కాలేయ మార్పిడి
విశాఖ విమానాశ్రయం..
సమయం ఆదివారం రాత్రి ఏడు గంటలు
ఎవరో ముఖ్యమైన వ్యక్తి వస్తున్నట్టు విమానాశ్రయం అంతా హడావుడిగా ఉంది. పోలీసులు, విమానాశ్రయ సిబ్బందిలో ఆదుర్దా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వాతావరణంలోనే తిరుపతి నుంచి ప్రత్యేక విమానం దూసుకొచ్చి రన్‌వేపై ఆగింది. విమానం ఆగీ ఆగగానే, తలుపులు తెరుచుకున్న వెంటనే.. ప్రముఖులెవరూ దిగలేదు కానీ.. ప్రత్యేక యూనిఫారంలో ఉన్న కొందరు వ్యక్తులు ఏదో ఓ ప్రత్యేకమైన బాక్స్‌ను పట్టుకుని పరుగులు తీస్తున్నట్టు దిగడం కనిపించింది. అంతా ఉత్కంఠగా చూస్తూ ఉండగానే, వారు అక్కడే ఆగి ఉన్న ఓ వాహనంలోకి చేరడం, పోలీస్ ఎస్కార్ట్‌తో ఆ వాహనం దూసుకు పోవడం క్షణాల్లో జరిగిపోయాయి. పోలీస్ వాహనం సైరన్ మోగుతుండగా ట్రాఫిక్ పోలీసులు విజిల్స్ ఊదుతూ, రోడ్ల మీద ఒక్క అడ్డంకి కూడా లేకుండా చేస్తూ ఉండగా, ఈ వాహనం ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, అడవి వరం మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డుపై మెరుపులా దూసుకుపోయింది. అదే వేగంతో ముడసర్లోవ చేరువలోని అపోలో ఆస్పత్రి వాకిట్లో ఆగింది. వాహనం తలుపులు తెరిచిన వెంటనే అప్పటికే అక్కడ ఆతతగా వేచి ఉన్న వైద్యులు పెట్టెతో పాటు లోనికి పరుగులు తీయగానే.. ఓ బహత్ ప్రయత్నం మొదలైంది. ఆ పెట్టెలో వచ్చింది ఎంతో విలువైన కాలేయం కాగా.. ఆస్పత్రికి దానిని ఆఘమేఘాలపై చేర్చిన వెంటనే అపోలోలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స మొదలైంది.
ఆరిలోవ: ఉత్కంఠభరిత వాతావరణంలో విశాఖలోని అపోలో ఆస్పత్రి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు వేదికైంది. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆరిలోవ ప్రాంతం పెదగదిలి వద్ద గల అపోలో ఆస్పత్రి ఇందుకు కేంద్రమైంది. ఈ శస్త్ర చికిత్స కోసం కాలేయాన్ని తిరుపతిలో ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆఘమేఘాలపై విశాఖలోని అపోలోకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి అపోలో వరకు కాలేయాన్ని తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు. అనుకొన్న సమయం కంటే కొన్ని నిముషాల ముందుగానే అస్పత్రికి కాలేయం చేరేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
ఇదీ నేపథ్యం
విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన ‘జీవన్‌దాన్’ స్కీమ్‌లో సభ్యుడుగా చేరాడు. విజయవాడలో వైద్యులు కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ స్కీంలో భాగంగా రోగి కుటుంబ సభ్యులు తిరుపతిలో ఓ ఆస్పత్రిని సంప్రదించి కాలేయం సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. దీని ప్రకారం అపోలోలో కాలేయ మార్పిడి చేయడానికి ఇక్కడి వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన ప్రకారం ఆదివారం వేకువ జామున రోగి అపోలోలో చేరాడు. కాలేయాన్ని తిరుపతి నుంచి ఇక్కడకు ప్రత్యేక విమానంలో తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరడానికి ట్రాఫిక్ నియంత్రణకు అపోలో నిర్వాహకులు ట్రాఫిక్ పోలీసుల సహకారం కోరారు. దాంతో పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. విమానాశ్రయం నుంచి గోపాలపట్నం, సింహాచలం, ముడసర్లోవ మీదుగా అపోలోకి చేరేవిధంగా పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అన్ని కూడళ్లలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో సాయంత్రం 7.30 గంటలకు చేరాల్సిన కాలేయం ఐదు నిముషాల ముందుగానే ఆస్పత్రికి చేరింది.
ఇలా ప్రయాణం
తిరుపతిలో కాలేయంతో ప్రత్యేక విమానం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరింది. విశాఖ విమానాశ్రయానికి 7 గంటలకు చేరుకొంది. విమానాశ్రయం ద్వారం ముందు సిద్ధంగా ఉన్న అపోలో అంబులెన్స్‌లోకి కాలేయం ఉన్న ప్రత్యేక బాక్స్‌ను సిబ్బంది ఎక్కించి అక్కడ 7.04 గంటలకు బయలదేరారు. అంబులెన్స్ విమానాశ్రయం నుంచి 7.10 గంటలకు ఎన్‌ఏడీ కూడలికి దూసుకొచ్చింది. అక్కడ నుంచి గోపాలపట్నం మీదుగా 7.18 గంటలకు సింహాచలం చేరుకుంది. కేవలం 7 నిముషాల్లో (7.25 గంటలకు) ముడసర్లోవ మీదుగా పెదగదిలి వద్ద అపోలో ఆస్పత్రికి అంబులెన్స్ చేరింది. అంటే 18 కిలోమీటర్లు 21 నిమిషాల్లో ప్రయాణించింది. వెంటనే సిబ్బంది ఆగమేఘాలపై మూడో ఫ్లోర్‌లో ఉన్న ఆపరేషన్ థియేటర్‌కు చేర్చారు. అప్పటికే సిద్ధమైన వైద్య సిబ్బంది 7.28 నిముషాలకు ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఆపరేషన్ పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. విశాఖలో అపోలోలో కాలేయం మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు.