝా. నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. అందుకే తండ్రికి అతనంటే చాలా ఇష్టం. అన్నలకు మాత్రం అసహ్యం. ‘‘బాన్సురీ ఊదడానికి తప్ప బతకడానికి పనికిరాడు’’ అని ముఖం మీదే తిట్టేవాళ్లు. ఇక వదినలు సరేసరి. సూటి పోటి మాటలతో రాంఝాను బాధ పెడుతూనే ఉండేవాళ్లు. ఆ వేధింపులు, అవమానాలు భరించ లేక ఒకరోజు సోదరులతో గొడవ పడ్డాడు రాంఝా. ‘‘ఈ నరకంలో ఇక ఉండలేను’’ అంటూ ఇల్లు విడిచిపెట్టాడు. ఒక ద్వారం మూసిన దేవుడు ఎక్కడో ఇంకో ద్వారం తెరిచే ఉంచుతాడట. అందుకే రాంఝా కోసం జంగ్ నగర ద్వారాలు తెరుచు కున్నాయి. ఈ చారిత్రక పట్టణం... ఒక అజరామర ప్రేమకథకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. జంగ్లో మల్కి అనే పెద్దాయన దగ్గర పశువుల కాపరిగా చేరాడు రాంఝా. వాటిని మేపుతూ మురళి వాయించేవాడు. ఆ సమ్మోహన వేణుగానం వినే అదృష్టా నికి ఆ పశువులు సైతం పులకించిపోయేవి. ఒకరోజు... ఆ అద్భుత వేణుగానం మల్కి కూతురు హీర్ చెవిన పడింది. ఆమె సమ్మోహితురాలయ్యింది. స్వయంగా అతడితో ఆ విషయం చెప్పింది. ఆ పరిచయం వాళ్లను దగ్గర చేసింది. రాంఝాను ఎక్కడో ఒకచోట రహస్యంగా కలిసేది హీర్. తన చేదు గతాన్ని మరిచిపోవడానికి దైవం పంపిన బహుమానం ఈ అమ్మాయి అనుకునే వాడు రాంఝా. రాంఝా-హీర్ల ప్రేమవ్యహరం... హీర్ తల్లిదండ్రులకు, మేనమామ కైడోకు తెలిసింది. వాళ్లంతా నిప్పులు కక్కారు. స్థానిక పూజారి సైదా ఖైరాతో హీర్ పెళ్లికి రంగం సిద్దం చేశారు. రాంఝాను ఊరి నుంచి గెంటేశారు. రాంఝా గుండె బద్దలయ్యింది. ఐహిక ప్రపంచం మీద విరక్తి పుట్టింది. సన్యాసిగా మారిపోయాడు. పాటలు పాడుతూ పిచ్చివాడిలా ఊరూరా తిరుగు తుండేవాడు. అతడి పాటల్లో గొప్ప జీవన తత్వాలు ఉండేవి. అవి ఎందరినో ఆకర్షించేవి. మరోవైపు హీర్ ‘‘రాంఝాను తప్ప ఎవరినీ పెళ్లాడను’’ అని గట్టి పట్టుదలతో ఉంది. ఎంత భయపెట్టినా, బుజ్జగించినా ఆమెలో మార్పు రాలేదు. బెంగ పెట్టేసుకుంది. రోజురోజుకూ కుంగిపోసాగింది. కూతురు ఆరోగ్యం దెబ్బతినడం చూసి హీర్ తల్లిదండ్రులు ఆమెను రాంఝాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమ య్యారు. రాంఝాను వెతికి తీసుకొచ్చారు. ఆ రోజు హీర్-రాంఝాల పెళ్లి. ఈ సృష్టిలోని సంతోషమంతా అతడి కళ్లలోనే ఉన్నట్లుగా ఉంది. ‘రాంఝా లేని ఈ లోకం నరకం కంటే ఘోరం’ అనుకున్న హీర్‌కు ప్రపంచమంతా అందంగా కనిపించసాగింది. అంతలో ఉన్నట్టుండి ఏవో కేకలు. అందరూ అటువైపు పరుగెత్తారు. హీర్ నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటోంది. ఏమయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమెను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ అంతలోనే ఆమె ప్రాణం ఆమెను వదిలిపోయింది. పెళ్లికని చేసిన లడ్డుల్లో ఒకటి తింది హీర్. అది విషప్రయోగం చేసిన లడ్డు అనే విషయం తెలిసింది. ఈ పని హీర్ మామ కైడో చేసి ఉంటాడని అనుమానం. చేసింది ఎవరైనా, పోయింది మాత్రం హీర్ ప్రాణం! రాంఝా గుండె మరోసారి ముక్కలైంది. ఆమె లేని లోకంలో తానేం చేయాలో తోచలేదు. హీర్ తిని వదిలేసి లడ్డూను తినేశాడు. మరుక్షణం ప్రాణాలు వదిలి తన ప్రేయసిని చేరుకున్నాడు. వీరి విషాదాంత ప్రేమగాథ పంజాబ్ చరిత్రలో కన్నీటిచుక్కై నిలిచింది. జంగ్లో కనిపించే హీర్-రాంఝాల స్మారక కట్డడం... అజరామరమైన ప్రేమకు నిలువెత్తు సంతకంలా నేటికీ మెరిసిపోతూ ఉంటుంది. - యాకూబ్ పాషా -
తొలి వెలుగు!
గ్రేట్ లవ్ స్టోరీస్ ప్రేమలో విషాదం ఉంటుంది. కానీ, అసలైన విషాదం... మనలో ప్రేమే లేకపోవడం! మైత్రి ప్రేమరాహిత్యంతో ఎందుకు కనిపిస్తుంది? ప్రేమ అనే మాట వినగానే ఎందుకు ఉలిక్కిపడుతుంది? ఆమె ఎప్పుడూ ఏదీ చెప్పదు. కానీ ఆమె కళ్లలో కనిపించీ కనిపించని నల్లటి విషాదపు నీడ మాత్రం... ఏదో చెప్పకనే చెబుతుంది. దాన్ని నాజరస్ గుర్తించాడు. అందుకే ఆమె మౌనాన్ని తన మాటలతో చెరిపేయాలని, తన పెదవులపై నవ్వుల పూలు పూయించాలని కలలు కన్నాడు. అమావాస్య చీకట్లో నుంచి ఆమెను బయటికి తీసుకువచ్చి... వెన్నెల వర్షంలో తడిపెయ్యాలని తహతహలాడాడు. ‘‘ఎందుకిలా నా చుట్టూ తిరుగు తున్నావు... వేరే పనేమీ లేదా?’’ ఒకరోజు కోపంగా నాజరస్‌ను నిలదీసింది మైత్రి. ‘‘లేదు. నిన్ను ప్రేమించడమే నాకు ఉన్న ఏకైక పని’’... అప్పటి వరకు లేని గాంభీర్యాన్ని కొని తెచ్చుకుని అన్నాడు నాజరస్. ‘‘పిచ్చివాడిలా ఉన్నావే... అసలు నా గురించి నీకేం తెలుసు?’’ అడిగింది మైత్రి. ‘‘ఏమీ తెలియనక్కర్లేదు. అన్నీ తెలుసు కుని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించడమే ప్రేమ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.’’ ఆ తర్వాత వారి మధ్య కొన్ని నిమిషాల మౌనం. క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే నాజరస్... అప్పుడు మాత్రం మౌనాంకితుడైపోయాడు. న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఖైదీలా ఉన్నాడు. అతడి ఎదురు చూపులు ఫలించాయి. ‘సరే’ అంది మైత్రి. ఆనందంతో నోట మాట రాలేదు నాజరస్కి. కళ్ల నుంచి కన్నీళ్లు మౌనంగా జారుతున్నాయి! కానీ మైత్రికి ఆనందంతో కూడా కన్నీళ్లు రావడం లేదు. ఎందుకంటే ఆమె మనసులోని చెమ్మను విధి పూర్తిగా పీల్చేసింది. ఆమె గతం అలాంటిది! బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేది మైత్రి. ‘‘ఆడపిల్ల పదవ తరగతి వరకు చదివితే చాలు’’ అంటూ చదువు మానిపించి ఆమెకి పెళ్లి చేసేశాడు తండ్రి. అయిపోయిందేదో అయిపోయింది, సర్దుకుపోదాం అనుకుంది మైత్రి. కానీ ఆ అవకాశం లేకపోయింది. ఎందుకంటే, భర్తకి లేని చెడు అలవాటు లేదు. బాగా తాగి వచ్చి మైత్రిని చావబాదే వాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అతడిలో మార్పు రాలేదు. అంతా తన ఖర్మ అనుకుంది. అయితే అంతలోనే ఒకరోజు అతడు వచ్చి భోరుమన్నాడు. ‘‘ఏమైంది?’’ అని ఆందోళనగా అడిగింది మైత్రి. ‘‘నాకు హెచ్ఐవీ సోకింది. ఇక ఎంతో కాలం బతకను’’ అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. బెంగాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల్లోనే మరణించాడు. భర్త నుంచి తనకు హెచ్ఐవీ సోకిందేమోనని పరీక్షలు చేయించుకుంది మైత్రి. బతుకు మరోసారి చీకటయినట్లు అనిపించింది. తనకు కూడా హెచ్ఐవీ సోకింది! కాస్తయినా కనికరం లేకుండా అత్తింటివాళ్లు మైత్రిని ఇంటి నుంచి తరిమేశారు. పిల్లలను ఆమె దగ్గరికి వెళ్లనివ్వలేదు. చివరకు ఆమెను కన్న తల్లి కూడా కూతుర్ని చేరదీయలేదు. ఎటు చూసినా చీకటి. భవిష్యత్తు అన్నది కన్ను పొడుచుకు చూసినా కాన రాలేదు. సరిగ్గా అదే సమయంలో ‘బీఎన్‌పీఎల్’(బెంగాల్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ, ఎయిడ్స్) సభ్యులు కొందరు పరిచయమయ్యారు. వాళ్లంతా తనలాగే భర్తను పోగొట్టుకున్న వారు. హెచ్ఐవీ బాధితులు. వారితో చెలిమి మైత్రిలో ధైర్యాన్ని నింపింది. ఆ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగమూ దొరి కింది. ఆ పని చేస్తూనే సంస్థ ప్రచార కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో విషాదం నుంచి ఉపశమనం లభించినట్లు అనిపిం చింది మైత్రికి. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న నాజరస్ పరిచయమయ్యాడు. ఆమె జీవితానికి ఒక కొత్త అర్థం ఇచ్చాడు. మైత్రిని పెళ్లాడిన నాజరస్‌ను ‘పిచ్చోడు’ అన్నారు చాలామంది. అతని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏ ఒక్కరూ వారి వెంట నిలవలేదు సరికదా సూటి పోటి మాటలు, వెటకారాలతో వాళ్ల మనసులకు తూట్లు పొడవాలని ప్రయత్నించారు. కానీ నాజరస్ పట్టించుకోలేదు. ఆ నిరసనల సెగ మైత్రిని తాకనివ్వలేదు. ఆమెను సంతోషంగా ఉంచడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా సాగిపోతున్నాడు. ఆ ప్రేమ ముందు వెక్కిరింపులు, అవహేళనలు చిన్నబోయాయి. అవి వారి ప్రేమబంధానికి దిష్టిచుక్కలుగా మిగిలిపోయాయి. -
వజ్రాయుధం
గ్రేట్ లవ్ స్టోరీస్ ప్రేమ... ధైర్యాన్నిస్తుంది. బతకడానికే కాదు... చావుతో పోరాడటానికి కూడా. అందుకు నెల్ సాహసమే ఓ పెద్ద ఉదాహరణ. తాను ప్రాణంగా ప్రేమించే తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి మృత్యువు ముఖంలో ముఖం పెట్టి చూసింది నెల్. ఆ పోరాటంలో చివరికి ఆమె గెలిచిందా? ఓడిందా? ఈ కథ చదివితే తెలుస్తుంది. ‘‘రేపు మన పెళ్లి రోజు... గుర్తుందా?’’ అంది నెల్. ‘‘నా పుట్టిన రోజునైనా మరిచి పోతానుగానీ... మన పెళ్లి రోజును మరిచిపోగలనా? అది నేను నిజంగా పుట్టిన రోజు కదా!’’ చెప్పాడు జిమ్. ‘‘మరి రేపు మన ప్లాన్ ఏమిటి?’’ ‘‘ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్, బంధువులతో కలిసి రెస్టారెంటుకి వెళ్లడం, డిన్నర్లు చేయడం బోర్ కోడుతుంది. ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం.’’ ‘‘ఎలా?’’ ‘‘మనిద్దరమే ఎక్కడికైనా ఏకాంతం లోకి వెళదాం. అక్కడ మన ప్రేమ జ్ఞాప కాలను ఒక్కొటొక్కటిగా గుర్తు తెచ్చు కుందాం. నాకైతే క్రిక్ రెడ్‌వుడ్ స్టేట్ పార్క్ చూడాలని ఎప్పటి నుంచో ఉంది. నువ్వే మంటావు?’’ ఆసక్తిగా అడిగాడు జిమ్. ‘‘తప్పకుండా వెళదాం’’ అంది నెల్. జిమ్, నెల్లకు పెళ్ళై రెండు దశబ్దాలు దాటిందంటే ఎవరూ నమ్మరు. ఎప్పుడూ నవ దంపతులలాగే కనిపిస్తారు వాళ్లు. పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవా లనుకున్నప్పుడు ఇరువైపుల పెద్దలూ అంగీకరించలేదు. అయినా ఎన్నో కష్టాలకు ఎదురు నిల్చి పెళ్లి చేసుకున్నారు. ఆదర్శ దాంపత్యానికి నమూనాగా మారారు. కాలిఫోర్నియాలోని ‘క్రిక్ రెడ్‌వుడ్ స్టేట్ పార్క్’ పద్నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులోకి అడుగు పెడితే ఒక మహారణ్యంలోకి అడుగు పెట్టినట్లుగానే ఉంటుంది. రకరకాల జంతు జాతులతో పాటు కొన్ని వందల ఏళ్ల నాటి రెడ్‌వుడ్ చెట్లు పార్క్‌కు నిండుదనం తీసుకు వచ్చాయి. విశాలమైన రెడ్‌వుడ్ చెట్టు నీడలో కూర్చున్నారు జిమ్, నెల్లు. ఆ చల్లటి చెట్టు నీడలో వెచ్చటి ప్రేమ జ్ఞాపకాలు అలలు అలలుగా! ‘‘బొద్దింకను చూస్తే కూడా భయపడే నువ్వు, నన్ను ప్రేమించి పెళ్లాడటానికి సింహం లాంటి మీ నాన్నను ఎలా ఎది రించావో, ఎంత ధైర్యం చేశావో తలచు కుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు’’ అన్నాడు జిమ్ నవ్వుతూ. ఆ నవ్వుతో శృతి కలిపింది నెల్. ‘‘నీకోసం సింహం లాంటి మా నాన్నతోనే కాదు, నిజంగానే సింహం వచ్చినా ఎదురొడ్డి పోరాడతాను’’ అంది నెల్ నాటకీయంగా. ఆమె అన్న ఆ మాట కొద్ది క్షణాల్లో నిజమైంది. ఉన్నట్టుండి ఒక చిత్రమైన, భయానకమైన శబ్దం వినిపించింది. అది ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాడు జిమ్. సింహం! భయంతో గుండెలు అదిరిపోయాయి. మెదడు స్తంభించిపోయింది. ఆ సింహం ఒక్కసారిగా పంజా విసిరింది. తల మీద ఎవరో బేస్‌బాల్ బ్యాట్‌తో బలంగా కొట్టినట్లు అనిపించింది జిమ్‌కు అతడు తేరుకునే లోపే. సింహం జిమ్‌ను నోట కరచుకుంది. ఈడ్చుకెళ్లసాగింది. అతడిని రకాలుగా గాయపరుస్తోంది. జిమ్ నిస్సహాయంగా అరుస్తున్నాడు. నెల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన భర్తను ఎలా కాపాడుకోవాలి? దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు. మరి ఎలా? జిమ్‌కి ఏదైనా అయితే? ఆ ఆలోచనే భరించలేకపోయింది నెల్. చుట్టూ చూసింది. ఒక కర్ర కని పించింది. దాన్ని చేతిలోకి తీసుకుని పరుగు తీసింది నెల్. అప్పటికే సింహం జిమ్ని ఓచోట పడేసింది. చంపడానికి సిద్ధపడుతోంది. దాని దృష్టి కేవలం జిమ్ పైనే ఉంది. ఇదే అదునుగా, తన చేతిలోని కర్రతో సింహం తల మీద బాదడం మొదలెట్టింది నెల్. జేబులోంచి పెన్ను తీసి సింహం కళ్లలోకి గుచ్చింది. తట్టుకోలేక సింహం వెన్నుచూపింది. అంతలో పార్క్ సిబ్బంది వ్యాన్ ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్లు జిమ్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ‘కాలిఫోర్నియా పసిఫిక్ మెడికల్ సెంటర్’లో చికిత్స పొందుతూ కోలు కున్నాడు జిమ్. భర్త కోసం ప్రాణాలొడ్డిన నెల్ ధైర్యసాహసాలని మెచ్చుకుంటూ ఎన్నో అవార్డ్లు వరించాయి. ‘ప్రేమలోకంలో గుడ్డిదీపం కూడా సూర్యతేజం అవుతుంది. ప్రేమలోకంలో గడ్డిపోచ కూడా... వజ్రాయుధమై మెరిసిపోతుంది!’ - యాకూబ్ పాషా -
ప్రేమ పుస్తకం
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘అబ్బా... ఈరోజు కూడా వెళ్లాలా!’ అంది నోరు. ‘వెళ్లక చస్తావా? వెళ్లకుంటే ఆకలితో మాడి చస్తావ్’ అంది అంతరాత్మ. దాంతో తప్పనిసరై బయలుదేరాడు ఫిలిప్. ‘ఫోర్ట్ వర్త్ బార్’లోకి అయిష్టంగానే అడుగుపెట్టాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫిలిప్. ఆర్థిక పరిస్థితుల వల్ల అతడి కోరిక కోరికగానే మిగిలిపోయింది. ‘చదువుకోలేక పోయానే’ అన్న అసంతృప్తి వెంటాడు తూనే ఉంది. ఈ బాధను దారి మళ్లించ డానికి చాన్స దొరికితే వ్యాయామంలో మునిగిపోయేవాడు. చివరికి అదే బార్లో బౌన్సర్‌గా బతుకుదారి చూపింది. అయితే బార్లో వాతావరణం ఫిలిప్‌కు బొత్తిగా నచ్చేది కాదు. కేకలు, అరుపులు, గొడవలు, సిగరెట్ పొగలు... ఆ ప్రపంచమంటేనే వెగటు వచ్చేది. అలా అని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు. రాజీ పడుతూ బతుకు బండిని భారంగా లాగించసాగాడు. సరిగ్గా అప్పుడే సూజన్ అతని జీవితంలో ప్రవేశించింది. ఫిలిప్ పని చేస్తోన్న బార్లో బార్ గాళ్‌గా చేరింది సూజన్. మొదటి చూపు లోనే ఫిలిప్ మనసును తడిమింది. ఆమె అమాయకమైన ముఖం ఫిలిప్ మనసులో ముద్రపడి పోయింది. అందుకే పొట్టి పొట్టి బట్టలు కట్టుకుని, పాటలు పాడుతూ, మందు బాబులను అలరించే అమ్మాయిగా తనను చూడలేకపోయాడు. ‘ఇంత చక్కని అమ్మాయి ఇక్కడ ఇలా ఉండటమేంటి’ అనిపించేది. కానీ తనతో మాట్లాడాలంటే మనసు సిగ్గుతో మెలికలు తిరిగేది. చివరికి ఓరోజు ధైర్యం చేసి మాట కలిపాడు. ‘‘మీరు బార్లో పాడడం నాకు ఇష్టం లేదు. చిన్న వయసు. చక్కగా చదువుకో వచ్చుగా’’ అన్నాడు ఫిలిప్. ఆశ్చర్య పోయిందామె. ఇతనేంటి ఇలా చెబు తున్నాడు అనుకుంది. కానీ అతని మనసులో తనమీద అప్పటికే పెరిగిన అపారమైన ప్రేమ అలా మాట్లాడిస్తోందని అర్థం చేసుకుంది. చదువుకోలేని తన అశక్తతని, నిస్సహాయతని వివరించింది. ‘నీతో జీవితాన్ని పంచుకోవాలను కుంటున్నాను. నీ కష్టాన్ని పంచుకోలేనా, నిన్ను నేను చదివిస్తాను’ అన్నాడు ఫిలిప్. తల అడ్డంగా ఊపింది సూజన్. ‘నీకూ చదువంటే ఇష్టమే అన్నావ్ కదా. నాతో పాటు నువ్వూ చదువుకోవాలి. అలా అయితేనే ఒప్పుకుంటాను’ అంది. ‘సరే’ అన్నాడు. నాటి నుంచీ వాళ్ల మనసులతో పాటు లక్ష్యాలూ ఒక్కటయ్యాయి. ఒకరికొకరు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. పుస్తకాలు చేతబట్టారు. ప్రేమ అనేది అప్పుడే పుట్టిన వెలుగు కిరణం లాంటిది. చీకట్లో అప్పటి వరకు చూడలేనివాటిని అది చూపుతుంది. ప్రేమ వెలుగులో ఫిలిప్, సూజన్లు చదువులోని అద్భుతాన్ని, ఆకర్షణను చూశారు. ఒక్కొక్క మెట్టూ ఎదిగారు. ఒక్కొక్క క్లాసూ దాటారు. టెక్సాస్‌లోని సర్ రాస్ స్టేట్ యూనివర్శిటీ నుంచి బయాలజీలో బేచిలర్ డిగ్రీ, ఆ తరువాత మాస్టర్ డిగ్రీ కూడా తీసుకున్నారు. పట్టా చేతికి వచ్చాక ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది ఫిలిప్‌కి. ‘‘నువ్వు నా జీవితంలో రాక పోయి ఉంటే చీకట్లో మగ్గిపోయేవాడిని’’ అన్నాడు సూజన్ చేతిని ప్రేమగా చేతిలోకి తీసుకుని. ‘‘నాదీ అదే మాట’’ అంది సూజన్. తర్వాత ఇద్దరూ దంపతులు అయ్యారు. జీవితాన్ని సంతోషంగా సాగిం చారు. కొన్నాళ్ల క్రితమే కోడీ సిటీలోని ‘డ్రాపర్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో బయాలజిస్ట్‌గా సూజన్, అస్టి సెంట్ క్యురేటర్‌గా ఫిలిప్ రిటైరయ్యారు. ప్రస్తుతం తమ ప్రేమ పుస్తకంలోని పేజీల్ని తిరగేసి చూసుకుంటూ గడుపుతున్నారు. ఆ పుస్తకం నిండా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. తమ జీవితాన్ని కాంతివంతం చేసిన వెలుగు రేఖలున్నాయి! - యాకుబ్ పాషా -
కలల రాకుమారుడు
గ్రేట్ లవ్ స్టోరీస్ * మొదట అతడు అపరిచితుడు. * తర్వాత స్నేహితుడు. * ఇప్పుడు ప్రాణనాథుడు. ‘నిన్ను కలిసే వరకు తెలియదు... నాలో నవ్వుందని... ఆ నవ్వులో ఒక మెరుపు ఉందని... ఆ మెరుపులో ఒక హృదయం ఉందని... ఆ హృదయం నీదేనని!’ ‘నా మీద నీకు ప్రేమ పోయింది. నన్ను మోసం చేసి ఎవరినో ప్రేమిస్తు న్నావు’... అదే పనిగా తిడుతున్నాడు రాబర్ట. అతడి మాటల్లో అహంకారం, అనుమానం, అర్థం లేని ఆవేశం! ‘మెలిస్సా... నువ్వు పుట్టి ఉండకపోతే నా జీవితం వృథా అయ్యి ఉండేది’ అంటూ అతను ఎప్పుడూ అనే మాట గుర్తొచ్చింది మెలిస్సాకి. అతడేనా ఇలా మాట్లాడుతోంది! ఈ మగాళ్లు ఇంతేనా... ప్రేమించే వరకు ప్రేమ ప్రేమ అంటారు. ప్రేమించడం మొదలు పెట్టిన తరువాత... అధికారాన్ని, అహంకారాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తారు. విసుగొచ్చిందామెకి. రోజురోజుకీ రాబర్టలో చెప్పలేని మార్పు వస్తోంది. పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. చివరికి ఈ రోజు నడిరోడ్డు మీద నిలబడి తనను అవమానిస్తున్నాడు. ఇక తట్టుకోలేక పోయింది. ‘‘నిన్ను ప్రేమించినందుకు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను రాబర్ట. ఇక ఎప్పుడూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు’’ అనేసి అక్కడ్నుంచి కదిలింది. నాలుగడుగులు వేసిందో లేదో... ఏదో పదునైన వస్తువు సూటిగా వెన్నులో దిగింది. తేరుకునేలోపే నడుము దగ్గర... ఆ తర్వాత భుజాలపై... ఆపైన కడుపులో... చేతుల మీద... కాళ్ల మీద... ముఖమ్మీద... విచక్షణారహితంగా ఒళ్లంతా కత్తులతో పొడుస్తున్నాడు రాబర్ట. మెలిస్సా అరుస్తోంది. బాధతో విలవిల్లాడుతోంది. చుట్టూ చాలామంది ఉన్నారు. అందరూ అవాక్కయి చూస్తున్నారే తప్ప రక్షించే ప్రయత్నమేదీ చేయడం లేదు. కానీ ఎక్కడ్నుంచి దూసుకొచ్చాడో... వాయువేగంతో వచ్చాడు క్యామెరాన్ హిల్. అప్పటికే మెలిస్సా ఒంట్లో ముప్ఫై రెండుసార్లు దిగింది కత్తి. మరోసారి దిగబోతోంటే అడ్డుకున్నాడు క్యామెరాన్. రాబర్ట్ ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. తట్టుకోలేక పారిపోయాడు రాబర్ట. క్యామెరాన్ వేగంగా కదిలాడు. మెలిస్సాకు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. రెండు చేతుల్లో ఎత్తుకుని కారువైపు పరుగెత్తాడు. ఆమెను తీసుకుని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆమెను డాక్టర్ల చేతుల్లో పెట్టి, దేవుడికి ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. మెలిస్సా చేసుకున్న పుణ్యమో, డాక్టర్ల నైపుణ్యమో, లేక క్యామెరాన్ ప్రార్థనల ఫలితమో... గండం గడిచింది. మెలిస్సా మృత్యులోయ నుంచి తిరిగి వచ్చింది. బతకడమంటే బతికింది కానీ మెలిస్సా మళ్లీ మాట్లాడగలదా, నవ్వ గలదా, నడవగలదా అని సందేహపడ్డారు డాక్టర్లు. కానీ ఆమె అవన్నీ చేయగలిగింది. అందుకు కారణం... క్యామెరాన్. అతడు తన పని అయిపోయిందని వెళ్లిపోలేదు. రోజూ వచ్చి మెలిస్సాని కలిసేవాడు. ఆమెకి ఏం కావాలో అడిగి తెలుసుకునే వాడు. అధైర్యపడితే ధైర్యం నూరి పోసేవాడు. అణువణువునా కొత్త ఆశల్ని నింపేవాడు. అందుకే ఆమె మళ్లీ మామూలు మనిషి అయ్యింది. రోజులు గడిచాయి. వాళ్ల స్నేహమూ పెరిగి పెద్దదయ్యింది. ఓ రోజు పీటర్స్బర్గ్ (ఫ్లోరిడా)లోని ట్రోపికన్ ఫీల్డ్‌లో బేస్‌బాల్ ఆడుతోంది మెలిస్సా. ఓ బేస్‌బాల్ మీద ‘నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా?’ అని రాసి విసిరాడు క్యామెరాన్. నమ్మబుద్ధి కాలేదామెకి. ఎందుకంటే, తనలో ఇంతకుముందు ఉన్న అందం లేదు. కత్తిపోట్లతో కళ తప్పింది. అయినా అతను తనను ఇష్టపడు తున్నాడా అనుకుంది. కానీ అది నిజమే. అతను ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె అంగీకారంతో ప్రాణదాత కాస్తా ప్రాణనాథుడయ్యాడు. ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించ డానికి రాకుమారుడు ప్రదర్శించే సాహసాన్ని జానపద కథల్లో చదివిన మెలిస్సాకి... తన కలల రాకుమారుడిలా కన్పించాడు క్యామెరాన్! - యాకూబ్ పాషా -
ప్రేమఖైదీ
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘మొదట నేను... కెరటాల వంటి నీ శిరోజాలతో మాట్లాడాను. నీ కళ్లలోని వెన్నెల వెలుగులతో మాట్లాడాను. నీ పెదాలపై విరిసిన హరివిల్లుతో మాట్లాడాను. చివరిగా నీ హృదయంతో మాట్లాడాను. ప్రియా... ఇప్పుడు నేను ‘నేను’ కాదు... నువ్వు!’ ప్రేమ... రెండు ప్రపంచాలను ఒకే ప్రపంచంగా చేస్తుంది. అతడి ప్రపంచం: ‘మోడల్ బ్యాడ్‌బాయ్’ ఎవరంటే ఎవరైనా సరే... మొహమాటం లేకుండా వేలెత్తి చూపించేంత బ్యాడ్ ఇమేజ్ రషీద్‌కు ఉంది. టీనేజ్‌లో వయసుతో పాటు వచ్చిన అల్లరి... ఇంతింతై అన్నట్లు ఎక్కడికో వెళ్లిపోయింది. చదువుకు నీళ్లొదిలి, వీధి రౌడీగా పోలీసుల లిస్టులోకి ఎక్కడానికి అతడికి ఎంతో కాలం పట్టలేదు. మూడు అల్లర్లు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా ఉండేది రషీద్ జీవితం. అయితే వాటి కంటే దారుణమైన పని ఒకటి పదిహేడేళ్ల వయసులో చేశాడు. ఏదో ఒక గొడవలో ఆవేశాన్ని అణచుకోలేక, న్యూ యార్క్‌లో ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఏ కిక్ కోసమైతే రషీద్ నేరాలకు పాల్పడేవాడో ఇప్పుడది జైలులో లేదు. ఎటు చూసినా ఒంటరితనం. అందులో నుంచి పుట్టిన నిరాశా నిస్పృహలు. వాటి నుంచి పుట్టిన ఆలోచనలు! తమ తొలి పరిచయం నుంచి రషీద్‌ను పెళ్లి చేసుకునే వరకు ప్రతి అనుభవాన్నీ కూర్చి ‘ద ప్రిజనర్స వైఫ్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది ఆశ. ‘టూ రూమ్ ట్రైలర్’లో అతడితో రెండు రోజులు ఏకాంతంగా గడిపిన ఆనందానికి ఫలితంగా పుట్టిన బిడ్డను తాను ఒంటరిగా పెంచుతోన్న వైనాన్ని, ఆ అను భూతిని వివరిస్తూ ‘సమ్‌థింగ్ లైక్ బ్యూటిఫుల్’ బుక్ రాసింది. రషీద్ విడుదలై వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె ప్రపంచం: మన్హట్టన్లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఆశా బండెల్. చదువుకు చదువు, తెలివికి తెలివి. వాటితో పాటు సామాజిక స్పృహ. ఎప్పుడూ సామాజికసేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంది. ఆమెలో ఒక చక్కని రచయిత్రి కూడా ఉంది. అందమైన కవితలు అల్లుతూ ఉంటుంది. ఒకసారి తన ప్రొఫెసర్ కోరిక మేరకు న్యూయార్క్‌లోని ఓ జైలుకు వెళ్లింది ఆశ. అక్కడికి వెళ్లి ఆమె చేయాల్సిన పని... ఖైదీలకు తన కవిత్వం వినిపించడం. అప్పుడే ఆమె రషీద్‌ని చూసింది. అందరు ఖైదీల మధ్యలో ఉన్నా అతడు ఆమెకు ప్రత్యేకంగా కనిపించేవాడు. ఆమె కవిత్వం చెబుతుంటే విని పులకించేవాడు. కళ్లతోనే అభినందించేవాడు. చివరికి ఒకరోజు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్లి అభినం దించాడు. ఆమె కవిత్వం తన మనసుకు కలిగించే ఊరట గురించి చెప్పాడు. నాటి నుంచీ ఆశ, రషీద్‌ల మధ్య స్నేహం పెరిగింది. ఆమె స్నేహంలో తనొక కొత్త ప్రపంచాన్ని చూశాడు. కొత్త మనిషిగా బతకడానికి, కొత్త జీవితం మొదలు పెట్టడానికి తన కోసం దేవుడు పంపిన విలువైన కానుక అని భావించాడు రషీద్. ‘ఇప్పటి వరకు నాది బతుకే కాదు. ఇక నుంచైనా మనిషిగా బతకాలి’ అనుకున్నాడు. రషీద్ గురించి ఆశ కూడా చాలా ఆలోచించింది. పెరిగిన పరిస్థితులే అతడి నలా మార్చాయని అర్థం చేసుకుంది. రషీద్‌ను చూడడానికి ఆశ వారానికి రెండు సార్లు జైలుకు వచ్చేది. ఫోన్లు కూడా చేసు కునేవారు. ఉత్తరాలు రాసుకునేవారు. వీలైనంత వరకూ తన మాటలతో అతడిలో మంచిని నింపడానికి ప్రయత్నం చేసేది ఆశ. చివరికి మోడల్ బ్యాడ్‌బాయ్‌ని మోడల్ ప్రిజనర్‌గా మార్చేసింది. ఏడేళ్లు దొర్లిపోయాయి. వారి మనసులు దగ్గరయ్యాయి. ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని ఒకరోజు ప్రపోజ్ చేసింది ఆశ. ‘‘ఇప్పటికి విధి నాతో ఆడుకుంది చాలు. ఇప్పుడు నువ్వు కూడానా’’ అన్నాడు రషీద్. ‘‘నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను’’... రషీద్ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పింది. ఆశ అబద్ధం ఆడలేదు. అన్నట్టుగానే రషీద్‌ని పెళ్లాడింది. అధికారుల అనుమతితో జైలు నాలుగు గోడల మధ్యే అతడి అర్ధాంగి అయ్యింది. నాలుగు నెలల తరువాత జైల్లోని ‘టూ రూమ్ ట్రైలర్’లో ఆ ఇద్దరికీ రెండు రోజులు ఏకాంతంగా గడిపేందుకు అనుమతి లభించింది. ఆ రోజు ఇద్దరూ ఒక్కటయ్యారు. నాటి నుంచీ ‘నేను నేను కాదు’’ అంటున్నాడు రషీద్. నిజమే కదా! - యాకుబ్ పాషా -
చివరి ప్రేమలేఖ!
గ్రేట్ లవ్ స్టోరీస్ తన కవితల ద్వారా ప్రపంచానికి ప్రేమను దగ్గర చేసిన కవి జాన్ కీట్స్. కానీ అతని దరికి ‘ప్రేమ’ చేరడానికి మాత్రం చాలా కాలమే పట్టింది. కీట్స్ ఎనిమిదో ఏట అతని తండ్రి చనిపోయాడు. తల్లి ప్రేమలో తలమునకలై... అమ్మచాటు బిడ్డగా బతుకుతున్న కీట్స్‌ను విధి మరోసారి చిన్నచూపు చూసింది. పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు అతణ్ని వదిలి తల్లి కూడా వెళ్లిపోయింది. పొరుగింటి డాక్టర్ కీట్స్‌ను ఓదార్చాడు. ఏదైనా పనిలో పడితే గానీ దుఃఖం నుంచి తేరుకోడనే ఉద్దేశంతో తన దగ్గర అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. ‘గయ్స్ హాస్పిటల్’లో పని చేస్తున్నా డన్న మాటేగానీ కీట్స్ మనసు ఎక్కడో ఏకాంత దీవిలో తచ్చాడేది. ఆ దీవిలో తాను పుంఖాను పుంఖాలుగా కవిత్వం రాస్తున్నట్లు కలగనేవాడు. ఆ కలలు నిజమయ్యాయి. కీట్స్ రాసిన ‘ఒ సాలిట్యూడ్’ కవిత అచ్చయింది. ఆ తర్వాత మరికొన్ని. అయితే అతడి కవితలు అచ్చవుతున్న కాలంలో సాహితీ విమర్శకుల నుంచి ప్రశంసల చిరుజల్లుల కంటే విమర్శల జడివానే ఎక్కువ కురి సింది. ఆ బాధలో ఉన్నప్పుడే తమ్ముడు చనిపోయాడు. నరాల్లో రక్తానికి బదులు బాధ ప్రవహిస్తున్నట్లుగా ఉంది. తన ఇంటిని ఖాళీ చేసి లండన్‌లోని ప్రశాంత ప్రాంతమైన హేత్కు వెళ్లిపోయి స్నేహితుడి రూమ్‌లో ఉన్నాడు. పక్కింటి అమ్మాయిగా అక్కడే పరిచయం అయింది ఫ్యానీ బ్రాన్! కవిత్వం వారిద్దరినీ దగ్గర చేసింది. దాంతో ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాడు కీట్స్. ఆ ప్రపంచంలో మునుపటి చీకటి, దుఃఖం లేవు. వెన్నెల వెలుగులు, తేనె జలపాతాలు ఉన్నాయి. మనసు సహ కరించినప్పుడు గానీ కవిత్వం రాసేవాడు కాదు ఒకప్పుడు. తేజోమయమైన మన సుతో రోజూ రాస్తున్నాడు ఇప్పుడు. కవిత్వమే కాదు... ప్రేమలేఖలూ రాస్తు న్నాడు. తన లోని సృజనశక్తి రెట్టింపయి నట్లు అనిపించింది. ప్రేమకున్న శక్తి అదే! కీట్స్... ప్రతి రోజులో ఒక కొత్త రోజును చూస్తున్న రోజులవి. అలాం టప్పుడు ఓ రోజు మృత్యువు తన చుట్టు పక్కలే కదలాడటం గమనించాడు కీట్స్. ఉన్నట్టుండి విపరీతంగా దగ్గు వచ్చింది. నోట్లో నుంచి రక్తం పడింది. కొన్ని రోజులు వైద్యం నేర్చుకున్న కీట్స్‌కి ఆ రక్తంలో ఏదో తేడా కనిపించింది. చివరికి ఆయన ఊహించిందే జరిగింది. ‘నీకు టీబీ సోకింది’ అని చెప్పారు డాక్టర్లు. తన దగ్గర ఉన్న అపూర్వమైన నిధిని అకస్మాత్తుగా ఎవరో దొంగిలించినట్లు అనిపించింది కీట్స్‌కి. అయినా మౌనంగా ఆ బాధను భరించాడు. కొన్ని రోజుల తరువాత పరిస్థితి విషమించింది. శరీరం కుంగిపోతోంది. మనసు అంతకంటే కుంగిపోతోంది. ‘లోకాన్ని విడిచి వెళ్లడానికి భయం లేదు. ఆమెను విడిచి వెళ్లడానికి మాత్రం భరించలేనంత బాధగా, భయంగా ఉంది’ అంటూ తన మిత్రుడికి లేఖ రాశాడు. ఫ్యానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మనసులో అగ్ని పర్వతాలు బద్ద లవుతున్నా, బాధ చివ్వున ఎగజిమ్ము తున్నా తట్టుకుని కీట్స్‌కు సపర్యలు చేస్తోంది. అంతలో కీట్స్ మిత్రుడు జోసెఫ్ సోవెర్న్ వచ్చాడు. మెరుగైన చికిత్స కోసం కీట్స్‌ను ఇటలీకి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. ఓడ ఎక్కేముందు ప్రేమికులిద్దరూ తృప్తిగా మాట్లాడు కున్నారు. ‘నీ కోసం మళ్లీ బతుకుతాను’ అన్నాడు కీట్స్. ‘నా కోసం బతకాలి’ అని అర్థించింది ఫ్యానీ. ఒకరిని వదల్లేక ఒకరు అల్లాడారు. తప్పనిసరై బై చెప్పుకున్నారు. ఇటలీకి వెళ్లిన కొంత కాలానికి కీట్స్ ఆరోగ్యం విషమించింది. పాతికేళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. రోమ్‌లోని ప్రొటెస్టెంట్ సిమెట్రీలోని సమాధిలో చేరిపోయాడు. ఆ నిలువెత్తు సమాధి ఫలకాన్ని చూస్తే... ఫ్యానీ కోసం అతడు రాసిన చివరి ప్రేమలేఖలా కనిపిస్తుంటుంది! కీట్స్, ఫ్యానీల ప్రేమకథను ‘బ్రైట్ స్టార్’ (2009) పేరుతో తెరకెక్కించారు న్యూజిలాండ్ దర్శకురాలు ఎలిజబెత్ జెన్ క్యాంపియన్. లండన్‌కు చెందిన కవి, నవలా రచయిత ఆండ్రూ మోషన్ రాసిన కీట్స్ జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విడుదల సమయంలో ప్రసిద్ధ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ‘బ్రైట్‌స్టార్: లవ్ లెటర్స్ అండ్ పొయెమ్స్ ఆఫ్ జాన్ కీట్స్ టు ఫ్యానీ బ్రాన్’ పేరుతో 144 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. -
ఒక ఎడారి పువ్వు!
గ్రేట్ లవ్ స్టోరీస్ నాజీ క్యాంపులు ఎలా ఉంటాయి? ఎవరో నరాలను గట్టిగా మెలిపెడు తున్నట్లుగా ఉంటాయి. చావుకు బతుకుకు మధ్య శ్వాస ఆడక...‘బతికి చావడం కంటే, చచ్చి బతకడం నయం’ అనిపించేలా ఉంటాయి. హిట్లర్ నాజీ క్యాంపులలో జీవితమే ఉండదు. అలాంటిది ‘ప్రేమ’ ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది. ప్రేమని బందూకులు భయపెట్టలేవు. ఇంకే రకమైన భయాలూ దాన్ని ఆపలేవని నిరూపించిన చారిత్రక ప్రేమకథ ఇది. పోలెండ్‌లోని నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపులో గార్డగా పని చేస్తాడు ఫ్రాంక్. అతడు ఎలా ఉంటాడు? అడగాల్సిన అవసరం లేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఫ్రాంక్ కూడా జాత్యాహంకారంతో, యూదు వ్యతిరేకతతో... మిలిగిన నాజీలలాగే కఠినంగా ఉంటాడు. 1933... హిట్లర్ పవర్లోకి వచ్చిన రోజులవి. నాజీలలో విజాతి వ్యతిరేకత అగ్గిలా ఎగిసిపడుతోన్న దినాలవి. పోలెండ్‌లోని కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లో భయం రాజ్యమేలుతోంది. జర్మన్ ఆక్రమిత ప్రాంతాలలోని యూదులు, కమ్యూనిస్ట్ ప్రేమికులు మొదలైన వాళ్లు దీనిలో బందీలు. అలాంటి వాళ్లలో హెలెనా సిట్రోనోవా ఒకరు. స్లొవేకియాకు చెందిన హెలెనా యూదు మతంలో పుట్టడమే తప్పైపోయింది. చేయని నేరానికి డెత్ క్యాంపులోకి వచ్చి పడింది. కొందరిని మాట కలుపుతుంది. కొందరిని పాట కలుపుతుంది. కరడుగట్టిన మూర్ఖ భావాలతో రగిలిపోయే ఫ్రాంక్, కలువపువ్వులాంటి హెలెనాతో ప్రేమలో పడడానికి కారణం మాత్రం పాట! ఒకానొకరోజు డెత్క్యాంప్లో ఒంటరిగా పాట పాడుకుంటోంది హెలెనా. అది ఫ్రాంక్ విన్నాడు. ఆమె గొంతు, పాడిన విధానం ఫ్రాంక్‌కు తెగ నచ్చేశాయి. అందుకే తన పుట్టిన రోజు వేడుకలో ఆ అమ్మాయితో పాట పాడించుకున్నాడు. ఇక ఆరోజు నుంచి హెలెనాను మౌనంగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సాకుతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడు. అదేంటో తెలియదుగానీ, హెలెనాని ప్రేమించడం మొదలు పెట్టినప్పటి నుంచి అతనిలో కోపం మాయమైంది. ఎప్పుడూ ద్వేషం, అశాంతితో నిండి ఉండే అతని హృదయం ప్రశాంత సరోవరం అయింది. ఓసారి ఒక మూల పనిచేసుకుంటున్న హెలెనాపై ఒక చీటీ విసిరాడు ఫ్రాంక్. ఆ చిన్న చీటీలో పెద్ద మాట ఉంది... ‘ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ.’ ‘పిచ్చివాడిలా ఉన్నాడు’ అని నవ్వుకుంది హెలెనా. సరదా కోసం అలా రాసి ఉంటాడని కూడా అనుకుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ తన పట్ల అతడి కళ్లలో కనిపించే నిజాయితీని గమనించింది. తనకు తెలియకుండానే ఫ్రాంక్ ప్రేమలో పడిపోయింది. గంటల తరబడి మాటలు లేవు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. చూపులతోనే వారి మనసులు ముడిపడి పోయాయి. సమయం చూసుకొని, అందరి కళ్లూ గప్పి, హెలెనాని, ఆమె అక్కని క్యాంపు నుంచి తప్పించాడు ఫ్రాంక్. వాళ్లు ఇజ్రా యెల్ వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఆ తర్వాత ఫ్రాంక్, హెలెనాలు కలుసు కున్నారా, మనసు విప్పి మాట్లాడు కున్నారా, ఇద్దరూ ఒక్కటయ్యారా అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. అది నేటికీ రహస్యమే. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మాత్రం....అతని హృదయంలో ఆమె, ఆమె హృదయంలో అతడు ముద్రపడిపోయారని! వారి ప్రేమ అజరామరమైనదని!! * ఫాంక్, హెలెనాల ప్రేమకథపై ఇజ్రాయెల్ టీవీలో 2003లో ‘ఏ డిఫరెంట్ లవ్ స్టోరీ’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. * వీరి ప్రేమకథపై ‘ఫర్ సచ్ ఏ టైమ్’ అనే నవల వచ్చింది. కేట్ బ్రెస్ట్లిన్ రాసిన ఈ నవల ‘ఇన్స్పిరేషనల్ రొమాంటిక్ నావెల్’గా గుర్తింపు పొందింది. -
ఇక సెలవని...
గ్రేట్ లవ్ స్టోరీస్ * మనిషి మరణించవచ్చు. * ప్రేమ మరణించదు. * జ్ఞాపకంగానైనా బతికే ఉంటుంది. సెప్టెంబర్ 11, 2001. టీవీ ఆన్ చేసి వార్తలు వింటూ, ఏదో పని చేసుకుంటోంది బెవెర్లీ. అంతలో ఓ పిడుగులాంటి వార్త. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్‌పై దాడి చేశారు. వణికిపోయింది బెవర్లీ. భర్త షాన్ కళ్ల ముందు మెదిలాడు. అతడు వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని సౌత్ టవర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పొద్దున్న నవ్వుతూ బై చెప్పి వెళ్లాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో! వెంటనే అక్కడికి వెళ్లేందుకు సమా యత్తమయ్యింది బెవెర్లీ. అంతలోనే ఆమె ఫోన్ రింగయ్యింది. చేసింది షాన్. ‘‘షాన్... ఎక్కడున్నావ్? ఎలా ఉన్నావ్?’’ అంది కంగారుగా. ‘‘105వ ఫ్లోర్లో ఉన్నాను. ఇంటికి వచ్చేస్తాను, కంగారుపడకు’’ అన్నాడు ఎంతో కూల్‌గా. ప్రమాదం నుంచి బయట పడడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు చెప్పాడు. దాంతో కాసింత ధైర్యం వచ్చింది బెవెర్లీకి. షాన్ ఫోన్ పెట్టేశాడు. మెట్లమార్గం ద్వారా వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ పొగ, వేడి తట్టుకోలేక వెనక్కి వచ్చేశాడు. లాక్ వేసి ఉండడంతో రూఫ్ డోర్స్ ద్వారా తప్పించుకునే ప్రయత్నమూ విఫలమైంది. మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే బెవెర్లీ గుర్తొచ్చింది. ఫోన్ చేశాడు. ‘‘దారి ఏమైనా కనిపించిందా షాన్?’’ గొంతులో కోటి ఆశలు నింపుకొని అడి గిందామె. ‘‘లేదు... పొగ మరింత దట్టంగా వస్తోంది’’ అన్నాడు షాన్. అతడు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మృత్యువు అతనికి అతి చేరువలోకి వచ్చిన విషయం అర్థమైంది. ‘‘ఐ లవ్యూ షాన్. ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా నేనుండలేను’’ అంది పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. ‘‘నేను ఎక్కడికీ వెళ్లను. ఎప్పుడూ నీతోనే ఉంటాను. బతికి వస్తే భర్తగా, మరణిస్తే జ్ఞాపకంగా’’... అన్నాడు షాన్. తన మాటలతో ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె కళ్లనీళ్లతో ఆ మాటలను వింటూనే ఉంది. కొద్ది నిమి షాల్లో కొన్ని యుగాలకు సరిపడా విలువైన మాటలు మాట్లాడుకున్నారు వాళ్లు. పొగ ఎక్కువైంది. షాన్ గొంతు తడబడుతోంది. దగ్గు తెరలు తెరలుగా వస్తోంది. మాట రావడమే కష్టంగా ఉంది. ‘‘నీకేమైనా అయితే నేనూ చనిపోతాను’’ అంది ఏడుస్తూ బెవెర్లీ. ‘‘అలా చేయనని నాకు మాటివ్వు’’ అని ఒట్టు వేయించు కున్నాడు షాన్. ముద్దు పెట్టి ఐలవ్యూ అన్నాడు. ఐ లవ్యూ టూ అనాలనుకుంది బెవెర్లీ. కానీ అంతలోనే పెద్ద శబ్దమేదో వినిపించింది. గుండెల్లో వేయి అగ్ని పర్వతాలు పేలినట్లయింది. షాన్ షాన్ అని అరుస్తూనే ఉంది. బదులు లేదు. విషయం అర్థమైంది. షాన్ వెళ్లిపోయాడు. తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కొండంత దుఃఖం. చనిపోవాలని ఉంది. కానీ భర్తకు ఇచ్చిన మాట కోసం గుండె రాయి చేసుకుంది. మనసు లోతు ల్లోంచి బాధ తన్నుకొస్తున్నా నిభాయించు కుంది. భర్త లేని వెలితిని పోగొట్టుకోవ డానికి తాను మరికొందరికి తోడుగా నిలబడాలని నిర్ణయించుకుంది. నాటి నుంచీ సామాజిక సేవలో మునిగి పోయింది. ముఖ్యంగా సెప్టెంబర్ 11 బాధితులకు న్యాయ సహాయం అందిం చేందుకు నడుం కట్టింది. ప్రభుత్వంతో పోరాడి ఎందరికో న్యాయం చేకూర్చింది. అలా ఎనిమిదేళ్లు సేవే లోకంగా గడిపింది. కానీ ప్రతిక్షణం భర్తను తలచుకుంటూనే ఉంది. అతణ్ని చేరే రోజు త్వరగా రావాలని దేవుణ్ని వేడుకుంటూనే ఉంది. చివరికి ఆ రోజు వచ్చింది.. 2009లో! షాన్ పుట్టినరోజును అతని బంధువులతో కలిసి జరుపుకోవాలని కాంటినెంటల్ ఫ్లైట్ 3407లో బఫెలో సిటీకి బయలుదేరింది బెవెర్లీ. బయలుదేరిన కాసేపటికే ఆ విమానం కూలిపోయింది. బెవెర్లీ ప్రాణాలు కోల్పోయింది. బహుశా ఆమె ఆ క్షణంలో భయపడి ఉండదు. బాధపడీ ఉండదు. షాన్ని చేరుకుంటానని సంతోషపడి ఉంటుంది. ‘నీ చెంతకే వస్తున్నాను ప్రియా’ అంటూ ఆనందంగా కన్నుమూసి ఉంటుంది! -
మన్నించుమా ప్రియా!
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘‘ఎంత బాగా పాడతాడు!’’ అనుకుంది క్రిస్టినా. అలా ఆమె అనుకోవడం అది వందోసారి! జిమ్మీ మోర్గంటీ అద్భుతంగా పాడతాడు. ముఖ్యంగా అతను పాడే విషాదగీతం- ‘వెన్ యూ ఆర్ డ్రీమింగ్ విత్ ఏ బ్రోకెన్ హార్ట్’ అంటే ఆమెకి ఎంత ఇష్టమో! క్రిస్టినా, జిమ్మీల మధ్య స్నేహం పెరగడానికి, అది ప్రేమగా మారడానికి, పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ‘పాట’ మాత్రమే కాదు, వారి అభిరుచులు ఒక్కటి కావడం కూడా కారణం! ఆరోజు న్యూజెర్సీలో... ఫ్రెండ్స్, బంధువుల కోసం తన ఆంటీవాళ్ల ఇంట్లో విందు ఏర్పాటు చేసింది క్రిస్టినా. ఆ విందులో తన పెళ్లి గురించి ప్రకటించాలనేది ఆమె ప్లాన్. జిమ్మీ మోర్గంటీ పాత, కొత్త పాటలతో ఆ విందును పసందుగా మార్చాడు. అంతలో క్రిస్టినాకి ఓ కోరిక పుట్టింది. ఆ సంతోష సమయంలో సరదాగా స్విమ్ చేయాలని ఆశపడింది. స్విమ్మింగ్ పూల్‌లో దూకింది. ఒక్కసారిగా ఏదో శబ్దం... అంతలోనే నిశ్శబ్దం. జిమ్మీకి అనుమానం వచ్చింది. వెంటనే పూల్‌లోకి దూకేశాడు. అను కున్నట్లే అయింది. క్రిస్టినా మెడకు బల మైన గాయం అయింది. బాధతో విల విలలాడిపోతోంది. జిమ్మీ మనసు అల్లాడి పోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి చేరుకున్నాడు. స్విమ్మింగ్‌పూల్‌లో దూకినప్పుడు క్రిస్టినాకు గచ్చు బలంగా తగిలింది. ఆ షాక్‌లో పక్షవాతం వచ్చింది. వీల్ చెయిర్‌కి పరిమితమైపోయింది. ఆమె పనులు ఆమె చేసుకోలేని పరిస్థితి. దాంతో దుఃఖిస్తూనే ఉండేది. జిమ్ ఆమెను పాటలతో అల రించేవాడు. జోక్స్ చెప్పి నవ్వించేవాడు. ధైర్యం నూరిపోసేవాడు. జీవితం విలువ గురించి చెబుతుండేవాడు. వింటున్నంత సేపూ ధైర్యంగా కనిపించేది. కానీ తర్వాత మళ్లీ నిరాశ, నిస్పృహ! ఒకరోజు క్రిస్టినా కోసం వచ్చాడు జిమ్మీ. ఆమె గదిలో నిద్రపోతోంది. ‘‘తనని డిస్టర్బ్ చేయకు. ఆమె జీవితాన్ని పాడు చేసింది చాలు’’ అన్నాడు క్రిస్టినా మారుతండ్రి. ‘‘నీతో ప్రేమలో పడ్డాకే నా కూతురి పరిస్థితి ఇలా అయింది. పెళ్లయితే ఇంకేమైనా ఉందా! వెళ్లు’’ అని అరిచింది క్రిస్టినా తల్లి. జిమ్మీ కళ్లు కన్నీటి సంద్రా లయ్యాయి. మౌనంగా వెళ్లిపోయాడు. స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ! ‘‘జిమ్మీ ఇవాళ రాలేదా?’’ అడిగింది క్రిస్టినా. ‘‘రాలేదు’’ అని సమాధానం. వారం రోజుల పాటు అదే సమాధానం. ‘‘మొన్నటి వరకు నేను లేక బతకలేను అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి చూసి ముఖం చాటేశాడు’’ అని కుమిలి పోయింది. కానీ తర్వాత స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ! ఆ రాత్రి క్రిస్టినాకు నిద్ర పట్టలేదు. ‘నేను జిమ్మీని పెళ్లాడడం సరైన నిర్ణయ మేనా? నన్ను చేసుకుని అతనేం సుఖపడ తాడు, నాకు సేవ చేస్తుండడం తప్ప’ అని దుఃఖించింది. ‘నా స్వార్థం కోసం అతడి జీవితాన్ని బలి తీసుకోలేను’ అనుకుంది. ‘‘ఇక జిమ్మీని నా దగ్గరికి రానివ్వొద్దు’’ అని తల్లిదండ్రులను కోరింది. వాళ్లకు అది వేరే విధంగా అర్థమైంది. కానీ నిజానికి ఆమె అనుకుంది వేరు. నాటి నుంచీ భోజనం మానేసింది క్రిస్టినా. ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఎంతో బతిమిలాడారు. కానీ వినలేదు. ‘క్షణ క్షణం బతుకుతూ చావలేను’ అంది. ‘చని పోయే హక్కు నీకు లేదు’ అంటే ‘రైట్- టు-డై’ లా గురించి మాట్లాడేది. రోజులు భారంగా సాగిపోతున్నాయి. క్రిస్టినా శరీరాన్ని కొత్త కొత్త సమస్యలు చుట్టు ముడుతున్నాయి. విషయం తెలిసి జిమ్మీ వచ్చాడు. మనసు మార్చుకోమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మౌనంగా ఉండిపోయింది క్రిస్టినా. ఆ తర్వాత మూడు రోజులకి ఆమె స్వరం పూర్తిగా మూగవోయింది. ఆమె కన్ను శాశ్వతంగా మూతపడింది. ‘నా కోసం నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను మన్నించు’ అంటూ జిమ్మీకి రాసిన చివరి లేఖలో పేర్కొంది క్రిస్టినా. కానీ ఆమె తప్పుగా ఆలో చించింది. తాను వెళ్లిపోతే జిమ్మీ తనను మర్చిపోతాడనుకుంది. జీవితంలో ముందుకు సాగిపోతాడనుకుంది. అలా జరగలేదు. జిమ్మీ నేటికీ ఆమె ఆరాధన లోనే గడుపుతున్నాడు. ఆమె జ్ఞాపకాలతో జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. -
గుర్తుకొస్తాయని...
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘కోకిల... తనకు ఇష్టమైన వసంతాన్ని మరిచిపోయింది. తనకు మరీ ఇష్టమైన గానాన్ని మరిచిపోయింది. ఇప్పుడు వసంతకోకిల దుఃఖనదిగా మారింది!’ ‘‘నీ ముఖం నాకు చూపించకు... వెళ్లు... తక్షణం ఇక్కడి నుంచి వెళ్లు’’ అరిచింది క్రిక్. ఆమె కళ్లు ఎర్రగా ఉన్నాయి. కోపంతో జ్వలిస్తున్నాయి. ‘‘అలా అనకు క్రిక్... నేను తట్టుకోలేను. నేను నీ భర్తను...’’ చెప్పు కుంటూ పోతున్నాడు కిమ్ కార్పెంటర్. ‘‘నువ్వెవరో నాకు తెలియదు. వెళ్లు ఇక్కడి నుంచి’’ ఈసడించుకుంది క్రిక్. కిమ్ విలవిల్లాడిపోయాడు. భారంగా గుండెను చేత్తో పట్టుకున్నాడు. అతడి మదిలో అలలు అలలుగా జ్ఞాపకాలు...... ఇరవై నాలుగు సంవత్సరాల క్రిక్ (కాలిఫోర్నియా, యు.ఎస్.) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక స్పోర్ట్స్ గూడ్స్ కంపెనీలో రిప్రజెంటేటివ్‌గా చేరింది. ఒకరోజు కంపెనీ పనిలో భాగంగా న్యూ మెక్సికోలోని హ్యాలాండ్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల కిమ్ కార్పెంటర్ పరిచయం అయ్యాడు. అతను అక్కడ బాస్కెట్‌బాల్ కోచ్. క్రిక్ తరపున చాలా స్పోర్ట్స్ జాకెట్లు అమ్మి పెట్టాడు కిమ్. అలా వారి మధ్య స్నేహం మొలకెత్తింది. ఫోన్లో గంటల తరబడి మాటలు. వందల్లో విరిసిన ప్రేమలేఖలు! ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేని పరిస్థితి. ఒక వారాంతంలో క్రిక్ను వెదుక్కుంటూ కాలిఫోర్నియా వచ్చేవాడు కిమ్. ఇంకో వారాంతంలో కిమ్‌ను వెదుక్కుంటూ న్యూ మెక్సికో వెళ్లేది క్రిక్. కొంత కాలానికి వారి ప్రేమ పెళ్లిగా మారింది. క్రిక్, కిమ్‌లు భార్యాభర్తలయ్యారు. రెండు నెలల తరువాత... క్రిక్ తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి కిమ్‌తో కలిసి కారులో బయలుదేరింది. డ్రైవింగ్ సీట్లో కిమ్ కూర్చుని ఉన్నాడు. అంతలో పెను ప్రమాదం...! వెనక నుంచి ఒక లారీ వచ్చి ఢీ కొట్టింది. కారు ఎగిరిపడింది. కిమ్ పక్కటెముకలు విరిగాయి. క్రిక్ అయితే కోమాలోకి వెళ్లి పోయింది. నాలుగు మాసాలు ఈ లోకంలో లేదు క్రిక్. తర్వాత ఓ రోజు కళ్లు తెరిచింది. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తోన్న కిమ్ ఆనందంగా ఆమె దగ్గరకు వెళ్లాడు. కానీ అతణ్ని చూసిన కిమ్‌లో ఏ స్పందనా లేదు. కనీసం అతణ్ని గుర్తించినట్టు ఆమె కళ్లు కూడా మెరవలేదు. అల్లాడిపోయాడు కిమ్. క్రిక్‌కి ఏమైందంటూ డాక్టర్లను ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. చివరకు వాళ్లు చెప్పిన విషయం విని విలవిల్లాడాడు. తలకు బలమైన గాయాలు కావడం వల్ల జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయింది క్రిక్. పండ్లు తోముకోవడం నుంచి నడ వడం వరకు ఏది ఎలా చేయాలో కూడా మరిచిపోయింది! ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకురావడానికి నాటి నుంచీ ప్రయత్ని స్తూనే ఉన్నాడు కిమ్. ఇంటెన్సివ్ థెరపీ చేయిస్తున్నాడు. తమ ఇద్దరికీ సంబంధిం చిన విషయాలను చెప్తున్నాడు. తాము కలిసి తిరిగిన ప్రదేశాలకు తీసుకెళ్తున్నాడు. కానీ ఫలితం లేదు. అతడిని గూర్చిన ఏ జ్ఞాపకమూ క్రిక్ మనసులో మెదలట్లేదు. పాతికేళ్లుగా ఆమె కళ్లలో అదే శూన్యం. ‘‘మేము మొదటిసారి కలుసుకున్న సందర్భం, మాట్లాడుకున్న మాటలు, మా తియ్యటి జ్ఞాపకాలను తనకి గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఎన్ని గుర్తు చేసినా సరే... తను నన్ను అపరిచితుడి లానే చూస్తోంది’’ అంటాడు దుఃఖాన్ని ఆపుకుంటూ. ‘‘ఇప్పుడు నేను తన భర్తను కాదు తండ్రిని’’ అంటున్నప్పుడు కిమ్ ఉద్వేగాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ప్రేమకు బలం... నమ్మకం! ఆ నమ్మకంతోనే కిమ్ ముందుకు సాగుతు న్నాడు. తన ప్రియసఖి ఒక్కసారి తనను గుర్తిస్తే చాలని తపిస్తున్నాడు. క్రిక్, కిమ్ కార్పెంటర్ల ప్రేమకథ ఆధారంగా హాలీవుడ్లో ‘ది వావ్’ సినిమా రూపుదిద్దుకుంది. మైఖేల్ సక్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘హయ్యెస్ట్ గ్రాసింగ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ఆఫ్ ఆల్‌టైమ్’ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. అలాగే వీరి ప్రేమ ఆధారంగా తెరకెక్కిన ‘ఫిఫ్టీ ఫస్ట్ డేట్స్’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. -
పేరుకే ఇద్దరు... ప్రేమలో ఒక్కరు
* గ్రేట్ లవ్ స్టోరీస్ ‘ప్రేమలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... అది ‘బాధ’ను కూడా మహత్తరమైన శక్తిగా మారుస్తుంది!’ ఆమె: వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే... అది తన కోసమే అని ఆనందించే అందాల బొమ్మ కెల్లీ. ఎంతో చురుగ్గా ఉంటుంది. స్విమ్మింగ్, బైకింగ్, డ్యాన్స్... అనేకానేక కళలలో ఆరితేరిన ఆమె, తన భవిష్యత్ చిత్రపటాన్ని సుందరంగా చిత్రించుకుంది. ఆమెకు తన వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలతో పాటు, తనకు కాబోయేవాడి గురించి కూడా ఎంతో అందమైన ఊహలు ఉన్నాయి. అతడు: ధైర్యానికి మరోపేరులా ఉంటాడు జెస్సీ కాటిల్. అలా అని గంభీరంగా, ముఖం మాడ్చుకొనేం కనిపించడు. హుందాగా ఉంటాడు. తెలిసినవాళ్లతో మాత్రం సరదా సరదాగా ఉంటాడు. అమెరికాలో ఎన్ఇఒడి (నేవీ ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్) టెక్నీషియన్‌గా పని చేసే అతడు ఆపత్కాలంలో తన సత్తా చాటుతుంటాడు. జెస్సీని చూస్తే బాంబులే కాదు, భయాలు కూడా బెదురుతాయి. అనగనగా ఒకరోజు... బైస్ సిటీలో ఫేమస్ స్విమ్మర్ అయిన కెల్లీతో ఆరోజు అనుకోకుండా పరిచయం అయింది జెస్సీకి. ఆ పరిచయం దృఢపడి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల మధ్యా స్నేహాలు విరిశాయి. రెండు కుటుంబాలూ తరచూ కలుసుకుని సంతోషాన్ని పంచుకునేవి. పిల్లలిద్దరి మనసుల్లో ఉన్న ప్రేమను అర్థం చేసుకున్నాయి. మంచి టైమ్ చూసి... కెల్లీ, జెస్సీలకు ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇక వెళ్లొస్తానని... ‘‘నా మనసుకేదో భయంగా ఉంది’’ అంది కెల్లీ ఆ రోజు. ‘‘ఛ... భయమే మనల్ని చూసి పారిపోవాలి. దానికి నా దగ్గరో చిట్కా ఉంది. వెళ్లేప్పుడు నీ చిరునవ్వును పర్స్‌లో పెట్టుకొని వెళతాను. ఎప్పుడైనా భయమేసినప్పుడు ఆ చిరునవ్వుని చూస్తే చాలు... భయం పారిపోతుంది’’ అంటూ గట్టిగా నవ్వాడు జెస్సీ. ఆ నవ్వుతో కెల్లీ శృతి కలిపింది. మరుసటిరోజు జెస్సీ అఫ్గానిస్తాన్‌కు వెళుతున్నాడు విధులు నిర్వహించడానికి. నాటికి ఆఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో న్యూస్‌పేపర్లు, టీవీ చానెళ్లు చెబుతూనే ఉన్నాయి. అందుకే కెల్లీలో ఆ కలవరపాటు! రోజులు గడుస్తున్నాయి. ఆఫ్గానిస్తాన్ నుంచి తన ప్రియుడు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందా అని లెక్కలు వేసుకుంటోంది కెల్లీ. జెస్సీ రాలేదు. కానీ గుండె చెదిరే వార్త ఒకటి వచ్చింది. మందుపాతర వెలికితీసే క్రమంలో జెస్సీ తీవ్రంగా గాయపడ్డాడు. ‘బతకడం కష్టం’ అంటూ డాక్టర్లు పెదవి విరిచారు. కెల్లీ అల్లాడిపోయింది. తన ప్రాణ ప్రియుడి ప్రాణాలు కాపాడమని దేవుడిని అర్థించింది. ఆయన కరుణించాడు. జెస్సీ బతికాడు. కానీ ప్రాణాలు మిగిల్చిన దేవుడు కాళ్లు మాత్రం తీసుకెళ్లిపోయాడు! హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు జెస్సీ. అతని కళ్లలో దైన్యం. జీవితాన్నే కోల్పో యాను అన్న నిర్వేదం. అతణ్నలా చూడలేకపోయింది కెల్లీ. ధైర్యం చెప్పబోయింది. ‘‘నా నవ్వులు ఇంకా నీ పర్సులోనే ఉన్నాయి, మర్చిపోయావా’’ అంటూ అందంగా నవ్వింది. కానీ జెస్సీ నవ్వలేదు. ‘‘అవిటివాడిని చేసుకుని ఏం సుఖపడతావ్, వెళ్లిపో’’ అన్నాడు ఎటో చూస్తూ. కెల్లీ మాట్లాడలేదు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ‘నీతోనే నా జీవితం’ అన్న అర్థం స్ఫురించింది ఆ స్పర్శలో! జెస్సీకీ ఎన్నో సర్జరీలు జరిగాయి. కృత్రిమ కాళ్లతో నడవటానికి కొన్ని నెలలు పట్టింది. అంతవరకూ అతణ్ని కళ్లలో పెట్టి కాచుకుంది కెల్లీ. ఎక్కడికి వెళ్లినా జెస్సీని తనతో తీసుకుపోయేది. బిడ్డను వీపున మోసినట్టుగా అతడిని మోసుకుపోతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రేమ ఉండదు అంటూ కితాబు ఇచ్చారు!ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పేరుకే ఇద్దరు. ప్రేమలో ఒక్కరు! -
క్షణ క్షణం...నీ నిరీక్షణలో!
అభిరుచులు కలిశాయి. మనసులు ఒక్కటయ్యాయి. మనువుతో బతుకులు ముడిపడ్డాయి. కానీ ఆ ముడి ఎందుకు విడిపోయింది? గ్రేట్ లవ్ స్టోరీస్ ‘ఆకాశంకేసి చూస్తున్నాను... గంటలు గడిచాయి. రోజులు, వారాలు గడిచాయి. నీ జాడ మాత్రం లేదు. నేల మీద ఇప్పుడే ఒక పువ్వు పూచింది. నువ్వు మళ్లీ పుట్టావు కదూ!’ ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమైతే... ప్రేమలు ఎక్కడ నిర్ణయమవుతాయి?’’ ఆ సాయంత్రం వర్షాన్ని చూస్తూ, వేడి కాఫీ చప్పరిస్తూ అడిగింది క్యాథలీన్.‘‘అభిరుచులు అనే స్వర్గంలో’’ అన్నాడు రెయాన్. ‘‘అందుకేనేమో మనం ఇలా ప్రేమికులమయ్యాం’’ అందంగా నవ్వుతూ అంది క్యాథలీన్. అంతలో పెద్ద శబ్దం. ఎక్కడో పిడుగు పడింది. భయంగా చెవులు మూసుకుంది క్యాథలీన్. ‘‘ఎందు కలా చిన్నపిల్లలా భయపడతావు?’’... భుజం మీద చేయివేస్తూ అన్నాడు రెయాన్. ‘‘కొన్ని భయాలంతే. వయసుతో పాటు పెరిగి పెద్దవుతాయి’’ అందామె. రెయాన్, క్యాథలీన్లు ప్రేమలో పడడానికి బలమైన కారణం...వారి అభిరుచులు ఒక్కటి కావడమే! జంతుసంక్షేమం నుంచి ప్రకృతి ప్రేమ, సినిమాలు, యోగా, పర్వతా రోహణ వరకు... ఇద్దరి అభిరుచులూ ఒక్కటే. ‘అతడు నా మనిషి’ అని ఆమె, ‘ఆమె నా మనిషి’ అని అతడు అనుకోవ డానికి వారికి ఎంతో కాలం పట్టలేదు. ‘‘ఆమె నా ప్రేమికురాలు మాత్రమే కాదు.. నాకు దారి చూపే వెలుగు దీపం. నా కోసమే పుట్టింది. ఆమె నా వెనకాల ఉంటే ఏదైనా చేయగలను’’ అంటూ ఉండేవాడు రెయాన్. అతని ప్రేమ ఎంత గొప్పదో తెలుసు కనుక అతని ఫ్రెండ్సకి ఆ మాటలు అతిశయోక్తుల్లా తోచేవి కావు.అతడు అంత ప్రేమించడానికి క్యాథలీన్లో ఉన్న ప్రత్యేక క్వాలిటీస్ కూడా కారణమే. ఆమె అందమైనదే కాదు, గొప్ప మనసున్నది. ఆ గొప్పదనాన్ని ఇతరులకు సాయం చేస్తోన్న ఎన్నో సందర్భాల్లో గమనించాడు రెయాన్. ఆ మంచితనానికే మనసు పారేసుకున్నాడు. ప్రేమలో పడ్డ ఆరు నెలలకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ సంతోషాన్ని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని కొలెరాడోలోని మౌంట్ యేల్ పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లారు. మౌంట్ యేల్ పర్వత శిఖరాలు, బూడిద రంగులో ఉన్న ఆకాశంతో ఏదో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘‘చూడు... ఆ దృశ్యం ఎంత ముచ్చటగా ఉందో’’ అంది క్యాథలీన్. ‘‘ శిఖరం నేనైతే... ఆకాశం నువ్వు’’ కవిత్వం అల్లాడు రెయాన్. పర్వతారోహణ మొదలైంది. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ ఎవరి దారిన వారు పర్వతాన్ని అధిరోహిస్తున్నారు. వాతావరణంలో మార్పేదో కనబడుతోంది. అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్న ఆకాశం... అపకారమేదో చేయబోతున్నట్లుగా ముఖం పెట్టింది. అంతవరకూ ఉన్న మౌనాన్ని వీడి, గొంతు సవరించుకొని గర్జిస్తోంది.క్యాథలీన్ కాస్త కంగారుపడింది. రెయాన్ ధైర్యం చెప్పాడు. అంతలో ఊహించని సంఘటన. ఓ పెద్ద పిడుగు క్యాథలీన్కు అతి చేరువలో పడింది. ఆమె శరీరం చాలా వరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగెత్తాడు రెయాన్. గంటలు గడుస్తున్నాయి. క్యాథలీన్ కోలుకోలేదు. రెయాన్ మెదడు స్తంభించి పోయింది. ఆమె వైపే దీనంగా చూస్తు న్నాడు. నలభై నిమిషాలు గడిచాయి. క్యాథలీన్కి అంతిమ ఘడియలు సమీపించాయి. మెల్లగా కళ్లు తెరిచింది. ఎందుకిలా జరిగింది అన్నట్టు రెయాన్ వైపు చూసింది. నిన్ను వీడి నేను వెళ్లలేను అన్నట్టుగా చేతిని అతని వైపు చాపింది. అతడు దాన్ని అందుకోబోయాడు. కానీ అంతలోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆమె చేయి నిర్జీవంగా వాలిపోయింది. క్యాథలీన్ అంత్యక్రియలు జరిగాయి. కానీ వాటికి రెయాన్ హాజరు కాలేదు. ఆమెను సమాధి చేశారు. కానీ ఇప్పటికీ అతడు దాన్ని చూడలేదు. ఎందుకంటే ఆమె చనిపోయిందన్న విషయాన్ని అతడు నమ్మడం లేదు. పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లిన క్యాథలీన్ కిందికి దిగి వస్తుందని నేటికీ రోజూ మౌంట్ యేల్ దగ్గర నిలబడి దీనంగా చూస్తున్నాడు! -
హృదయరాగం!
గ్రేట్ లవ్ స్టోరీస్ * వాళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? * ఎందుకు దగ్గరయ్యారు? * ఎలా ఒక్కటయ్యారు? ‘‘ప్రేమ అంటే జీవితం. ప్రేమకు దూరమైతే...జీవితానికి దూరం అయినట్లే!’’ రకరకాల ఎగ్జిబిషన్లకు వెళ్లడం అంటే కేల్ ఫ్రోలిక్కు ఎంతో ఇష్టం. ఆ ఇష్టానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... కొత్త వస్తువులను చూడవచ్చు. రెండు... కొత్త మనుషులను కలవవచ్చు! ఆరోజు ఒక ఫ్రెండ్‌తో కలసి డాన్విల్లీ టౌన్ (ఇండియానా, అమెరికా)లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్‌కు వచ్చాడు కేల్. అక్కడ అతనికి చెల్సియా అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. కొన్ని గంటల వ్యవధి లోనే వారి చిరు పరిచయం గాఢ పరిచయమై, అది మరింత గాఢ స్నేహంగా మారింది. ‘‘ఇంత చలాకీగా ఎలా ఉండగలుగు తున్నారు? ఆ రహస్యమేదో నాకు కూడా చెబితే రుణపడి ఉంటాను’’ అంటూ చిన్నగా నవ్వింది చెల్సియా. ‘‘ఎందుకంటే... కొద్దిరోజుల్లోనే నేను చనిపోతున్నాను కాబట్టి’’ అన్నాడు కేల్. ఉలిక్కిపడింది చెల్సియా.‘‘అదేంటి అలా అన్నావు?’’ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘నేను తమాషా కోసం అనలేదు. నిజమే చెబుతున్నాను. నా కిడ్నీలు పాడై పోయాయి. ఎంత త్వరగా కిడ్నీలు మారిస్తే అంత మంచిది. లేకపోతే చాలా కష్టం అన్నారు డాక్టర్లు. చాలా కష్టం అనే మాటను డాక్టర్ల నోటి నుంచి వినడం ఇది రెండోసారి. మా నాన్న చనిపోవడానికి కొంత కాలం ముందు కూడా ఇలాంటి మాటే విన్నాను. నేను కూడా చని పోతానేమో’’ గంభీరంగా అన్నాడు కేల్. ‘‘ఛ... అలా అనవద్దు. నువ్వు నిండు నూరేళ్లూ బతుకుతావు’’ అంటూ- ‘‘అవునూ... కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఇబ్బంది ఏమిటి? డబ్బుల సమస్యా లేక డోనర్స్ ఎవరూ లేరా?’’ అడిగింది చెల్సియా. ‘‘డబ్బు ఉంది, కిడ్నీ దానం చేయడానికి బంధుమిత్రులు రెడీగా ఉన్నారు. కానీ మ్యాచ్ కావడం లేదు. దేవుడు ఇంకా దయ చూపలేదు’’ కాస్త బాధగా అన్నాడు కేల్. ‘‘అయితే నేను ఇస్తాను..’’ అంది చెల్సియా. గట్టిగా నవ్వాడు కేల్. ‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అడిగింది. ‘‘చెల్సియా... మనం ఫ్రెండ్స్‌గా మారి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదని గుర్తుంచుకో...’’ అన్నాడు కేల్. ‘‘స్నేహాన్ని కాలంతో కొలవకు బాస్’’ అంది చెల్సియా అందంగా నవ్వుతూ. చెల్సియా స్నేహంలో మునుపెన్నడూ లేని కొత్త జీవితాన్ని చూశాడు కేల్. ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది! అవి కేవలం ఒక అందమైన అమ్మాయి పెదాల మీద మెరిసే మాటల ముత్యాల్లా ఉండవు. ఆ మాటల్లో ఎంతో ధైర్యం ఉంటుంది. జీవనోత్సాహం ఉంటుంది. ‘‘ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా’’ అరిచింది చెల్సియా తల్లి. కేల్కు కిడ్నీ దానం చేస్తానని చెల్సియా అనడమే అందుకు కారణం. అయితే చెల్సియా తల్లి కోపానికి వెనక్కి తగ్గలేదు. తమ స్నేహం గురించి చెప్పింది, స్నేహితుడి నిస్సహాయత గురించి చెప్పింది. ఎట్టకేలకు ఒప్పించింది. ఆరు నెలల తరువాత ఆపరేషన్‌కు రెడీ అయింది. కేల్ కదిలిపోయాడు. వద్దని ఎన్నో విధాలుగా వారించాడు. కానీ చెల్సియా వినలేదు. కానీ దేవుడు వాళ్ల ప్రార్థన విన్నాడు. చెల్సియా కిడ్నీ కేల్కు మ్యాచ్ అయింది. కిడ్నీ మార్పిడి విజయవంతం అయింది. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పింది చెల్సియా. కేల్ మాత్రం తన ముందున్న దేవతకు కృతజ్ఞతలు చెప్పాడు. కన్నీరు ఆగిపోయింది. కథ మాత్రం ఇక్కడితో ఆగిపోలేదు. త్యాగంతో బలపడిన వారి కథ... ఒక అందమైన ప్రేమకథగా మారిపోయింది. ‘‘చెల్సియా.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టమైతే...’’ కేల్ నోటి నుంచి వచ్చిన వాక్యం పూర్తి కానే లేదు-‘‘మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం’’ అంది చెల్సియా ఆనందంగా. వాళ్లు మొన్న స్నేహితులు. నిన్న ప్రేమికులు. ఈరోజు భార్యాభర్తలు!