హృదయంతో... నవీన ఉదయంతో! | Great Love Stories of Birds | Sakshi
Sakshi News home page

హృదయంతో... నవీన ఉదయంతో!

Published Sun, Feb 28 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

హృదయంతో... నవీన ఉదయంతో!

హృదయంతో... నవీన ఉదయంతో!

గ్రేట్ లవ్‌స్టోరీస్
ఎప్పుడో చిన్నప్పుడు నానమ్మ ఏవో జాన పద కథలు చెబుతుంటే అడిగింది సమియా- ‘‘మనం ఊళ్లో ఎందుకుంటున్నాం? అడవుల్లో ఎందుకుండట్లేదు?  అక్కడ రకరకాల పక్షులతో ఆడుకోవచ్చు కదా’’ అని. ‘‘నువ్వన్నది నిజమే అనుకో, కానీ అడవిలో అందమైన పిట్టలే ఉండవు. క్రూరమృగాలూ ఉంటాయి. అవి ఏ క్షణాన దాడి చేసి చంపేస్తాయో తెలియదు. అందుకే మనం ఊళ్లలోనే ఉంటాం. ఇక్కడ మనిషికి మనిషి ఆసరా. ఒకరు కష్టాల్లో ఉంటే ఇంకొకరు సహాయం చేస్తారు’’ అని  చెప్పింది నానమ్మ.
 
అఫ్గానిస్తాన్‌లోని సంచారక్ జిల్లాలోని సర్-ఎ-పల్ అనే ఊరు సమియాది. ఇప్పుడా ఊరు ఆమెకు ఊరిలా కనిపించ ట్లేదు. మనుషులే క్రూర జంతువులై వేటాడడానికి  సిద్ధంగా ఉన్న దట్టమైన అడవిలా భయపెడుతోంది. ఎందుకంటే...
   
ఆరోజు సమియా జీవితంలో  చీకటి రోజు. సాయుధులైన ఎనిమిది మంది ఆమెను అపహరించి అత్యాచారం చేశారు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చింది. ఆ రాక్షసులను శిక్షించాలని పోలీసులను ఆశ్రయించాడు సమియా తండ్రి. వాళ్లు పలుకుబడి ఉన్న వాళ్లు కావడంతో పోలీసులు, అధికారులు చేతులెత్తేశారు. మరోవైపు  ఊరివాళ్లు సమియాను చిన్నచూపు చూడడం మొదలు పెట్టారు. సూటిపోటి మాటలతో బాధపెట్టడం ప్రారంభించారు.

‘‘ఇక ఈ ఊళ్లో మనం ఉండలేం తల్లీ’’ అని సమియాను కాబూల్‌కు తీసుకెళ్లాడు నాన్న. జీవితం నిస్సారమై... భయ పెడుతూ, బాధపెడుతూ ఉన్న స్థితిలో జోయా పరిచయం సమియాను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘ద రివల్యూషన్ అసోసియేషన్ ఆఫ్ ద వుమెన్ ఆఫ్ అఫ్గానిస్తాన్’ సంస్థ తరపున పని చేస్తున్న జోయా పార్లమెంట్ సభ్యురాలు కూడా. ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచారామె.
 
జోయా దగ్గర బాడీగార్డ్‌గా పని చేస్తున్న ఫరమర్జ్ సమియాను చూశాడు. ఆమె పట్ల జరిగింది  విని చలించిపోయాడు. ఆమెను చూస్తేనే అతడి మనసు విచారమయమైపోయేది. ఏదో సాకుతో మాట్లాడేవాడు. కబుర్లతో నవ్వించేవాడు.
 
‘‘అందరూ ఈయనలాగే ఉంటే ఎంత బాగుండేది!’’ అనుకునేది సమియా. తెలియకుండానే ఫరమర్జ్‌ను ప్రేమించడం మొదలు పెట్టింది. ఒకరోజు ఆమెలో చిన్న అలజడి... ‘‘నన్ను ఆయన ప్రేమించడం,  పెళ్లి చేసుకోవడం జరిగే పనేనా? అలాంటప్పుడు ఏవేవో  ఊహించుకోవడం ఎందుకు? ఆశలు పెట్టుకోవడం ఎందుకు? భంగపడి బాధపడడం ఎందుకు? ఇప్పు డున్న బాధ చాలు’’ అనుకుంది సమియా.
 
ఒకరోజు సమియాతో ‘‘పెళ్లి చేసుకో మని ఇంట్లో ఒకటే పోరు’’ అన్నాడు ఫరమర్‌‌జ. ‘‘చేసుకోవచ్చు కదా’’ అంది నవ్వుతూ సమియా. ‘‘నాకు కూడా చేసు కోవాలనే ఉంది. కానీ నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుందో చెప్పు?’’ అన్నాడు సమియా కళ్లలోకి సూటిగా చూస్తూ. ఫరమర్జ్ ఏం మాట్లాతున్నాడో ఒక్క క్షణం వరకు అర్థం కాలేదు సమియాకి. ‘‘ఏమన్నావు? మరోసారి చెప్పు?’’ అంది నమ్మలేనట్టుగా.

‘‘నీలాంటి అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదు. పెళ్లంటూ చేసుకుంటే నీలాంటి అమ్మాయినే చేసుకుంటాను’’ అన్నాడు ఫరమర్జ్. ఆమెలో ఏదో అలజడి.  ‘నాలాంటి అమ్మాయినా, నన్ను కాదా?’ అనుకుంది మనసులో.

ఆ మాట అతని మనసుకు వినబడిందో ఏమో... ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు మరుక్షణమే. తక్షణం ఆమె పెదవులపై విరిసిన చిరునవ్వు ఆమె జవాబును చెప్పకనే చెప్పింది. జోయా ఆధ్వర్యంలో వాళ్లిద్దరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ‘సంతోషకరమైన విషయం... నిజమైన స్నేహితుణ్ని కనుక్కోవడం. అంతకంటే సంతోషకరమైన విషయం... నిజమైన స్నేహితుణ్ని భర్తగా పొందడం’ అని పెళ్లికి వచ్చిన ఒక అతిధి అంటుంటే తృప్తిగా నవ్వింది సమియా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement