transplant
-
13 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు.. 13 నిమిషాలు..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్‌కు గ్రీన్‌చానల్ ద్వారా మెట్రో రైల్లో గుండెను తరలించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 34 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని, ఖైరతాబాద్ గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండెను అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.డాక్టర్ అజయ్‌జోషి నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం సాయంత్రం కామినేని ఆస్పత్రికి చేరుకుని, దాత శరీరం నుంచి గుండెను సేకరించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో దీన్ని తీసుకుని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య బృందం రాత్రి 9.30 గంటలకు ఎల్బీనగర్ నుంచి మెట్రోలో బయలుదేరి 9.43 గంటలకు ఖైరతాబాద్ చేరుకుంది.పోలీసులు, మెట్రో అధికారులు, జీవన్‌దాన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొత్తపేట, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, మలక్‌పేట్, ఎంజీబీఎస్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లను మూసివేసి, ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు. 13 కిలోమీటర్లు, 13 స్టేషన్లు దాటుకుని, 13 నిమిషాల్లో రైలు గమ్యస్థానానికి చేరుకుంది. -
దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స!
వైద్య విధానంలో అత్యంత క్లిష్టమైన రెండు చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్స ఇద్దరూ వ్యక్తులకు ఏకకాలంలో తొలిసారిగా విజయవంతమయ్యింది. ఇక్కడ అన్నింట్లకంటే షాకింగ్ ట్వీస్ట్ ఏంటంటే ఈ శస్త్ర చికిత్స ఓ కిడ్నీ మార్పిడి పేషెంట్‌కి కూడా జరగడం. ఇలా కిడ్నీ మార్పిడి చేయించుక్నున వ్యక్తికి సంక్లిష్టమైన ఈ చేయి మార్పిడి శస్తచికిత్స జరగడం దేశలోనే తొలిసారి కూడా. ఈ షాకింగ్ ఘటనలు ఎక్కడ జరిగాయంటే.. ఇద్దరు మగ రోగులకు హర్యానాలో ఫరిదాబాద్‌లోని అమృత హాస్పిటల్లో విజయవంతంగా ఈ చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ముందుగా ఉత్తర భారతదేశానికి చెందిన 65 ఏళ గౌతమ్ తాయల్కు ఈ సంక్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అయితే అనుకోకుండా గత రెండేళ్ల క్రితం ఓ పారిశ్రామిక ప్రమాదంలో మణికట్టుపై వరకు ఎడమ చేతిని కోల్పోయారు. అయితే అతనికి బ్రెయిన్ డెడ్ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేయిని మార్పిడి చేశారు. ఒక కిడ్నీ మార్పిడి రోగికి ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం దేశంలో మొట్టమొదటిది. వైద్యశాస్త్రంలో ఇదొక అరుదైన ఘట్టం కూడా. ఇలా ట్రాన్సప్లాంట్ చేయడానికి రెండు ఎముకలు, రెండు ధమనులు, సుమారు 25 స్నాయువులు, 5 నరాలను కలపాల్సి ఉంటుందని వైద్యుడు మోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. ఈ చికిత్స అనంతరం రోగి మంచిగానే కోలుకుంటున్నట్లు తెలిపారు. అతని కొత్త చేతిలో కూడా కదలికలు మొదలయ్యాయని చెప్పారు. జస్ట్ ఒక్క వారంలోనే డిశ్చార్జ్ అవుతాడని అన్నారు. ఇక మరో హ్యాండ్ ట్యాన్స్ప్లాంటేషన్ ఢిల్లీకి చెందిన దేవాన్ష్ గుప్త అనే 19 ఏళ్ల వ్యక్తికి జరిగింది. మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులు మోకాలి పైభాగం వరకు పోయాయి. కుడి చేయి మోచేయి పైభాగం వరకు పోగా, ఎడమ చేయి మోచేయి కొంచెం కింద స్థాయి వరకు పోయింది. అయితే ఈ వ్యక్తికి ఫరీదాబాద్‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయిన సూరత్ అనే 33 ఏళ్ల వ్యక్తి చేతులను మార్పిడి చేశారు. ఇక ఈ విచ్ఛేదనం స్థాయిని బట్టి ఈ ఆపరేషన్ అంత క్రిటికల్‌గా ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ సర్జరీ తర్వాత దేవాన్ష్ పరిస్థితి కూడా మెరుగుపడిందని, పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే మోచేయి పైవరకు పోయిన కోల్పోయిన చేతి శస్త్ర చికిత్సలో కాస్త సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే గుప్తా పురోగతి కూడా బాగుందని, అవసరమనుకుంటే తదుపరి చేతి మార్పిడికి సంబంధించిన కొన్ని చికిత్సలు రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సదరు పేషంట్లు గౌతమ్ తాయల్, దేవాన్ష్ గుప్తా ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ మార్పిడి తమకు రెండో అవకాశం అని, పైగా జీవితంలో కొత్త ఆశలు అందించిందని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలతో వైద్య విధానం మరింత అభివృద్ధిని సాధించింది. అంతేగాదు ఈ శస్త్ర చికిత్స భవిష్యత్తులో ఇలా అవయవాల కోల్పోయిన వారిలో కొత్త ఆశను అందించేలా ధైర్యంగా జీవించేలా చేయగలుగుతుంది. (చదవండి: మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..) -
వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్! మొత్తం కంటినే మార్పిడి..
వైద్యశాస్త్రంలో మరో అద్భుతమైన ఫీట్‌ని సాధించింది. ఇంతవరకు సాధ్యం కానీ అరుదైన పూర్తి స్థాయి కంటిమార్పిడి శస్త్ర చికిత్సను చేసి చరిత్ర సృష్టించారు వైద్యులు. దీంతో భవిష్యత్తులో అంధుల కళ్లల్లో వెలుగును ప్రసాదించేలా సరికొత్త వైద్య విధానానికి నాంది పలికారు. ఏంటా అరుదైన శస్త్ర చికిత్స తదితరాల గురించే ఈ కథనం!. వైద్యశాస్త్రంలో ఇంతవరకు మొత్తం కంటిని మార్పిడి చేయండం సాధ్యం కాలేదు. అలా అయితే చాలామంది చనిపోయేటప్పుడూ కళ్లు దానం చేస్తున్నారు కదా అని అడగొచ్చు. అదీగాక కొందరూ పేషెంట్లు కన్నుమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాం అంటారు కదా! అనే సందేహం కూడా మనకు వస్తుంది. కానీ అది కన్నుమార్పిడి చికిత్స కాదు జస్ట్ కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ లేదా కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు. కంటికి ఏదైన గాయం లేదా వాపు కారణంగా మచ్చలు తీవ్ర స్థాయిలో ఏర్పడి చూపుపై ప్రభావం ఏర్పడవచ్చు లేదా దృష్టి లోపం రావచ్చు. అలాంటప్పుడు దాత నుంచి స్వీకరించిన కార్నియాను నేత్ర వైద్యుడు పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాడు. స్పష్టమైన దృష్టికి కార్నియా అత్యంత ముఖ్యం. అంతే గానీ పూర్తి స్థాయిలో కంటిని అమర్చడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే? మన కళ్లు చిత్రాన్ని బంధించే కెమరాలాంటివే. కానీ మన మెదడు వాటిని ప్రాసెస్ చేసి ఆ వస్తువు ఏంటీ? అనేది ఐడెంటిఫై చేయగలదు. అంటే మన మెదడుతో కన్ను అనుసంధానమైతేనే చూడగలం. ఇక్కడ కంటి నుంచి మెదడుకు దృశ్యమాన సంకేతాలను పంపే ఆప్టిక్ నాడి ద్వారా మన కళ్ళు అనుసంధానించి ఉండటం అనేది అత్యంత ముఖ్యం. అందువల్ల కన్ను అనేది మెదడుకు ఆప్టిక్ నరాలతో అనుసంధానించి ఉన్న సంక్లిష్ట అవయవం. ప్రమాదవశాత్తు ఈ నరాలు తెగిపోయిన లేదా దెబ్బతిన్న చూపు తెప్పించడం అనేది అసాధ్యం. ఈ ఆప్టిక్ నరాలు పరిమాణం పరంగా చిన్నవే అయినప్పటికీ.. కంటి నుంచి మెదడుకు మిలియన్లకు పైగా చిన్న నరాలు కనెక్ట్ అయ్యి ఉంటాయి. పొరపాటున తెగితే అతుక్కోవు. అందువల్ల మొత్తం కంటిని మార్పిడి చేయలేరు వైద్యులు. ఒకవేళ వైద్యలు మొత్తం కంటిని మార్పిడి చేసినా.. మెదడుకి కనెక్ట్ చేయడం అనేది కుదరదు. దీంతో ఆ కన్ను దృశ్యమాన సంకేతాలను మెదడకు పంపలేదు కాబట్టి రోగికి చూపు రావడం అనేది అసాధ్యం. అలాంటి అసాధ్యమైన సంక్లిష్ట శస్త్ర చికిత్సనే చేసి అరుదైన ఘనత సాధించారు అమెరికా వైద్యులు. ఇంతకీ ఆ వ్యక్తి చూపు వచ్చిందా? ఎలా మెదడుకు కంటిని కనెక్ట్ చేశారు చూద్దామా! వివరాల్లోకెళ్తే..46 ఏళ్ల ఆరోన్ జేమ్స్ సరిగ్గా 2021లో దాదాపు ఏడు వేల వోల్ట్ల విద్యుత్ వైర్లు అతని ముఖాన్ని తాగడంతో మెత్తం ఎడమ భాగం అంటే.. అతడి ఎడమ కన్ను, మోచేయి, ఎడమ చెంప, గడ్డంకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ముఖ పునర్నిర్మాణం కోసం అమెరికాలోని లాంగోన్ ఆస్పత్రికి తరలించగా.. మే 27న అతడికి శస్త్రచికిత్స చేశారు. ఐతే ఈ ప్రమాదంలో అతను ఎడమవైపు కంటిని పూర్తిగా కోల్పోయాడు. అయితే వైద్య శాస్త్రంలో సవాలుగా ఉన్న మొత్తం కంటి మార్పిడి శస్త్ర చికిత్సపై పలు పరిశోధనలు జరగుతున్న తరుణంలో జేమ్స్ పరిస్థితి ఓ సువర్ణావకాశంలా వైద్యులకు అనిపించింది. ఇంతవరకు ఎలుకలపై చేసిన ప్రయోగాలు కొంత మేర ఫలితం ఇచ్చినప్పటికి వాటికి పాక్షిక దృష్టి మాత్రమే వచ్చింది. మెరుగైన చూపు మాత్రం రాలేదు. ఇది సాధ్యమా కాదా! అనే ఆసక్తితో ఉన్న వైద్యులకు జేమ్స్ స్థితి కొత్త ఆశను చిగురించేలా చేసింది. అలాగే జీవించి ఉన్న వ్యక్తికి ఇంతవరకు ఇలాంటి ఆపరేషన్ చేయలేదు. దీంతో ఎడ్వర్డో రోడ్రిగ్జ్ వైద్యుల బృందం జేమ్స్‌కి ఈ సంక్లిష్టమైన పూర్తి స్థాయి కంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయాలనుకున్నారు. దాదపు 21 గంటలు శ్రమించి, త్రీడీ టెక్నాలజీ సాయంతో జేమ్స్‌కి ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. అతని ఎడమ కన్నులోని రెటీనాకు రక్తప్రసరణలో సహా కాంతి స్వీకరించి మెదడుకు సంకేతం పంపేలా చేయగలిగారు. మార్పిడి చేసిన ఎడమ కన్ను మంచి ఆరోగ్యంతో ఉన సంకేతాలు చూపినట్లు తెలిపారు. నిజానికి జేమ్స్‌కు తన చూపుని తిరిగి పొందగలడని కచ్చితంగా చెప్పలేం. కానీ తాము ఎన్నోఏళ్లుగా చూస్తున్న అద్భుతమైన ఫీట్‌ని మాత్రం చేయగలిగాం అన్నారు. అతడి దృష్టికి వచ్చినా రాకపోయినా..ఈ ఆపరేషన్ మాత్రం తన 15 ఏళ్ల అనుభవంలో చాలా అతిపెద్ద ప్రయోగమని అన్నారు కొలరాడో అన్‌స్చుట్జ్ మెడిల్ ప్రోఫెసర్ కియా వాషింగ్టన్. ఇక జేమ్స్ తనకు జీవితంలో రెండో అకాశం కల్పించిన దాతకు అతని కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అతను నెలవారి చెకప్‌ల కోసం ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఐతే శస్త్రచికిత్స తర్వాత గడిచిన సమయాన్ని బట్టి, జేమ్స్ కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ చికిత్సలో కన్ను మెదడుకు కనెక్ట్ అయ్యేలా ఆప్టిక్ నరాలను పనరుత్పత్తి చేయడమే గాక ఆ నరాలు మెరుగ్గా పనిచేసేలా ఎముక మజ్జలోని మూల కణాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం ఫలిస్తే భవిష్యత్తులో అంధులకు దృష్టిని ప్రసాదించగలిగే సరికొత్త వైద్య విధానానికి నాంది పలకగలుగుతామని అన్నారు వైద్యులు. (చదవండి: చెఫ్ కాదు టెక్ జీనియస్!) -
పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు.. మరో మెట్టెక్కిన ఆధునిక వైద్యం!
మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్‌లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్ సపోర్ట్ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు. జినోట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్ప్లాంట్ సహరిస్తుంది. తాజా పరిశోధనలో జెనోట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్‌లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు. మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్ పిగ్‌లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జెనోట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు -
తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి
తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు: తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. 39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్‌బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకోసం అవయవదాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితోపాటు డాక్టర్ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. నలుగురికి పునర్జన్మ ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్‌బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్ ఆస్పత్రి, జీవన్‌దాన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించడంతో సురేష్‌బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను ఏపీ జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాఘవేంద్రరావు, జీవన్‌దాన్ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..!
సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి కిడ్నీ ఇచ్చే దాత దొరకడం అరుదు. ఒకవేళ దొరికినా ఆపరేషన్ చేశాక జీవితాంత మందులు వాడుతుండాల్సిందే. ఎందుకంటే దాత ఇచ్చిన అవయవాన్ని అతడి శరీరం అంగీకరించదు తత్ఫలితంగా లేనిపోని సమస్యలు ఉత్ఫన్నమవుతుంటాయి వాటిని తట్టుకునేలా నిత్యం రోగ నిరోధక శక్తి కోసం మందులు వాడక తప్పదు. అయితే ఇలాంటి సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా యూకేలోని ఓ ఆస్పత్రి భారత సంతతి చిన్నారికి సరికొత్త కిడ్నీ మార్పిడి చికిత్స చేసింది. విజయవంతమవ్వడమే కాదు ఇప్పుడూ ఆ చిన్నారి చాలా చలాకీగా అందరిలా అన్ని పనులు చేస్తోంది. అసలేం జరిగిందంటే..భారత సంతతికి చెందిన 8 ఏళ్ల చిన్నారి అదితి శంకర్ అరుదైన జన్నుపరమైన పరిస్థితి కారణంగా కోలుకోలేని మూత్రపిండ వైఫల్యంతో పోరాడుతుంది. గత మూడేళ్లుగా డయాలసిస్‌పైనే జీవనం సాగిస్తోంది. ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో లండన్‌లోని గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రి(ఘోష్) ఒక సరికొత్త కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌కి తెరతీసింది. ఇది ఎంతోమంది కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట వరంలా మారింది. చిన్నారి అదితికి కిడ్నీ మార్పిడి చేయడానికి దాతగా ఆమె తల్లే కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఐతే ఈ మార్పిడి చికిత్సకు ముందే అదితికి ఆమె తల్లి ఎముక మజ్జ సాయంతో అధితికి స్టెమ్‌సెల్ మార్పిడి చేశారు. అధితి శరీరం తిరస్కరించకుండా ఉండేలా దాత రోగ నిరోధక వ్యవస్థలా రీప్రోగామ్ చేశారు. దీంతో ఆమెకు మార్పిడి చికిత్స చేసిన తర్వాత కొత్త కిడ్నీ శరీరంపై దాడి చేయదు. ఆమె శక్తి స్థాయిలో మార్పులను వైద్యులు గమనించారు. ఆమె జీవితాంత రోగనిరోధక స్థాయిలకు సంబంధించే మందులతో పనిలేకుండా హాయిగా కొత్త కిడ్నీతో జీవించేలా చేశారు. ఎలాంటి దుష్ఫరిణామాలు ఉండకుండా ఆమె భవిష్యత్తు మొత్తం హాయిగా సాగిపోతుందని నమ్మకంగా చెప్పారు. ఇప్పుడామె స్విమ్మింగ్ వంటివి హుషారుగా నేర్చుకుంటోంది కూడా. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేని రోగులకు ఈ విధానం ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స విధానం వల్ల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చయించుకున్న రోగులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. పైగా జీవితాంత మందులు వాడాల్సిన బాధ తప్పుతుంది. “Aditi's always dancing and singing. We’re so happy that she can be the amazing version of herself that she is, thanks to her dual transplant.” Uday, Aditi’s dad. ✨ 8-year-old Aditi is the first child in the UK to receive an improved kidney transplant.https://t.co/xnskoDQ9vA pic.twitter.com/53WMhd3ncv — Great Ormond Street Hospital (@GreatOrmondSt) September 22, 2023 (చదవండి: ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా? అలానే విజయ్ ఆంటోని కూతురు..) -
గాంధీ వైద్యుల మరో ముందడుగు
గాందీఆస్పత్రి : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి చెందిన కాలేయాన్ని సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రి వైద్యులు సేకరించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం... గాం«దీఆస్పతితో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌అయ్యాడు. అతని కుటుంబసభ్యుల అంగీకరించడంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి పలు అవయవాలు సేకరించాలని వైద్యులు నిర్ణయించారు\ లివర్ ఒక్కటే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, మిగతా అవయవాల పనితీరు బాగోలేదని వైద్యపరీక్షల్లో తేలింది. జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్న జాబితా ప్రకారం ఏబీ బ్లడ్ గ్రూపుకు చెంది లివర్ సమస్యతో బాధపడేవ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. గాంధీ వైద్యులు బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి లివర్‌ను సేకరించి (రిట్రీవల్) ప్రత్యేక వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అక్కడ చికిత్స పొందుతున్న మరోవ్యక్తికి (ట్రాన్స్‌ప్లాంట్) అమర్చారు. లివర్‌ను సేకరించడం ఇదే గాందీఆస్పత్రిలో మొదటిసారని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లివర్‌ను విజయవంతంగా సేకరించి మరో వ్యక్తికి అమర్చి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, గాంధీ, ఉస్మానియా వైద్యులు, సిబ్బందిని వైద్యమంత్రి హరీష్ రావు అభినందించారు. -
బాలికకు విజయవంతంగా గుండె మార్పిడి
సాక్షి,తిరుపతి(తుడా): తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండెమారి్పడి చికిత్సను వైద్యులు శనివారం విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలికకు 6 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. కొంతకాలంగా ఆ బాలిక గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించడంతో అనారోగ్యం బారినపడింది. ఆమెకు గుండె మార్పిడి అనివార్యమని ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తేల్చారు. బాలిక పేరును ‘ఏపీ జీవన్‌దాన్’లో రిజిస్టర్ చేయించారు. కాగా, చెన్నైకు చెందిన 29 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ కావడంతో యువకుడి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. అతడి నుంచి సేకరించిన గుండెను తమిళనాడు, తిరుపతి జిల్లా పోలీసులు 2.32 గంటల్లో గ్రీన్ చానల్ ద్వారా హృదయాలయానికి తరలించి బాలికకు అమర్చారు. కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షించారు. చదవండి: ప్యాసింజర్ రైళ్లకు మంగళం -
వాట్! చేతిపై 'ముక్కు' పెరగడమా? దాంతో ట్రాన్స్‌ప్లాంట్!
శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోతే ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పరిపాటే. కొన్ని అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడమనేది కాస్త క్రిటికల్. కానీ క్యాన్సర్ కారణంగా ముక్కుని కోల్పోయిన ఒక మహిళకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సతో విజయవంతంగా ముక్కుని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. వైద్య ప్రక్రియలోనే ఇదోక అద్భతమైన చికిత్స విధానమనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన ఒక మహిళ 2013లో నాసిక కుహరం క్యాన్సర్ కారణంగా ముక్కున్ని కోల్పోయింది. దీంతో ఆమె అవయవం లేకుండానే కొన్ని ఏళ్లు గడిపింది. అయితే ఒక సరికొత్త వైద్య విధానం ద్వారా కొత్త ముక్కును పొందగలిగింది. అదీకూడా అమె చేతిపైనే పెరిగిన ముక్కుతో. అదేలా సాధ్యం అని సందేహం తలెత్తుంది కదా. కానీ సాధ్యమే అంటూ చేసి చూపించారు ఫ్రాన్స్ సర్జన్లు. ఈ మేరకు వైద్యులు మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన ముక్కును ఆమె ముంజేయికి అమర్చి పరీక్షిస్తారు. ఏకంగా రెండు నెలలు పాటు వైద్య పరికరంతో కూడిన ముక్కును అలా ఉంచి పెరిగిన తర్వాత ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. చేతిలోని రక్తనాళాలు ముఖంలోని రక్త నాళాలతో అనుసంధానం చేసి సర్జరీ చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సర్జరీని చేయలేదు. ఇది ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు సెర్హమ్ వైద్య బృందాల సహకారంతో ఈ సర్జరీని విజయంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు. (చదవండి: నర్వ్ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్!) -
ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి
మిషెగావ్: అవయవ మార్పిడి విధానంలో తొలిసారి కరోనా వైరస్ మృతి సంభవించింది. కరోనా సోకిన వ్యక్తి ఊపిరితిత్తులు మార్పిడి చేయడంతో పొందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలోని మిషెగావ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మరణంగా అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. అయితే అవయవ మార్పిడి చికిత్స అందించిన వైద్యుడికి కూడా కరోనా సోకింది. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఊపిరితిత్తులు అందుబాటులో ఉన్నాయని సమాచారం రావడంతో వైద్యులు వెంటనే వివరాలు సేకరించారు. ఊపిరితిత్తుల మార్పిడికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమెకు ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స విజయవంతంగా చేశారు. అయితే మార్పిడి చేసిన 61 రోజులకు ఆమె మరణించండం వైద్యులు షాకయ్యారు. సక్రమంగా చికిత్స అందించినా ఎందుకు ఇలా అయ్యిందని మొత్తం చికిత్స విధానమంతా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికి ఊహించని సమాధానం లభించింది. ఊపిరితిత్తులు ఇచ్చిన దాతకు కరోనా సోకిందనే విషయం తెలిసింది. ఆ కరోనా ఇంకా ఊపిరితిత్తుల్లో నిక్షేపమై ఉంది. అవయవదానం పొందిన మహిళకు కూడా కరోనా సోకింది. అంతర్గతంగా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో విస్తరించి ఆమె ప్రాణం తీసిందని వైద్యులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. -
రక్తం గ్రూపు వేరైనా మూలకణ మార్పిడి సాధ్యమే!
మా నాన్నగారి వయసు 50 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. ఎప్పుడూ నీరసంగా చాలా బలహీనంగా ఉంటున్నారు. ఇదివరకటిలా తన సహచరులతో సాయంత్రాలు బాడ్మింటన్ ఆటకూ, ఉదయం వాకింగ్‌కూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చూపిస్తే బ్లడ్‌క్యాన్సర్ ఉన్నట్లు చెప్పారు. దీనికి పర్మనెంట్ చికిత్స బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పారు. పూర్తిగా మ్యాచింగ్ బోన్‌మ్యారో డోనార్‌ను ఏర్పాటు చేసుకోమన్నారు. ఈ మ్యాచింగ్ డోనార్ అంటే ఏమిటో వివరించగలరు. ఒకవేళ దాత దొరకకపోతే ఏం చేయాలి? దయచేసి వివరంగా చెప్పండి. – కిరణ్‌కుమార్, కరీంనగర్ మార్పిడి చేసే మూలకణాల వనరును బట్టి ఈ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడు రకాలు ఉన్నాయి. రెస్క్యూ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఒక వ్యక్తికి తన సొంత స్టెమ్‌సెల్స్‌తో చికిత్స చేస్తారు. ఇందుకోసం ముందుగానే ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిని బయట అభివృద్ధిపరచి మార్పిడికి సిద్ధం చేస్తారు. రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయ్యాక వాటితోనే ఆ వ్యక్తి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మూలకణాలే తిరిగి అతడిని చేరతాయి. ఇలా జరిగినప్పుడు మూలకణాల మార్పిడి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఆల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఇందులో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో మార్పిడి ప్రక్రియను నిర్వహిస్తారు. అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా దాతపైన ఆధారపడే అల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటిదే. అయితే ఇందులో నవజాత శిశువు బొడ్డుతాడు (అంబ్లికల్ కార్డ్) నుంచి సేకరించిన మూలకణాలను వాడతారు. మీరు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో మార్పిడి ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు మ్యాచింగ్ అవసరమవుతుంది. ఇందులో దాత మూలకరణాలు స్వీకరించే వ్యక్తికి జన్యురీత్యా సంబంధికులై ఉంటాడు. చాలా సందర్భాల్లో దగ్గరి బంధువులు దాతలవుతారు. అదే సమయంలో జన్యురీత్యా సరిపడే బయటి వ్యక్తులు కూడా ఉపయోగపడతారు. దాత–స్వీకర్త రక్తం గ్రూప్ సరిపడినవైతేనే మూలకణమార్పిడి చేస్తున్నారు. అందువల్ల మీకు పూర్తి మ్యాచింగ్ బోన్ మ్యారో దాత కోసం సూచించారు. అయితే మూలకణ మార్పిడి ప్రక్రియలో ఇటీవల నూతన విధానాలు, మెళకువలు అభివృద్ధి చెందాయి. వీటిని అనుసరించడం వల్ల ఈ ‘పూర్తి మ్యాచింగ్’ పరిమితిని అనే అంశాన్ని అధిగమించగలుగుతున్నాం. రక్తం గ్రూపు సరిపోని పక్షంలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సాధ్యం కాదన్నది అపోహ మాత్రమే. బ్లడ్‌గ్రూప్ మ్యాచ్ కాకపోయినా మూలకణ మార్పిడి చేయవచ్చు. ఇందుకు దాత – స్వీకర్తల ఆర్.హెచ్. సరిపోవడం కూడా తప్పనిసరేమీ కాదు. కావాల్సిందల్లా హెచ్ఎల్ఏ అనే జన్యువులు సరిపోవడం. హెచ్ఎల్ఏ జన్యువుల్లో క్లాస్–1, క్లాస్–2 అని రెండు రకాల ఉండాలి. క్లాస్–1లో ఏ, బి, సి జతల జన్యువులు ఉంటాయి. అదే క్లాస్–2లో డీఆర్ అనే జన్యువు జత ఉంటుంది. ఈ మొత్తం నాలుగింటిలో దాత–స్వీకర్తల మధ్య రెండు జతలు సరిపోయినా (హాఫ్ మ్యాచ్) అయినా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను నిరభ్యంతరంగా చేయవచ్చు. ఈ రకమైన మూలకణ మార్పిడి ప్రక్రియలు ఫుల్మ్యాచ్ ప్రక్రియలతో సమానంగా విజయవంతం అవుతున్నాయి. అందువల్ల మీరు ఎలాంటి సందేహాలు, ఆందోళన లేకుండా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కు వెళ్లండి. రక్త సంబంధిత సమస్యలకు ఇక తరచూ రక్తమార్పిడి అవసరం లేదు మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. ఇన్ఫెక్షన్తో తరచూ జ్వరం వస్తోంది. స్కూల్‌కు కూడా వెళ్లలేకపోతున్నాడు. హైదరాబాద్‌లో డాక్టర్లకు చూపించాం. రక్తానికి అందునా... తెల్లరక్తకణాలు సంబంధించి సమస్యలు ఉన్నాయని, జీవితాంతం రక్తమార్పిడి చేయించుకుంటూ ఉండాల్సిందేనని చెప్పారు. అలా జరగకపోతే మా అబ్బాయి మరో నాలుగైదు ఏళ్లకు మించి బతికే అవకాశం లేదని కూడా అన్నారు. ఈమాట మా అందరికీ ఆందోళన కలిగిస్తోంది. మా అబ్బాయిని కాపాడుకోడానికి మార్గం ఏదైనా ఉందా? దయచేసి తెలపండి. – ఆర్ శ్యామల, మంచిర్యాల తెల్లరక్తకణాలు ఉత్పాత్తి కాకపోవడమో లేక వాటిలో సమస్యల వల్లనో మీ అబ్బాయికి రోగనిరోధక శక్తి తగ్గిపోయి (ఇమ్యూనో డెఫిషియెన్సీ) ఏర్పడినట్లు మీరు చెప్పిన అంశాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటప్పుడు ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థతో సహా వివిధ శరీర భాగాలకు ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా తయారవుతాయి. రక్తకణాలకు సంబంధించిన తీవ్ర సమస్యలు ఎదురైనప్పుడు రక్తం, రక్తకణాలను మారుస్తూ ఉండటం అవసరమవుతుంది. ఇది ఎడతెగని శ్రమతో కూడిన వ్యవహారం. పైగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. రోజులు గడుస్తున్నకొద్దీ ఆర్థికభారాన్ని పెంచుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఇప్పుడొక మంచి పరిష్కారం ఉంది. ఈ రకమైన సమస్యలకు మూలకణ మార్పిడితో శాశ్వత పరిష్కారం లభిస్తోంది. ఈ చికిత్సలో మొదట వ్యాధిగ్రస్త బోన్‌మ్యారోను పూర్తిగా తొలగిస్తాం. ఆ తర్వాత దాత నుంచి సేకరించిన కొత్త మూలకణాలను ఎక్కిస్తాం. ఈ కొత్త మూలకణాలు (స్టెమ్‌సెల్స్) ఇకపై ఆరోగ్యకరమైన కొత్త రక్తాన్ని తయారు చేస్తాయి. కాబట్టి దీంతో ఆరోగ్యాన్ని దెబ్బతీసే రోగనిరోధక శక్తి లోపం తొలగిపోతుంది. ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్ల దాడిని తట్టుకుంటుంది. దాంతో ఆరోగ్యకరమైన సాధారణ జీవితం సాధ్యపడుతుంది. బోన్మ్యార్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఫలితాలు చిన్నపిల్లల్లో మరింత మెరుగ్గా! మా అబ్బాయికి మూడున్నరేళ్లు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే హైదరాబాద్‌కు వచ్చి చూపించాం. అన్ని పరీక్షలు చేశాక, బ్లడ్‌క్యాన్సర్ అని చెప్పారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా దీనికి పూర్తిగా చికిత్స చేయవచ్చని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. మా బాబు ఆరోగ్యంపై మా కుటుంబ సభ్యులమంతా కలత చెందుతున్నాం. పై ప్రక్రియ ఎలా చేస్తారు. మాకు తగిన సలహా ఇవ్వండి. – కె. శ్రీకాంత్, ఆదిలాబాద్ అనేక రకాల బ్లడ్క్యాన్సర్లకు బోన్‌మ్యారో (ఎముకలోని మజ్జ లేదా మూలగ) ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ఇప్పటికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స. అయితే పెద్దలతో పోలిస్తే చిన్నపిల్లల్లో ఈ చికిత్స ఇంకా మెరుగ్గా సాధ్యమవుతుంది. ఇందులో క్యాన్సర్గ్రస్తమైన బోన్‌మ్యారోను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యవంతమైన బోన్‌మ్యారోను నింపడం ద్వారా బ్లడ్‌క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఇప్పుడు చాలా సురక్షితమైన ప్రక్రియ. సాధారణంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ 75 ఏళ్ల వారికి కూడా చేస్తారు. అయితే రోగి వయసు ఎంత తక్కువగా ఉంటే ఈ ప్రక్రియ ఫలితాలు అంతబాగా ఉంటాయి. మీ అబ్బాయి వయసులో చాలా చిన్నవాడు అయినందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబటి మీ బాబును సమీపంలోని అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉన్న బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు తీసుకెళ్లండి. అలాగే బోన్‌మ్యారోను దానం చేయగలవారి కోసం కుటుంబ సభ్యుల హెచ్ఎల్ఏ టైపింగ్ నిర్ధారణ కోసం అందుబాటులో ఉంచండి. బ్లడ్ క్యాన్సర్లలో మూడు రకాలు ఉంటాయి. అవి... లింఫోమా, మైలోమా, లుకేమియా. మొదటి రెండు రకాల క్యాన్సర్ల చికిత్స కోసం పేషెంట్ నుంచే స్టెమ్‌సెల్స్ సేకరించడం జరుగుతుంది. లుకేమియా విషయంలో మాత్రంహెచ్ఎల్ఏ మ్యాచ్ అయిన దాత నుంచి స్టెమ్‌సెల్స్ సేకరించి, పేషెంట్ ఎముక మజ్జ మార్పిడి చేయడం ద్వారా చికిత్స చేస్తారు. మీ అబ్బాయి విషయంలో మీరు అసలు బాధపడటానికి అవకాశమే లేదు. ఎందుకంటే... దాదాపు 90 శాతం మంది పేషెంట్లు ఈ చికిత్స చేయించుకున్న తర్వాత పూర్తిగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. – డాక్టర్ గణేష్ జైషట్వార్, సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. -
ఇక అందుబాటులోకి మానవ అవయవాలు
న్యూయార్క్: మానవుల్లో ఏడాదికి 1,20,000 అవయవాలను ఒకరి నుంచి ఒకరికి మారుస్తున్నారు. వాటిలో ఎక్కువగా కిడ్నీలే ఉంటున్నాయి. ప్రమాదాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి, స్వచ్ఛంద దాతల నుంచి తీసిన అవయవాలను రోగులకు అమరుస్తున్నారు. అయినప్పటికీ ఏడాదికి లక్షలాది మంది రోగులు తమకు అవసరమైన అవయవాల కోసం నిరీక్షించి అవి సకాలంలో అందక మరణిస్తున్నారు. వారి కోసం అవసరమైన కృత్రిమ మానవ అవయవాలను సృష్టించడం ఎలా? అనే అంశంపై ఎంతోకాలం నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలోజీ రావడం వల్ల ఈ ప్రయోగాలు సులభతరం అయ్యాయి. మానవ కణజాలాన్ని కృత్రిమంగా అభివృద్ధి చేసి కిడ్నీలు, గుండె, కాలేయమే కాకుండా కళ్లు, ముక్కు, చెవులను సృష్టించవచ్చని భావించారు. ఇప్పుడు ఆ దిశగా వేగంగా పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ చర్మంతోపాటు, చెవిని సృష్టించారు. పునరుత్పత్తి శక్తి కలిగిన కాలేయాన్ని అతి త్వరలోనే సృష్టిస్తామని చెబుతున్నారు. మరి కొన్నేళ్లలో కిడ్నీలను ప్రింట్ చేస్తామని పరిశోధకులు చెబుతున్నారు. గుండె లాంటి సంక్లిష్టమైన అవయవాల సృష్టికి మాత్రం మరికొంత కాలం పడుతుందని అంటున్నారు. ఇంక్జెట్ ప్రింటర్ల నాజిల్స్ ద్వారా మానవ సజీవ మూల కణాలను దెబ్బతినకుండా స్ప్రే చేయవచ్చని కనుగొనడంతో మానవ అవయవాల సృష్టికి 2000 సంవత్సరంలోనే ప్రయోగాలు మొదలయ్యాయి. ఇప్పుడు మానవ జీవ కణాలను ఒక పొర మీద మరో పొరను పేర్చుకుంటూ పోయి అవి సజీవ కణజాలంగా పెరిగేలా చేయవచ్చని, వాటితోని త్రీడీ ప్రింటర్ల ద్వారా అవయవాలను సృష్టించవచ్చని కనుగొన్నారు. ఇప్పటికే ప్రింట్ చేసిన మానవ చెవులను, ఎముకలను, కండరాలను జంతువులకు అమర్చి విజయం సాధించారు. గతేడాది షికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ మానవ అండాశయాన్ని సృష్టించి ఓ ఎలుకలో అమర్చారు. దీని ద్వారా పునరుత్పత్తిని కూడా సాధించగలిగారు. చైనాలోని చెంగ్డూలోవున్న సిచువాన్ రివోటెక్ బయోటెక్నాలజీ కంపెనీ ఓ భాగం కృత్రిమ ధమనులను సృష్టించి విజయవంతంగా ఓ కోతిలో ప్రవేశపెట్టింది. అలాగే శాండియాగోలోని ఆర్గనావో అనే కంపెనీ మానవ మూల కణాల ద్వారా కృత్రిమ కాలేయాన్ని సృష్టించి గత డిసెంబర్ నెలలో ఎలుకలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడది విజయవంతంగా పనిచేస్తోంది. త్వరలోనే దీన్ని మానవుల్లో ప్రవేశపెట్టి విజయం సాధిస్తామని చెబుతోంది. ఈ విషయంలో ఒక్క అమెరికాలోనే ఏడాదికి 300 కోట్ల డాలర్ల వ్యాపారం ఉంటుందని కూడా అంచనావేసింది. మిచిగాన్‌లోని టిష్యూ రీజెనరేషన్ సిస్టమ్స్ సంస్థతో ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీ ఎముకల ప్రింటింగ్‌కు కృషి చేస్తోంది. కెనడాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోకాలు చిప్పల ప్రింటింగ్‌కు కృషి చెస్తోంది. వినియోగదారుల సరకుల కంపెనీ ‘ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ ఐదు చదరపు మీటర్ల మానవ చర్మాన్ని ఇప్పటికే సృష్టించింది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైతే గుండెలో స్టెంట్లను కొనుగోలు చేసే బదులు ఏకంగా గుండెలనే కొనగోలు చేసి రోగులకు అమర్చవచ్చు. ఈ ఒక్కటేమి ఖర్మ కిడ్నీలు, ఊపిరితుత్తులు, కాలేయం, క్లోమ గ్రంధి, మోకాళ్ల చిప్పలు, కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, పెదాలు సర్వం కొనుగోలుచేసి అమర్చుకోవచ్చు. -
కాలేయ మార్పిడి
విశాఖ విమానాశ్రయం.. సమయం ఆదివారం రాత్రి ఏడు గంటలు ఎవరో ముఖ్యమైన వ్యక్తి వస్తున్నట్టు విమానాశ్రయం అంతా హడావుడిగా ఉంది. పోలీసులు, విమానాశ్రయ సిబ్బందిలో ఆదుర్దా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వాతావరణంలోనే తిరుపతి నుంచి ప్రత్యేక విమానం దూసుకొచ్చి రన్‌వేపై ఆగింది. విమానం ఆగీ ఆగగానే, తలుపులు తెరుచుకున్న వెంటనే.. ప్రముఖులెవరూ దిగలేదు కానీ.. ప్రత్యేక యూనిఫారంలో ఉన్న కొందరు వ్యక్తులు ఏదో ఓ ప్రత్యేకమైన బాక్స్‌ను పట్టుకుని పరుగులు తీస్తున్నట్టు దిగడం కనిపించింది. అంతా ఉత్కంఠగా చూస్తూ ఉండగానే, వారు అక్కడే ఆగి ఉన్న ఓ వాహనంలోకి చేరడం, పోలీస్ ఎస్కార్ట్‌తో ఆ వాహనం దూసుకు పోవడం క్షణాల్లో జరిగిపోయాయి. పోలీస్ వాహనం సైరన్ మోగుతుండగా ట్రాఫిక్ పోలీసులు విజిల్స్ ఊదుతూ, రోడ్ల మీద ఒక్క అడ్డంకి కూడా లేకుండా చేస్తూ ఉండగా, ఈ వాహనం ఎన్ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, అడవి వరం మీదుగా బీఆర్టీఎస్ రోడ్డుపై మెరుపులా దూసుకుపోయింది. అదే వేగంతో ముడసర్లోవ చేరువలోని అపోలో ఆస్పత్రి వాకిట్లో ఆగింది. వాహనం తలుపులు తెరిచిన వెంటనే అప్పటికే అక్కడ ఆతతగా వేచి ఉన్న వైద్యులు పెట్టెతో పాటు లోనికి పరుగులు తీయగానే.. ఓ బహత్ ప్రయత్నం మొదలైంది. ఆ పెట్టెలో వచ్చింది ఎంతో విలువైన కాలేయం కాగా.. ఆస్పత్రికి దానిని ఆఘమేఘాలపై చేర్చిన వెంటనే అపోలోలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స మొదలైంది. ఆరిలోవ: ఉత్కంఠభరిత వాతావరణంలో విశాఖలోని అపోలో ఆస్పత్రి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు వేదికైంది. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆరిలోవ ప్రాంతం పెదగదిలి వద్ద గల అపోలో ఆస్పత్రి ఇందుకు కేంద్రమైంది. ఈ శస్త్ర చికిత్స కోసం కాలేయాన్ని తిరుపతిలో ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆఘమేఘాలపై విశాఖలోని అపోలోకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి అపోలో వరకు కాలేయాన్ని తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు. అనుకొన్న సమయం కంటే కొన్ని నిముషాల ముందుగానే అస్పత్రికి కాలేయం చేరేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇదీ నేపథ్యం విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన ‘జీవన్‌దాన్’ స్కీమ్‌లో సభ్యుడుగా చేరాడు. విజయవాడలో వైద్యులు కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ స్కీంలో భాగంగా రోగి కుటుంబ సభ్యులు తిరుపతిలో ఓ ఆస్పత్రిని సంప్రదించి కాలేయం సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. దీని ప్రకారం అపోలోలో కాలేయ మార్పిడి చేయడానికి ఇక్కడి వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన ప్రకారం ఆదివారం వేకువ జామున రోగి అపోలోలో చేరాడు. కాలేయాన్ని తిరుపతి నుంచి ఇక్కడకు ప్రత్యేక విమానంలో తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరడానికి ట్రాఫిక్ నియంత్రణకు అపోలో నిర్వాహకులు ట్రాఫిక్ పోలీసుల సహకారం కోరారు. దాంతో పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. విమానాశ్రయం నుంచి గోపాలపట్నం, సింహాచలం, ముడసర్లోవ మీదుగా అపోలోకి చేరేవిధంగా పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అన్ని కూడళ్లలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో సాయంత్రం 7.30 గంటలకు చేరాల్సిన కాలేయం ఐదు నిముషాల ముందుగానే ఆస్పత్రికి చేరింది. ఇలా ప్రయాణం తిరుపతిలో కాలేయంతో ప్రత్యేక విమానం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరింది. విశాఖ విమానాశ్రయానికి 7 గంటలకు చేరుకొంది. విమానాశ్రయం ద్వారం ముందు సిద్ధంగా ఉన్న అపోలో అంబులెన్స్‌లోకి కాలేయం ఉన్న ప్రత్యేక బాక్స్‌ను సిబ్బంది ఎక్కించి అక్కడ 7.04 గంటలకు బయలదేరారు. అంబులెన్స్ విమానాశ్రయం నుంచి 7.10 గంటలకు ఎన్ఏడీ కూడలికి దూసుకొచ్చింది. అక్కడ నుంచి గోపాలపట్నం మీదుగా 7.18 గంటలకు సింహాచలం చేరుకుంది. కేవలం 7 నిముషాల్లో (7.25 గంటలకు) ముడసర్లోవ మీదుగా పెదగదిలి వద్ద అపోలో ఆస్పత్రికి అంబులెన్స్ చేరింది. అంటే 18 కిలోమీటర్లు 21 నిమిషాల్లో ప్రయాణించింది. వెంటనే సిబ్బంది ఆగమేఘాలపై మూడో ఫ్లోర్లో ఉన్న ఆపరేషన్ థియేటర్‌కు చేర్చారు. అప్పటికే సిద్ధమైన వైద్య సిబ్బంది 7.28 నిముషాలకు ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఆపరేషన్ పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. విశాఖలో అపోలోలో కాలేయం మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు. -
పునర్జమ్మ
-
20 మంది వైద్యులు... ఏడున్నర గంటలు...
* కరీంనగర్ జిల్లా మహిళకు విజయవంతంగా గుండెమార్పిడి * పదేళ్ల తర్వాత నిమ్స్‌లో ఈ తరహా ఆపరేషన్ సాక్షి, హైదరాబాద్: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) వైద్యులు మరో రికార్డు సాధించారు. ఇటీవల కాలేయ, పాక్షిక పుర్రె మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు... తాజాగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు గురువారం గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి, పునర్జన్మ ప్రసాదించారు. జీవన్‌దాన్, సీఎంఆర్ఎఫ్ సహాయంతో పదేళ్ల తర్వాత నిమ్స్‌లో గుండె మార్పిడి చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. కరీంనగర్జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓంలత(30) ఏడాది కాలంగా తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నారు. స్థానిక వైద్యులను సంప్రదించగా... గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మందులు, సర్జరీలతో నయం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆమె మూడు వారాల క్రితం నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఆర్వీ కుమార్‌ను సంప్రదించారు. ఈ సమస్యకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమని సూచించారు. శస్త్రచికిత్సకు రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత బాధితురాలికి లేకపోవడంతో... సీఎంఆర్ఎఫ్, జీవన్‌దాన్‌లో ఆమె పేరు నమోదు చేశారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. బ్రెయిన్‌డెడ్ యువకుడి గుండె దానం... కాగా, వరంగల్ జిల్లా హుజురాబాద్ సమీపంలో గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పి.వినయ్‌కుమార్(20) తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతడిని మంగళవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో... బుధవారం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్థారించారు. కుమారుని అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. జీవన్‌దాన్ ఇన్చార్జి స్వర్ణలత సమాచారంతో నిమ్స్ వైద్యులు గుండె సేకరించారు. బాధితురాలికి దాత గుండె సరిపోతుందని నిర్థారించుకున్నారు. 20 మంది వైద్యులు... ఏడున్నర గంటలు... రాత్రి పదకొండు గంటలకు యశోద ఆస్పత్రిలో దాత నుంచి గుండె సేకరించారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గ్రీన్‌చానల్ ద్వారా ఏడు నిమి షాల్లోనే నిమ్స్‌కు చేర్చారు. అప్పటికే ఆపరేషన్ థియేటర్లో బాధితురాలి ఛాతిని ఓపెన్ చేసి శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. కార్డియో థొరాసిక్ అధిపతి ఆర్వీ కుమార్ నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్య బృందం... బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏడున్నర గంటలు శ్రమించి బాధితురాలికి విజయవంతంగా గుండె అమర్చింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచారు. మరో 48 గంటల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. -
పునరుద్ధరించి.. మళ్లీ అమర్చి
* దెబ్బతిన్న కాలేయానికి ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స * ప్రపంచంలోనే రెండోది... దేశంలో మొదటిది సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాలేయం, కాళ్లు, పొట్ట భాగంలోని ప్రధాన రక్తనాళాలు మూసుకుపోవడంతో కాలేయం పని తీరు దెబ్బతిని తరచూ రక్తస్త్రావంతో బాధపడుతున్న యువకుడికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్'(దెబ్బతిన్న కాలేయాన్ని శరీరం నుంచి బయటికి తీసి, పూడుకుపోయిన అంతర్గత రక్త నాళాలను పునరుద్ధరించి, తిరిగి అమర్చడం) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా చికిత్స చేయడం ఇది రెండోదని, దేశంలో మొదటిదని ఉస్మానియా వైద్యులు తెలిపారు. కెనడాలో మాదిరిగా... ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు(24) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. కాలేయం నుంచి గుండెకు, తిరిగి అటు నుంచి కాలేయానికి రక్తం సరఫరా చేసే ఇంట్రాహెపటిక్ బ్లడ్ వెసెల్ (ఐవీసీ) మూసుకుపోయింది. దీంతో కాలేయం దెబ్బతింది. పొట్ట, కాళ్లకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వల్ల అవి ఉబ్బి తరచూ రక్తస్త్రావం అవుతోంది. దీన్ని వైద్య పరిభాషలో 'క్రానిక్ బడ్ చియరీ సిండ్రోమ్'గా పిలుస్తారు. చికిత్స కోసం నగరంలోని ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రులను సంప్రదించగా... కాలేయ మార్పిడి చేయాలని, అందుకు రూ.20-30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అంత ఖర్చు భరించే స్తోమత లేక నాగరాజు ఉస్మానియా ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.మధుసూదన్‌ను ఆశ్రయించాడు. పరీక్షలు చేసిన వైద్యులు... కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని తొలుత భావించారు. అయితే... కాలేయ దాత కోసం రెండు మాసాలు ఎదురు చూసినా దొరకలేదు. ఈ క్రమంలో కెనడాలోని టొరంటో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా ఇదే వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్' పద్ధతిలో శస్త్రచికిత్స చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో డాక్టర్ మధుసూదన్ బృందం ఈ తరహా శస్త్రచికిత్సకు సిద్ధమైంది. 25 మంది వైద్యులు... 10 గంటలు... ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలకు కావాల్సిన నిధులను సమకూర్చారు. ప్రభుత్వ అనుమతితో ఈ నెల 13న ఛాతీ కింది భాగంలోని కాలేయాన్ని పూర్తిగా కత్తిరించి, బయటకు తీసి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్స్ దగ్గర దాన్ని భద్రపరిచారు. కాలేయంలో పూడుకుపోయిన అంతర్గత రక్తనాళాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో కాళ్లు, పొట్ట భాగం రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌లను క్లియర్ చేశారు. ఇలా శరీరం పునరుద్ధరించిన కాలేయాన్ని తిరిగి అదే వ్యక్తికి అదేచోట విజయవంతంగా అతికించారు. ఇందు కోసం 25 మందితో కూడిన వైద్య బృందం సుమారు 10 గంటలు శ్రమించినట్లు మధుసూదన్ తెలిపారు. బాధితుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, గురువారం డిశ్చార్జ్ కానున్న అతను జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందన్నారు. -
'మనుషులకు పందుల అవయవాలు'
వాషింగ్టన్: వివిధ ప్రమాదాలలో, వ్యాధుల వల్ల అవయవాలు కోల్పోయే వారికి పందుల నుండి సేకరించిన అవయవాలను అమర్చడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. నూతన జన్యు ఎడిటింగ్ విధానం ' సిఆర్ఐఎస్పీ ఎస్9' ద్వారా ఇంతకు ముందు సాధ్యం కానటువంటి క్లిష్టమైన జీన్ ఎడిటింగ్ ప్రక్రియ సాధ్యమైనట్లు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మానవుని గుండెకు సంబంధించిన కవాటాల మార్పిడి చికిత్సలో పందుల యొక్క గుండె కవాటాలను ప్రస్తుతం వాడుతున్నారు. కాగా అవయవాలను, కణజాలాలను ఉపయోగించాల్సిన సందర్భంలో ఎదురయ్యే సమస్యలు నూతన విధానంతో తొలగిపోనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన జన్యు విధానం ద్వారా సుమారు 62 రకాల జన్యువులను ఎడిట్ చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే త్వరలోనే పందుల యొక్క పూర్తి స్థాయి కణజాలాలు, అవయవాలు మనుషులకు అమర్చనున్నారు. -
తిరిగొచ్చిన మగతనంతో తండ్రి కాబోతున్నాడు
కేప్‌టౌన్: అవును. కోల్పోయిన మగతనాన్ని ఆపరేషన్ ద్వారా తిరిగి పొందిన 22 ఏళ్ల దక్షిణాఫ్రికా యువకుడు తండ్రి కాబోతున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పురుషాంగం (పెన్నిస్) ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ నిర్వహించిన కేప్‌టౌన్‌లోని టైగర్బర్గ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఆపరేషన్ ద్వారా మగతనాన్ని పొందిన ఆ యువకుడు (పేరు వెల్లడించలేదు) తండ్రి కాబోతునట్లు చెప్పాడు. ప్రస్తుతం అతని గర్లప్రెండ్ నాలుగు నెలల గర్భవతి. ఈ వార్త మమ్మల్ని ఆనందింపజేస్తోంది' అని పేర్కొన్నారు. మత మార్పిడిలో భాగంగా సున్తీ చేయించుకున్న సదరు యువకుడు కొద్ది రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సున్తీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని పురుషాంగాన్ని తొలిగించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత కొద్ది నెలల కిందటే కేప్‌టౌన్ వైద్యులు..యూనివర్సిటీ ఆఫ్ స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్ల సహకారంతో ఆ యువకుడికి మగతనాన్ని ప్రసాదించారు. అనారోగ్యంతో మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అతని అంగాన్ని సదరు యువకుడికి అమర్చారు.