
మా నాన్నగారి వయసు 50 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. ఎప్పుడూ నీరసంగా చాలా బలహీనంగా ఉంటున్నారు. ఇదివరకటిలా తన సహచరులతో సాయంత్రాలు బాడ్మింటన్ ఆటకూ, ఉదయం వాకింగ్‌కూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చూపిస్తే బ్లడ్‌క్యాన్సర్ ఉన్నట్లు చెప్పారు. దీనికి పర్మనెంట్ చికిత్స బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పారు. పూర్తిగా మ్యాచింగ్ బోన్‌మ్యారో డోనార్‌ను ఏర్పాటు చేసుకోమన్నారు. ఈ మ్యాచింగ్ డోనార్ అంటే ఏమిటో వివరించగలరు. ఒకవేళ దాత దొరకకపోతే ఏం చేయాలి? దయచేసి వివరంగా చెప్పండి.
– కిరణ్‌కుమార్, కరీంనగర్
మార్పిడి చేసే మూలకణాల వనరును బట్టి ఈ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడు రకాలు ఉన్నాయి. రెస్క్యూ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఒక వ్యక్తికి తన సొంత స్టెమ్‌సెల్స్‌తో చికిత్స చేస్తారు. ఇందుకోసం ముందుగానే ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిని బయట అభివృద్ధిపరచి మార్పిడికి సిద్ధం చేస్తారు. రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయ్యాక వాటితోనే ఆ వ్యక్తి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మూలకణాలే తిరిగి అతడిని చేరతాయి. ఇలా జరిగినప్పుడు మూలకణాల మార్పిడి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఆల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఇందులో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో మార్పిడి ప్రక్రియను నిర్వహిస్తారు. అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా దాతపైన ఆధారపడే అల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటిదే. అయితే ఇందులో నవజాత శిశువు బొడ్డుతాడు (అంబ్లికల్ కార్డ్) నుంచి సేకరించిన మూలకణాలను వాడతారు.
మీరు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో మార్పిడి ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు మ్యాచింగ్ అవసరమవుతుంది. ఇందులో దాత మూలకరణాలు స్వీకరించే వ్యక్తికి జన్యురీత్యా సంబంధికులై ఉంటాడు. చాలా సందర్భాల్లో దగ్గరి బంధువులు దాతలవుతారు. అదే సమయంలో జన్యురీత్యా సరిపడే బయటి వ్యక్తులు కూడా ఉపయోగపడతారు. దాత–స్వీకర్త రక్తం గ్రూప్ సరిపడినవైతేనే మూలకణమార్పిడి చేస్తున్నారు. అందువల్ల మీకు పూర్తి మ్యాచింగ్ బోన్ మ్యారో దాత కోసం సూచించారు. అయితే మూలకణ మార్పిడి ప్రక్రియలో ఇటీవల నూతన విధానాలు, మెళకువలు అభివృద్ధి చెందాయి. వీటిని అనుసరించడం వల్ల ఈ ‘పూర్తి మ్యాచింగ్’ పరిమితిని అనే అంశాన్ని అధిగమించగలుగుతున్నాం.
రక్తం గ్రూపు సరిపోని పక్షంలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సాధ్యం కాదన్నది అపోహ మాత్రమే. బ్లడ్‌గ్రూప్ మ్యాచ్ కాకపోయినా మూలకణ మార్పిడి చేయవచ్చు. ఇందుకు దాత – స్వీకర్తల ఆర్.హెచ్. సరిపోవడం కూడా తప్పనిసరేమీ కాదు. కావాల్సిందల్లా హెచ్‌ఎల్‌ఏ అనే జన్యువులు సరిపోవడం. హెచ్‌ఎల్‌ఏ జన్యువుల్లో క్లాస్–1, క్లాస్–2 అని రెండు రకాల ఉండాలి. క్లాస్–1లో ఏ, బి, సి జతల జన్యువులు ఉంటాయి. అదే క్లాస్–2లో డీఆర్ అనే జన్యువు జత ఉంటుంది. ఈ మొత్తం నాలుగింటిలో దాత–స్వీకర్తల మధ్య రెండు జతలు సరిపోయినా (హాఫ్ మ్యాచ్) అయినా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను నిరభ్యంతరంగా చేయవచ్చు. ఈ రకమైన మూలకణ మార్పిడి ప్రక్రియలు ఫుల్‌మ్యాచ్ ప్రక్రియలతో సమానంగా విజయవంతం అవుతున్నాయి. అందువల్ల మీరు ఎలాంటి సందేహాలు, ఆందోళన లేకుండా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కు వెళ్లండి.
రక్త సంబంధిత సమస్యలకు ఇక తరచూ రక్తమార్పిడి అవసరం లేదు
మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. ఇన్ఫెక్షన్‌తో తరచూ జ్వరం వస్తోంది. స్కూల్‌కు కూడా వెళ్లలేకపోతున్నాడు. హైదరాబాద్‌లో డాక్టర్లకు చూపించాం. రక్తానికి అందునా... తెల్లరక్తకణాలు సంబంధించి సమస్యలు ఉన్నాయని, జీవితాంతం రక్తమార్పిడి చేయించుకుంటూ ఉండాల్సిందేనని చెప్పారు. అలా జరగకపోతే మా అబ్బాయి మరో నాలుగైదు ఏళ్లకు మించి బతికే అవకాశం లేదని కూడా అన్నారు. ఈమాట మా అందరికీ ఆందోళన కలిగిస్తోంది. మా అబ్బాయిని కాపాడుకోడానికి మార్గం ఏదైనా ఉందా? దయచేసి తెలపండి.
– ఆర్ శ్యామల, మంచిర్యాల
తెల్లరక్తకణాలు ఉత్పాత్తి కాకపోవడమో లేక వాటిలో సమస్యల వల్లనో మీ అబ్బాయికి రోగనిరోధక శక్తి తగ్గిపోయి (ఇమ్యూనో డెఫిషియెన్సీ) ఏర్పడినట్లు మీరు చెప్పిన అంశాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటప్పుడు ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థతో సహా వివిధ శరీర భాగాలకు ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా తయారవుతాయి.
రక్తకణాలకు సంబంధించిన తీవ్ర సమస్యలు ఎదురైనప్పుడు రక్తం, రక్తకణాలను మారుస్తూ ఉండటం అవసరమవుతుంది. ఇది ఎడతెగని శ్రమతో కూడిన వ్యవహారం. పైగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. రోజులు గడుస్తున్నకొద్దీ ఆర్థికభారాన్ని పెంచుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఇప్పుడొక మంచి పరిష్కారం ఉంది. ఈ రకమైన సమస్యలకు మూలకణ మార్పిడితో శాశ్వత పరిష్కారం లభిస్తోంది. ఈ చికిత్సలో మొదట వ్యాధిగ్రస్త బోన్‌మ్యారోను పూర్తిగా తొలగిస్తాం. ఆ తర్వాత దాత నుంచి సేకరించిన కొత్త మూలకణాలను ఎక్కిస్తాం. ఈ కొత్త మూలకణాలు (స్టెమ్‌సెల్స్) ఇకపై ఆరోగ్యకరమైన కొత్త రక్తాన్ని తయారు చేస్తాయి. కాబట్టి దీంతో ఆరోగ్యాన్ని దెబ్బతీసే రోగనిరోధక శక్తి లోపం తొలగిపోతుంది. ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్ల దాడిని తట్టుకుంటుంది. దాంతో ఆరోగ్యకరమైన సాధారణ జీవితం సాధ్యపడుతుంది.
బోన్‌మ్యార్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఫలితాలు చిన్నపిల్లల్లో మరింత మెరుగ్గా!
మా అబ్బాయికి మూడున్నరేళ్లు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే హైదరాబాద్‌కు వచ్చి చూపించాం. అన్ని పరీక్షలు చేశాక, బ్లడ్‌క్యాన్సర్ అని చెప్పారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా దీనికి పూర్తిగా చికిత్స చేయవచ్చని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. మా బాబు ఆరోగ్యంపై మా కుటుంబ సభ్యులమంతా కలత చెందుతున్నాం. పై ప్రక్రియ ఎలా చేస్తారు. మాకు తగిన సలహా ఇవ్వండి.
– కె. శ్రీకాంత్, ఆదిలాబాద్
అనేక రకాల బ్లడ్‌క్యాన్సర్లకు బోన్‌మ్యారో (ఎముకలోని మజ్జ లేదా మూలగ) ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ఇప్పటికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స. అయితే పెద్దలతో పోలిస్తే చిన్నపిల్లల్లో ఈ చికిత్స ఇంకా మెరుగ్గా సాధ్యమవుతుంది. ఇందులో క్యాన్సర్‌గ్రస్తమైన బోన్‌మ్యారోను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యవంతమైన బోన్‌మ్యారోను నింపడం ద్వారా బ్లడ్‌క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఇప్పుడు చాలా సురక్షితమైన ప్రక్రియ. సాధారణంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ 75 ఏళ్ల వారికి కూడా చేస్తారు. అయితే రోగి వయసు ఎంత తక్కువగా ఉంటే ఈ ప్రక్రియ ఫలితాలు అంతబాగా ఉంటాయి. మీ అబ్బాయి వయసులో చాలా చిన్నవాడు అయినందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబటి మీ బాబును సమీపంలోని అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉన్న బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు తీసుకెళ్లండి. అలాగే బోన్‌మ్యారోను దానం చేయగలవారి కోసం కుటుంబ సభ్యుల హెచ్‌ఎల్‌ఏ టైపింగ్ నిర్ధారణ కోసం అందుబాటులో ఉంచండి. బ్లడ్ క్యాన్సర్లలో మూడు రకాలు ఉంటాయి. అవి... లింఫోమా, మైలోమా, లుకేమియా. మొదటి రెండు రకాల క్యాన్సర్‌ల చికిత్స కోసం పేషెంట్ నుంచే స్టెమ్‌సెల్స్ సేకరించడం జరుగుతుంది. లుకేమియా విషయంలో మాత్రంహెచ్‌ఎల్‌ఏ మ్యాచ్ అయిన దాత నుంచి స్టెమ్‌సెల్స్ సేకరించి, పేషెంట్ ఎముక మజ్జ మార్పిడి చేయడం ద్వారా చికిత్స చేస్తారు. మీ అబ్బాయి విషయంలో మీరు అసలు బాధపడటానికి అవకాశమే లేదు. ఎందుకంటే... దాదాపు 90 శాతం మంది పేషెంట్లు ఈ చికిత్స చేయించుకున్న తర్వాత పూర్తిగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
– డాక్టర్ గణేష్ జైషట్వార్, సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్
అండ్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment