ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్‌కు మెట్రో రైల్‌లో గుండె తరలింపు..
గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్‌కు గ్రీన్‌చానల్ ద్వారా మెట్రో రైల్‌లో గుండెను తరలించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 34 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని, ఖైరతాబాద్ గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండెను అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
డాక్టర్ అజయ్‌జోషి నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం సాయంత్రం కామినేని ఆస్పత్రికి చేరుకుని, దాత శరీరం నుంచి గుండెను సేకరించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో దీన్ని తీసుకుని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య బృందం రాత్రి 9.30 గంటలకు ఎల్బీనగర్ నుంచి మెట్రోలో బయలుదేరి 9.43 గంటలకు ఖైరతాబాద్ చేరుకుంది.
పోలీసులు, మెట్రో అధికారులు, జీవన్‌దాన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, మలక్‌పేట్, ఎంజీబీఎస్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లను మూసివేసి, ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు. 13 కిలోమీటర్లు, 13 స్టేషన్లు దాటుకుని, 13 నిమిషాల్లో రైలు గమ్యస్థానానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment