human body parts
-
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Brain Tumor Day: మెదడులో కల్లోలం.. లక్ష మందిలో ఏడుగురికి
కర్నూలు(హాస్పిటల్): మానవ శరీరంలో మెదడు కీలక అవయవం. శరీర నిర్మాణం, వ్యవహారం మొత్తం నడిచేది అక్కడి నుంచే. అలాంటి మెదడులో అలజడి రేగితే శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్‌పై ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ప్రతి లక్ష మందిలో ఏడుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే జిల్లాలో 350 మంది దాకా ఈ జబ్బుతో సతమతమవుతున్నట్లు అంచనా. 20 ఏళ్ల క్రితం జిల్లాలో ఒకే ఒక్క న్యూరోసర్జన్ డాక్టర్ డబ్ల్యూ సీతారామ్ ఉండేవారు. మెదడు, కేంద్రనాడీ మండలానికి వచ్చే వ్యాధులకు ఆయనే చికిత్స అందించేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయన వద్ద చికిత్స తీసుకునేందుకు రాయలసీమ జిల్లాలన్నింటితో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి సైతం వచ్చిన పేషెంట్లు నెలల తరబడి వేచి చూసేవారు. దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ సీట్లు పెరిగిన కారణంగా ఇటీవల సూపర్స్పెషలిస్టుల కొరత తీరింది. ప్రతి విభాగానికి పది మందికి పైగా స్పెషాలిటీ వైద్యులున్నారు. ఈ మేరకు న్యూరోసర్జరీ విభాగంలోనూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ఐదుగురు డాక్టర్లు ఉండగా, ప్రైవేటుగా మరో 10 మంది దాకా వైద్యులున్నారు. వీరితో పాటు అంతే సంఖ్యలో న్యూరోఫిజీషియన్లూ సేవలందిస్తున్నారు. వీరందరి వద్దకు బ్రెయిన్ ట్యూమర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఇలాంటి వ్యాధులకు శస్త్రచికిత్సలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నగరంలోని నాలుగైదు ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. మెదడు కణితులు, రకాలు? మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూబర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. కొన్ని రసాయనాల బారిన పడటం, రేడియేషన్ ఎక్కువగా ఉండటం, ఎక్స్టీమ్ వైరస్ బారిన పడటం వల్ల ఈ కణితులు ఏర్పడతాయి. లక్షణాలు మెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహకోల్పోవడం వంటివి. ఇక రెండవది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్ రావడం, మాట తడబడటం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేము. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు తప్పనిసరిగా కలవాలి. నిర్ధారణ ఇలా.. మెదడులో కణితులు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి మూడు రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది క్లినికల్, రెండోది రేడియాలజీ, మూడోది సర్జికల్ ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌లో తేలిపోతుంది. కానీ కొందరిలో సర్జికల్ ద్వారా కూడా నిర్ధారణ చేయవచ్చు. ఈ స్కాన్లలో కణితులను నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స ప్రారంభిస్తారు. మెదడు కణితులను బట్టి చికిత్స మెదడులో ఏర్పడిన కణితులను గ్రేడ్ 1, 2, 3, 4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తాం. అలాగే కణితుల స్థానంపై కూడా ఆధారపడి చికిత్స ఉంటుంది. గ్రేడ్ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. దీని ద్వారా వారి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3, 4 కణితులు ఉంటే జీవితకాలం జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మంచింది. – డాక్టర్ ఎన్.సుమంత్‌కుమార్, న్యూరోసర్జన్, కర్నూలు -
కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా..
న్యూఢిల్లీ: మనుషుల చర్మంపై కరోనా వైరస్ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్ కారక సార్స్–సీవోవీ–2 మాత్రం 9 గంటల పాటు జీవించి ఉంటుందని జపాన్ కు చెందిన పరిశోధన సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువేనని హెచ్చరించింది. సార్స్–సీవోవీ–2 వైరస్ వ్యాప్తి నిరోధానికి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొంది. ఉపరితలాలపై దీర్ఘకాలం... చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని సూచించింది. సాధారణ ఫ్లూ వైరస్‌తో పోలి్చతే కరోనా వైరస్ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై దీర్ఘకాలం చురుకుగా ఉంటున్నట్లు తేల్చారు. అయితే చర్మంతో పోలిస్తే స్టీలు, గాజు, ప్లాస్టిక్ వంటి వాటిపై త్వరగా నశిస్తోందన్నారు. అంతేకాదు చర్మంపైన ఉండే వైరస్‌కు లాలాజలం, చీమిడి, చీము.. లాంటివి తోడైతే కరోనా వైరస్ 11 గంటల పాటు సజీవంగా ఉంటుందని తేల్చారు. (కరోనా మా దగ్గర పుట్టలేదు: చైనా) ఇదీ క్యోటో వర్సిటీ పరిశోధన... జపాన్ క్యోటో పర్‌ఫెక్చురల్ వర్సిటీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన తాజా పరిశోధన అంశాలు ఆక్స్ఫర్డ్ అకడమిక్, ద జర్నల్ క్లినికల్ ఇనెఫెక్షియస్ డిసీజెస్‌ల్లో ప్రచురితం అయ్యాయి. పోస్ట్‌మార్టం చేసిన శవాల నుంచి సేకరించిన చర్మంపై ఈ అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా శరీరంలోని ఇతర అవయవాలతో పోల్చితే చర్మం నెమ్మదిగా క్షీణిస్తుంది. అందుకే చనిపోయి ఒకరోజు గడిచిన మృతదేహాల నుంచి సేకరించిన చర్మంపై ఈ పరిశోధనలు జరిపారు. ఇథెనాల్ శానిటైజర్‌తో 15 సెకన్లలోనే... చనిపోయి 24 గంటలు గడిచాక కూడా ఆ చర్మం ‘స్కీన్ గ్రాఫ్టింగ్’కు ఉపయోగపడుతుందని, చనిపోయాక కొంత సమయం దాకా చర్మం వినియోగించవచ్చు అన్న దానికి ఇంత కంటే నిదర్శనం అవసరం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే మృతదేహాల చర్మంపై నుంచి వైరస్‌కు సంబంధించి తీసుకున్న రీడింగ్స్ కచ్చితంగా ఉంటాయని నిర్ధారించామన్నారు. 80 శాతం ఇథెనాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్లు వాడితే కరోనా వైరస్‌తో సహా ఇన్ ఫ్లుయెంజా సెల్స్ కూడా 15 సెకన్లలోనే నాశనమైపోతాయని వారు తెలిపారు. అంతేకాదు.. సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులను కడుక్కుంటే ఈ వ్యాధి వ్యాప్తిని ఆపవచ్చని, 60 శాతం ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్ వాడినా ఉపయోగం ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇదివరకే సూచించింది. అధిక శాతం మందిపై కరోనా వైరస్ కొద్ది మేరకే ప్రభావం చూపుతోందని.. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటివి వచ్చి కొద్ది రోజులకు తగ్గిపోతున్నాయని పేర్కొంది. అయితే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో వారి పరిస్థితి విషమించడం, చివరకు మరణించడం జరుగుతోందని ఈ పరిశోధకులు పునరుద్ఘాటించారు. -
అవి ‘ఎయిరిండియా’ మృతులవేనా?
మాంట్ బ్లాంక్‌పై మానవ అవశేషాల గుర్తింపు గ్రానాబుల్(ఫ్రాన్స్): ఆల్ప్స్ శ్రేణిలో అతిపెద్ద పర్వతమైన ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌పై మానవ శరీర భాగాలను గుర్తించారు. ఇవి 50 ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో చనిపోయినవారివి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. 1950లో మాంట్ బ్లాంక్ పర్వతంపై ఎయిరిండియా విమానం కూలి 48 మంది మరణించారు. మరోసారి 1966లో బాంబే నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 707 విమానం మాంట్ బ్లాంక్ శిఖరాన్ని ఢీకొని అందులోని మొత్తం 117 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదాల గురించి అన్వేషణలు చేసే డేనియల్ రోచీ... ఈ రెండు ప్రమాదాల్లో చనిపోయిన వారి శరీర అవశేషాలు, విమాన శకలాలకోసం గతకొన్నేళ్లుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు గురువారం ఆయన ఓ చేయి, కాలిలో పై భాగంను కనుగొన్నారు. ఇవి 1966 ప్రమాదంలో చనిపోయిన ఓ మహిళవి అయ్యుండొచ్చనీ, తనకు ఆ విమానంలోని ఓ ఇంజిన్ కూడా కనిపించిందని రోచీ చెప్పారు. శరీర భాగాలను నిపుణులు ఇంకా పరిశీలించాల్సి ఉంది. అయితే ఇవి ఒకే వ్యక్తికి చెందినవి కాకపోవచ్చనీ, ప్రయాణికులవే అయినా రెండు ప్రమాదాల్లో ఎప్పుడు చనిపోయిన వారివో చెప్పడం కష్టమని స్థానిక అధికారి ఒకరు అన్నారు. ఇదిలా ఉండగా స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ఓ హిమనీనదం వద్ద 75 ఏళ్ల క్రితం అదృశ్యమైనవారి మృతదేహాలను 10 రోజుల క్రితమే కనుగొన్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయగా వారిద్దరూ భార్యాభర్తలనీ, చనిపోయే నాటికి భార్య వయసు 37, భర్త వయసు 40 అని తేలింది. -
ఇక అందుబాటులోకి మానవ అవయవాలు
న్యూయార్క్: మానవుల్లో ఏడాదికి 1,20,000 అవయవాలను ఒకరి నుంచి ఒకరికి మారుస్తున్నారు. వాటిలో ఎక్కువగా కిడ్నీలే ఉంటున్నాయి. ప్రమాదాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి, స్వచ్ఛంద దాతల నుంచి తీసిన అవయవాలను రోగులకు అమరుస్తున్నారు. అయినప్పటికీ ఏడాదికి లక్షలాది మంది రోగులు తమకు అవసరమైన అవయవాల కోసం నిరీక్షించి అవి సకాలంలో అందక మరణిస్తున్నారు. వారి కోసం అవసరమైన కృత్రిమ మానవ అవయవాలను సృష్టించడం ఎలా? అనే అంశంపై ఎంతోకాలం నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలోజీ రావడం వల్ల ఈ ప్రయోగాలు సులభతరం అయ్యాయి. మానవ కణజాలాన్ని కృత్రిమంగా అభివృద్ధి చేసి కిడ్నీలు, గుండె, కాలేయమే కాకుండా కళ్లు, ముక్కు, చెవులను సృష్టించవచ్చని భావించారు. ఇప్పుడు ఆ దిశగా వేగంగా పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ చర్మంతోపాటు, చెవిని సృష్టించారు. పునరుత్పత్తి శక్తి కలిగిన కాలేయాన్ని అతి త్వరలోనే సృష్టిస్తామని చెబుతున్నారు. మరి కొన్నేళ్లలో కిడ్నీలను ప్రింట్ చేస్తామని పరిశోధకులు చెబుతున్నారు. గుండె లాంటి సంక్లిష్టమైన అవయవాల సృష్టికి మాత్రం మరికొంత కాలం పడుతుందని అంటున్నారు. ఇంక్జెట్ ప్రింటర్ల నాజిల్స్ ద్వారా మానవ సజీవ మూల కణాలను దెబ్బతినకుండా స్ప్రే చేయవచ్చని కనుగొనడంతో మానవ అవయవాల సృష్టికి 2000 సంవత్సరంలోనే ప్రయోగాలు మొదలయ్యాయి. ఇప్పుడు మానవ జీవ కణాలను ఒక పొర మీద మరో పొరను పేర్చుకుంటూ పోయి అవి సజీవ కణజాలంగా పెరిగేలా చేయవచ్చని, వాటితోని త్రీడీ ప్రింటర్ల ద్వారా అవయవాలను సృష్టించవచ్చని కనుగొన్నారు. ఇప్పటికే ప్రింట్ చేసిన మానవ చెవులను, ఎముకలను, కండరాలను జంతువులకు అమర్చి విజయం సాధించారు. గతేడాది షికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ మానవ అండాశయాన్ని సృష్టించి ఓ ఎలుకలో అమర్చారు. దీని ద్వారా పునరుత్పత్తిని కూడా సాధించగలిగారు. చైనాలోని చెంగ్డూలోవున్న సిచువాన్ రివోటెక్ బయోటెక్నాలజీ కంపెనీ ఓ భాగం కృత్రిమ ధమనులను సృష్టించి విజయవంతంగా ఓ కోతిలో ప్రవేశపెట్టింది. అలాగే శాండియాగోలోని ఆర్గనావో అనే కంపెనీ మానవ మూల కణాల ద్వారా కృత్రిమ కాలేయాన్ని సృష్టించి గత డిసెంబర్ నెలలో ఎలుకలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడది విజయవంతంగా పనిచేస్తోంది. త్వరలోనే దీన్ని మానవుల్లో ప్రవేశపెట్టి విజయం సాధిస్తామని చెబుతోంది. ఈ విషయంలో ఒక్క అమెరికాలోనే ఏడాదికి 300 కోట్ల డాలర్ల వ్యాపారం ఉంటుందని కూడా అంచనావేసింది. మిచిగాన్‌లోని టిష్యూ రీజెనరేషన్ సిస్టమ్స్ సంస్థతో ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీ ఎముకల ప్రింటింగ్‌కు కృషి చేస్తోంది. కెనడాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోకాలు చిప్పల ప్రింటింగ్‌కు కృషి చెస్తోంది. వినియోగదారుల సరకుల కంపెనీ ‘ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ ఐదు చదరపు మీటర్ల మానవ చర్మాన్ని ఇప్పటికే సృష్టించింది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైతే గుండెలో స్టెంట్లను కొనుగోలు చేసే బదులు ఏకంగా గుండెలనే కొనగోలు చేసి రోగులకు అమర్చవచ్చు. ఈ ఒక్కటేమి ఖర్మ కిడ్నీలు, ఊపిరితుత్తులు, కాలేయం, క్లోమ గ్రంధి, మోకాళ్ల చిప్పలు, కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, పెదాలు సర్వం కొనుగోలుచేసి అమర్చుకోవచ్చు. -
చేతికి లక్ష, తలకు రెండు లక్షలు..మొత్తంగా..
డొడోమా: అక్కడ మానవ ప్రాణాలకు అసలు విలువ లేదు. కానీ మానవుడి ఆవయవాలకు మాత్రం ఎంతో విలువుంది. ఒక చేతికి దాదాపు లక్ష రూపాయలు. తలకు రెండు లక్షలు. మొత్తం చర్మానికి దాదాపు ఆరు లక్షలు, మొత్తంగా శరీరానికి కోటీ ముప్పై లక్షల రూపాయలు. ఇందులో బాధితులకు నయా పైసా రాదు. వీటిని సొమ్ము చేసుకునేవాడికి వెళుతుంది. వీటిని తెగనరికి తెచ్చేవాడికి కొంత పర్సంటేజీ దక్కుతుంది. కిడ్నీలను తస్కరించి అమ్ముకునే వ్యాపారంకన్నా దారుణమైన ఈ వ్యాపారం తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో యధేశ్చగా జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి మానవ అవయవాలను కొనుక్కుంటోంది ఎవరో కాదు. రాజకీయ నాయకులు. బడా వ్యాపారవేత్తలు. ఎందుకంటే మూఢ నమ్మకం. ఎన్నికల్లో గెలవాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా ఈ అవయవాల చూర్ణం, స్థానిక మొక్కల మిశ్రమంతో తయారు చేసిన కషాయాన్ని తాగడం ఒక్కటే మార్గమన్న మౌఢ్యం. ఈ మూఢ నమ్మకాన్ని పెంచి పోషిస్తున్నవారు క్షుద్ర వైద్యులు. అల్బినో అనే జన్యుపరమైన లోపాలతో పుట్టిన వారి అవయవాల్లో అద్భుతమైన అతీంద్రీయ శక్తులు ఉంటాయనే పూర్వకాల నమ్మకాలను ఉపయోగించుకొని ఈ పిశాచ వైద్యులు ఇంతకు తెగబడుతున్నారు. వారు ప్రతి మానవ ప్రాణి జోలికి వెళ్లకపోవడం కొంత నయమనుకోవాలేమో! వైద్య పరిభాషలో మెలానిన్ అనే వర్ణద్రవ్య లోపం వల్ల అల్బినోలు పుడతారు. వారి శరీరానికి, కళ్లకు, శరీరంపై వెంట్రుకలకు రంగు ఉండదు. శరీరం కూడా పాండురోగం సోకినట్టు తెల్లగా ఉంటుంది. వీరి జుట్టుపై నుండే వెంట్రుకలకు (మొలిచేదే తక్కువ), చేతుల గోళ్లకు అతీంద్రీయ శక్తులు ఉంటాయన్నది టాంజానియాలాంటి తూర్పు ఆఫ్రికా దేశాల్లో పూర్వికుల విశ్వాసం. తమ వద్దకు కోరికలు ఈడేరేందుకు వచ్చే విశ్వాసకులకు వీరి వెంట్రుకలను, గోళ్లను ఉపయోగించి క్షుద్ర పూజలు చేయడం, అర్థంపర్థంలేని కషాయాలు తాగించడం అక్కడి క్షుద్ర వైద్యుల నైజం. హఠాత్తుగా టాంజానియాలో అల్బినోల ప్రతి అవయవాన్ని క్షుద్ర వైద్యానికి ఉపయోగించడం 2006లో మొదలైంది. క్షుద్ర వైద్యుల మధ్య పోటీ పెరిగి ఒక్కో అవయవానికి ఒక్కో అతీంద్రీయ శక్తి ఉందంటూ అల్బినోల అవయవాలకు రేటు పెంచుతూ వచ్చారు. మరి రేటునుబట్టి అవయవాలను ఎవరు తీసుకరావాలి? అందుకోసం అడ్డంగా ఏ అవయవాన్నైనా తెగనరికే తలారుల ముఠాలను నియమించుకున్నారు. ఈ ముఠాలను స్థానికంగా ఎంగ్యాంగ్ అని పిలుస్తారు. 2013, జనవరి 31వ తేదీన పెండో సెంగెరెమా అనే బాలుడి ఎడమ చేయి నరుక్కెళ్లారు (ఇప్పుడు ఆ బాలుడికి 15 ఏళ్లు). అడ్డొచ్చిన ఆ బాలుడి 95 ఏళ్ల తాతయ్యను కూడా నరికేశారు. 2008లో మిరియాము స్టఫోర్డ్ అనే మహిళ కుడి చేతిని మొండిపోయిన పొడవైన కత్తితో తెగనరికారు. కత్తి మొండి వల్ల రెండో చేయి పూర్తిగా తెగకపోవడంతో దాన్ని వదిలేసి తెగిన చేతిని తీసుకెళ్లారు. రెండు కృత్రిమ అవయవాలతో ఆమె ఇప్పటికీ బతికే ఉన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు 156 మంది అల్బినోలు బలయ్యారని టాంజానియా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ బాధితులు వేల మందే ఉంటారని అనధికార లెక్కలు చెబుతున్నాయి. లేక్ విక్టోరియా పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంకా పెరిగాయని ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడిన ‘మెయిల్ ఆన్ లైన్’ జర్నలిస్టులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అక్కడ అల్బినోలను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. అల్బినోలుగా పుట్టినవారిని పురిటిలోనే చంపుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలా చేయని వారు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అల్బినో బిడ్డలను తీసుకొని మారుమూల ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు వారి తల్లిదండ్రులు. ప్రపంచవ్యాప్తంగా సరాసరి తీసుకుంటే ప్రతి 20 వేల మందిలో ఒకరు అల్బినోలుగా జన్మించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ప్రపంచంలోనే అల్బినోలు టాంజానియాలో ఎక్కువ మంది ఉన్నారని, అక్కడ ప్రతి 1400 మందిలో ఒకరి అల్బినోలేనని ఐరాస పేర్కొంది. టాంజానియా మొత్తం జనాభా దాదాపు ఐదు కోట్లు. అందులో క్రైస్తవులు, ముస్లింలే ఎక్కువ. మూఢ విశ్వాసకులకు మాత్రం ఎవరూ అతీతులుకారు. వారిలో 93 శాతం మంది ఈ మూఢనమ్మకాన్ని విశ్వసిస్తారు. ఇంతకాలం ఈ క్షుద్ర వైద్యాన్ని నిషేధించడటానికి నిరాకరిస్తూ వచ్చిన టాంజానియా ప్రభుత్వం చివరకు ఐక్యరాజ్య సమితి ఒత్తిడితో 2015 జనవరి మొదటి వారంలో నిషేధించింది.