అజరామరం ఆ ప్రేమకావ్యం | Great Love Stories | Sakshi
Sakshi News home page

అజరామరం ఆ ప్రేమకావ్యం

Published Sun, Nov 22 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

అజరామరం ఆ ప్రేమకావ్యం

అజరామరం ఆ ప్రేమకావ్యం

గ్రేట్ లవ్ స్టోరీస్
 ఏదో ఒకరోజు... ఆమెను కలుస్తావు.
 ఆమెకు  నీ గతంతో పని లేదు.
 ఎందుకంటే నీ భవిష్యత్ తనది కాబట్టి!
 
 అందమైన యువకుడు రాంఝా గురించి వివరం అడిగితే మనుషుల కంటే ప్రకృతి ఎక్కువగా చెప్పగలుగుతుంది. అతడి వేణు గానామృతంలో పడి అదే పనిగా తలలు ఎలా ఊపిందీ చెట్లు చెబుతాయి. తన నిరంతర చిరునవ్వుల వెనుక రహస్యం అతడి గానమని చీనాబ్ నది చెబుతుంది. తమ మోమున వెన్నెల కురిపించింది రాంఝా మురళీగానమేనని మొఘలు రాజుల కట్టడాలు చెబుతాయి.చీనాబ్  నది ఒడ్డున ఉన్న తాహ్త్ హజరాలో పుట్టి పెరిగాడు ధీడో రాంఝా. నలుగురు అన్నదమ్ముల్లో  చిన్నవాడు. అందుకే తండ్రికి అతనంటే చాలా ఇష్టం. అన్నలకు మాత్రం అసహ్యం. ‘‘బాన్సురీ  ఊదడానికి తప్ప బతకడానికి పనికిరాడు’’ అని ముఖం మీదే తిట్టేవాళ్లు. ఇక వదినలు సరేసరి. సూటి పోటి మాటలతో రాంఝాను బాధ పెడుతూనే ఉండేవాళ్లు.
 
 ఆ వేధింపులు, అవమానాలు భరించ లేక ఒకరోజు సోదరులతో గొడవ పడ్డాడు రాంఝా. ‘‘ఈ నరకంలో ఇక ఉండలేను’’ అంటూ ఇల్లు విడిచిపెట్టాడు. ఒక ద్వారం మూసిన దేవుడు ఎక్కడో ఇంకో ద్వారం తెరిచే ఉంచుతాడట. అందుకే రాంఝా కోసం జంగ్ నగర ద్వారాలు తెరుచు కున్నాయి. ఈ చారిత్రక పట్టణం... ఒక అజరామర ప్రేమకథకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. 
 
 జంగ్‌లో మల్కి అనే పెద్దాయన దగ్గర పశువుల కాపరిగా చేరాడు రాంఝా. వాటిని మేపుతూ మురళి వాయించేవాడు. ఆ సమ్మోహన వేణుగానం వినే అదృష్టా నికి ఆ పశువులు సైతం పులకించిపోయేవి. ఒకరోజు... ఆ అద్భుత వేణుగానం మల్కి కూతురు హీర్ చెవిన పడింది. ఆమె సమ్మోహితురాలయ్యింది. స్వయంగా అతడితో ఆ విషయం చెప్పింది. ఆ పరిచయం వాళ్లను దగ్గర చేసింది. 
 రాంఝాను ఎక్కడో ఒకచోట రహస్యంగా కలిసేది హీర్. తన చేదు గతాన్ని మరిచిపోవడానికి దైవం పంపిన బహుమానం ఈ అమ్మాయి అనుకునే వాడు రాంఝా.
 
 రాంఝా-హీర్‌ల ప్రేమవ్యహరం... హీర్ తల్లిదండ్రులకు, మేనమామ కైడోకు తెలిసింది. వాళ్లంతా నిప్పులు కక్కారు. స్థానిక పూజారి సైదా ఖైరాతో హీర్ పెళ్లికి రంగం సిద్దం చేశారు. రాంఝాను ఊరి నుంచి గెంటేశారు.
 రాంఝా గుండె బద్దలయ్యింది. ఐహిక ప్రపంచం మీద విరక్తి పుట్టింది. సన్యాసిగా మారిపోయాడు. పాటలు పాడుతూ పిచ్చివాడిలా ఊరూరా తిరుగు తుండేవాడు. అతడి పాటల్లో గొప్ప జీవన తత్వాలు ఉండేవి. అవి ఎందరినో ఆకర్షించేవి. మరోవైపు హీర్ ‘‘రాంఝాను తప్ప ఎవరినీ పెళ్లాడను’’ అని గట్టి పట్టుదలతో ఉంది. ఎంత భయపెట్టినా, బుజ్జగించినా ఆమెలో మార్పు రాలేదు. బెంగ పెట్టేసుకుంది. రోజురోజుకూ కుంగిపోసాగింది. కూతురు ఆరోగ్యం దెబ్బతినడం చూసి హీర్ తల్లిదండ్రులు ఆమెను రాంఝాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమ య్యారు. రాంఝాను వెతికి తీసుకొచ్చారు. 
 
 ఆ రోజు హీర్-రాంఝాల పెళ్లి. ఈ సృష్టిలోని సంతోషమంతా అతడి కళ్లలోనే ఉన్నట్లుగా ఉంది. ‘రాంఝా లేని ఈ లోకం నరకం కంటే ఘోరం’ అనుకున్న హీర్‌కు ప్రపంచమంతా అందంగా కనిపించసాగింది.
 అంతలో ఉన్నట్టుండి ఏవో కేకలు. అందరూ అటువైపు పరుగెత్తారు. హీర్ నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటోంది. ఏమయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమెను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ అంతలోనే ఆమె ప్రాణం ఆమెను వదిలిపోయింది. పెళ్లికని చేసిన లడ్డుల్లో ఒకటి తింది హీర్. అది  విషప్రయోగం చేసిన లడ్డు అనే విషయం  తెలిసింది. ఈ పని హీర్  మామ కైడో చేసి ఉంటాడని అనుమానం. చేసింది ఎవరైనా, పోయింది మాత్రం హీర్ ప్రాణం!
 
 రాంఝా గుండె మరోసారి ముక్కలైంది. ఆమె లేని లోకంలో తానేం చేయాలో తోచలేదు. హీర్ తిని వదిలేసి లడ్డూను తినేశాడు. మరుక్షణం ప్రాణాలు వదిలి తన ప్రేయసిని చేరుకున్నాడు.  వీరి విషాదాంత ప్రేమగాథ పంజాబ్ చరిత్రలో కన్నీటిచుక్కై నిలిచింది. జంగ్‌లో కనిపించే హీర్-రాంఝాల స్మారక కట్డడం... అజరామరమైన ప్రేమకు నిలువెత్తు సంతకంలా నేటికీ మెరిసిపోతూ ఉంటుంది. 
 - యాకూబ్ పాషా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement