ఇక అందుబాటులోకి మానవ అవయవాలు
న్యూయార్క్: మానవుల్లో ఏడాదికి 1,20,000 అవయవాలను ఒకరి నుంచి ఒకరికి మారుస్తున్నారు. వాటిలో ఎక్కువగా కిడ్నీలే ఉంటున్నాయి. ప్రమాదాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి, స్వచ్ఛంద దాతల నుంచి తీసిన అవయవాలను రోగులకు అమరుస్తున్నారు. అయినప్పటికీ ఏడాదికి లక్షలాది మంది రోగులు తమకు అవసరమైన అవయవాల కోసం నిరీక్షించి అవి సకాలంలో అందక మరణిస్తున్నారు. వారి కోసం అవసరమైన కృత్రిమ మానవ అవయవాలను సృష్టించడం ఎలా? అనే అంశంపై ఎంతోకాలం నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలోజీ రావడం వల్ల ఈ ప్రయోగాలు సులభతరం అయ్యాయి.
మానవ కణజాలాన్ని కృత్రిమంగా అభివృద్ధి చేసి కిడ్నీలు, గుండె, కాలేయమే కాకుండా కళ్లు, ముక్కు, చెవులను సృష్టించవచ్చని భావించారు. ఇప్పుడు ఆ దిశగా వేగంగా పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ చర్మంతోపాటు, చెవిని సృష్టించారు. పునరుత్పత్తి శక్తి కలిగిన కాలేయాన్ని అతి త్వరలోనే సృష్టిస్తామని చెబుతున్నారు. మరి కొన్నేళ్లలో కిడ్నీలను ప్రింట్ చేస్తామని పరిశోధకులు చెబుతున్నారు. గుండె లాంటి సంక్లిష్టమైన అవయవాల సృష్టికి మాత్రం మరికొంత కాలం పడుతుందని అంటున్నారు.
ఇంక్‌జెట్ ప్రింటర్ల నాజిల్స్ ద్వారా మానవ సజీవ మూల కణాలను దెబ్బతినకుండా స్ప్రే చేయవచ్చని కనుగొనడంతో మానవ అవయవాల సృష్టికి 2000 సంవత్సరంలోనే ప్రయోగాలు మొదలయ్యాయి. ఇప్పుడు మానవ జీవ కణాలను ఒక పొర మీద మరో పొరను పేర్చుకుంటూ పోయి అవి సజీవ కణజాలంగా పెరిగేలా చేయవచ్చని, వాటితోని త్రీడీ ప్రింటర్ల ద్వారా అవయవాలను సృష్టించవచ్చని కనుగొన్నారు. ఇప్పటికే ప్రింట్ చేసిన మానవ చెవులను, ఎముకలను, కండరాలను జంతువులకు అమర్చి విజయం సాధించారు. గతేడాది షికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ మానవ అండాశయాన్ని సృష్టించి ఓ ఎలుకలో అమర్చారు. దీని ద్వారా పునరుత్పత్తిని కూడా సాధించగలిగారు.
చైనాలోని చెంగ్డూలోవున్న సిచువాన్ రివోటెక్ బయోటెక్నాలజీ కంపెనీ ఓ భాగం కృత్రిమ ధమనులను సృష్టించి విజయవంతంగా ఓ కోతిలో ప్రవేశపెట్టింది. అలాగే శాండియాగోలోని ఆర్గనావో అనే కంపెనీ మానవ మూల కణాల ద్వారా కృత్రిమ కాలేయాన్ని సృష్టించి గత డిసెంబర్ నెలలో ఎలుకలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడది విజయవంతంగా పనిచేస్తోంది. త్వరలోనే దీన్ని మానవుల్లో ప్రవేశపెట్టి విజయం సాధిస్తామని చెబుతోంది. ఈ విషయంలో ఒక్క అమెరికాలోనే ఏడాదికి 300 కోట్ల డాలర్ల వ్యాపారం ఉంటుందని కూడా అంచనావేసింది. మిచిగాన్‌లోని టిష్యూ రీజెనరేషన్ సిస్టమ్స్ సంస్థతో ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీ ఎముకల ప్రింటింగ్‌కు కృషి చేస్తోంది. కెనడాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోకాలు చిప్పల ప్రింటింగ్‌కు కృషి చెస్తోంది. వినియోగదారుల సరకుల కంపెనీ ‘ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ ఐదు చదరపు మీటర్ల మానవ చర్మాన్ని ఇప్పటికే సృష్టించింది.
ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైతే గుండెలో స్టెంట్‌లను కొనుగోలు చేసే బదులు ఏకంగా గుండెలనే కొనగోలు చేసి రోగులకు అమర్చవచ్చు. ఈ ఒక్కటేమి ఖర్మ కిడ్నీలు, ఊపిరితుత్తులు, కాలేయం, క్లోమ గ్రంధి, మోకాళ్ల చిప్పలు, కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, పెదాలు సర్వం కొనుగోలుచేసి అమర్చుకోవచ్చు.