రుధిర హృదయం | Great Love Stories | Sakshi
Sakshi News home page

రుధిర హృదయం

Published Sun, Jan 31 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

రుధిర హృదయం

రుధిర హృదయం

  గ్రేట్ లవ్‌స్టోరీస్
  బాబిలోన్ చారిత్రక సౌందర్యానికి వన్నె తెచ్చిన వాటిలో కట్టడాలు, కళాకృతులు, నిర్మాణాలు మాత్రమే కాదు... ఒక గొప్ప ప్రేమ కథ కూడా ఉంది. అదే పైరమస్, తిస్బేల ప్రేమకథ. ‘ఇరుగు పొరుగువారు కలిసి మెలిసి ఉండటం, ఒక కుటుంబంలా ఉండటం’ అనేది ఎక్కడైనా సాధ్య పడుతుందేమో కానీ అక్కడ మాత్రం సాధ్యపడదు. బాబిలోన్ నగరంలో ఉన్న ఆ ఇరుగుపొరుగు ఇళ్లలో... ఒక ఇంటి మీద వాలిన కాకి ఇంకో ఇంటి మీద వాలదు. వారి మధ్య తరచూ భగ్గుమనే తగాదాలకు చెప్పుకో దగ్గ బలమైన కార ణాలేవీ లేవు. అయినా వాళ్లు కీచులాడు కుంటూనే ఉండేవారు.   చిత్రం ఏమి టంటే, ఆ రెండు ఇళ్లలో ఉండే అమ్మాయి, అబ్బాయి మాత్రం చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవాళ్లు. పెద్దల తగాదాలకు వాళ్లు  ఎప్పుడూ విలువ ఇచ్చేవాళ్లు కాదు. వాళ్ల స్నేహాన్ని వదులుకునేవారూ కాదు. వాళ్లే... పైరమస్, తిస్బే.
 
 ‘‘మీ తల్లి దండ్రులేమో నిమిషం ఖాళీ దొరికినా కయ్యా నికి కాలు దువ్వుతారు. మీరేమో ప్రాణ స్నేహితుల్లా ఉంటారు’’ అనేవారు పైరమస్, తిస్బేలతో  ఊరివాళ్లు. వాళ్ల స్నేహాన్ని చూసి అందరూ ముచ్చట పడేవారు. తిస్బేకు ఏ కష్టం వచ్చినా ‘‘నేనున్నాను’’ అంటూ ముందుకు వచ్చేవాడు పైరమస్. తనకు ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రుల కంటే ముందు పైరమస్‌కు చెప్పుకునేది తిస్బే. కాలక్రమంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. పాత స్నేహం కొత్తగా అనిపించసాగింది.  పాత మాటలే కొత్తగా వినిపించసాగాయి.
 
 అయితే తిస్బే-పైరమస్‌ల ప్రేమవ్యవహారం తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దాంతో వారు గట్టిగా తగువులాడుకోవడానికి మరో బలమైన కారణం దొరికింది.  ‘‘వాడితో మాట్లాడ్డం కాదు కదా, చూసినా ప్రాణం తీస్తాను’’ అని హెచ్చరించాడు తిస్బే తండ్రి. దాంతో ఇద్దరూ ప్రేమఖైదీలుగా మారిపోయారు. అడుగు తీసి అడుగు వేస్తే ఆంక్షలు. వాటిని ఛేదించలేక సతమతమయ్యేవారు. వాళ్ల రెండు ఇళ్లనూ వేరు చేస్తూ ఒక గోడ ఉంది. ఆ గోడకు ఒక పెద్ద పగులు ఉంది. ఎవరూ చూడనప్పుడు ఆ పగుల్లో నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు.  ‘‘ఇలా ఎన్ని రోజులు?’’ అని ఒకరోజు అడిగాడు పైరమస్. ‘‘మన పెళ్లి అయ్యేవరకు’’ చిలిపిగా నవ్వి అంది తిస్బే.‘‘అయితే రేపే చేసుకుందాం.

మనం ఎప్పుడూ కలుసుకునే నినుసు సమాధి దగ్గరికి వచ్చేయ్’’ అన్నాడు పైరమస్. సరే అందామె. నినుసు సమాధి దగ్గర కంబలి చెట్టు కింద కూర్చుని ప్రియుడి కోసం నిరీక్షిస్తోంది తిస్బే. ఆ నిరీక్షణలో... క్షణమొక యుగంలా ఉంది! గడిచే ప్రతి నిమిషం తమ ప్రేమ జ్ఞాపకాలతో ఆమె మనసు నిండి పోతోంది.  అంతలో అడుగుల సడి. ‘పైరమస్ వస్తున్నట్టు న్నాడు’ అంటూ అటు చూసింది తిస్బే. వస్తుంది పైరమస్ కాదు... అసలు మనిషే కాదు... సింహం! ఎక్కడ వేటాడి వస్తోందో... నోరంతా రక్తం! భయంతో పరుగులు తీసింది తిస్బే. ఆ కంగారులో పైట సైతం జారిపోయింది. అలానే వెళ్లి ఒక మాను వెనుక దాక్కుంది. తిస్బే కోసం తెగ తిరిగింది సింహం. ఆమె కనిపించలేదు. కసిగా తన కాలి గోళ్లతో తిస్బే పైటను చీల్చుకుంటూ వెను దిరిగింది.
 
 అప్పుడే అక్కడికి వచ్చిన పైరమస్ సింహాన్ని చూశాడు. అతడి గుండెల్లో భయంతో కూడిన అలజడి! ‘నా తిస్బేకు ఏమీ కాలేదు కదా’ అని వడివడిగా కంబలి చెట్టు దగ్గరికి నడిచాడు. తిస్బే పైట చూసి కుప్పకూలిపోయాడు. ‘నా తిస్బేను ఆ సింహం పొట్టన పెట్టుకుంది’ అని రోదించాడు. ఆమె లేని జీవితం తనకు వద్దనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో గుండెల్లో పొడుచుకున్నాడు.  కొద్ది క్షణాల తర్వాత అక్కడికి వచ్చింది తిస్బే. రక్తపు మడుగులో ఉన్న పైరమస్‌ను చూసి విలవిల్లాడి పోయింది. ప్రాణాలతో ఉన్న తిస్బేను చూసి సంతోషంతో పైరమస్ పెదవులు విచ్చుకున్నాయి. కానీ అతని కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. అది తట్టుకోలేని తిస్బే... ‘‘నువ్వు లేని ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఉండలేను’’ అంటూ పైరమస్ గుండెల్లో ఉన్న కత్తిని తీసుకుని పొడుచుకుని ప్రాణాలు విడిచింది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే కంబలి చెట్టు కన్నీరుమున్నీరైంది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement