
పునరుద్ధరించి.. మళ్లీ అమర్చి
* దెబ్బతిన్న కాలేయానికి ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స
* ప్రపంచంలోనే రెండోది... దేశంలో మొదటిది
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాలేయం, కాళ్లు, పొట్ట భాగంలోని ప్రధాన రక్తనాళాలు మూసుకుపోవడంతో కాలేయం పని తీరు దెబ్బతిని తరచూ రక్తస్త్రావంతో బాధపడుతున్న యువకుడికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్'(దెబ్బతిన్న కాలేయాన్ని శరీరం నుంచి బయటికి తీసి, పూడుకుపోయిన అంతర్గత రక్త నాళాలను పునరుద్ధరించి, తిరిగి అమర్చడం) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా చికిత్స చేయడం ఇది రెండోదని, దేశంలో మొదటిదని ఉస్మానియా వైద్యులు తెలిపారు.
కెనడాలో మాదిరిగా...
ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు(24) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. కాలేయం నుంచి గుండెకు, తిరిగి అటు నుంచి కాలేయానికి రక్తం సరఫరా చేసే ఇంట్రాహెపటిక్ బ్లడ్ వెసెల్ (ఐవీసీ) మూసుకుపోయింది. దీంతో కాలేయం దెబ్బతింది. పొట్ట, కాళ్లకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వల్ల అవి ఉబ్బి తరచూ రక్తస్త్రావం అవుతోంది. దీన్ని వైద్య పరిభాషలో 'క్రానిక్ బడ్ చియరీ సిండ్రోమ్'గా పిలుస్తారు. చికిత్స కోసం నగరంలోని ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రులను సంప్రదించగా... కాలేయ మార్పిడి చేయాలని, అందుకు రూ.20-30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
అంత ఖర్చు భరించే స్తోమత లేక నాగరాజు ఉస్మానియా ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.మధుసూదన్‌ను ఆశ్రయించాడు. పరీక్షలు చేసిన వైద్యులు... కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని తొలుత భావించారు. అయితే... కాలేయ దాత కోసం రెండు మాసాలు ఎదురు చూసినా దొరకలేదు. ఈ క్రమంలో కెనడాలోని టొరంటో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా ఇదే వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్' పద్ధతిలో శస్త్రచికిత్స చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో డాక్టర్ మధుసూదన్ బృందం ఈ తరహా శస్త్రచికిత్సకు సిద్ధమైంది.
25 మంది వైద్యులు... 10 గంటలు...
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలకు కావాల్సిన నిధులను సమకూర్చారు. ప్రభుత్వ అనుమతితో ఈ నెల 13న ఛాతీ కింది భాగంలోని కాలేయాన్ని పూర్తిగా కత్తిరించి, బయటకు తీసి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్స్ దగ్గర దాన్ని భద్రపరిచారు. కాలేయంలో పూడుకుపోయిన అంతర్గత రక్తనాళాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో కాళ్లు, పొట్ట భాగం రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌లను క్లియర్ చేశారు. ఇలా శరీరం పునరుద్ధరించిన కాలేయాన్ని తిరిగి అదే వ్యక్తికి అదేచోట విజయవంతంగా అతికించారు. ఇందు కోసం 25 మందితో కూడిన వైద్య బృందం సుమారు 10 గంటలు శ్రమించినట్లు మధుసూదన్ తెలిపారు. బాధితుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, గురువారం డిశ్చార్జ్ కానున్న అతను జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందన్నారు.